ఆలోచించు మిత్రమా…!

(అంశం :: “విమర్శించుట తగునా”)

ఆలోచించు మిత్రమా…!

రచన::వాడపర్తి వెంకటరమణ

విమర్శనాస్త్రాలు సంధించే ముందు
ఓ అర నిమిషం ఆలోచించు మిత్రమా…!

హృద్యమైన ఈ కవన నిధిని
హృదయాంతరాలలో పరిమళింపజేసేందుకు
అతనెన్ని చీకటి వనాలను శోధించాడో
ఎన్నెన్ని అగాథపుటంచులలో పయనించాడో
నీకైతే ఎరుకలేదు కదా…!

ఒక్కో అక్షర పుష్పాన్ని దోసిట్లో చేర్చి
అందమైన కవితా మాలికగా కూర్చడానికి
అతనెన్ని నిద్రలేని రాత్రులను ఆహ్వానించాడో
ఎన్నెన్ని స్వప్నాల దీవుల్ని గాలించాడో
నీ దృష్టిలో పడలేదు కదా…!

దారిపొడవునా సుమాల గుభాళింపులే
ఉన్నాయంటూ ఈర్ష్యతో ఊగిపోతే ఎలా…
కాళ్ళను చీల్చి చెండాడిన కంటకాల గూర్చి
తెలుసుకోకపోవడం నీ అవగాహనారాహిత్యమే సుమీ!

విమర్శనాస్త్రాలు సంధించే ముందు
ఓ అర నిమిషం ఆలోచించు మిత్రమా…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!