మానవత్వమే రక్షిస్తుంది

(అంశం : “మానవత్వం”)

మానవత్వమే రక్షిస్తుంది

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

రఘురామ్, సుజాత భార్యాభర్తలు. రఘురామ్ మానవతను మించిన దైవము లేదని నమ్మే వ్యక్తి. సుజాత పూర్తిగా దైవాన్ని నమ్మే వ్యక్తే కాని కోపం యెక్కువ. కారుణ్య గుణం, పరోపకారం లక్షణాలు లేవు.

రఘురామ్ ఒక ప్రైవేటు వుద్యోగి. ఉన్నంతలో జీవితాన్ని యెటువంటి లోటు లేకుండా నెగ్గుకు వస్తున్నాడు. వాళ్ళకి ఒక కొడుకు చరణ్. తల్లి గారాబంతో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. రఘురామ్ మొత్తుకునే వాడు వాడిని గారాబం చేయవద్దని.

‘అలా అంటే ఎలాగండి, మనకు ఒక్కగానొక్క కొడుకు. మనలాగ వాడు యిబ్బందులు పడకూడదండి’ అంటూవుండేది సునీత. అదే కొడుకు వ్యక్తిత్వానికి పెద్ద దెబ్బ. ఎలాగో బీటెక్ పూర్తి చేసాడు.

రఘురామ్ తనకు తెలుసున్న స్నేహితుని ద్వారా వుద్యోగం యిప్పించాడు. చేతులో డబ్బులు ఆడటంతో వ్యసనపరుడయ్యాడు. ఇంటికి ఒక్క పైసాకుడా ఇచ్చేవాడు కాదు. అనుకోకుండా తన స్నేహితుడి చెల్లెల్ని వివాహం చేసుకుని, నేరుగా యింటికి తీసుకుని వచ్చేసాడు. రఘురామ్ యిలాంటిది యేదో జరుగుతుందని వూహించాడు. కానీ భార్య సునీత జీర్ణించుకోలేక పోతోంది. పైగా కోడలు వుద్యోగస్తురాలు అవడంతో కొడుకు, కోడలు యిద్దరికీ సేవలు చేయవలసి వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళను పట్టించుకునే స్థాయిలో లేరు.
……

రఘురామ్ వుద్యోగ విరమణ జరిగింది. ప్రోవిడెంట్ ఫండ్ లాంటివి చెల్లించి, ఆఫీసు వారు యింటికి గౌరవంగా పంపారు. ఆరోజు కొడుకు, కోడలు కూడా ఎంతో సంతోషంగా వచ్చి అమ్మనాన్నలతో మంచి హొటల్ కి వెళ్ళి, కార్లో యింటికి తిరిగి వచ్చారు. రఘురామ్ మనసులో నవ్వుకున్నాడు, తల్లి అయితే అమ్మో నా కొడుకు మారి పోయాడు అనుకుంది. కానీ కొంచెం సేపటికే కొడుకు నైజం బయటపడింది. నాన్నా నీ కొచ్చిన బెనిఫిట్స్ నాకు యివ్వు, అలాగే మన ఇల్లు కూడా అమ్మేద్దాం. మనం ఆంతా మంచి ఇంటిలో వుందాం అన్నాడు.

రఘురామ్ యేమీ మాట్లాడలేదు. సునీత యెందుకురా ఇల్లు అమ్మడం నాన్న కష్టార్జితం, మా తరువాత ఎలాగూ నీదే కదా. ఇల్లు అమ్మకం తలపెట్టవద్దు, డబ్బులు అవసరం వుంటుంది, నాన్న దగ్గరే వుండనీ అని స్పష్టంగా చెప్పడంతో, చరణ్ పాచిక పారలేదు. దానితో చరణ్ ‘ఓ అలాగా అమ్మా, అయితే మేమిద్దరం వేరుగా వుంటాము’ అని నిర్ణయానికి వచ్చేసారు. రఘురామ్ తడుముకోకుండా ‘మీ యిష్టం వెళ్ళి పోండి’ అని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు వారి యిష్టాన్ని.
….

కాలం గడుస్తోంది. రఘురామ్, సునీతలు తమకు ఒక గది వుంచుకుని, మిగిలిన పోర్షన్ అద్దెకు ఇచ్చి, ఆ డబ్బుతో, వచ్చే కొద్ది పెన్షన్ తో జీవితం నడుపుకొస్తున్నారు.

రోజులు అన్నీ ఒకేలా వుండవు కదా. సడెన్ గా సునీతకు సీరియస్ అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి, అనుకుని చరణ్ కు ఫోన్ చేసాడు అమ్మను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని. నేను ఆఫీసు పనిలో బిజీగా వున్నాను అని మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు. ఈ తతంగమంతా సునీత గమనించి, కళ్ళు నీళ్ళు పెట్టుకుని నన్ను క్షమించండి, మీ మాట వినిపించుకోకుండా తప్పు చేసాను అనేసరికి, సునీతా బాధపడకు సమయానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు అంటూ వుండగా….

మామయ్య యెలా వున్నారు అని చనువుగా లోపలికి రావడం, అత్తయ్య పరిస్థితి గమనించి, తరువాత మాట్లాడుకుందాం అంటూ తన కారులోనే అత్తయ్యను ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, సరిగా తినకో లేక ఏదో బెంగ కారణంగానో వచ్చిన బలహీనతే కానీ ఏమీ లేదు, మందులు వ్రాసి యిస్తాను, వాడండి సరిపోతుంది అని పంపించేసారు.

కారులో వాళ్ళిద్దరినీ తీసుకుని వేరే రూట్ లో తీసుకుని వెళ్తూవుంటే, రఘురామ్ మా యింటికి ఇలా కాదురా అన్నాడు. నువ్వు వుండు మామయ్యా అని చైతన్య చొరవతో అన్నాడు. ఇతను ఎవరో, తన భర్తను మామయ్య అంటున్నాడు అర్థం కాలేదు సునీతకు.
……

చైతన్య రఘురామ్ చెల్లెలు కొడుకు. చిన్నప్పుడే భర్త చనిపోతే, తన దగ్గర వుంచుకున్నాడు నెలల పిల్లవాడితో వున్న చెల్లెల్ని. కానీ వాళ్ళని వదిలించుకునే వరకూ భర్తనూ, ఆడపడుచుని సతాయిస్తూనే వుంది. ఇక అది భరించే శక్తి లేక వాళ్ళని దూరం పెట్టి, తనకు వున్న మానవత్వంతో, చెల్లెలిపై వున్న ప్రేమ తోడైతే, వున్నంతలో వాళ్ళ బాగోగులు చూసాడు, భార్య సునీతకు తెలియకుండా. రఘురామ్ ఆర్థిక సహాయంతో, సలహాలతో చైతన్య మంచి చదువు చదివి, కాలేజీ క్యాంపస్ లోనే మంచి ఉద్యోగం సంపాదించాడు.
……

చైతన్య తన ఇంటికి తీసుకుని రాగానే ఆడపడుచు అన్నయ్యా, వదినా అంటూ కౌగలించుకుని, సాదరంగా లోపలికి తీసుకుని వచ్చింది. ఇదంతా సునీతకు కలలా అనిపిస్తోంది.

వదినా మా ఇంటికి మొదటి సారి వచ్చారు, కనీసం రెండు రోజులైనా మా ఇంటిలో వుండాలి అంటూవుంటే సునీతకు అర్థం కావడం లేదు.

ఈలోపు చైతన్య చొరవతో అత్తయ్యా ‘మామయ్యకు మేము జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మామయ్య ఎంతోమందికి ఎంతో సహాయం చేసారు. మా విషయం వచ్చేసరికి మామయ్య మానవతకు చెల్లెలుమీద వున్న ప్రేమ తోడయ్యింది. మామయ్య చరణ్ బావ విషయం అంతా చెప్పాడు’, అంటూ అమ్మ వైపు తిరిగి బావ గురించి చెప్పాడు. తను చాలా బాధపడింది. మరి ఏమంటావు రా చైతన్య అంది.

అమ్మా నీకు మీ అన్నయ్య, వదినలు మా తాతా, అమ్మమ్మ కంటే ఎక్కువ. వాళ్ళిద్దరూ మనతోనే వుంటారు అని కన్ఫర్మ్ చేసేసాడు.

రఘురామ్ మానవత్వం, ప్రేమ వారి జీవిత చరమాంకంలో రక్షణ యిచ్చింది. నిజమే కదా మానవతను మించిన దైవం లేదు కదా!

****

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!