పరిష్కారం

పరిష్కారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : జీడిగుంట నరసింహ మూర్తి

ట్రైన్ గుడివాడ స్టేషన్ లో ఆగేసరికి  అప్పటికే నా కోసం చాలా సేపటినుండి ఎదురుచూన్న రామూ పరిగెట్టుకుంటూ మా కంపార్టుమెంటు దగ్గరికి వచ్చాడు. ఏమిటి ఇంతేనా నీ లగేజీ ? పది రోజులైనా ఉండేటట్టు రమ్మంటే ఒక ప్లాస్టిక్ సంచీలో  రెండు బట్టలు వేసుకొచ్చినట్టున్నావు. నీ పద్దతి నాకేమీ నచ్చడం లేదురా విస్సూ. పోనీలే నావి కొత్త బట్టలు చాలా ఉన్నాయి. అవి వేసుకుందువు గానిలే ఉండు స్కూటర్ తెచ్చాను. తీసుకొస్తాను ఇక్కడే ఉండు. అంటూ వెళ్ళాడు రామూ. స్టేషన్ చుట్టూ చూశాను. ఇంతకు ముందు దేవదాస్ సినిమాలో దుర్గపురం రోడ్ స్టేషన్ లాగా అనిపించే స్టేషన్ ఇప్పుడు అన్ని ఆధునీకరణంలో భాగంగా కొత్త అందాలు, హంగులు సంతరించుకున్నట్టుగా కనిపిస్తోంది. అవునురా రామూ. స్టేషన్కు ఆనుకుని మూడేళ్ళ క్రితం ఒక  హోటల్ ఉండేది కదా. అది  కనపడలేదే ? అన్నాను, అవును. ఇప్పుడు ఈ వూరు అన్నిటికీ పెద్ద సెంటర్. ఇక్కడ దిగి బస చేసి వాళ్ళ పనులు ముగించుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనాల అవసరాల దృష్ట్యా, ఆ చిన్న హోటల్ ను తీసేసి ఈ సందులోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టరు అన్నాడు రాము. రామూది గుడివాడలో డాబా ఇల్లు.  చక్కగా పొందికగా ఉంటుంది. డాబాకు ఒక మూలగా ఆకుపచ్చని ఆనపకాయలు వేలాడుతున్నాయి. మరోపక్క చిక్కుడు, కాకర విరగ కాసేస్తున్నాయి. అప్పట్లో ఆ మొక్కలన్నిటికీ నీళ్ళ సదుపాయం తూర్పు వైపున  ఉన్న  పెద్ద గిలకల బావి నుండే. చాలా సార్లు ఆ కుటుంబం మంచి నీళ్ళు గా కూడా వాడుకునే వాళ్ళు ట. ఇన్నేళ్ల  తర్వాత కూడా ఆ నుయ్యి చెక్కు చెదరకుండా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒకనాడు మేము ఈ ఊళ్ళో ఉన్నప్పుడూ పాటించిన సంప్రదాయం రామూ  కుటుంబం కూడా తూచా తప్పకుండా  చేస్తున్నట్టుగా అనిపించింది. స్నానానికి కుండలో వేడి నీళ్ళు  నాకోసం ఎదురుచూస్తున్నాయి. మీరింకా ఈ పొట్టు పోయి సంప్రదాయం అలాగే కొనసాగిస్తున్నట్టున్నారుగా? అన్నాను.
“అవును. దీనిమీదే నీళ్ళు, దీనిమీదే వంట, చాలా హాయిగా ఉంటోంది అనుకో అప్పట్లో మీ ఇంట్లో కూడా అంతేగా మీ నాన్నగారిని చూసి మా ఇంట్లో కూడా మొదలు పెట్టాం. మీ నాన్న గారైతే కట్టెల అడితీలో ఉండే రంపపు మిల్లు దగ్గర నుండి నెలకు రెండు బస్తాలు పొట్టు తెప్పించి మొత్తం వంటా, నీళ్లు కాచుకోవడం ఇవన్నీ చూశాక  మేము కూడా మొదలెట్టాము. కాలక్రమేణా మీరు ఈ వూరు విడిచి పెట్టి వెళ్ళి పోయినా మా కుటుంబం మాత్రం మీ దగ్గర నుండి నేర్చుకున్న ఎన్నో విషయాలు అలాగే కొనసాగిస్తున్నాం. ఎంతోమంది గ్యాసుపొయ్యికి మారిపోయినా మా ఇంట్లో మాత్రం ఇంకా పాత పద్దతులే కొనసాగుతున్నాయి ” అన్నాడు రాము.
పొట్టు పొయ్యిదగ్గర కూర్చుని చిక్కుడు కాయలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు కాల్చుకుని తినడం నాకింకా గుర్తే. అవును. రామూ ఈ ఊళ్ళో మంచి హోటళ్లు ఏమున్నాయో చెప్పు. ఇద్దరమూ కలిసి ఒక పూట అక్కడ భోజనం చేద్దాం ” అన్నాను ఆ మాటకు రామూ నా మీద విరుచుకుపడ్డాడు. ” నువ్వు మా ఇంట్లో భోజనం చేయకుండా హోటల్లో తింటానంటావేమిటి? నీకింకా ఈ హోటళ్ల పిచ్చి వదలలేదా ? ఈ ఊళ్ళో ఉన్నప్పుడు ఏ హోటలూ వదిలే వాడివి కావు. చక్కగా నీకిష్టమైన వంటలన్నీ వండిపెట్టించాలని నేను చూస్తూంటే. నువ్వు అంతగా వదలలేకపోతూ ఉంటే ఒక పూట వెళ్ళి టిఫిన్ తీనొద్దాములే. అది సరే కానీ ఒకసారి అలా దొడ్లోకి వచ్చి మేము కాయిస్తున్న కూరకాయలు చూడు. అందులో నీకు ఏది ఇష్టమైతే అది చెప్పు. అదే కూర వండిస్తాను ” అన్నాడు భుజమ్మీద చెయ్యి వేసి అటువైపు తీసుకెళ్తూ. అవును రామూ చెప్పినట్టు నాకింకా హోటళ్ళ పిచ్చి వదలలేదు. అనవసరంగా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. హాయిగా డబ్బులు పారేస్తే ఇంటి అల్లుడిని చూసుకున్నట్టు దగ్గరికొచ్చి అన్నీ వడ్డిస్తారు పాపం హోటల వాళ్ళు. ఏమిటో  వీడి చాదస్తం వీడిది.” అనుకుని  “ఓకే రా బాబూ. ప్రస్తుతం మీ ఇంట్లోనేలే నా భోజనం. ఆనపకాయ కోసి ఉల్లికారం పెట్టి కూర వండించు. దానితో పాటు చల్లపులుసు. పక్కన కొద్దిగా ముద్దపప్పు వుంటే మరీ మంచిది. ఇక పచ్చళ్లు, వడియాలు లాంటివి నీ ఇష్టం.”  పొద్దున్న తిన్న టిఫిన్ ఇంకా కడుపులో అలాగే వుంది. వంట ఆలస్యమైనా పర్వాలేదు. రెండు తర్వాత తింటాను. చెల్లెమ్మను శ్రమ పడొద్దని చెప్పు. అన్నాను చనువుగా. రాము నా మీద ఉన్న ప్రేమతో పది రోజులు ఉండమన్నాడు కానీ నాకోసం వాళ్ళ పనులన్నీ ఆపుకుని నాతో తిరగమని చెపితే ఏం బాగుంటుంది ? ఇంట్లో వాళ్ళకు కూడా చిరాకుగా ఉండొచ్చు. అందుకనే వాడికి చెప్పలేదు కానీ నా ప్రయాణాన్ని మూడు నాలుగు రోజులకు కుదించుకున్నాను. గుడివాడలో ఉన్న మూడు నాలుగు రోజుల్లో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రామూ, వాడి భార్య ఏ లోటూ రాకుండా బాగానే చూసుకున్నారు. విస్సూ. నేను రామూని మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో నాకు ఆఫీసు ఇన్స్పెక్షన్ పని పడింది. పనిలో పని తను కూడా వస్తానంటోంది.  మేము ఉండే మూడు నాలుగు రోజులు కాస్త ఖాళీ చేసుకో. మా కోసం కేటాయించు. చాలా రోజులకు వస్తున్నాం కదా. కాస్త జూ, ఛార్మినార్, బిర్లా టెంపుల్, వగైరా వగైరా చూడాలని అంటోంది. అదీ విషయం. వెంటనే కాదనుకో. ఇంకా పది రోజులు టైముంది మధ్యలో మా ప్రోగ్రామ్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటానులే, నాలుగు రోజులు మళ్ళీ నీతో సరదాగా గడిపినట్టుంది. అంటూ ఫోను పెట్టేశాడు రామూ. రామూ చెప్పింది వింటూ ఊ కొడుతున్నాను కానీ ఆ సమయంలో మా ఒరిస్సా ప్రోగ్రామ్ గురించి చెప్పలేక పోయాను. ఒరిస్సాలో మా చిన్నాన్న గారి  ఆఖరి అబ్బాయి పెళ్లికి వెళ్లాలని టిక్కెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. పెళ్లి కూడా రామూ హైదరాబాద్ వస్తానని చెప్పే తేదీలలోనే ఉండటం కాకతాళీయం అయినా గుడివాడ వెళ్లి రామూ ఇంట్లో దర్జాగా గడిపివచ్చిన నేను ఇప్పుడు రామూ ప్రోగ్రామ్ వేసుకునే సరికి ఆల్రెడీ మేము వేసుకున్న ప్రోగ్రామ్ గురించి ఎలా చెప్పాలో తెలియక గొంతులో వెలక్కాయ పడిన చందాన అయిపోయింది ఆ క్షణంలో. ఒక రకంగా నాకు ఇప్పుడు  సంకట పరిస్తితి ఎదురయ్యింది.  నేను ఏమి చెప్పినా కావాలని తప్పించుకున్నట్టు అవుతుంది. ఇదే విషయం మా ఆవిడతో చెప్పాను.
“ఇదేమిటండీ. మీకు మరీ మొహమాటం ఎక్కువైపోయింది ? రమ్మని చెప్పేసారా ? ఒక పక్క పెళ్లికి టిక్కెట్స్ కూడా కొని రెడీగా ఉన్నామని తెలిసి ఎంత అతను క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా అలా నోరు నొక్కుకుని ఉంటారా ఎవరేనా? ఆ విషయం మర్చిపోయాను అంటూ ఇప్పుడైనా ఫోన్ చేసి అతనికి చెప్పండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది. అందుకే చెపుతూ ఉంటాను. అవతలి వాళ్ళ ఇళ్లకు పనిగట్టుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే మనం కూడా ఏదో ఒకరోజు వాళ్ళను కూడా అకామిడేట్ చేయాల్సి ఉంటుందని. మీరు నా మాట వినరు. నాకు తెలియదు. ఇప్పుడు మీరేమీ చేస్తారో చేయండి ” అంటూ అక్కడనుండి వెళ్లిపోయింది మా ఆవిడ. ఇంతలో ఫోన్ రింగయ్యింది. మా చిన్నాన్న గారి నుండి ఫోన్.
“ఆ .. వస్తున్నాం చిన్నాన్న. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం “అన్నాను హీనస్వరంతో .””దాని గురించే చెప్పాలని ఫోన్ చేస్తున్నాను విశ్వేశ్వరం. అనుకోకుండా ఒక ఆపద వచ్చి పడింది. పెళ్లి కూతురి సొంత బాబాయి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి పోయారుట. ఈ పరిస్తితిలో పెళ్లి కొన్ని రోజులు వాయిదా వెయ్యడం అనివార్యం అయ్యింది. బహుశా వచ్చే నెలో, ఆ పై నెలో మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వు టిక్కెట్స్ బుక్ చేసుకున్నావు అంటున్నావు కాబట్టి కాన్సెల్ చేసుకోవడానికి వీలైతే వెంటనే చేసుకో. ఈ విషయం నేను ఇంకా చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. పాపం మా వల్ల ఎంతమందికి శ్రమ ఇస్తున్నామో అని ఒకటే బాధగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోకు ” అంటూ ఫోన్ పెట్టేశాడు మా చిన్నాన్న గారు. తర్వాత రోజు రామూ నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. తన ఫైనల్ ప్రోగ్రాం గురించి కన్ఫర్మ్ చేస్తూ. ఓకేరా రామూ. మేమంతా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం ” అన్నాను ఊపిరి పీల్చుకుంటూ. మా చిన్నాన్న ఇంట్లో పెళ్లి గురించి రామూకీ ఎలా చెప్పాలో తెలియక కొన్ని గంటలనుండి ఒకటే సతమతమవుతున్న నాకు ఊహించని పరిష్కారం దొరికేసరికి మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!