తీరని కోరిక

తీరని కోరిక
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

మనిషికొక జిహ్వ
జిహ్వకొక రుచి
మనసుకొక కోరిక
తీరదేమో అన్న వేదన
కంటి మీద కునుకు రానీయదు
మనసును కుదురుగా ఉండనీయదు
అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. వెంటనే చూసిన వాళ్ళు అందరూ రిప్లయ్ పెట్టారు. వాట్ హాప్పెండ్ (ఏమి జరిగింది ) అంటూ…
ఏమి లేదులే… ఏదో చిన్న ఆలోచన… అలా మెదడులో కి వచ్చి వెళ్ళింది అంటూ హాస్యంగా చెప్పాను.
నీకు ఆలోచించే సమయం కూడా ఉందా!!!
పొద్దున వెళ్ళి, సాయంత్రం ఇంటికి చేరతావు. ఉద్యోగంతో సతమతమవుతున్నావు. ఉద్యోగం లేనప్పుడు, ఖాళీగా ఉండలేను అంటూ ఫాన్సీ అండ్ స్టేషనరీ షాప్ పెట్టావు. ఇప్పుడు రెండు పడవల మీద కాళ్ళు వేసినట్టు రెండూ కొనసాగిస్తున్నావు.
ఇదే హడావిడి ఇలానే ఉండగా, పిల్లల చదువులు, వారి వారి కళా పోషణ ప్రక్రీయలపై దృష్టి నిలిపావు. నీ ఉరుకులు, పరుగులు ఏమిటో మాకు అర్థం కావడం లేదు అంటూ వెటకారంగా కొందరు, మెచ్చుకోలుగా మరి కొందరు మెసేజ్ లు పెట్టారు. ఇంతలో మరో మెసేజ్ టిక్..టిక్ మంటూ… చూస్తే మా వారు.
మళ్ళీ ఏం గుర్తు వచ్చింది నీకు??? అంటూ మెసేజ్.
నచ్చని విషయాన్నీ నచ్చినట్టుగా మార్చుకోవటాన్ని బాధగా ఉన్నప్పుడు భావాన్ని పంచుకోవటానికి కానీ ఓ ఉన్నతమైన మార్గం నేను ఎంచుకున్న విభిన్నమైన మార్గం అదే రచనలు చెయ్యటం. బాధగా ఉన్నప్పుడు, భావం గొప్పగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు, మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అలసటగా ఉన్నప్పుడు, మనసు తోడు కోరుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు, శరీరం సేద తీరుతుంది.. అలాగే, నా మనసులోని భావం ఏదైనా… బాధ, ప్రేమ, ఏడుపు, కోపం, అలజడి ఏదైనా, నా అక్షరాల పరంపర కొనసాగించడం జరుగుతుంది. అది నేను ఎంచుకున్న విలక్షణమైన మార్గం. అదో సంతోషకరమైన మార్గం. ఎన్ని ఆనందాలు చెంత ఉన్నా ఎన్ని అవరోధాలు చుట్టిముట్టి ఉన్నా మనసులో ఆశ నిక్షిప్తమై ఉంటుంది. ఏదో సాధించాలన్న కోరిక, మనసులో అలజడి సృష్టిస్తుంది అలా ఎప్పటి నుంచీనో నా మదిలో ఓ కోరిక నన్ను నిలువనీయదు. అదే నాలో ఉన్న ఒక పట్టుదల. నేను సంపాదించాలి అనుకున్న ఓ ఉన్నత స్థాయి. ఆ స్థాయి కోసమే నా ఆరాటం, ఆగనిదే ఈ పోరాటం. నేను ఉద్యోగంలో సాధించాలి అనుకున్నాను ఆ స్థానం. కానీ విధి రాత ఎలా ఉందో తెలియదుగా. చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు. చదువుకున్న చదువు ఒకటి చేస్తున్న పని మరొకటి మనసులోని ఒకటి సాధిస్తున్న విజయం మరొకటి ఏదైనా విజయం లభించింది అని సంతోష పడాలా??? కోరుకున్నది దక్కలేదని బాధ పడాలా!!! ఉన్నది ఒకటే జిందగీ… ఏడిపించడం ఎందుకు? ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని.. ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడాయ్యో అన్న ఓ కవి మాటలకు, నా అభిమాన హీరో అభినయం తోడు అయ్యింది. నేను ఇంకా ఆ నవ్వునే ఫాలో అయ్యాను.
కొసమెరుపు ఏంటి అని అడిగితే,,,
వచ్చే జన్మ అంటూ ఉంటే (ఉండకూడదని మనసు భావం), ఎలాగైనా ప్రభుత్వ రంగ సంస్థలో మంచి ఉద్యోగం చెయ్యాలని నా కోరిక. తీరుతుందేమో చూద్దాం.
తీరని కోరిక కోసం ఆగని ప్రయత్నం నాది అందని జాబిలి కోసం ఆశ పడే పసితనం ఇది అలా అనుకుంటూ కాలాన్ని వృధా చెయ్యను. జీవితాన్ని వృధా చెయ్యను.
విధాత వ్రాసిన నుదుటి రాతకు తల వగ్గాల్సిన పరిస్థితి మనది అందుకే… మార్గం మార్చుకున్నాను నేను గమ్యం మార్చుకోను నేను చేధించేది ఏ సమస్య అయినా
విజయం సాధిస్తాను నేను అనుకుంటూ, నాకు వచ్చిన చిరు ఉద్యోగంలో, ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మానసిక ఉల్లాసం కోసం, నాకున్న ఙ్ఞానాన్ని వినియోగిస్తున్నాను. దక్కని దాని కోసం ఏడవకు నీకు లేని అదృష్టానికి రోదించకు నీపై నువ్వు నమ్మకం పెంచుకో ఆత్మ విశ్వాసంతో సాగు ముందుకు
విజయం కోసం ఆశ పడకు ఉన్నతి సాధనకై ప్రయత్నాలు ఆపకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!