దీపక్ పెళ్లి

దీపక్ పెళ్లి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అది గ్రీష్మ తాపంతో వడగాల్పులు వీస్తున్న మధ్యాహ్న సమయం. ప్రదీప్ కి సేల్స్ ఉద్యోగం కావడం తో బయట తిరగడం తప్పదు. ఆ రోజు కొంచెం కాల్స్ కూడా ఎక్కువ ఉండడంతో తిరిగి తిరిగి అలసి పోయాడు. మేనేజర్ కి చెప్పి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు.
పని ఒత్తిడి లో ఫోన్ కాల్స్ కూడా చూసుకోలేదు. వచ్చి కూర్చుని ఫ్రెష్ అయి, ఫోన్ చూస్తే కవిత నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అప్పుడు గుర్తు వచ్చింది తను సాయంత్రం తనని కలుస్తానని చెప్పాడు. కవిత తన ప్రేయసి. ఇద్దరూ చాలా కాలం నుంచి ప్రేమించు కుంటున్నారు. ఈ రోజు విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి వారి అంగీకారం తీసుకోవాలి. ప్రదీప్ ఇంట్లో చెప్పడం, అమ్మానాన్న కవితని చూసి సరే అనడం జరిగింది. ఇక కవిత నుంచే పెండింగ్.
వెంటనే కవిత కి ఫోన్ చేసాడు.
కవిత: హలో! నీకసలు గుర్తు ఉందా, ఈ పాటికి మా ఇంట్లో ఉండాలి కాదా, ఎక్కడ ఉన్నావు. ఎంతో కష్టం మీద మా అమ్మానాన్న కి చెప్పి సగం ఒప్పించా, ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఈ రోజు నువ్వు ఇక రావని చెప్పి ఇప్పుడే నాన్న మా దూరపు బంధువు కొడుకు ఎవరో ఉన్నారని, వాళ్ళకి ఫోన్ చేసి రేపు చూపులకు, మాట్లాడు కోవడానికి రమ్మన్నారు. నీకసలు ఏమైనా పద్ధతిగా ఉందా. మా అమ్మ సంగతి సరే సరి. ఈ ప్రేమలు దోమలు వద్దు అంటే వద్దు అని భీష్మించుకుని కూర్చుంది. నువ్వేమో రాలేదు, ఫోన్ అయినా ఎత్తాలి కదా.
దీపక్: సారీ రా, ఈ రోజు అస్సలు ఖాళీ లేదు. తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చా, నీ మిస్డ్ కాల్స్ చూసి ఫోన్ చేస్తున్నా. ఇప్పటి వరకూ నేను ఈ విషయమే మర్చిపోయా. సారీ సారీ…
కవిత: అంతేలే ఎప్పుడూ నేను ప్రాకులాడడమే, నీకు అసలు చీమ కుట్టినట్లు అయినా ఉందా..?
దీపక్: అదికాదు కవితా, అర్థం చేసుకో. రేపు సెలవు పెట్టీ మీ ఇంటికే వస్తా.
కవిత: రే..పా… మా నాయనే, ఇప్పుడు చెప్పింది నీకు అసలు బుర్రకి ఎక్కిందా. రేపు వేరే వాళ్లను రమ్మన్నారు, ఎలాగా అని నేను టెన్షన్ పడుతుంటే,… అలాగే రేపు రా, నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడుదు గానీ. అంతా నా విధి రాత, ఇక నన్ను వదిలేయ్.
దీపక్: అయ్యో అంత మాట అనకు. నేను ఇప్పుడే వస్తా. దగ్గరే కదా. పది నిమిషాలలో మీ ఇంట్లో ఉంటా.
కవిత: సరే, రా నాయనా ఎదోటి చూద్దాం.
ఇలా ఫోన్ కట్ చెయ్యడం ఆలస్యం, ఒక్క ఉదుటున వాళ్ళింట్లో వాలాడు, మన వాడు.
అనుకున్నట్టు గానే వీధిలో కాలు కాలిన పిల్లలా తిరుగుతూ కవిత స్వాగతం పలికింది. ఇద్దరూ గుమ్మం బయటే కాసేపు మాట్లాడుకుని, కవిత అమ్మానాన్న తో ఏం మాట్లాడాలి అన్నది ముందే అనుకున్నారు గనుక మళ్ళీ ఓ సారి నెమరు వేసుకుంటూ లోపలికి వెళ్లారు.
కవిత అమ్మా నాన్న కూడా లోపలికి రమ్మని పిలిచి, కూల్ డ్రింక్, స్నాక్స్ పెట్టారు. మెల్లిగా మనవాడు అంకుల్ మీ అమ్మాయి కవిత అంటే నాకు చాలా ఇష్టం, మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు.
ఆహా.. అంతా మీ ఇష్టమేనా అసలు నీ స్థితి గతులు, కుటుంబం గురించి మేమేమీ తెలుసుకో నక్కర్లేదా? అని దబాయించారు కవిత నాన్న.
నేను మీ వెనుక కాలనీ లో ఉంటా, అమ్మా నాన్న, నాకో చెల్లి అంటూ ఉద్యోగం, కుటుంబ వివరాలు అన్నీ చెప్తాడు దీపక్.
అది సరేనయ్యా మరి ఇన్నాళ్ళ నుంచీ మీరిద్దరూ మాకేమీ చెప్పలేదు, నేనేమో మా బంధువు కి మాట ఇచ్చా, ఇప్పుడెలా అంటారు కవిత నాన్న.
అదికాదు, మీరు ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి. మీరు కాదనరు అనే నమ్మకంతోనే ఇంత ఆలస్యం చేశాం. మమ్మల్ని క్షమించి, పెద్ద మనసుతో మీరు అంగీకరించాలి అని వేడుకుంటాడు దీపక్, కవిత కూడా వంత పాడుతుంది.
కవిత అమ్మగారు మాత్రం ససేమిరా కుదరదు అంటుంది. అన్నీ మీరే నిర్ణయించు కుంటే మేమెందుకు ఇక అంటారు.
అలాకాదు అంటీ, కొంచెం మీరు కూడా మమ్మల్ని దీవించాలి, లేదంటే ఎలా చెప్పండి, ప్రాధేయ పడుతూ అంటాడు దీపక్.
ఇలా చాలాసేపు గడిచిన తర్వాత కవిత నాన్న ఒక పని చేద్దాం, రేపు వాళ్ళని రమ్మన్నాను కనుక, వాళ్ళకి నచ్చకపోతే ఏ ఇబ్బందీ లేదు, మాకూ నిన్ను అల్లుడ్ని చేసుకుందుకు అభ్యంతరం లేదు అంటారు.
హమ్మయ్య అనుకుని ఇక దేవుడి మీద భారం వేసి దీపక్ ఇంటికి చేరాడు.
భోజనం అయ్యాకా, ఒరేయ్ దీపూ పిలిచింది వాళ్ళ అమ్మ.
ఆ, ఏమిటి అమ్మా అన్నాడు.
రేపు నీకు పెళ్లి చూపులు రా, నాన్న ఎవరికో మాట ఇచ్చారుట చూసి రావాలి.
అదేంటి అమ్మా కవిత గురించి చెప్పా కదా అంటాడు.
అవునురా అయినా ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారో లేదో, లేదంటే ఈ పాటికే ఆ అమ్మాయి వచ్చేది కదా. నాన్న ఇక ఆలస్యం చెయ్యొద్దు అంటున్నారు.
లేదమ్మా ఇప్పుడే మాట్లాడి వచ్చా వాళ్ళు ఒప్పుకున్నారు మనం రెండు రోజుల్లో వాళ్ళింటికి వెళ్దాం అంటాడు దీపక్.
అదేంటి రా మరి ఇంత ఆలస్యం చేశారు. సర్లే రేపు అక్కడికి వెళ్ళాకా అమ్మాయి నచ్చలేదు అని చెప్పు. ఈ అమ్మాయి వాళ్ళ మావయ్య నాన్నగారి స్నేహితుడు టా, పెళ్లి చూపులు కూడా వాళ్ళింట్లో నే. వెళ్లకపోతే బాగోదు. పోయి పడుకో అంది ఆవిడ.
ఇక చేసేది లేక అప్పటికి ఊరుకున్నాడు కానీ రాత్రంతా ఎలా, రా భగవంతుడా నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఏదో కునుకు లాగాడు కానీ నిద్ర పట్టనే లేదు. ఉదయమే అమ్మ లేపడంతో రెడీ అయ్యి ఆ అమ్మాయి మావయ్య ఇంటికి వెళ్ళారు అంతా.
సాదర స్వాగతం, కాఫీ టిఫిన్లు అయ్యాకా ఆ మావయ్య అన్నారు ఏమండీ మీకు అమ్మాయి నచ్చితే పెళ్లి మాత్రం వెంటనే జరిగిపోవాలి అంటారు.
అదేంటం డీ అమ్మాయిని చూపరా, అసలు వాళ్ళ అమ్మానాన్న ఏరీ అంటారు అంతా ఒకేసారి. ఆ వస్తున్నారు కొంచెం ఆలస్యం అయిందట, వారికి వేరే ఏదో పని ఉండి, ఇంకో ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటారు.
ఇది మరీ బాగుంది అండి. అని లోపల అనుకోబోయి పైకే అనేశాడు దీపక్, పోన్లే ఎలాగూ నచ్చలేదు అని చెప్పడమే కదా అనుకుంటూ.
ఇంతలో కవిత అమ్మానాన్న వస్తారు. వాళ్ళని చూసి దీపక్ ఆశ్చర్య పోతూ, అంకుల్ మీరు ఇక్కడ అంటాడు.
ఏంలేదు బాబు ఈయన అంటీ కి తమ్ముడు వరస చుట్టం, వాళ్ళ వాళ్ళది ఏదో పెళ్లి చూపులు అంటే, సాయం కోసం వచ్చాం, అమ్మాయి అమ్మానాన్న రావడం కుదరలేదు టా.
సరే ఇదిగో అమ్మాయిని తీసుకురా మళ్లీ దుర్ముహూర్తం వస్తోంది అంటారు ఆ మేనమామ. అమ్మాయి వచ్చి ఎదురుగా కూర్చుంది. చూడ్డానికి బానే ఉంది. దీపక్ సరిగ్గా చూడనే లేదు. అమ్మాయి నచ్చలేదు అని చెప్పడం సభ్యత కాదని, వ్యక్తిగతం గా మాట్లాడి తన విషయం చెప్దామని అనుకుంటాడు. సరిగ్గా చూడకుండానే తను మాట్లాడాలని చెప్తే, అందరూ కలిసి పైన వరండాలో మాట్లాడుకొండి అని పంపుతారు.
అక్కడ కావాలనే అమ్మాయి మొహం చూపకుండా అటు తిరిగి కూర్చుంటుంది.
దీపక్ మాత్రం అదేం పట్టించు కోకుండా తన గురించి, కవిత గురించి తొందరగా చెప్పేసి, ఆమె చెప్పే దానికోసం కూడా చూడకుండా కిందకు వచ్చేస్తాడు.
ఏరా! ఎలా ఉంది అమ్మాయి అంటారు దీపక్ తండ్రి.
లేదు నాన్న గారు మా ఇద్దరికీ సరిపడదు, తన ఆలోచనలు వేరు, నా పద్దతులు వేరు అంటాడు దీపక్.
అదేమిటి రా! మరి ప్రేమ, దోమ అంటూ ఏదో అన్నావ్, తీరా ఇప్పుడు నచ్చలేదు అంటావు ఏమిటి రా అంటారు ఆయన. నేను ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు…. అంటుండగానే వెనుక నుంచి కవిత వచ్చి అంతేనా దీపక్ మరి నిన్నటి దాకా నేనే ప్రాణం, పెళ్లి నాతోనే అన్నావ్, మా అమ్మానాన్న తో కూడా మట్లాడావు, అంతా ఉత్తిదేనా? అంటుంది.
అదీ.. అదీ.. అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు, ఎదురుగా కవిత. ఇంకేంటి ఇప్పుడు ఆశ్చర్య పోయాడు దీపక్.
అంతా కలిసి ఇంత నాటకం ఆడి, నన్ను టెన్షన్ పెడతారా. హమ్మా! అంటాడు దీపక్.
అందరూ కలిసి హాయిగా నవ్వుకుంటూ భోజనాలు అయ్యాక దీపక్, కవిత దగ్గరికి వెళ్ళి ఇదేం పని, నీకసలు బాగుందా అన్నీ తెలిసీ నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు.
ఇంతలో కొసమెరుపు గా దీపక్ తండ్రి వచ్చి ఇదంతా నా ప్లాన్ రా, లేకపోతే మీరిద్దరూ నీళ్ళు నములుతూ కాలం వృధా చేస్తుంటే మేమెలా ఆగుతాం అని ఆయన కవిత నాన్నగారితో మాట్లాడి, ఈ తతంగం అంతా నడిపిన విషయం మెల్లిగా చెప్తారు.
అలా ఈ కథ సుఖాంతం అవుతుంది.

You May Also Like

6 thoughts on “దీపక్ పెళ్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!