ద్వేషం   

ద్వేషం   
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీడిగుంట నరసింహ మూర్తి

“హలో  వెంకట్రావేనా మాట్లాడేది  నేను  గోపాలరావునయ్యా గుర్తున్నానా ?”
“అదేనోయ్ మనమిద్దరం ఇరవై ఏళ్ల  క్రితం విజయవాడలో ఎరువుల కంపినీలో పనిచేసాం కదా”వెంకట్రావ్  గుండె ఆగినంత పనయ్యింది. ఇదేమిటి   తను నిజంగా గోపాలరావుతోనే మాట్లాడుతున్నాడా ? ఇది కలా  నిజమా? తనని ఆఫీసులో పెట్టిన టార్చర్కు అతని మీద కథకూడా రాసేసి ఒక ప్రముఖ పత్రికలో బహుమతి కూడా కొట్టేసాడు. గోపాలరావు అవతల ఫోనులో ఉండగానే  వెంకటర్రావు మస్తిష్కంలో క్షణాల్లోనే భయంతోగూడిన ఆలోచనలు చెలరేగి కొద్దిసేపు కొయ్యబారిపోయాడు. ఆ క్షణాన అతనిలో ఎప్పుడూ లేని అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చాయి. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి  మొహం చెమటతో ముద్దయ్యింది.
“ఏమిటోయ్ వెంకట్రావ్ అలా స్పందన లేకుండా బిర్ర బిగుసుకు పోయినట్టున్నావు . ఈమధ్య ఒక పత్రికలో నువ్వు రాసిన కథ కింద నీ ఫోటో నీ సెల్  నెంబర్  చూసి ఫోన్ చేస్తున్నాను లే ఇప్పుడెక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్?”
గోపాలరావు మాట్లాడుతూ ఉంటే ఇరవై ఏళ్ల క్రితం  ఏ  తప్పు చేయని తనని అతని చాంబర్లోకి పిలిపించుకుని నిర్దాక్షిణ్యంగా తలెత్తుకోలేనంత  ఘోరంగా అవమానించిన గోపాలరావు  రూపం కళ్ళ ముందు మెదిలింది. ఏదో ఘోరమైన విపత్తు జరగబోతోందన్నట్టుగా అతని మనసు సూచిస్తోంది.  అతని మొహంలో రంగులు మారాయి క్రమంగా. సంభాషణ ఎక్కడనుండి మొదలెట్టాలో తెలియలేదు. “మీరా సార్  వయసు ప్రభావం వల్ల మీ గొంతు  వెంటనే గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోకండి. మీ గురించి చాలా ప్రయత్నించాను సార్. కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇప్పుడు ఎక్కడ వున్నారు సార్ ? మేడమ్ గారు ఎలా వున్నారు ? పిల్లలు  ఏమి చేస్తున్నారు ?” గబగబా అడిగేశాడు మనసును  స్వాధీనంలోకి తెచ్చుకుని. ఇటువంటి సంకట పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని  వెంకటరావు కలలోనైనా ఊహించి ఉండడు” ఏమిటయ్యా బాబూ నా   గురించి అంత అసహ్యంగా కధ ఎలా రాసావ్? నీ కధలో రాసినట్టు నేను నీతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదే ? నేను మామూలుగా కోపం వచ్చినప్పుడు అందరితో ఎలా మాట్లాడుతానో ఆరోజు నీతో కూడా ఒక రెండు మాటలు అని వుంటాను. అంత మాత్రం చేత నా మీద కక్ష పెంచుకుని కథలో భయంకరమైన రోగంతో చచ్చి పోయినట్టు  రాస్తావా ? నువ్వు ఎంత రచయితవైతే మాత్రం వున్నవీ లేనివీ కలిపించి నీకు పడని వాళ్ళ మీద కధలు  రాసి బహుమతులు కొట్టేయ్యాలని  ప్రయత్నం చేసి అందరి ఉసురు పోసుకుంటున్నావు. ఆ కధ నా అదృష్టవశాత్తు నా కంట పడింది కాబట్టి నువ్వేమిటో నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అర్ధం అయ్యింది. నువ్వేం శపించావో తెలియదు కానీ  కొన్నాళ్ళ క్రితం నాకు యాక్సిడెంటయ్యి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఇలా నీకు నచ్చని వాళ్ళ మీద విద్వేషం  పెంచుకుని వాళ్ళ మీద కథలు రాసి డబ్బు సంపాదించి ఆ  రక్తపు కూడు తినాలనుకోవడం హేయమైన చర్య అని గుర్తించుకో ” అంటూ కోపంగా ఫోను పెట్టేశాడు గోపాలరావు, ఆయన మాటలు చెళ్లుమని కొరడాతో కొట్టినట్టుగా అనిపించాయి. ఊహించని ఈ హఠాత్తు పరిణామానికి వెంకటరావు స్థాణువులా అయిపోయాడు. అతనికి ఎప్పటికీ అర్ధం కాని విషయం ఏమిటంటే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో గోపాలరావు తీసుకుని తీసుకుని చచ్చిపోయాడని  ఎవరో ద్వారా విన్నాక అది నిజమే అనుకుని ఇక అతడు లేడనే పూర్తి  ధైర్యం వచ్చాకనే అతన్ని కథావస్తువుగా తీసుకుని పోటీకి కథ రాసి మొదటి బహుమతి కొట్టేయ్యడం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!