కన్నవారికి కడుపు కోత

కన్నవారికి కడుపు కోత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: తిరుపతి కృష్ణవేణి

ఉన్నత విద్య కొరకు కొంతమంది యువతీ యువకులు విదేశాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లి డాక్టర్స్, ఇంజనీర్స్,సైంటిస్టులుగా, వ్యాపార వేత్తలుగా తయారై మన దేశానికి మంచి పేరు తీసుక రావటానికి ప్రయత్నం చేస్తుంటే! మరికొందరు యువత సెల్ ఫోన్, వాట్సాప్ ఇనిస్టాగ్రామ్ ల కలల ప్రపంచంలో జోగుతున్నారు. వారి గమనం ఎటు వైపో వారికే తెలియటం లేదు.? తల్లిదండ్రులు ప్రతి వారు తమ పిల్లలను ప్రేమగా, ఏ లోటూ రాకుండా,  తమకు ఉన్నంతలో, కష్టాన్నంతా ధారపోసి పై చదువులు చదివించి వారి భవిష్యత్ ను  తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే తాము అనుభవించిన  కష్టాలు, వారికి రాకూడదని, వారు సుఖంగాజీవించాలని, పిల్లలు ప్రయోజకులైతే ఇంతకాలం తాము పడ్డ బాధలు తీరుతాయని, తమ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తారని, ప్రతి అమ్మా నాన్నలు ఆశపడతారు. పిల్లల చదువుల కొరకు రెక్కలు, ముక్కలు చేసుకొని  వారిని ఉన్నత స్థాయి కి తీసుకరావటమే ప్రధాన లక్ష్యంగా శ్రమిస్తారు. తమ పిల్లల ఎదుగుదలకు ప్రతి అమ్మా,నాన్న, తమ కర్తవ్యంగా, భాద్యతగా పని చేస్తారు. అది వారి జీవితంలో సాధించే గొప్ప విజయం గా భావిస్తారు. కానీ.!నేటి యువతలో కొందరు దీనికి భిన్నంగా ఆలోచనలు చేస్తున్నారు. గమ్యం తెలియక ఎటువైపు వెళ్తున్నారో వారికి తెలియటం లేదు.? అమ్మా నాన్నలు మాత్రం బయటి నగరాలకు, ఉన్నత చదువుల నిమిత్తం వెళ్తున్న తమపిల్లలు అక్కడ ఏ కష్టం పడకూడదని వారు అడిగినంత డబ్బులు ఇస్తుంటారు. అంతేకాదు కొందరు డబ్బు బాగా ఉన్న తల్లిదండ్రులు తమపిల్లలు నడిచి అలసి పోతారని చాలా ఖరీదైనమోటార్ బైకులు కొనిస్తుంటారు.
కొందరు విద్యార్థులు తమ చేతుల్లో డబ్బు పుష్కళంగా ఉంటం మూలంగా ఆడంబరాలకు పోయి! జల్సా ఖర్చులు చేస్తూ, ఖరీదయినా జీవితాలకు  అలవాటు పడుతున్నారు. మరికొందరి స్నేహితుల మూలంగా, బర్త్ డే పార్టీలంటూ, హోటల్స్, పబ్బుల చుట్టూ తిరుగుతూ, కాలక్షేపం చేస్తుంటారు. భాధ్యత గల యువతగా వారికి ఈ దేశంలో ఏం జరుగుతుంది? పట్టదు? దేశ నాయకుల, పాలన ప్రజల సమస్యలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళా సమస్యలు ఏమిటో తెలుసుకోరు.? ప్రజల జీవన విధానాలు ఎలా ఉన్నాయి.? ఈ సమాజం ఎటుపోతుంది? ఈ ఆలోచనలు చేసే తీరిక వారికి ఉండదు.?
వారి ప్రపంచమే వేరు.! చదువులు తర్వాత చదవొచ్చు! చాలా సమయముంది! చదవటానికి ముందు, జీవితాన్ని, ఎంజాయ్ చేయాలి.! ఈ సమయంలో కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాము? అనే, దురాలోచనలతోనే వారు జీవితాలను గడుపుతున్నారు. సరదాకు అలవాటు చేసుకోవటం మొదలైన ఈ దురలవాట్లు, వ్యసనంగా మారి, యువతను  బానిసలుగా తయారు చేస్తున్నాయి.
ఇంకొందరు యువకులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి, అమాయకుల ప్రాణాలను బలి  తీసుకుంటున్నారు.
ప్రమాదాలకు గురైతూ, అర్దాంతరంగా తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తల్లి దండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఏ వార్తా పేపర్ చూచినా, టి. వి.వార్తలు చూచినా, సోషల్ మీడియాలో చూచినా ఏ మున్నది చెప్పుకోవటానికి,? ఎక్కడ చూసినా,మహిళల పై దాడులు,దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కులమత సంఘర్షణలే, కనపడుతున్నాయి. కొంతమందిచదువుకున్న యువకులే ఇటువంటి దుర్చర్యలకు పాల్పడుతుంటే ఇక సమాజం ఏం, బాగుపడుతుంది. దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది.? యువత ఎప్పుడు మేల్కొంటుంది.?
యువత ఒక్కక్షణం ఆలోచించు! నీలో ఉన్న చైతన్యాన్ని నిద్రలేపు ! నీ విజ్ఞానానికి పదును పెట్టు.!
నీ ఉనికిని కాపాడుకో! నీకు పట్టిన జాడ్యాన్ని వదిలించుకో! దేశాన్ని చైతన్య వంతంగా నడిపించటానికి, యువతే నడుం బిగించి ముందుకు సాగాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!