మా ఊరు

మా ఊరు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: ఆకుమళ్ల కృష్ణదాస్

అనుకోని విపత్తుల వల్ల అయిన వారందరికీ దూరంగా వున్నాను. ఆప్తులను ఆత్మీయులను కూడా పోగొట్టుకున్నాను. ఎందుకో రాత్రంతా అమ్మానాన్నలే గుర్తొచ్చారు. అందుకే ఆఫీసుకి మూడురోజులు సెలవు పెట్టి, మా ఊరికి వెళ్లాలని బస్సెక్కాను.కిటికీ పక్క సీట్లో కూర్చొని. మా ఊరిని తలచుకుంటూ కళ్ళు మూసుకున్నాను. మావూరికి వెళ్లాలంటే బస్సు దిగి, మూడు మైళ్ళు నడిచి వెళ్ళాలి. చిన్నప్పుడు మా నాన్నతో, పై చదువులకు స్నేహితులతో పక్క ఊరికి నడిచే వెళ్ళేవాన్ని. దారిపొడవునా ఇరువైపులా పచ్చని చెట్లుండేవి. అందుకే మేం నడిచి వెళ్లినా అలసట వచ్చేది కాదు. జేబునిండా బొరుగులు పోసుకొని తినుకుంటూ వెళ్లే వాళ్ళం. మా ఊరిమధ్యలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. అది చుట్టూ వున్న మూడు ఊళ్లకు రాజగోపురం లా కనిపించేది. చెట్టుకింద పెద్ద అరుగు. అక్కడ అందరికీ కొలువు కూటంలా ఉండేది. నిత్యం చల్లదనాన్ని పచ్చదనాన్ని ఇచ్చే చలువ పందిరి ఆచెట్టు. ఆచెట్టు పై ఎన్నో రకాల పక్షలు కిలకిలా రావాలతో కనువిందు చేసేవి. బడికి వేసవి సెలవులొస్తే.. మా ఆటలన్నీ ఆ చెట్టుకిందే. ఉదయం సాయంకాలం. మా రాములోరి గుడినుండి కమ్మని పాటలు వినిపించేవి. ప్రసాదం కోసం పరుగులెత్తే వాళ్ళం దోస్తులందరం. ఊహల్లో వుండగానే మా ఊరొచ్చింది. బస్సు దిగాను. మా ఊరికి వెళ్ళటానికి రెడీగా ఆటోలున్నాయి అక్కడ. ఆటో ఎక్కి కూర్చున్నాను. వెళుతుంటే ఒక్కచెట్టు లేదు దారిపొడవునా. ఆటోవాణ్ణి అడిగితే రోడ్డు వెడల్పు కోసం కొట్టేశారు అన్నాడు. ప్రాణం చివుక్కుమంది. అక్కడక్కడా చేలల్లో ప్లాట్లు వేశారు ఇళ్లకోసం. ఊళ్ళో దిగాను. గుండెలు జల్లుమన్నాయి. ఊరిమధ్యలో మర్రిచెట్టు లేదు. అదికూడా రోడ్డు విస్తరణలో పోయిందట. తిన్నగా ఇంటికి వెళ్ళాను, తమ్ముడు లేడు. వాడిపిల్లలు బయట ఆడుకుంటున్నారు. గుర్తు పట్టలేదు. మూడేళ్లయ్యిందిగా. ఇంటిలోపలికి వెళ్ళాను. అమ్మానాన్నల ఫోటోలు గోడపై నుండి నన్ను చూసి నవ్వుతున్నారు. చాన్నాళ్ళైందిగా నన్ను చూసి. తిన్నగా బయటకు వచ్చి శివయ్య మామ ఇంటికి వెళ్ళాను. మావయ్య చాలా చిక్కిపోయాడు. ఊరిచెరువును ఎవరో కబ్జా చేశారట. కొందరు ఊరు వదిలి వెళ్లారని మరికొందరు వలస వెళ్లారని మావయ్య చెబుతుంటే కన్నీరు ఆగలేదు. రండి మావయ్యా నాతోపాటు అన్నాను. రానన్నాడు ఈవూరి మట్టిలోనే ఇమిడి పోతా నన్నాడు. అందరినీ చూసి ఆనందాన్ని పొందాలనుకున్నాను. సముద్రాన్ని కళ్ళల్లో నింపుకొని ఆటో ఎక్కాను తిరుగు పయనమై!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!