మంచి మాట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కాటేగారు పాండురంగ విఠల్
మన మంచితనం బలహీనత కారాదు
ఎదుటి వ్యక్తికది బలముగా మారరాదు
చేసే పని మీద నమ్మకము సడల రాదు
ఆత్మవిశ్వాసం ఎప్పటికీ వదులుకోరాదు
నీలోని అంతశ్శక్తిని గెలుపుకై వాడుకో
నీలోని నీతి నిజాయితీలను నమ్ముకో
నీవే నీకు హితుడు మిత్రుడని అనుకో
శ్రమను చులకన చేయడం మానుకో
జీవితమనుభవాల బడియని మరవకు
సంతోషాలు పంచే మడియని మరవకు
వరాలిచ్చే దేవుని గుడియని మరవకు
వాత్సల్యపు అమ్మ ఒడియని మరవకు
స్నేహమనే చిరు దీపాన్ని వెలిగించుము
ధైర్యమనే రవ్వ మదిలో రగిలించుము
నీప్రేమనే సమాజానికి సమర్పించుము
నీ మంచితనాన్నే నలుగురికర్పించుము
కష్టమును ఇష్టంగా ఎదిరిస్తే విజయం
నీరుగారిపోతే కలుగును పరాజయం