ఊతపదం -కాంతమ్మ

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
ఊతపదం -కాంతమ్మ
రచన:: శృంగవరపు శాంతికుమారి

రాఘవరావు గారి ఇల్లంతా పెళ్ళి వేడుకులతో సందడి సందడిగా ఉంది.
రామభద్రపురంలోని ప్రజలందరూ రాఘవరావుని దేవుడులా కొలుస్తారు. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి కష్టాల్లో ఆదుకొని వాళ్ళందరికీ అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తి రాఘవరావు.

మరి రాఘవరావు పెద్ద కూతురు సంధ్యారాణి వివాహం అంటే….రామభద్రపురంలోని వాళ్ళందరికీ వేడుకే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు పెళ్ళి పనుల్లో సాయం చేస్తున్నారు.

కమలాదేవి ఏవండీ…..
రేపే పెళ్ళి నాకు చాలా టెన్షన్గా ఉందండి. వియ్యంకులు వారు చాలా ధనవంతులు. వాళ్ళ తరుపున ఎంతో మంది గొప్ప గొప్ప వారు వస్తారు.
పైగా అల్లుడు అమెరికాలో ఉంటున్నాడు. అల్లుడు స్నేహితులు కూడా…..

ఆ…. స్నేహితులు కూడా అయితే ఏమిటి కమల అల్లుడు గారు కానికట్నం తీసుకోకుండా మన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. వాళ్ళందరూ డబ్బులోనే కాదు గుణంలోనూ గొప్ప వారే…..
వాళ్ళ తరుపోళ్ళకి ఏ లోటు రాకుండా నేచూసుకుంటాను గా….. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు వెళ్ళు పడుకో ఉదయాన్నే లేవాలిగా….

కావ్యశ్రీ పెళ్ళి మండపం అదిరిపోయేటట్లు, అందరూ ఉలిక్కి పడేటట్లు నాన్నమ్మ
వచ్చిందో….. చిన్నాన్నమ్మ వచ్చిందో…… అని బిగ్గరగా అరుసుకుంటూ…….
కారు దిగి మండపంలోకి వస్తున్న కాంతమ్మ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి గట్టిగా నడుంపట్టుకొని నాన్నమ్మా………….అంటూ ఆప్యాయంగా చుట్టుకుపోయింది.

“ఓసి నీ ఇల్లు బంగారం గానూ”…. నేనంటే ఎంత ప్రేమే తల్లీ నీకు?
అంటూ కాంతమ్మ కావ్యశ్రీని ముద్దుపెట్టుకుంది.

రాఘవరావు పనిమనిషి నరసమ్మ కాంతమ్మకి డ్రింక్ ఇస్తూ బాగున్నారా అమ్మా?
అని పలకరిస్తుంది. “ఓసి నీ ఇల్లు బంగారం గానూ”…..
నరసమ్మా నువ్వెంటే!బాగున్నాను.
నా ఇల్లు బంగారం అయితే మీ ఇంట్లో పనిమనిషిగా పడి ఎందుకుంటానమ్మా….. అని అమాయకంగా గొణుక్కొంటూ…… వెళ్ళు పోతుంది నరసమ్మ.

సంధ్యారాణి, సుధీర్ కుమార్ లా కళ్యాణం సీతారాముల కళ్యాణంలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజి బిజీగా ఉన్నారు.

కమలాదేవి పెద్దన్నయ్య కాంతమ్మను పలకరించి ప్రక్కన కూర్చున్నాడు. ఏం మధుసూదనం దిగాలుగా కనిపిస్తున్నావేమిరా?
మేనకోడలకి మేనమామ తరుపున కట్న కానుకులు భారీగా ఇవ్వాలనా…..

అచ్చే…. అదేం లేదు అత్తయ్య నా బంగారు తల్లికి నేను కాకపోతే ఎవరిస్తారు కానుకలు…..
మొన్న మా ఇంట్లో దొంగలు పడి చాలా డబ్బు ధనం బంగారం ఎత్తుకు పోయారు.
కాంతమ్మ నిర్ఘాంతపోయి!
“ఓసి నీ ఇల్లు బంగారం గానూ”….. అంతపని జరి గిందేంట్రా? బాధ, అమాయకం, అయోమయం కలగలిపిన మొఖంతో సన్నని గొంతుతో నా ఇల్లు బంగారమనే కదా! దొంగలొచ్చి ఇల్లంతా దోచుకున్నారు. ఆ మాటలకి కాంతమ్మ నోరెళ్ళ బెట్టి అలానే చూస్తూ ఉండిపోయింది.

ఎలాంటి ఆటంకాలు, గొడవలు లేకుండా సంధ్యారాణి పెళ్ళి ప్రశాంతంగా జరిగిపోయింది. వధూవరులు సీతారాముల్లా చూడ ముచ్చటగా ఉన్నారు.పెద్దలందరి దగ్గరకి వెళ్ళి కాళ్ళకి దండం బెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

కాంతమ్మ కాళ్ళకి కూడా దండం బెడుతున్నారు”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”….
పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా నిండునూరేళ్ళు వర్ధిల్లు తల్లీ….. అని దీవించే సరికి పెళ్ళి మండపంలోని అందరూ….. “ఓసి నీ ఇల్లు బంగారం గానూ”…. ఇక్కడ కూడా ఆ మాట మానలేదా…….. అని అందరూ పక పకా నవ్వుల వర్షాన్ని కురిపించారు.

—-సమాప్తం —–

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!