పన్నెండు గంటలు

(అంశం:”అల్లరి దెయ్యం”)

పన్నెండు గంటలు

సావిత్రి కోవూరు 

ఆరోజు మధ్యాహ్నం అన్నం తిని ఏదో మ్యాగ్జైన్ పట్టుకుని కూర్చున్నాను. అప్పుడే నా చిన్ననాటి స్నేహితురాలు లావణ్య వచ్చింది ఇద్దరం మా చిన్నప్పటివిషయాలన్నీ నెమరు వేసుకుందాం తర్వాత సంసార విషయాలు, సినిమాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.

మధ్యలో లావణ్య “ఏంటే అప్పట్లో నీకు ఏవో అల్లరి దెయ్యాలు కనిపించాయట. ఎప్పుడో మీ ఆడపడుచు కనబడి చెప్పింది. చాలా భయపెట్టాయట కదా” అన్నది అల్లరిగా నవ్వుతూ.

“నీకు నవ్వులాట గానే అనిపిస్తున్నది. ఆ నరకం అనుభవించిన నాకు తెలుసు ఎంత భయంకరంగా ఉంటదో” అన్నాను.

“పోవే ఈ కాలంలో కూడా దయ్యాలు ఉంటాయని నమ్మడమూ, పైగా భయపడడమూ నా?  వింటుంటేనే ఎంత హాస్యాస్పదంగా ఉన్నది” అన్నది లావణ్య.

“నీకు తెలియదే నేను ఎంత భయపడ్డానో” అన్నాను.

“అయితే చెప్పు ఆ అల్లరి దెయ్యాల కథ ఏంటో వింటాను” అన్నది.

“నేను చెప్పినంత సేపు నీవు ఎగతాళిగా నవ్వకుండా,  నేను చెప్పేదంతా పూర్తిగా విను. నేను ఎందుకు అంతగా భయపడ్డానో తెలుస్తుంది నీకు” అన్నాను.

“సరే చెప్పవే నేనేం నవ్వనులే” అన్నది.

నేను చెప్పడం మొదలు పెట్టాను.

“మా పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ల ఆ పెద్ద ఇల్లు చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఆ ఇల్లు మావారి ముత్తాతగారు కట్టించిన పాత ఇల్లు. చాలా విశాలంగా ఉండేది. అది పాత కాలంలో కట్టారు కనుక ఇంటికి రెండు వైపులా కామన్ వాల్స్ ఉండేవి ముందు వైపు రోడ్డు వెనకవైపు, వెనక ఇళ్లకు వెళ్లడానికి చిన్న దారి ఉండేది. అప్పటి ఇళ్ళకి కాంపౌండ్ వాల్స్, గేట్స్ ఉండేవి కావు. గ్రౌండ్ ఫ్లోర్ లో మధ్యన ఓపన్ ప్లేస్ ఉండి చుట్టూ హాల్, ఏడు గదులుండేవి. ఓపెన్ ప్లేస్ ను  విభజిస్తూ మధ్య నుండి పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. ఆ మెట్ల కింద ఒక బావి ఉండేది. ఆ బావి అవసరం  ఉండేది కాదు. కాబట్టి దాన్ని గ్రిల్స్ తో మూసేశారు. ఆ బావిలో మా పూర్వులలో ఎవరో ఒక పెద్దావిడ పడి చనిపోయిందని మా వాళ్ళు చెప్పారు. పైన నాలుగు గదుల్లో మూడింటిని వాడకుండ ఎప్పుడు మూసి ఉంచేవాళ్ళం.  రోడ్డు వైపు ఉన్న ఒక గదిని మాత్రం మేము బెడ్ రూమ్ గా వాడుకునే వాళ్ళం. దానికి పెద్ద కిటికీలు బిల్డింగ్ లెవల్ కంటే కొంచెం ముందుకు ఏర్పాటు చేశారు. అంటే ఆ కిటికీల దగ్గర నిల్చుని చూస్తే రోడ్డు ఆ చివరి నుండి నుండి చివరి వరకు మొత్తము స్పష్టంగా కనిపించేది.

మా అత్తగారు, మామగారు, ముగ్గురు మరుదులు, మావారు, నేను మొత్తం ఏడు మందిమి ఉండే వాళ్ళము. అందరం  గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేవాళ్ళం. ఓన్లీ మా బెడ్రూం మాత్రమే పైన ఉండేది. పెళ్లయిన కొత్తలో మా అత్తగారు పిల్లలను తీసుకుని వాళ్ళ మేనమామ ఊరికి రెండు నెలలు వెళ్లారు.

అంత పెద్ద ఇంట్లో నేను, మా వారు, మా మామగారు మాత్రమే ఉన్నాం. మా వారు పబ్లిక్ సెక్టర్  కంపెనీలో జాబ్ చేస్తూ, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట టైం ఇంజనీరింగ్ చదువుతుండేవారు. అందుకని ఉదయం ఆరున్నరకు ఇంటి నుండి బయలుదేరితే రాత్రి వచ్చే వరకు పన్నెండున్నర అయ్యేది. మా మామగారు స్టేట్ గవర్నమెంట్లో పని చేసేవారు. ఆయన ఉదయం పది గంటలకు వెళితే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవారు.

అంటే పొద్దున పదింటి నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండవలసివచ్చేది. ఎవరు లేనప్పుడు హాలు నుండి వంటగదికి వెళ్లడానికి కూడా  భయమేసేది. అందుకని మా మామగారు ఉదయం పది గంటలకు ఆఫీస్ కి వెళ్లడానికి భోజనం చేస్తున్నప్పుడే, నేను కూడా ఒక ప్లేట్ లో అన్నం కూరలు అన్ని గబగబ వడ్డించుకుని, మా మామగారు ఆఫీసుకు వెళ్ళగానే మెయిన్ డోర్ పెట్టేసి ప్లేట్ తీసుకొని పైన బెడ్ రూం లోకి వెళ్ళిపోయెదాన్ని.

అంటే ఇక సాయంత్రం మా మామగారు వచ్చేవరకు కిందికి వచ్చే దాన్ని కాదు. పైన బెడ్ రూమ్ రోడ్డు వైపు ఉండి పెద్ద కిటికీలు ఉండేవి కనుక అక్కడ కూర్చుంటే ఒంటరిగా ఉన్నట్టు అనిపించేది కాదు.

కానీ సరిగ్గా పన్నెండింటికి ఎవరో నడుస్తున్నట్టు, పరిగెత్తుతున్నట్టు, గజ్జెల శబ్ధం అడుగుల శబ్దం వినిపించేది. కొంచం సేపటి తరువాత ఇంచుమించు రోజూ రెండు పిల్లలు పోట్లాడినట్టు వింత శబ్దం వచ్చేది. మధ్య మధ్య పై నుండి ఓపెన్ ప్లేస్ లోకి రక్త చుక్కలు కూడా పడేవి. మొదట్లో నేను అంతగా పట్టించుకునే దాన్ని కాదు. కానీ రోజూ అదే టైం కి ఆ గజ్జెల శబ్దం పరిగెత్తుతున్న శబ్దం పిల్లులు శబ్దం వచ్చేసరికి చాలా భయం వేసేది. మళ్ళీ రాత్రికి పన్నెండింటికి కూడ అదే ఎవరో పరిగెత్తినట్టు అడుగుల శబ్దం, గజ్జెల శబ్దం వచ్చేది.

మా వారికి గాని, మామగారు గాని చెబ్దామంటే  నవ్వుతారేమో నని భయం. నేను రోజు పొద్దున, రాత్రి పన్నెండు అవుతుందంటే భయంతో వణకి పోయేదాన్ని. మధ్య మధ్యన పిల్లల ఏడుపులు కూడా వినిపించేవి. ఇక భయంతో నేను రోజంతా దాని గురించే ఆలోచిస్తూ చాలా డల్ గా ఉండేదాన్ని.

మా వారు మధ్య మధ్యన “ఏమైంది అలా ఉన్నావ్” అంటే

“మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటి నిండ జనాలు ఉండే వాళ్ళు. ఇక్కడ  దినమంత ఒక్క దాన్ని ఉండటం వల్ల చాలా బోర్ గా ఉంది” అన్నాను.

“బోర్ కొడితే మ్యాగజైన్స్ చదువు. రేడియో పెట్టుకుని హాయిగా పాటలు విను” అనేవారు.

(అప్పుడు టీవీలు లేవు ఫోన్స్ లేవు) చుట్టుపక్కల ఎవరితో నాకు పరిచయం లేదు పొద్దుటి నుండి సాయంత్రం ఆరు వరకు ఒక్కదాన్ని ఉండాల్సి వచ్చేది. ఆరింటికి మా మామ గారు వచ్చి టీ తాగి బయట అరుగుపైన కూర్చునేవారు. మళ్లీ ఎనిమిదింటికి భోజనం చేసి తన రూమ్ లోకి వెళ్లి తొమ్మదింటికే నిద్రపోయేవారు.

అప్పుడు అందరూ రూ 9:30 లోపలే అందరు పడుకునేవాళ్ళు. రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉండేవి. అడపదడప సైకిళ్ళు ఏ వెహికిల్స్ ఉండేవి కావు. నేను రాత్రి తొమ్మిదింటికి పైన బెడ్ రూం లోకి వెళ్లి కిటికీల దగ్గర మా వారు వచ్చే వరకు బయటకు చూస్తూ కూర్చునేదాన్ని. మళ్ళీ రాత్రి పన్నెండు అయ్యింది అంటే అవే గజ్జెల శబ్దాలు, పరిగెత్తుతున్నట్టు అడుగుల శబ్దాలు వినపడేవి. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత మెల్లగా పన్నెండున్నరకు మా వారు నైట్ కాలేజీ నుండి వచ్చేవారు. మా వారు వచ్చినప్పుడు ఇంటికెళ్ళి డోర్లు తీయడానికి కూడా చాలా భయపడుతూ వెళ్ళేదాన్ని. ఆ శబ్దాలే కాకుండా మా ఇంట్లో మెట్ల కింద ఉన్న బావిలో మా పూర్వీకులు ఎవరు ఒక ఆవిడ పడి చనిపోయింది అని కూడా నాకు తెలియడం వల్ల  ఇక ఆ మెట్లు దిగి వస్తుంటే భయంతో వణికి పోయేదాన్ని.

అలా రెండు నెలలు గడిచిన తర్వాత మా ఆడపడుచు వచ్చింది మా ఇంటికి. నన్ను చూసి “ఏంటి ఇలా అయిపోయావ్. అసలు అన్నం తింటున్నావా లేదా” అని అడిగేసరికి గట్టిగా ఏడ్చేశాను.

“ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైంది. మా అన్నయ్య సరిగ్గా చూసుకోవడం లేదా మా నాన్న ఏమయిన అంటున్నారా” అని మళ్లీ మళ్లీ అడిగింది.

“అందరూ బాగానే చూసుకుంటున్నారు. కానీ నాకు ఈ ఇంట్లో చాలా భయమేస్తుంది” అని ఆ శబ్దాల సంగతంతా చెప్పేశాను. ఆమె కొంచెం సేపు మౌనంగా ఉంది.

తర్వాత “అవును నా పెళ్లికాకముందు కూడా ఈ గదిలో పడుకుంటే, నాక్కూడా అలాగే గజ్జెల శబ్దం, పరిగెత్తిన శబ్దము వినబడేవి. నేను ఎవరికీ చెప్పలేదు” అన్నది.

“అంటే ఈ ఇంట్లో ఏదైనా దయ్యం ఉందా” అన్నాను.

“అదంతా నాకు తెలియదు కానీ ఎవరూ లేకపోతే ఎక్కువగా శబ్దం వచ్చేది. సరేలే ఈ విషయము నేనే మా నాన్నకు అన్నయ్యకు చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. నీవు భయపడకు” అని చెప్పింది. ఆ మాటలు నాకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చాయి.

ఒక రోజు మా ఆడపడుచు “పక్కింటి రాధిక చీరల బిజినెస్ ఏదో చేస్తోందట వెళ్లి చూద్దాం పద” అని వాళ్ళింటికి తీసుకెళ్ళింది. వాళ్లు మేడ పైన ఉంటారు. మేం వెళ్లి కూర్చుని చీరలు చూస్తున్నాం.  పన్నెండు గంటలకు వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి వచ్చి మెట్ల దగ్గర డోర్ కొట్టేసరికి రాధిక డోర్ తీయడానికి పరిగెత్తుకొని వెళ్ళింది. ఆమె కాళ్ళకి పెద్ద శబ్దం వచ్చే గజ్జెలు ఉన్నాయి. ఆమె నడక చాలా స్పీడ్ గా పరిగెత్తినట్టు ఉంది. నేను మా ఆడపడుచు ముఖముఖాలు చూసుకున్నాము.

ఆమెతో “రాధ మీ పిల్లలు రోజు ఇదే టైం కి వస్తారా” అని అడిగితే
“ఆమె అవును వాళ్ళకు లంచ్ టైం పన్నెండింటికి. రోజు ఈ టైం కే వస్తారు వాళ్ళు” అన్నది.

“మీ వారు ఎక్కడ చేస్తారు” అని మామూలుగా అడిగినట్టు అడిగితే

“ఆయన డిఫెన్స్ ఆఫీస్ లో చేస్తారు. నైట్ డ్యూటీ ఉంటుంది.ఆయన వచ్చేసరికి రాత్రి పన్నెండు అవుతుంది” అని చెప్పింది. ఆమె పిల్లలకి అన్నం పెట్టడానికి వెళుతూ, రండి మా ఇల్లు చూద్దురుగాని అని ఇల్లంతా చూపెట్టింది. వాళ్ళ ఇల్లు మెట్ల పక్కన రెండు బెడ్రూంలు ఒక హాలు ఉన్నాయి. వాటి ముందర  చాలా ఓపెన్ ప్లేస్ ఉండి అక్కడి నుండి మూడు మెట్లు  దిగినాక వంటగది ఉన్నది అంటే వాళ్ళ వంటగది లెవెల్ కొంచెం క్రిందికి ఉన్నదన్నమాట. కనుక ఆమె హాల్ నుండి వంటింటికి వెళ్లాలంటే ఓపెన్ ప్లేస్ దాటుకుని మూడు మెట్లు దిగి వెళ్లాలి అన్నమాట. రోజు వాళ్ల పిల్లలు లంచ్ కి వచ్చినప్పుడు మధ్యాహ్నం పన్నెండింటికి, వాళ్ళ ఆయన డ్యూటీ నుండి రాత్రి పన్నెండింటికి వస్తే అప్పుడు ఆమె రెండుసార్లు పెద్దపెద్ద అడుగులతో పరిగెత్తినట్టు నడుస్తూ వంటగదికెళ్ళుతుందన్నమాట  పైగా కాళ్ళకి పెద్ద శబ్దం వచ్చే గజ్జెలు ఉండేవి. మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యన కామన్ వాల్ ఉండేది. అంటే రూఫ్ మొత్తం కలిసే ఉండేది. ఆమె నడిచినప్పుడల్లా పక్కనే ఉన్న మా బెడ్ రూమ్ కి గజ్జెల శబ్దం, అడుగుల శబ్దము రోజు ఒకే టైం కి రావడం వల్ల నేను ఇన్ని రోజులు భయంతో వణకి పోయాను. మేము అక్కడ ఉన్నప్పుడే రెండు పిల్లులు వాళ్ల మేడపైన పోట్లాడుకుంటున్నాయి. వాని శబ్దము చిన్న పిల్లల ఏడుపులాగ భయంకరంగా ఉన్నది.

ఆమె ఒక కర్ర తీసుకుని “ఈ పాడుపిల్లులు ఎన్నో రోజుల నుండి ఇక్కడ స్థావరం ఏర్పరచుకుని ఎప్పుడు పోట్లాడుకుంటాయి. ఎక్కడెక్కడినుండో ఎలుకలను తీసుకొని వచ్చి ఇక్కడ అంతా అసహ్యంగా తయారు చేస్తున్నాయి” అని విసుక్కుంది.

అప్పుడు నాకు మా ఆడపడుచుకు ఆ అడుగుల శబ్దము, ఆ గజ్జెల శబ్దం, ఆ పిల్లల అరుపులు, ఆ రక్తపు చుక్కలు ఎందుకోస్తున్నాయో అర్థమయింది.

ఆ సంగతి రాధతో చెప్తే ఎంతోసేపు నవ్వి “ఈ కాలంలో కూడా మీరు దయ్యాలున్నాయని నమ్ముతున్నారా. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే అంత అర్థమయ్యేది. మీరు ఇన్నిరోజులు భయపడుతూ ఎలా గడిపారు అసలు” అని ఒకటే నవ్వడం మొదలు పెట్టింది.

ఆమె మాటలకు మొదట మేము సిగ్గుపడ్డా తర్వాత ఆమె నవ్వుతో శృతి కలిపాము తేలికయిన మనసుతో. నేను చెప్పిన ఈ స్టోరీ ఎంతో శ్రద్ధగా విన్న లావణ్య “నీవు చెప్పింది నిజం గానే చాలా భయంకరంగా ఉంది. ఆ అల్లరి దయ్యం నిన్ను చాలా భయం పెట్టినట్టుంది అన్నది లావణ్య

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!