ఎన్నెన్నో జన్మల బంధం..బాలు

ఎన్నెన్నో జన్మల బంధం..బాలు

రచన: రాజ్(తొర్లపాటి రాజు)

తరాలు మారినా…
స్వరాలు మారినా…
మాకు వినబడే…స్వరం..నీదే

పదాలు మారినా…
నర్తించే పాదాలు మారినా…
కదిలే…పెదాలు మాత్రం …నీవే

కథలు మారినా…
కథనాలు మారినా…
పలికే గమకాలు మాత్రం నీవే

స్టార్లు మారినా…
దర్శక మాస్టారులు మారినా..
మా సింగింగ్ స్టార్ వి మాత్రం …నువ్వే

ఎందరో యువ గాయకులకు
సంగీత నిఘంటువు..నీ గళం!
నవరసాలను నల్లేరుపై నడకలా
పలికించే నీ గాత్రం..
అంతు చిక్కని శాస్త్రం!

రామా కనవేమిరా….
అంటూ రాముడ్ని పిలిచినా!
శంకరా… నాద శరీరాపర…………….
అంటూ..శంకరుడ్ని తలచినా!
అదివో అల్లదివో శ్రీ హరివాసము..
అంటూ..శ్రీహరిని కొలిచినా!

మేము జపించే..భక్తి మంత్రం
బాలు…గాత్రం

రవి వర్మకే అందని అందానివో
అంటూ…నువ్వు పాడిన పాట
ఎందరో ఊహలకు ఊపిరి పోసిన ఊట!

నిను చూడక నేనుండలేను
అంటూ వినిపించిన నీ మధుర గళం
ప్రేమికుల హృదయాలలో
రేపెను…కలకలం!

ప్రేమ లేదని ప్రేమించ రాదని
అంటూ..నీవు పాడిన పాట
భగ్న ప్రేమికుల గుండెల్లో పేల్చిన తూటా!

ఓ బాలు…
నీ మధుర స్వరం..
ఆ దేవుడు మాకిచ్చిన వరం
నీ పాట అంటే…
అందరికీ…ప్రాణం!

బాలు…
కుశలమా…నీకు కుశలమేనా…
అంటూ..కుశల ప్రశ్నలు వేసావు!

ఎన్నెన్నో జన్మల బంధం..నీది నాది..
అంటూ.. మన బంధాన్ని తెలిపావు!

ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం..
అంటూ…తీయటి జ్ఞాపకంగా మిగిలావు!

నూటికో కోటికో ఒక్కడు
ఎప్పుడో ఎక్కడో పుడతాడు..
అంటూ..
గర్వంగా తలచుకొనేలా…
అందరకీ ఆదర్శంగా నిలిచావు!

ఓ..గాన గంధర్వ బాలు…
అందుకో.. మా ప్రణామాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!