శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
రచన: ప్రసాదరావు రామాయణం
అంతర్యామీ!,
అలసితి సొలసితి
పోరాడలేనిక మరణంతో
ఐక్యం చేసుకోవా నన్ను నీలో
వెళ్ళిపోయాడు బాలు
మళ్లీ మళ్లీ అడిగి
పాటను బికారిగా వదలి
బిచ్చం వేసేవారు లేని
ఈ లోకంలో అడక్కు తినమని
వీణా తంత్రులు తెగిపోయాయి
వాయులీనాలు మూగబోయాయ్
తదిగిణలు తాళం తప్పాయ్
దారి తెన్నూ లేని తాళ వాయిద్యాలు
కోకిలమ్మల కన్నీరు
నైటింగేళ్ల ఏడ్పులు
సంద్రపు హోరు
ప్రకృతి శోకాలు
ఇంటింట కన్నీరు
ఎందరి హృదయాల్లో
నిక్షిప్త మైనావయ్యా బాలూ
నీవు అన్నమయ్యవయ్యా!
మరో తుంబురుడివయ్యా
నీ పాట శాశ్వతం
మేమే అశాశ్వతం
ఐనా మళ్లీ తెల్లారింది
అదేమో!
చీకటి విడిపోయింది
మళ్లీ జాబిల్లి ఉదయం
అంతే ఈ లోకపు తీరు!