ఆహార్యం

ఆహార్యం

రచన: మంగు కృష్ణకుమారి

వీడియో కాల్! అమెరికా నించీ! కూతురు కవిత దగ్గర నించీ! విశాల ఆత్రంగా వచ్చింది.
” అమ్మా! బిజీగా ఉన్నావా”

” లేదే! రోజూ ఉన్న పనులే! ఏమిటే కబుర్లు.‌ పిల్లలేరి? ” అడిగింది.

” నిఖిల్ ఎక్కడో ఆడుతున్నాడు. హరిణి లొపల ఉన్నట్టుంది. సరే గానీ మా అత్తగారేమన్నా ఫోన్ చేసేరా “

” లేదే? ఏమిటి సంగతి”

” మా అత్తగారు, మావగారు సత్య నారాయణ వ్రతం చేసుకుంటారమ్మా! మీ అందరినీ పిలుస్తారు. ఊరికే వ్రతం చేస్తున్నారు గానీ అందరితొ ఒక గెట్ టుగెదర్ మీట్ లా ఉండాలని కూడా ఆవిడ అనుకుంటున్నారు. మా పిన్నత్త గారు వాళ్ళ పిల్లలూ అందరూ వస్తారు.”

” అబ్నో! పెద్ద ఎత్తున చేస్తున్నారన్న మాట”
” అమ్మా! అన్నట్టు మావయ్యనీ అత్తనీ కూడా పిలుస్తారు. అత్త కి చెప్పు”

“సరే తల్లీ! ఇలాటప్పుడల్లా మీరు లేరే అని కలుక్కుమంటూ ఉంటుంది”

కూతురుతో మాటాడుతోంది గానీ విశాల చూపులు కవిత వేసుకున్న ఫేంట్ షర్డ్ ల మీదే ఉన్నాయి.
” ఇద్దరు పిల్లల తల్లయింది. చుడీదార్ అయినా వేసుకోదు” తనలో తను సణుక్కుంది.

హరిణీ ‘అమ్మమ్మా’ అంటూ వచ్చింది. దాన్ని చూస్తే మురిపం ఆగదు విశాలకి.
” బంగారం తల్లీ! ఏం చేస్తున్నావ్” అంటూ గారం చేసింది.‌ అది నవ్వుతూ చూసింది. .

దానికి తెలుగు మాటాడ్డం అంత బాగా రాదు. దాని తరపున కూడా కవితే మాటాడింది. హరిణి మినీ డ్రెస్ చూస్తుంటే ఒళ్ళు మండింది విశాలకి. తను కొన్న పట్టులంగాలు సరే చక్కటి గౌన్లు ఏం చేసేరో, ఎప్పుడూ ఈ చిట్టి డ్రెస్ తోనే ఉంటుంది. కోపం వచ్చినా, తమాయించుకుంది.
” సరే ఉంటానమ్మా! నాన్న కి కూడా చెప్పు” అంటూ ఫోన్ పెట్టేసింది కవిత.

 మర్నానిటికల్లా వియ్యపురాలు ప్రభావతి విశాలని వియ్యంకుడు నాగేశ్వర రావు ,సుందర్రావునీ ఫోన్ లో పిలిచేసారు.

ఆ మర్నాడు విశాల మరదలు, విజయ ఫోన్ చేసి తమకి కూడా పిలుపులు అందేయని, తమ కొడుకు కోడళ్ళని తెమ్మని మరీ మరీ చెప్పేరని, తన కోడలు నిత్య వస్తానని సరదా పడుతోందని చెప్పింది. విశాల కూడా సంతోషించింది. ఇద్దరూ కలిసి వెళదామని మాటాడుకున్నారు.

 పొద్దుట తొమ్మిదికల్లా కార్ లో తమ్ముడు సంజీవ్ ఇంటికి చేరుకున్నారు విశాల దంపతులు. తమ్ముడు,వాళ్ళ కొడుకు కూడా పనులున్నాయి రాలేం అన్నారు. విజయ నిత్య లే కాబట్టి కార్ సరిపోతుంది. వీళ్ళు వెళ్లేసరికి విజయ రెడీ అయిపోయి ఉంది.
” ఇదిగో, నిత్య తయారవుతున్నాది. రాగానే వెళిపోదాం” అంది. పావుగంటలో నిత్య పైకి వచ్చింది.

” హాయ్! ఆంటీ బాగున్నారా!” నవ్వుతూ పలకరించింది.
నవ్వతూ తలూపింది గానీ విశాల కి ఒక్క క్షణం బుర్ర పని చేయలేదు.
నిత్య కొత్త ఫేషన్ చీర కట్టుకుంది. జాకెట్టు వీపు మధ్య అంతా ఓపెనే! మీదన చిన్న తాళ్ళ తో టైట్ చేసినట్టుంది. మాటాడకుండా బయలుదేరింది గానీ దడగానే ఉంది. ఏమనడానికీ తన కూతురుకాదు. కూతురయినా వినదు.

మరీ తన వియ్యపురాలింటికి అదీ ఓ ఫంక్షన్ కి ఇలా వీపంతా కనపడే జాకెట్టుతొ ఈ అమ్మాయి రాడం. ఏమనుకుంటారు అందరూ! విశాల మనోబాధ వీళ్లు వెళ్ళేసరికి వ్రతం సగానికి పైగానే అయింది. వేగం మొదలెట్టేసారట. అందరూ ఒకళ్లని ఒకళ్లు నవ్వుతూ పలకరించుకున్నారు.

వ్రతం పూర్తయి హారతి ఇచ్చేసరికి ఇంకా చాలా మంది బంధువులు వాళ్ళ పిల్లలూ వచ్చేరు. ఈ కాలం పిల్లలని ఒకొకళ్లనీ చూస్తుంటే విశాలకి బుర్ర తిరుగుతోంది.

రెండు భుజాల దగ్గరా కటింగ్, ఓపెనగా ఉన్న షర్టుతో ఒకమ్మాయి. ప్రభావతి చెల్లెలి కోడలుట. ఆ అమ్మాయే కాదు, సరిగ్గా చూస్తే చాలామంది పిల్లలకి రెండు భుజాల దగ్గర కోసేసినట్టు కత్తిరింపులు.‌ చున్నీ లేకుండా టైట్ టాపులతో కొందరు. మోకాళ్ల మీదకి బాటమ్ టైట్ షర్టుతో కవిత ఆడపడచు కూతురు ధన్య.

లిప్ స్టిక్ లేకుండా ఎవరూ లేరు. జుట్టు భుజాల మీద పడుతూ ఆ జుట్టుకి ఓ క్లిప్ కూడా లేదు ఎవరికీ! కొందరు జుత్తుకి వెరైటీగా అలంకారాలు చేసుకున్నారు.

ఒక్కర్తి మొహాన బొట్టు లేదు.పెళ్ళిళ్ళు అయిన ఎవరి మెడలోనీ మంగళ సూత్రాలు లేవు. అందరినీ చూస్తూ ఉంటే నిత్యే నయం అనిపించింది. విశాలకి ఇంకా విడ్డూరంగా కనిపించిన విషయం మగపిల్లలందరూ చక్కగా ఫేంటూ, షర్టులూ వంటినిండా బట్టలతో ఉన్నారు.

“ఎంత కాని కాలం వచ్చింది దేవుడా! ఆడపిల్లలు ఒళ్లు కనపడేలా బట్టలూ మగపిల్లలు చక్కగా వంటినిండా బట్టలూ” నిట్టూరుస్తుంటే, ప్రభావతి ప్రసాదం గిన్నెతో నవ్వుతూ వచ్చింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!