బాబోయ్ ఇరికించేసాడు

బాబోయ్ ఇరికించేసాడు……

రచన: రాయల అనీల

“కస్తూరి….కస్తూరి “

” చిరాగ్గా ఉంది….. ఏమి తోచడంలేదు”

” ఏం చేయమంటారు నన్ను…… పోనీ  అక్కడ ఆ  నవలలు ఉన్నాయిగా వాటిల్లో ఒకటి తీసి చదుకోండి”

” అవా …..అవి ఇప్పుడు చదవాలని లేదు “

” ఇంకేంటి మరి”

” అది నాకు…. ఏమి లేదులే “

” అయితే కాసేపు అలా బయటకు వెళ్ళండి…… వాకింగ్ కి “

” సర్లే ”    అని బయటకు రాగానే నా తాత( మనవడు) ఎదురొచ్చాడు

” తాతయ్య….తాతయ్య మరే “

” ఏంటి తాత ….. చెప్పు”

” నీకేం కావాలో నాకు తెలుసులే”

” నాకా ….నాకేం కావాలిరా ….. నాకేం వద్దు”

” నీకేందుకు చిరాగ్గా వుందో నాకు తెలుసులే ….. ఉదయం అమ్మ చేసిన  లడ్డూలు నువ్వు తినకూడదని ….. నాన్న అన్నారనేగా”

” అవునురా తాత…. అయినా ఏం చేస్తాం ఈ మాయదారి రోగం వచ్చిన దగ్గరనుండి అది తినకూడదు, ఇది తినకూడదు అని నా సగం తిండి తగ్గించేసాడు మీ నాన్న ఆ డాక్టర్ ఎవరో చెప్పారని ……… వాడు చెప్పెది కూడా  నా ఆరోగ్యం కోసమేలే …… అయినా కూడా అప్పుడప్పుడు ఆ లడ్డూలు చూస్తే నా మనసటే లాగుతా ఉంటది…… “

“నాకు తెలుసు తాతయ్య….అందుకే నీ కోసం లడ్డు తెచ్చా ఇదిగో “

” మరి మీ నాన్న చూస్తే “

” అప్పుడు చూసుకుందాంలే…… ముందు తిను తాతయ్య ” అని ఒక చేతిలోది నాకు ఇచ్చి మరో చేతిలోది వాడు తింటుంటే

” అరే నువ్వు కూడా తింటున్నావా…… ఇందాకే కదరా అన్ని తిన్నావ్”

” అయితే ఏంటి ఇప్పుడు…. నువ్వు లడ్డు తింటున్నావని నాన్నకి చెప్పనా”

” ఓరి బడవా నన్నే బెదిరిస్తున్నావా ….సరేలే తిను” ఎన్ని రోజులకి తింటున్నాను….. అబ్బా ఎంత బాగుంది రా…..ఆహా

” నాన్నా……”  వామ్మో నా పుత్ర రత్నం చూసేసాడా …. ఇప్పుడెం అంటాడో …… పాపం నా వల్ల వీడికి కూడా అక్షింతలు పడతాయో ఏంటో…..

” ఏంటి నాన్న…. మీకేన్ని సార్లు చెప్పాలి…… మీకు డయాబెటిస్  స్వీట్స్ తినకూడదు అని….. పైగా వాడితో కలిసి తింటున్నారా”

” అది….అది కాదురా….. అసలేం జరిగిందంటే”

” అవును డాడీ….. నేను కూడా చెప్పాను తాతయ్యకి స్వీట్స్ తినకూడదు అని….. నా మాట వినలేదు పైగా నన్ను కూడా తినమన్నాడు…… నేను తినకపోతే నేనే తెచ్చి తినమన్నానని …… నీకు చెబుతా అని బెదిరించారు డాడీ “

” అయ్యో బాబోయ్ ఇరికించేసాడు వెధవ …… వీడిని ఎలా కాపాడాలి అని నేను  ఆలోచిస్తుంటే నన్నే ఇరికించాడు వెధవ”

” మాట్లాడరేం….. నాన్న “

” అబ్బా….మీరు ఉండండి  మావయ్య గారెం కావాలని  తినలేదు…….. నా దగ్గర నుంచి మన బన్నీ గాడే తీసుకెళ్లాడు”

” నువ్వెందుకు ఇచ్చావ్  వాడికి “

” ఇది మరీ బావుంది…… మీరు తెమ్మన్నారని నాకు చెప్పి తీసుకెళ్లాడు “

అమ్మా కోడలా బ్రతికించావమ్మ అని కోడలికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకోని …….. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని మెల్లగా వాకింగ్ అని చెప్పి జారుకున్నా…… ఈ బన్నీ గాడు ఇరికిస్తే ఇరికిచ్చాడు గానీ  ఒక మంచి లడ్డు ఇచ్చాడు ……. హమ్మయ్య  ఇప్పుడు బాగుంది నాకు…..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!