ఆనందం ఆర్నవమైన వేళ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పరిమళ కళ్యాణ్
“నిజంగా నువ్వేనా?”ఆశ్చర్యంగా మరోసారి అడిగాడు మావయ్య.
“అవును మావయ్య, నేనే. చిన్నప్పుడు మీతో ఆడుకున్న రవినే. ఆశ్చర్యంగా ఉంది కదా మావయ్యా, నమ్మలేక పోతున్నారా?” అడిగాను నేను.
అదేం లేదురా రవి. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఎంత ఎదిగిపోయావురా! మంచి వృద్ధిలోకి వచ్చినట్లు ఉన్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు రా?
“మొదట్లో చిన్న ఉద్యోగం చేసేవాడిని, ఇప్పుడు మానేసి కంపెనీ కూడా పెట్టాను మావయ్యా, బాగానే నడుస్తోంది. మీరందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నాన్న ఎలా ఉన్నారు మావయ్యా, కలవాలని ఉంది.”
చాలా సంతోషం రవి, నువ్వు అనుకున్నవి అన్నీ సాధించావు. నాకు తెలుసురా రవి నువ్వు గొప్పవాడివి అవుతావు అని, కానీ నన్ను ఈ విషయంలో క్షమించాలిరా నువ్వు. ఎందుకంటే మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచీ పంపటానికి నేనే కారణం. నువ్వు ఇక్కడే ఉంటే చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు అలవాటు పడిపోతావు అని భయం వేసింది నాకు. అందులోనూ మీ నాన్న తల్లి లేని పిల్లాడివని నిన్ను ఎంతో గారంగా చూసుకునే వాడు. ఆ గారాబమే నిన్ను పాడుచేస్తుంది అనీ, నిన్ను దూరం పంపమని నేనే సలహా ఇచ్చానురా. కానీ నువ్వు నిజంగా ఇంత ఎత్తుకు ఎదుగుతావు అనుకోలేదు రవి! మీ నాన్న నిన్ను చూస్తే ఎంత సంతోషిస్తాడో, అయితే నువ్వు మీ నాన్నని కలవలేదా ఇంకా?” అడిగాడు మావయ్య.
“లేదు మావయ్యా, ముందు నీ దగ్గరకే వచ్చాను. నువ్వు కూడా రా మావయ్యా, నాన్న దగ్గరకి వెళ్దాం!” అని మావయ్యతో పాటు నాన్నని చూడటానికి వెళ్ళాను.
“బావా, ఏం చేస్తున్నావు బావా, ఎవరొచ్చారో చూడు!” అంటూ బయట నుంచే కేక వేసాడు మావయ్య.
నాన్న ఆ మాటలకి ఎంతో ఆనందంగా బయటకి వచ్చి చూసాడు. నాన్న కళ్ళలో నన్ను చూసిన క్షణంలో కలిగిన ఆనందం నేను చూసాను, అది ఎంతో వెలకట్టలేనిది. ఆ ఆనందం చూడటానికి ఎన్నాళ్ళు కష్టపడ్డానో నేను. అందుకే ఇన్నాళ్లు నాన్నకి దూరంగా ఉండిపోయాను. నాన్నని చూడగానే ఆయన కాళ్ళమీద పడిపోయాను.
నాన్న నన్ను లేపి, “ఏరా, బాగున్నవా? “అని అడిగాడు.
“బ్రహ్మాండంగా ఉన్నా నాన్న. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఇదంతా నీ చలవే నాన్న. తెలిసీ తెలియని వయసులో నేను చేసిన తప్పుల్ని భరించి, నేను బాగు పడాలనే కదా నన్ను దూరం పంపింది. అందుకే నీ ఆశయం నెరవేర్చిన తర్వాతే నీకు కనపడాలి అనుకున్నాను. అందుకే ఇన్నాళ్లు ఇంటికి రాలేదు. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉండటమే కాకుండా, నలుగురికి మంచి చేసేలా ఉన్నాను. ఇప్పటివరకు నీకు దూరంగా ఉన్నది చాలు. కానీ ఇకపై నన్ను దూరం పెట్టకు నాన్న. నేను ఇక్కడే నీతోనే ఉంటాను. ఎప్పటికీ! కాదనకు నాన్నా!” నాన్నని పట్టుకుని ఏడ్చేశాను.
“నిన్ను ఇంకా నేను కూడా దూరం చేసుకుని జీవించలేనురా. నా ప్రాణాలన్ని నీపైనే ఉన్నాయి. నీకోసమే ఇంకా ఇలా జీవించి ఉన్నాను. నువ్వు సమర్థుడవయ్యావు. ఇంకేం కావాలి నాకు ఇంతకన్నా? నువ్వు ఇంక ఇక్కడే ఉండచ్చు సంతోషంగా” అన్నాడు నాన్న.
“తండ్రి కొడుకు ఏకం అయిపోయి, నన్ను పక్కన పెట్టేసారు అప్పుడే!” అన్నాడు మావయ్య కాస్త అసూయగా.
“అదేం లేదు మావయ్యా, నా ఈ గెలుపుకి కారణం మీరు కూడా కదా! మిమ్మల్ని ఎలా మర్చిపోతాను?” అన్నాను.
“ఏరోయ్, ఇందాకే నువ్వు అని, ఇప్పుడేమో మీరు అంటూ మర్యాదలు ఇస్తున్నావు ఏంటీ కథ?” అన్నాడు మావయ్య ఆటపట్టిస్తూ.
“రవి, అంతేకాదు నీకు ఇంకో శుభవార్త కూడ ఉంది. అంటూ ఒక అమ్మాయిని చూపించి “ఇదుగో నీ మరదలు లావణ్య. నీకు ఇష్టం అయితే మీ ఇద్దరికి పెళ్ళి చేసేస్తాం” అన్నాడు మావయ్య.
లావణ్య మావయ్య కూతురు, చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. తనని చూసిన ఎవరికైనా పెళ్ళి చేసుకోవాలనే అనిపిస్తుంది. అందుకే వెంటనే మావయ్య కి సరే అని చెప్పేసాను. లావణ్య కూడా సిగ్గుపడుతూ చూడటం నేను గమనించాను. అంటే తనకీ నేనంటే ఇష్టమే అన్నమాట. తొందరలో మా పెళ్ళి, ముహుర్తాలు పెట్టుకున్నాక కబురు చేస్తాను. తప్పకుండా వస్తారు కదూ మా పెళ్లికి! సరే ఉంటాను
