వెలుగు రేఖ

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

వెలుగు రేఖ

రచయిత :: నామని సుజనాదేవి

భయం భయం గా ఉంది సుమతి కి . ఆమె చూపంతా భర్త కూచున్న బెడ్ మీదే ఉంది.. పొరపాటున బెడ్ కింద తను దాచింది బయట పడిందా, ఇక తన జీవితం గోదాట్లో కల్సి నట్లే… గోడకు తగిలించిన బెల్టు ఎప్పుడెప్పుడు తన వీపు మీద నాట్యం చేద్దామా అని చూస్తున్నట్లు అనిపించింది. భయానికి గొంతు తడారి పోయింది.
‘ఏంటే… అలా దేభ్యం మొహం వేసుకుని చూస్తావ్…. టిఫిన్,మంచి నీళ్ళు తెమ్మని చెప్పానా….ఇంకా అలాగే నిలబడ్డావ్…. అవున్లే…. చాలా రోజులవుతోంది కదా వీపు దెబ్బలు తిని….’ హుంకరించాడు భర్త ప్రభాకర్.
‘ఇదిగో..ఇప్పుడే….తె…తెస్తున్నా…’ బలవంతాన అక్కడి నుండి కదిలింది… కదిలిందే గాని మనసంతా ఎక్కడ ఆ బెడ్ కింద ఉన్నది బయట పడుతుందో నని భయం.
హడావుడిగా అప్పటికే తడిపిన పిండి తో రెండు రొట్టెలు చేసి, పొయ్యి మీద ఉన్న కూర వేసి తెచ్చింది. ఆమెకు కూరలో కొంచెం కారం ఎక్కువ అయ్యిందేమో ననే భయం ఎక్కువయ్యింది. కాని అదే తన పాలిట వరం అవుతుందని ఆ క్షణం తెలీదు ఆమెకు.
‘ఏంటి…. ఇక్కడ ఎత్తుగా….’ ఆమె పళ్ళెం తో లోనికి అడుగుపెడుతుంటే , బెడ్ పై ఒక చివర కూర్చుని టీవీ చూస్తూన్న అతను , అలా అంటూ లేస్తున్నాడు. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కంగలో టిఫిన్ చేతికి అందించింది. పై నున్న పరుపు ఎత్తేవాడల్లా ఆ చేతులతో ప్లేట్ తీసుకున్నాడు.
అతను ,మళ్ళీ కూర్చున్నాడు. టీవీ చూస్తూ రొట్టెను కూరతో కలిపి నోట్లో పెట్టుకున్నాడు, అంతే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. అక్కడే ఉన్న ఆమె పై ఆ ప్లేట్ ను అలాగే గిరాటేశాడు.
‘ఏంటే…. ఈ కారం….. అసలు ఒంటిపై సోయి ఉండే చేస్తున్నావా…. నేను ఉండాలను కున్నావా.. ఆ కారానికి పోవాలనుకున్నావా…..ఛీ…. దీనికన్నా ఆ హోటల్ నయం….’ కోపంగా లేచి చేయి కడుక్కుని షర్ట్ తగిలించుకుని బయటకు వెళ్ళిపోయాడు. హమ్మయ్యా అనుకుంటూ పరుపు కింద దాచిన పుస్తకం తీసి గుండెలకు హత్తుకుంది.
అది సుమతి కి అలవాటే… ఉప్పు , కారం కొంచెం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, ఇష్టమైన కూర కాక పోయినా …. తిట్టడానికి అన్ని కారణాలో అన్ని వెదుక్కుంటాడు ప్రభాకర్ అని ఆమెకు బాగా తెల్సు. కారణం అతను ప్రేమించిన అమ్మాయి పెళ్లి వేరేవారితో కావడంతో బలవంతాన, అతని అమ్మా నాన్నలు అతన్ని ఒప్పించి పేదింటి అమ్మాయి అయిన తన గొంతు కోశారు. తనకు ఆవిషయం తెలీక పెళ్ళయిన మర్నాటి నుండే కోపంగా విసుక్కుంటూ , చీటికి మాటికి ఆయన విసుగుని, కొట్టి తీర్చుకుంటుంటే తన తప్పేమిటో తెలీక వణికి పోయేది. తర్వాత తోటికోడలు ద్వారా విషయం తెల్సి తన దురదృష్టానికి ఏడ్చింది. కారణం …. అమ్మా నాన్న లకు తన తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తను చెబితే పరిష్కారం దొరకకపోగా, వారిని మరింత బాధ పెట్టినది అవుతుంది అని మౌనంగా అన్నీ భరిస్తుంది. పైగా ఆమెకు పదో తరగతి చదువుతుండగా పెళ్లి చేసారు. చదువులో ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ ఉండే ఆమె పెళ్ళితో తన చదువుకు స్వస్తి పలకాల్సి వస్తుందేమో నని పెళ్లి చేసుకోనంది , కాని తల్లీ తండ్రి, ‘ పెళ్ళయ్యాక చదువుకోవచ్చు, మంచి సంపన్నుల సంబంధం, కట్నం ఎక్కువ ఇచ్చుకోలేని తమకు వాళ్ళంతట వాళ్ళే వచ్చి చేసుకుంటామంటున్నారు’ అంటూ ఒప్పించడం తో అమ్మానాన్న లను బాధ పెట్టలేక పెళ్లి చేసుకుంది. తర్వాత పదిలో స్కూల్ ఫస్ట్ వచ్చినది చూపిస్తూ , ఇంటర్ పుస్తకాలు చూపుతూ చదువుకోవాలనే తన కోరిక బయట పెట్టింది. అతను అగ్గిమీద గుగ్గిలం అయి ,’ ఆడపిల్లలు గడప దాటి చదవడం మా ఇంటా వంటా లేదు. మరోసారి ఎ పుస్తకం నా కంట పడకూడదు’ అంటూ ఆమె చేతిలోని పుస్తకాలు విసిరికోట్టాడు. బాగా బెదిరిపోయింది సుమతి. ఆ రాత్రంతా కల్లలైన తన ఆశను తల్చుకుని ఏడుస్తూనే ఉంది. ఒక నాలుగు నెలల వరకు నిరాశ నిస్పృహ లతో కొట్టుమిట్టాడింది.
ఆ తర్వాత పుట్టింటికి పండగకి నాలుగు రోజులు వచ్చిన ఆమె, అన్న వివేక్ ఇచ్చిన ప్రోత్సాహంతో భర్తకు తెలియకుండా ఓపెన్ యూనివర్సిటీ లో జాయిన్ అయి పరీక్షలు రాయడం మొదలు పెట్టింది. ప్రతీ పరీక్షా సమయం లో భయం భయం గా తల్లిగారింటి కి వెళ్లి వస్తానని చెప్పేది. అన్న వచ్చి తీసుకొచ్చే వాడు. దానికోసం మామూలు గా పండగలకు, ఫంక్షన్ లకు వెళ్ళడం మానేసింది. అప్పుడు వెళితే పరీక్షల సమయానికి పంపించడని. అలా డిగ్రీ, పీజీ మంచి పర్సెంటేజ్ తో పాసయింది. భర్తకు తెలీకుండా అతను లేనప్పుడు పుస్తకాలు తెరచి చదువుకునేది. పుస్తకాలు అతని కంట పడకుండా దాచేది. ఇప్పుడు అతను క్లబ్ కి వెళ్లి ఇప్పుడప్పుడే రాడనుకుని చదివేదల్లా అతని మాట వినిపించేసరికి భయం తో పరుపుకింద దాచిపెట్టేసింది. అయితే ఆమె అదృష్టం బాలేక, ఊరేల్లాడని ఆమె చదువుతుంటే ట్రైన్ మిస్ అయి వచ్చిన అతని కంట పడనే పడింది.
వ్యాపారంలో నష్టం వచ్చి చికాకుతో ఉన్న అతను, భార్య కూడా దిక్కరించడాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. కాని ఈసారి ఆమె ఆలోచించి ఆ చేయిని అలాగే ఆపింది.
‘ఇప్పటివరకు మీరేం చేసినా భరించాను.పెల్లయినంత మాత్రాన నేను బానిసను కాను. నాకు తిండి పెడుతున్నాననే కదా మీ అధికారం నాపై. నేను ఇప్పుడే నా పిల్లలను తీసుకుని వెళ్ళిపోతాను. మీకు నాపై ఎప్పుడు ప్రేమ గౌరవం కలిగితే అప్పుడే రండి’ అంటూ ఊహించని ఈ తిరుగుబాటు షాక్ లో అతనుండగానే ఆమె బాగ్ సర్దుకుని పిల్లలతో బయటకు రాబోతుంటే,
‘ఇంతవరకు నా మాటకు ఎదురు చెప్పని నీకు ఇంత ధైర్యం ఒకేసారి ఎలా వచ్చింది’ కూడబలుక్కుంటూ అన్నాడు ప్రభాకర్.
‘ఆ దైర్యం నాకు నా చదువు ఇచ్చింది. విద్య నాకు విశాలమైన ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది’ అంటూ బయటకు నడిచింది. నెలరోజుల్లో నష్టాల్లో కూరుకుపోయి, ఇంట్లో ఎవరూలేక పిచ్చివాడయిన ప్రభాకర్ ఆమె పట్ల తన ప్రవర్తనకు పశ్చాత్తాపం తో ఆమెను క్షమించమని కాళ్ళ బేరానికి వచ్చాడు. ఆమె సలహాల మేరకు కొన్ని మార్పులతో మళ్ళీ రెండు నెలల్లో పుంజుకుని , ప్రైవేట్ గా ఎం బీ ఎ లో చేరాడు.
నాలుగు నెలలలో గ్రూప్ వన్ లో రాంక్ సాధించిన ఆమె ఇంటర్వ్యు అన్ని పత్రికల్లో వచ్చింది.
‘చీకటి అనుకున్న నా జీవితంలో ఆనందాల వెలుగులు నింపిన అదృష్టానివి నువ్వు’ అంటూన్న భర్తను చూస్తూ , ‘నేను కాదు…. ఆ చదువుల తల్లి సరస్వతమ్మ దయ’ అంటున్న ఆమె మాటలు నిజమన్నట్లు గుడిలోని జేగంటలు శుభం అంటూ మోగాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!