ఆత్మావలోకనం 

ఆత్మావలోకనం 

రచయిత :: సత్య కామఋషి ‘రుద్ర’

చుట్టూ చిమ్మ చీకటి. కనుచూపు మేరలొ ఎక్కడా కనీసం ఒక వీధి దీపపు జాడైనా కనిపించడం లేదు. ఊరి పొలిమేరలకు చేరుకోవాలన్నా కూడా కొంత దూరం నడవాల్సి ఉంటుంది.

అలముకున్న నిశ్శబ్దాన్ని చేధిస్తున్న కీచురాళ్ళ ఈలపాటలు. నా గుండె సడి వేగం గడియారపు మల్లుతో పోటీ పడుతోంది.

సాయంగా, తోడుగా ఎవరైనా మనిషి కనిపిస్తే బాగుండు అని ఆత్రంగా చూస్తున్న నాకు, ఆ ఆనవాళ్ల జాడ కూడా ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఎవరికైనా ఫోన్ చేద్దామా అంటే నెట్ వర్క్ కవరేజీ లేని ప్రాంతం. పైగా ఫోన్ లో చార్జింగ్ కూడా అయిపోవచ్చింది.

ఇంక చేసేదేమీ లేక నెమ్మదిగా ముందుకు నడవ సాగాను. నాలో లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ. వేళ కాని వేళ లో పంక్చర్ అయ్యి నాకు ఎక్కడ లేని ఇబ్బందిని తెచ్చిపెట్టిన నా
ముద్దుల మోపెడ్ ని తిట్టుకుంటూ. అమ్మో, అయ్యో అంటూ కాళ్లు ఈడ్చుకుంటూ.

ఇదిలా ఉండగా మధ్యలో ఇద్దరు ఆకతాయిలు అలా పోతూ పోతూ, నన్ను చూసి రోడ్డు మధ్యలో చటుక్కున ఆగారు. వెకిలిగా ఈలలు వేస్తూ, నా చుట్టూ బండి మీద చక్కర్లు కొడుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతూ అల్లరి పెడుతుంటే, అమాంతం నా కాళ్ల కిందనే భూకంపం వచ్చినంత పనైంది. ఏమి చేయ్యాలో పాలుపోక ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.

ఈలోగా ఏ  దేవుడు కరుణించాడో గానీ అటుగా ఏవో కొన్ని వాహనాలు రావటంతో ఆ ఇద్దరు కంగారుగా తుర్రుమంటూ జారుకున్నారు. దాంతో బతుకు జీవుడా అనిపించింది.

ఇంతలో నా పంట పండి, అలా నడుస్తూ నెమ్మదిగా ఊళ్ళోకి వచ్చేశాను. దగ్గరలోనే, ఓ  బైక్ మెకానిక్ షాపు కూడా  కనిపించింది. జనాలతో కొంచెం సందడి కన్పించింది. వెంటనే ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. బండి రిపైర్ కి ఇచ్చి, అలా పక్కనే ఉన్న స్టూల్ పైన కూలబడ్డాను. అటూ ఇటూ దిక్కులు చూస్తూ కూర్చున్న నాలో ఉన్నట్టుండి ఏదో ఆలోచన. నేను దాటుకొని వచ్చిన పరిస్థితులు అన్నీ కళ్ళముందు ఒక్కసారిగా కదలాడాయి. దాంతో నన్ను నేను ఆత్మావలోకనం చేసుకోవడం ఆరంభించాను. పరిస్థితులు నాకు అనుకూలించాయి గనుక ఇవ్వాళ్టి రోజున ఇలా బతికి బయట పడ్డాను. కానీ, అన్నీ వేళలు ఒకలా ఉండవు కదా.!  ఒకవేళ అలాంటి అనుకోని పరిస్థితే ఎదురై ఉంటే, ఏమయ్యి ఉండేదో..!  అని తలచుకుంటేనే భయం వేస్తోంది.

నేను  కలలు కన్న నా జీవితం, నేనే వాళ్ల ప్రాణంగా..నాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న నా తల్లిదండ్రులు, వాళ్ల కలలు, జీవితాలు ..అన్నీ ఒక్క క్షణంలో తలకిందులై,
అతలాకూతలం అయిపోయేవి కదా అనిపించింది.

సాయంత్రం కాలేజి నుండి రావటంతోనే బ్యాగు పక్కకు విసిరేసి..” అమ్మా ఊరి అవతల ఫామ్ హౌస్ లో ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంది” అని చెప్పి హడావిడిగా రెడీ అవుతూంటే..
అమ్మ ముఖంలో కనిపించిన  ఏదో తెలియని ఆందోళన,  నాకు ఇప్పుడు ఙ్ఞాపకం వస్తోంది.

“వద్దురా తల్లీ అంత దూరం, అదీ ఊరికి అవతల ఎక్కడో అంటున్నావు. అనుకోని ఇబ్బంది ఏదైనా ఎదురైతే, వేళకాని వేళలో చాలా కష్టం తల్లీ. అసలే రోజులు కూడా బాగాలేవు. అమ్మ ఎందుకు చెబుతుందో ఆలోచించు” అని అమ్మ నాతో అన్నప్పుడు..,

“అమ్మా , నేనేమీ చిన్నపిల్లని కాదు. దేనినైనా తెలివిగా హాండిల్ చెయ్యగలను. అయినా ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచిస్తావేంటీ..! ఏమి కాదులే, అలా వెళ్లి ఇలా వచ్చేస్తా.  అన్నీ నాకు తెలుసులే “అంటూ తిరిగి బదులిచ్చిన నా ఓవర్ కాన్ఫిడెన్స్, నా ఇమ్మెచ్యూరిటీని తలచుకుంటుంటే, నామీద నాకే జాలి వేస్తోంది.

ఈలోపుగా  “మేడమ్, బైక్ రిపేర్ అయిపొయిందీ ” అంటూ మెకానిక్ గట్టిగా అరచినట్టగా చెప్పడంతో, ఈ లోకంలోకి తిరిగొచ్చాను . ఠక్కున లేచి, వ్యాలెట్ లోనుండి చేతికొచ్చిన ఏదో నోటు అతని చేతిలో పెట్టేసి, గబగబా ఇంటికి సరాసరి చేరుకున్నాను. అప్పటికే అక్కడ గేటులో నా గురించి కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ అమ్మ కనిపించడంతో, నా కళ్ళవెంట నీళ్లు ఆగలేదు.

బండిని అలాగే వదిలేసి, అమాంతంగా వెళ్లి అమ్మను గట్టిగా హత్తుకున్నాను. “ఏమైందిరా తల్లీ..?” అంటూ కంగారుగా అడిగింది అమ్మ , నన్ను ప్రేమగా లాలిస్తూ. “ఏమి లేదు అమ్మ లేటయింది కదా భయం వేసింది”  అంతే, అంటూ బయటకు అమ్మక సర్ది చెబుతూనే,  “నువ్వు , నీ మాటల వెనుక అనుభవం నిండిన భయం , ప్రతి క్షణం నా మేలును, మంచిని కోరే నీ ప్రేమ” నాకు బాగా తెలిసొచ్చాయి.

ఇక నుండి నువ్వు చెప్పిన మాట ఆలకిస్తూ నన్ను నేను దిద్దుకింటానని..” మనసులో అనుకుంటూ..అమ్మ వెనకాలే ఇంట్లోకి చేరిపొయాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!