అర్థవంతమైన అపార్థం

(అంశం:: “అర్థం అపార్థం”)

 అర్థవంతమైన అపార్థం

రచన:: శివరంజని

అర్జున్ కి ఉదయమే, తన రూమ్ మేట్ శంకర్ పంపిన ఆ వీడియో చూసినప్పటినుంచి చాలా కోపంగా, శ్రావణి మీద అసహ్యంగా ఉంది.

తమ కంపెనీలోనే పని చేసే అమిత్ మోకాళ్లమీద స్టైల్ గా కూర్చొని శ్రావణి కుడి చేయి పట్టుకొని, తన కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ ప్రపోజ్ చేస్తున్నాడు.

హమ్ తేరే బిన్ అబ్
రహ నహి సక్తే
తేరే బినా
క్యా వజూద్ మేరా

హమ్ తేరే బిన్ అబ్
రహ నహి సక్తే
తేరే బినా
క్యా వజూద్ మేరా

తుజ్ సే జుదా గర్
హోం జాయేంగే తో
ఖుద్ సే హి
హోం జాయేంగే జుదా

క్యోన్ కి తుమ్ హి హో
అబ్ తుమ్ హి హో
జిందగీ అబ్ తుమ్ హి హో

శ్రావణి అమిత్ కంటే ప్రేమగా అతని కళ్లల్లోకి చూస్తూ, వాడికి అర్ధమయ్యే లా హిందీలో….

బహుత్ ప్యార్ కర్తే హై
తుమ్ కో సనమ్
బహుత్ ప్యార్ కర్తే హై
తుమ్ కో సనమ్

కసం చాహే లేలో
కసం చాహే లేలో
ఖుదా కి కసం

బహుత్ ప్యార్ కర్తే హై
తుమ్ కో సనమ్
బహుత్ ప్యార్ కర్తే హై
తుమ్ కో సనమ్

పాట పాడుతూ తన అంగీకారం తెలిపింది.

రెండేళ్లుగా ఎంత ప్రేమించాడు శ్రావణిని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇంకా నయం పెళ్లి అయ్యాక తన గురించి తెలియలేదు, తన ప్రేమను అంగీకరించి వారం కూడా కాకముందే, మరొకరితో ప్రేమాయణం నడిపే అమ్మాయిని ఏమనాలి?

తొందరగా రెడీ అయి ఆఫీస్ కు వెళ్లాడు. శ్రావణి తన సీట్లో లేదు. ఫోన్ చేస్తే, బ్రేక్ అవుట్ ఏరియా లో కాఫీ తాగుతున్నానని చెప్పింది. వడివడిగా అడుగులేస్తూ, శ్రావణి దగ్గరికి వెళ్లాడు అర్జున్.

సోఫాలో విలాసంగా కూర్చొని, స్నేహితురాలు రాఘవితో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతోంది శ్రావణి.
అర్జున్ విసురుగా శ్రావణి దగ్గరికి వెళ్లి “ఎంత ప్రేమించాను నిన్ను, రెండేళ్లు నీ వెంట పడ్డాను. నాతో పెద్దవాళ్లను అడగండి, వారు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అని పచ్చ జండా వూపినట్టే ఊపి, అమిత్ గాడితో తిరుగుతున్నావా. పెళ్లి చేసుకోవడానికి నాలాంటి డబ్బున్న అమాయకుడు, ప్రేమించడానికి అందంగా ఉన్న అమిత్ గాడు కావాలా, ఛీ ఛీ నువ్విలాంటి దానివని తెలిస్తే నీ ముఖం కూడా చూసేవాణ్ణి కాదు” ఆవేశంగా అరిచాడు అర్జున్.

రాఘవి నిశ్శబ్దంగా వెళ్లి, బ్రేక్ ఏరియా ద్వారం దగ్గర నిలుచుంది, ఎవరు రాకుండా చూడడానికి.

“ఏమంటున్నావ్ అర్జున్, నేనేంటి అమిత్ ఛీ” అంటూ కళ్లల్లో నీరు తిరుగుతుండగా నోట మాట రావడంలేదు శ్రావణికి.

అర్జున్ విసురుగా తన ఫోన్ లో ఉన్న వీడియో ప్లే చేసాడు. అందులో అమిత్ శ్రావణి ని ప్రపోజ్ చేస్తూ హిందీ లో పాట పాడితే, శ్రావణి కూడా పాట పాడుతూ తన అంగీకారం తెలిపింది.

“చెప్పు కళ్లెదురుగా ఉన్న సాక్షం, ఏమంటావ్, ఇంకా నయం నిన్ను నమ్మి, పెళ్లి చేసుకోకముందే నువ్వేమిటో బయటపడింది, ఇంత తెలిసాక, నిన్ను పెళ్లి చేసుకోను, నీకు నాకు మధ్య ఏమి లేదు, బ్రేకప్” అన్నాడు అర్జున్.

“మిస్టర్ అర్జున్, నిజమే నువ్వు నన్ను నమ్మలేదు. నిజమైన ప్రేమలో హద్దులు లేని నమ్మకం ఉంటుంది. నువ్వు నన్ను నమ్మలేదంటే, నీకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు. ఏముందసలు ఆ వీడియో లో, నిన్న మా టీం ఔటింగ్ కు రిసార్ట్ కు వెళ్లాము. అక్కడ అనుకోకుండా స్కిట్ చేయాల్సిన మా టీం వాళ్లు రావడం ఆలస్యం అయింది. అప్పటికప్పుడు అనుకొని, ప్రిపేర్ అయ్యి అలా పాటలు పాడుతూ మా టీం తరఫున స్కిట్ చేసాము. టీం అవుటింగ్ కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ కు తెలుగు రాదు, మాకు హిందీ రాదు, అందుకే అలా హిందీలో పాటలు పాడగలిగిన వాళ్లం స్కిట్ చేసాము. ఇదిగో మా స్కిట్ పూర్తి వీడియో” అంటూ తన దగ్గర ఉన్న మొత్తం వీడియో చూపింది శ్రావణి.

ఆ స్కిట్ లో శ్రావణి అమిత్ లతో పాటు, వేరే జంటలు కూడా అలాగే ప్రేమ గీతాలు పాడుతూ స్కిట్ పూర్తి చేయడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడం అంతా షూట్ అయి ఉంది ఆ వీడియో లో.

వీడియో మొత్తం చూసిన అర్జున్ కు చాలా సిగ్గుగా అనిపించింది. తల దించుకొని తన నుదురు పట్టుకొని “సారీ శ్రావణి, ఇదంతా నా అపార్థం వల్ల జరిగింది, ఐ యామ్ ఎక్సట్రీమ్లి సారీ, నిన్నవసరంగా చాలా బాధ పెట్టాను, అంతా మర్చిపోదాం, ప్లీజ్” అన్నాడు అర్జున్.

“నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటె, ఆ వీడియో చూడగానే అది స్కిట్ అని నీకర్థమయ్యేది.
అలా అవలేదంటే నీలో లోపం ఉంది, అనుమానపు రోగం ఉంది. థాంక్ గాడ్, నాకు నీ గురించి ముందే తెలిసింది, నువ్వు కాదు మిస్టర్ అర్జున్, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నీలాంటి వాడితో నేను నా జీవితాన్ని పంచుకోలేను” అని అక్కడినుంచి వెళ్లిపోయింది శ్రావణి.

రాఘవి, శ్రావణిని అనుసరించింది. అసలేం జరిగిందంటే, ఆడవాళ్ల మీద చులకన భావంతో ఉండే అర్జున్, శ్రావణి అందం చూసి ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. అందం, చదువు, ఆస్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన శ్రావణితో వ్యవహారం ఆషామాషీ కాదు.
రెండేళ్లుగా శ్రావణితో చాలా మంచిగా ప్రవర్తిస్తూ వచ్చాడు అర్జున్. శ్రావణితో స్నేహం పెరిగాక
శ్రావణికి ప్రపోజ్ కూడా చేసాడు. శ్రావణికి కూడా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో, అర్జున్ ను ఇంట్లో పెద్దవారిని అడగమని చెప్పింది, తన అంగీకార సూచనగా.

తరచూ మహిళల గురించి చులకనగా, అసభ్యంగా కామెంట్స్ చేసే అర్జున్ కు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన శ్రావణితో పెళ్లి అంటే అర్జున్ రూమ్ మేట్ శంకర్ కు బాధనిపించింది. అర్జున్ తో పెళ్లి వల్ల శ్రావణి చాలా నష్టపోతుంది అనిపించింది. అందుకే రాఘవి పంపిన స్కిట్ వీడియో ను, ఎడిట్ చేసి శ్రావణి అమిత్ లు మాత్రమే ఉన్న క్లిప్ అర్జున్ కు వాట్సాప్ చేసాడు. దీనివల్ల శ్రావణికి అర్జున్ నిజ స్వరూపం తెలుస్తుందని ఆశించాడు. శంకర్ అనుకున్నట్టుగానే జరిగింది. శ్రావణి అర్జున్ నిజ స్వరూపం తెలుసుకున్నది.

అర్జున్ తో ఉన్న రూమ్ వెకేట్ చేయడానికి సామానులు సద్దుకుంటున్న శంకర్ కు రాఘవి కాల్ చేసింది. “నువ్వు చెప్పినట్టుగానే, అర్జున్ చాలా మూర్కంగా ప్రవర్తించాడు. థాంక్ గాడ్ మన శ్రావణి పెళ్లి అలాంటి వాడితో జరగలేదు. థాంక్ యు శంకర్” అన్నది రాఘవి.

“కొన్ని సార్లు అపార్థాలు కూడా అర్థవంతమైన పనులు చేస్తాయి. అర్జున్ కు కలిగించిన అపార్థం వల్ల అతని నిజ స్వరూపం బయటపడి, శ్రావణి జీవితం రక్షించబడింది” ఫోన్ పెట్టేసాడు శంకర్, ఒక మంచి పని చేసానన్న సంతృప్తితో.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!