చి.ల.సౌ.చంచల

(అంశం :’ ప్రేమ’)

చి.ల.సౌ.చంచల

రచయిత :: అశ్విని ‘సంకేత్’

ప్రేమ అనే రెండు అక్షరాలు చాలు,మనిషిని ఏ విధంగా నైన మారుస్తాయి. ఏ విధంగా అంటే తను ప్రేమించిన వారు ఎన్ని తప్పులు చేసినా మర్నించే విధంగా.

అసలు ఈ ప్రేమ అనేది ఒకసారి పుడితే అది ఆ వ్యక్తి చనిపోయే దాకా వదలదు.తను ప్రేమించిన వ్యక్తిలోని లోపాలను కూడా కనపడనివ్వకుండా చేస్తుంది ఈ ప్రేమ.

ప్రేమ అనేది డబ్బు,రూపం,గుణం,అందం….చూసి కాదు ఎదుటి వారి మంచి మనసు వల్ల కల్గుతుంది. మనుషుల మధ్య కాదు మనసుల మధ్య బంధమే ఈ ప్రేమ అని తెలుసుకోడానికి నాకు 20 ఏళ్లు పట్టింది.

అసలు ప్రేమ అంటే ఏంటో నా జీవితం గురించి చెప్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ప్రేమ అనేది బాహ్య సౌందర్యంకి సంబంధించింది కాదు అంతర సౌందర్యానికి చెందింది అని మీకే అర్ధం అవుతుంది.

నా పేరు చంచల.నా పేరు లాగే నా మనసు కూడా పారే సెలయేరులా చంచలంగా ఉండేది.ఇప్పుడు చెరువులా నిర్మలంగా మారింది.అది నా జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల.ఇంకో గంటలో ఆ వ్యక్తితో నా పెళ్లి.అది కూడా నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తితో…
**
నేను పుట్టక మునుపు ముగ్గురు బిడ్డలు పుట్టి పురిటిలోనే చనిపోవడంతో అమ్మా,నాన్నకు నేను అంటే అపురూపం.అందువల్ల అతి గారాబంగా పెంచారు నన్ను.చిన్నప్పటి నుండి ఏది కోరితే అది ఇస్తూ వచ్చే వారు.అది వారి తాహతుకు మించినా నాకు ఇచ్చేవారు.

నాకు చిన్నప్పటి నుండి అల్లరి ఎక్కువ.కొంచం కొంటె పనులు చేస్తూ ఉండే దాన్ని.కానీ, ఆ పనులకి దెబ్బలు మా బావ తినేవాడు.ఎందుకంటే నన్ను కొట్టడం వాడికి నచ్చక, వాడే ఆ పనులు చేశాను అని దెబ్బలు తినేవాడు.

బావ నాకు మేనత్త కొడుకు.వారు మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల ఉంటారు.బావ,నేను కలిసే స్కూల్ కి వెళ్ళే వాళ్ళం.బావ 7వ తరగతి చదివే రోజుల్లో మామయ్య వాళ్ళు ఒక ఏక్సిడెంట్ లో చనిపోతే బావ స్కూల్ మాని, పొలం పనులు చూసుకోవడం మొదలు పెట్టాడు.

అప్పటి నుండి నేను మాత్రమే ఒంటరిగా స్కూల్ కి వెల్లేదాన్ని.స్కూల్ మా పక్క ఊరిలో ఉండేది. హై స్కూల్ చదువుకు ముందు వరకు నాన్న సైకిల్ మీద దిగ బెట్టేవారు. హై స్కూల్ చదువుకు వచ్చే సరికి నేనే సైకిల్ మీద వెళ్ళడం మొదలు పెట్టా.

తెలిసి తెలియని వయసు,కొత్త స్నేహాల వల్ల నాకే తెలియకుండా మా క్లాస్ లో బాగా చదివే హరి అంటే ఇష్టం ఏర్పడింది.అది ప్రేమ అనుకున్నా, అంతే ఆ విషయమే హరికి చెప్పా.

హరి కూడా నాపై అదే అభిప్రాయం ఉంది అనడంతో మేము ఇద్దరూ అప్పటి నుండి ప్రేమికులం అయ్యాం. కానీ,ఆ వయసులో ప్రేమకి అర్థం కూడా తెలియదు మాకు.హరిది మా పక్క ఊరే. అందుకే హరి నాతో రోజూ మా ఊరి దాకా సైకిల్ మీద వచ్చి,మా ఊరు రాగానే నాకు బాయ్ చెప్పి తన ఊరు వెళ్ళేవాడు.

రోజులు బాగానే సాగుతూ ఉన్నాయి.కానీ,నేను క్లాస్ లో ఏ అబ్బాయితో మాట్లాడినా హరికి అది నచ్చేది కాదు.నన్ను ఎవ్వరితో మాట్లాడ వద్దని వార్నింగ్ ఇచ్చేవాడు రోజూ.

దానితో మా మధ్య ఉన్నది ప్రేమ కాదని అర్థమయి ఇద్దరూ విడిపోయాం.మళ్లీ ప్రేమ,దోమ లాంటి వాటి జోలికి పోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి అదే ఊరిలో ఇంటర్ జాయిన్ అయ్యాను.

అక్కడ మా సీనియర్ మైకిల్ బాగా డబ్బు ఉన్నవాడు.అతను రోజూ నా వెనక పడి,రోజుకో చాక్లెట్ ఇస్తూ నన్ను ప్రేమించాను అని చెప్పడంతో అతను చూపే దాన్ని ప్రేమ అనుకుని అతనితో ప్రేమలో పడ్డాను.కానీ, ఓ రోజు మైకిల్ వేరే అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండటం చూసిన నేను మా మధ్య ఉన్నది ప్రేమ కాదు అని త్వరగానే అర్థం చేసుకుని అతని నుండి దూరం అయ్యాను.

డిగ్రీ లో ఉండగా ఒక రోజు నేను ఒంటరిగా కాలేజ్ కి వెళ్తుంటే నా వెనుక ఒక కుక్క వెంటబడింది. దాని నుండి తప్పించుకోడానికి నేను పరిగెడుతుంటే దాన్ని కొట్టి, తరిమి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు.

నేను అతనికి థాంక్స్ చెప్తే,అతను నాకు ఐ లవ్ యూ చెప్పాడు.చూసిన వెంటనే పుట్టేది ప్రేమ కాదు అది మోహం మాత్రమే అని నా గత అనుభవాల వల్ల తెలుసుకున్న నేను అతనికి అదే చెప్పా.

అప్పుడు అతను “నేను మిమ్మలని చాలా సార్లు చూసా.మొదటి సారి మీరు మీ పుట్టిన రోజున అనాథ పిల్లలకి స్వీట్స్ పంచినప్పుడు చూసా.అప్పుడే మీ అందమైన మొఖం కన్నా నాకు మీ అందమైన మనసు నచ్చి ఆ క్షణమే మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టా. కానీ చెప్పడానికి సందర్భం రాక ఇప్పుడు చెప్తున్నా.

నేను ఒక అనాధనీ.అనాథలను ఆప్యాయంగా పలకరించిన మిమ్మలని చుడాగానే మీ అందమైన మనసుకి నా మనసుని కానుకగా ఇచ్చేశా.అది తీసుకోవడమో లేక తిరస్కరించడమో మీ ఇష్టం అంటూ” అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను చూడడానికి చాలా అందంగా ఉన్నాడు అచ్చం సినిమా హీరోలా.చూద్దాం లే అని నేను నా కూడా లైట్ తీసుకున్నా.కానీ, తర్వాత నాలుగు రోజులు అతను కనపడక పోవడంతో అతన్నే వెతుకుతూ ఉన్నా.

ఒక రోజు కాలేజీ పక్కన కనిపించేసరికి, నీ మాలాన నువ్వు ఐ లవ్ యు చెప్పేసి వెళ్ళిపోవడమేనా! నా ఉద్దేశ్యం తెలుసుకో అక్కరలేదా?నీ గురించి నేను ఈ నాలుగు రోజులు కళ్ళు కాయలు కాచేలా వెతికా తెలుసా అన్నాను.

దానికి అతను “ఎందుకు అన్నాడు వస్తున్న నవ్వును పంటి చివర ఆపుకుంటూ”.

నేను ఎందుకేంటి? నా మనసును ప్రేమించాను అన్నావు! ఆ మాత్రం నా మనసు అర్థం కాలేదా అంటూ అక్కడ నుండి పారిపోయి ఇంటికి వచ్చేశా.

అప్పటి నుండి అతను నాకు రోజూ కాలేజ్ దగ్గర కనపడడం,కళ్ళతో మాత్రమే మాట్లాడడం చేసే వాడు. తర్వాత కొన్ని రోజులు గడిచే సరికి ఇద్దరూ కాలేజ్ పక్కన క్యాంటీన్ లో,ఊరికి దగ్గరలో బ్రిడ్జి కింద కలిసే వాళ్ళం.కానీ,ఎప్పుడూ అతను తన హద్దులు దాటి నన్ను తాకలేదు.ఒక వేళ నేను తాకాలని చూసిన తను దూరంగా వెళ్ళేవాడు.

అప్పుడు నాకు నిజంగా అనిపించేది అతను నా శరీరాన్ని కాదు నా మనసుని ప్రేమించాడు అని. ఆ క్షణమే అనుకున్నా అతన్నే పెళ్లి చేసుకోవాలి అని.

నేను ఇంటికి ఆలస్యంగా రావడం…నేను బ్రిడ్జి కింద అతన్ని కలవడం చూసిన వాళ్ళు… నాన్నకి చెప్పడంతో, నాన్న నన్ను కాలేజ్ మాన్పించి బావతో పెళ్లికి ముహూర్తం పెట్టించారు.

బావ అంటే నాకు ఇష్టం లేదు.చదువు,అందం,మాట తీరు,ఆకర్షణ…..ఇలా ఏమీ లేని బావ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయమే ఇంట్లో చెప్పి నన్ను ప్రేమిస్తున్న కిషోర్ గురించి చెప్పా.పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటూ అని తెగేసి చెప్పా కూడా.

ఫలితం నేను ఎవ్వరితో కలవకుండా మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు.

ఎలాగోలా కిషోర్ తో ఫోన్ లో మాట్లాడా, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లిపో అని.అతను సరే రాత్రికి మీ ఇంటి వెనుక వైపు ఉంటా వచ్చేయ్ వెళ్లి తిరుపతిలో పెళ్లి చేసుకుందాం! అని చెప్పాడు.

అనుకున్నట్లు గానే రాత్రికి అందరూ పడుకున్నాక నేను, గోడ దూకి కిషోర్ తో తిరుపతి ట్రైన్ ఎక్కాను. ట్రైన్ లో నా బ్యాగ్ చూసిన కిషోర్ అదేంటి ఒట్టి చేతులతో రమ్మన్నాను కదా!ఇలా బ్యాగ్ తో వచ్చావు ఏంటి? అన్నాడు.

అదేంటి ఒట్టి చేతులతో వస్తె ఎలా? మనం బ్రతకడానికి డబ్బులు కావాలి కదా! అందుకే నేను నా నగలు, ఓ నాలుగు లక్షల క్యాష్ తెచ్చాను అన్నాను.

దానికి వెంటనే కిషోర్ కోపంగా అంటే నేను నిన్ను పోషించలేను అనుకున్నావు కదా! అన్నాడు మొఖం బాధగా పెట్టుకుని.

నేను, అలాంటిది ఏమీ కాదు! కిషోర్! ఒకవేళ డబ్బులు లేకపోతే…..అని అన్నాను మొఖం కిందకి దించి బాధగా.

కిషోర్ నా మొఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చూడు బంగారం! నా రెక్కల కష్టంతో నిన్ను రాణిలా చూసుకుంటా, వీటితో నాకు పనిలేదు అన్నాడు.

నాకు తెలుసు నువ్వు చూసుకోగలవు అని కానీ,ఒకవేళ ఇవి ఉంటే రేపు మనకి పుట్టబోయే బిడ్డల అవసరాలకి అయినా పనికి వస్తాయి కదా అన్నాను నేను కిషోర్ కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమకి మురిసిపోతూ.

“సరే,వాటిని అలానే ఉంచు.ఒకవేళ రోజులు బాగుండి మీ నాన్న వాళ్ళు మన ప్రేమని ఒప్పుకుని మనల్ని దగ్గరకి రాణిస్తే అప్పుడు వారికే మనం ఇవి ఇచ్చెద్ధాం.అంత వరకు వీటిని వాడకూడదు సరేనా అన్నాడు”కిషోర్.

నేను వెంటనే కిషోర్ నీ కౌగిలించుకుని ఇంత మంచోడు దొరికి నందుకు దేవుడికి కృత్గ్నతలు చెప్పుకున్నా.

అలా కిషోర్ బుజంపై తల పెట్టుకుని అలసిపోయి ఉండడం వల్ల నిద్రలోకిజారిపోయా.నిద్ర లేచి చూసేసరికి అతను నా పక్కన లేడు,బ్యాగ్ కూడా లేదు.

వెంటనే నేను బోగీ అంతా కలియ చూసేసరికి అతను బోగి డోర్ వద్ద నిలబడి చల్లగాలి ఆస్వాదిస్తున్నాడు. నేను అక్కడికి వెళ్లేసరికి అతను నా వైపు తిరిగి చిలిపిగా నవ్వుతూ “బయపడ్డావా? బ్యాగ్,నేను ఇద్దరూ లేకపోయేసరికి నిన్ను వదిలి పోయాను అని బయం వేసిందా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంక బ్యాగ్ అంటావా? నువ్వు ఏమో పడుకున్నావు, నాకు చల్లగాలి పీల్చాలి అనిపించి. బ్యాగ్ ఎవరైనా తీసేసుకుంటారు అని బయం వేసి, ఇలా భుజానికి వేసుకుని ఇక్కడ నిల్చున్న అంతే. ఇదిగో తీసుకో అని బ్యాగ్ నా చేతిలో పెట్టాడు”.

నువ్వే నా వాడివి అయినప్పుడు ఈ బ్యాగ్ తో నాకు పనేంటి, నీ వద్దే ఉంచు అని అతని చేతిలోనే పెట్టేసాను బ్యాగ్ నీ.

ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్ లో ఆగేసరికి, బాగా ఆకలిగా ఉండడంతో అతను వెళ్లి భోజనం తెస్తే ఇద్దరూ తిని రేపు జరిగే పెళ్లి గురించి మాట్లాడుకుంటూ పడుకున్నాం.

నాకు తెలివి వచ్చి చూచేసరికి నేను ఒక కార్ లో ఉన్నా,నా పక్కన కిషోర్ లేకపోవడంతో కిషోర్ నీ వెతుకుతుంటే నాకు, నా పక్కన ఉన్న వ్యక్తి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు.నాకు స్పృహ తప్పుతుంది అయినా వాళ్ళ మాటలు నాకు లీలగా వినిపించి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ కళ్ళు మూతలు పడ్డాయి.

మళ్లీ నాకు తెలివి వచ్చి చూచేసరికి నేను ఒక గదిలో మంచం మీద పడుకుని ఉన్నా, ఆ గది అంతా ఏదో అత్తరు కంపు కొడుతోంది. అది చాలా ఘాటుగా ఉంది.తల తిరగడంతో తల పట్టుకుని ఇందాక కార్ లో విన్న మాటలు లీలగా గుర్తు చేసుకున్నా.

కిషోర్ నన్ను వీళ్ళకి 5,00000 కి అమ్మేశాడు అంట.పైగా నన్ను తాకకుండా అమ్మినందుకు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు అంట వీళ్ళు.అంటే నన్ను తాకకుండా నటించింది ఇందుకా?నేను తెచ్చిన డబ్బులు,నగలు తీసుకుని నన్ను వీళ్ళకి అమ్మేశాడు ఎంత మోసగాడు.వీడ్ని చూసా నేను మంచివాడు అనుకుని నా అనుకున్న వాళ్ళని వదిలేసా?

నాకు తగిన శాస్తి జరిగింది.కని పెంచిన వారిని మోసం చేసిన నాకు తగిన శాస్తి జరిగింది.అమ్మ వాళ్ళ మాట వినకుండా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇలాగే జరుగుతుంది.అయినా,నాకు ఏం తక్కువ అని ఇలా దారిన పోయిన వాడ్ని నమ్మి మోసపోయాను. ఇప్పుడు నా గతి ఏంటి? అసలు వీళ్ళు ఎవరు? నన్ను ఏం చేస్తారు! అని ఏడుస్తుంటే…

నా గదిలోకి ఇద్ధరు నడివయసు ఆడవాళ్లు వచ్చి నాకాసి చూసి.నువ్వేనా కొత్త పిల్లవి. మ్మ్మ్మ్.. అందంగానే ఉన్నావు. అందుకే నిన్ను దుబాయ్ పంపాలి అని చూస్తున్నారు.ఆల్రెడీ దుబాయ్ సేట్ తో బేరం కూడా కుదిరింది అంట. బలే లక్కీ నువ్వు. రావడం రావడమే దుబాయ్ వెళ్లిపోతున్నావు.మేము గత రెండేళ్లుగా ఇక్కడ బొంబాయి లోనే ప్రతీ అడ్డమైన వాడి చేతిలో నలిగి పోతున్నాం. అదృష్ట వంతురాలివి అంటూ…నా గది నుండి బయటికి వెళ్ళిపోయారు.

నేను అదృష్ట వంతురాలినా… ఇది బొంబాయి నగరమా… దుబాయ్ వెళ్ళబోతున్నాన… అంటే నా గతి ఇంతేనా… నా వాళ్ళను ఇక చూడైనా చూడనా? దేవుడా నన్ను చంపేయి తప్ప, నాకు ఈ బ్రతుకు వద్దు అని నేను ఏడుస్తుంటే… నా గదిలోకి ఒకడు అన్నం ప్లేట్ తో వచ్చి తిను, ఇది తిని ఈ మాత్ర వేసుకో అన్నాడు గుర్రుగా నా వైపు చూస్తూ…

ఏంటి ఈ మాత్ర దేనికి అని నేను అనేసరికి, “ఇది, నీకు నీరసంగా ఉంది.ఇలాగే ఉంటే దుబాయ్ సేట్ మమ్మలని తిడతాడు. అందుకే ఈ అన్నం తిని టెబ్లెట్ వేసుకుని పడుకో అన్నాడు” వాడు.

నాకు వద్దు, నేను తినను అన్నాను నేను, “తినక పోతే, తిను అని బతిమిలాడే వాడు లేడు ఇక్కడ. తింటే తిను, లేకపోతే పో అంటూ… బలవంతంగా ఆ టాబ్లెట్ నా నోట్లో వేసి అన్నం కంచం అక్కడ పెట్టీ వెళ్ళిపోయాడు” వాడు.

అవును ఇదేమైనా నా ఇళ్ళా? నా ఇంట్లో అయితే నేను అలిగి అన్నం తినను అంటే అమ్మ,నాన్న ఎంత హడావిడి చేసే వారు. నాకు కావాల్సింది ఇచ్చి మరీ అన్నం పెట్టేవారు.ఇప్పుడు వారు లేరు అనుకుంటూ ఏడుస్తూ పడుకున్నా.

అలాగే నాలుగు రోజులు గడిచాయి. ఏటూ వెళ్ళడానికి దారి లేదు.నేను ఉన్న గదికి ఒకటే తలుపు.పక్కనే బాత్ రూం అంతే.అక్కడ నుండి తప్పించుకోడానికి గాని,చావడానికి గాని నాకు మార్గం లేదు.ఏమీ చేయలేని పరిస్థితుల్లో మరో వారం గడిచింది.

ఒక రోజు నా గదిలోకి ఒక ఆమె వచ్చి నా ప్రయత్నం లేకుండానే నన్ను అందంగా తయారు చేసి, పద నిన్ను కొనుక్కున్నవారు వచ్చారు అని నా చెయ్యి పట్టుకుని కిందకి తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళ ముందు పడేసింది.

ఆ వచ్చిన వాళ్ళకి అయినా నా పరిస్థితి చెప్తాం అనుకుంటే వారు నా నోటికి, కళ్ళకి గంతలు కట్టి నన్ను ఒక కార్ లో ఎక్కించి ఏదో రూమ్ కి తీసుకెళ్లారు.

అక్కడ రూమ్ లో కళ్ళ గంతలు విప్పలేక, అక్కడ జరుగుతుంది తెలీక ఏడుస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి నాపై పడింది.

ఒక్క సారిగా ఆ చేతి నుండి తప్పించుకుంటుంటే ఆ చెయ్యి నా కట్లను విప్పేసరికి, నా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నా కళ్ళను నేనే నమ్మలేక బావ అంటూ ఒక్క ఉదుటున వెళ్లి హత్తుకున్నా.

వెంటనే ఏదో గుర్తు వచ్చి,నువ్వేంటి ఇక్కడ? నన్ను…నన్ను…ఎలా కాపాడావు? అని అడిగే సరికి ఆ విషయం మమ్మలని అడుగు మేం చెప్తాం! అని ఆ గదిలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అన్నారు.

నిన్ను మోసం చేసిన వాడు ఊరూరూ తిరిగి అమాయకమైన అందమైన అమ్మాయిలను మోసం చేసి,ఇలా బొంబాయి లాంటి మహా నగరాల్లో అమ్మేస్తాడు. వాడి ఫోటో పేపర్ లో పడేసరికి, మీ బావ ఫ్రెండ్ రవి వాడితో ఒకసారి నిన్ను చూసాను అని చెప్పడంతో, మీ బావ గత 10 రోజులుగా బొంబాయి వచ్చి నీ కోసం అలాంటి ప్రదేశాలు అన్నీ వెతుకుతూ ఉన్నాడు.

చివరికి నీ ఆచూకీ మా ద్వారా తెలుసుకుని నిన్ను అక్కడ నుండి తప్పించాలని వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. రవికి మేము దూరపు చుట్టాలమి. రవి ఫోన్ చేసి చెప్తే మేమే, మీ బావని హాస్పిటల్ లో జాయిన్ చేశాం.తర్వాత వాళ్ళతో పని అంత సులువు కాదని నిన్ను డబ్బులు ఇచ్చి కొనడం తప్ప వేరే మార్గం లేకపోవడంతో మీ బావ ఊర్లో ఉన్న తన పొలాన్ని అమ్మి వాళ్ళకి 25,00000 లక్షలు ఇచ్చి మా ద్వారా నిన్ను కొనుక్కున్నాడు అని చెప్పారు.

నాకు ఆ మాటలకు ఏడుపు వచ్చి ఏడుస్తుంటే, ఊరుకో బుజ్జమ్మ! నువ్వు ఇప్పుడు సురక్షితం. నీ కష్టాలు అన్నీ తీరిపోయాయి అంటూ బావ నా తలపై చేయి వేసేసరికి.

ఆ చేతిని వెనక్కి తోసి, లేదు బావ! నన్ను ముట్టుకోకు! నేను పాపిష్టి దాన్ని. నా వల్లే నువ్వు వాళ్ళ చేత దెబ్బలు తిన్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు అనేసరికి,

లేదు బుజ్జమ్మ! నా ఆస్తి ఎటు పోలేదు. నువ్వే నా ఆస్తి.నువ్వు అవును అన్నా కాదన్నా! ఈ జన్మకి నువ్వే నా సీతవి! అంటూ నా నుదుటిన ముద్దాడాడు బావ.

బావ! నా మీద కోపం లేదా నీకు అని నేను అడిగితే. ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు బుజ్జమ్మా.అయినా బిడ్డ తప్పు చేస్తే తప్పు సరిదిద్దాలి గాని, ఆ బిడ్డను వదులుకుంటారా? చెప్పు అంటూ నన్ను ప్రేమగా లాలిస్తుంటే అప్పుడు చూసా,

బావ కళ్ళల్లో నిజమైన ప్రేమని.

అతను ఇచ్చిన కౌగిలిలో తెలిసింది, ప్రేమ అంటే చితి దాకా తోడుందే బరోసా అని.

ప్రేమ అంటే ప్రేమించిన వారి తప్పుల్ని కూడా ప్రేమతో మర్నించడం అని.

ప్రేమ అంటే ఒక తీయని జ్ఞాపకం తప్ప చేదు అనుభవం కాదని.

***

బావతో ఊర్లోకి వచ్చిన నన్ను అమ్మా,నాన్న ఇంట్లోకి రానివ్వలేదు.కానీ,బావ వారికి,ఊర్లో వారికి నాకు జరిగిన మోసం,నేను పడిన బాధలు,తను చేసిన సాహసం చెప్పేసరికి అప్పటి వరకు నన్ను దూషించిన వారే నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు.

ఇప్పుడు బావకి,నాకు ఎప్పుడో మనసుల సాక్షిగా పెళ్లి జరిగినా. పెద్దల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, నా అనుకున్న నా వాళ్ళ ముందు పెళ్లి జరగబోతుంది.

నేను,నా బావ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దీవించండి.

ప్రేమతో,మీ ఆశీర్వచనాలు కోరుకుంటున్న

చి.ల. సౌ.చంచల.

****సమాప్తం***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!