ముడిపడిన మనసులు

(అంశం :’ ప్రేమ’)

ముడిపడిన మనసులు

రచయిత :: మోదేపల్లి. శీనమ్మ

ఆఫీసులో ఉదయశ్రీ లంచ్ టైమ్ లో ఆలోచిస్తూ కూర్చుని ఉంది.
ఎన్ని సార్లు ఫోన్ చేసినా భాను ప్రకాష్ ఫోన్ తీయకుండా కొద్దిరోజులు ఉన్నాడు, ఇప్పుడైతే ఏకంగా నెం మార్చినట్లున్నాడు, అసలు పాత నెం పనిచేయడం లేదు.
ఎంత నమ్మించాడు నన్ను, నువ్వు తప్ప నాకు భార్యగా ఎవరిని ఊహించుకోలేనని , నువ్వే నా సర్వస్వం అని, ఒక్క రోజు నేను ఆఫీసుకు రాకుంటే తనకు అసలు ఏమి తోచదని, అంతకు ముందు ఎవరిని చూసినా …ఇలాంటి ఫీలింగ్స్ ఏమి వచ్చేవి కావని, మొట్టమొదటి సారి నన్ను చూసినప్పటి నుండి తనలో ఏదో అలజడి కలిగిందని, అది ప్రేమ అని తెలిసాక …తనతో చెప్పటానికి …తాను తనకన్నా…పెద్ద పోస్టులో ఉన్నప్పటికి కూడా .. తనకి ధైర్యం సరిపోలేదని…తన తో చెప్పేందుకు భాను ప్రకాష్ పడ్డపాట్లు …మేము
ప్రేమలో ఉన్నప్పుడు చెప్తుంటే ..ఎంత అమాయకుడు పాపం అని నేను ఎంతగా నవ్వుకునేదాన్నో…
కానీ, అలాంటివాడు …ఇప్పుడు ఇలా నన్ను వదిలేసి, అదీ నేను మా నాన్నగారు ఉన్నట్లుండి హార్టెటాక్ తో మరణించి నన్ను , చెల్లిని, అమ్మను దిక్కులేని వారిగా మిగిల్చి వెళ్తే….
నేను ఒక నెల ఆఫీసుకు సెలవు పెట్టి , అమ్మకు , చెల్లికి తోడుగా ఊరిలో ఉండి వచ్చేసరికి, ఇలా ఇంత మోసం చేసి అసలు ఆఫీసులో ఎవరికి చెప్పకుండా అడ్రసు, ఫోన్ నెం అన్ని మార్చేసి , జాబ్ కూడా మానేసి వెళ్లిపోయాడు, మరీ ఇంత దారుణమైన
మోసం నా భాను చేస్తాడని అసలు నేను ఊహించనే లేదు.అని తనలో తాను కుమిలిపోతూ ఉంది.
ఎందుకే లంచ్ బాక్స్ ముందు పెట్టుకుని, తినకుండా ఆలోచిస్తున్నావు అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ…బాక్సు మూత పెట్టి , పదవే ..పోదాం అంటూ లేచింది.
అదేంటే… భోజనం చేయవా…ఎందుకే అలా ఎన్ని రోజులు తినకుండా ఉంటావు, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు, నీవు ఇలా అయితే మీ అమ్మ, చెల్లి ని ఎవరు చూసుకుంటారు అంటూ రమ్య ఓదారుస్తుంది.
ఒకప్పుడు ఈ రూములో తనతోపాటు లంచ్ చేసిన రోజులు ఎలా మర్చిపోవాలి, ఎందుకే రమ్యా…నన్ను ఇంత మాయలో పడేసి ఏవేవో కబుర్లు చెప్పి ఇప్పుడు
తనకెవరో అందమైన, అస్తిపరురాలు దొరికేసరికి ఇలా మాయమైపోయాడు. అసలు తను అలాంటి వాడని అసలు ఊహించనే లేదు నేను , ఎన్నెన్ని మాటలు చెప్పి , ప్రేమ అని నమ్మించి ఇలా …ఎలా ..మోసం చేయగలిగాడు అనేది , నాకు చాలా బాధగా ఉంది .దేవుడు మా నాన్నను తీసుకెళ్లి మమ్మల్ని దిక్కులేనివాళ్లను చేస్తే, వాడు నన్ను ఇలా మోసం చేసి పారిపోయాడు అంటూ ఉన్న ఉదయ పై చిరాగ్గా… అబ్బా…అపవే ఇంక చాలు…ఎన్ని సార్లు అంటావు , పాపం వదిలెయ్యక అంటుంది రమ్య.
పాపమా…ఇంత చేసిన వాడిని పాపమంటున్నవా నువ్వు, నా స్థానంలో నువ్వుంటే ఇంక ఎలా చేసేదానవు?
ఎంత ప్రేమించానే తనని, అంటున్న ఆమెను రమ్య ఆపి నువ్వు ఇంత భాద పడుతున్నావు కాబట్టి నేను నిన్ను భాను ప్రకాష్ వాళ్ళ ఇంటికి తీసుకునిపోతాను … పద అంటుంది.
ఏంటి ..నీకు తనెక్కడున్నాడో తెలుసా? మరి నాకెందుకు ఇన్నిరోజులు చెప్పలేదు, నీకు తెలుసన్న సంగతి అంటూ ఉండగా…ముందు పద అన్ని అక్కడ మాట్లాడుకుందాము అంటూ స్కూటీ దగ్గరకు ఉదయను లాక్కెళ్ళుతుంది రమ్య.
ఇద్దరు బయలుదేరి వెళ్లారు.
రమ్య ఒక ఇంటి ముందు స్కూటీ ఆపి , ఇదేనే మన భాను సార్ వాళ్ళ ఇళ్ళు. నేను రోజు వస్తాను …అనగానే , అదేంటి నువ్వు రోజు వస్తూ … .మరి నేను అంతలా బాధపడుతుంటే …మాటమాత్రమైనా…నాతో చెప్పలేదంటే…నువ్వు కూడా నన్ను మోసం చేసావా…మిత్రద్రోహి అంటుండగా …ఏవో మాటలు వినపడుతున్నాయని ఒకావిడ గేటు దగ్గరకు రావడం చూసి ఆగిపోతుంది.
ఇంతలో…రమ్య ..హాయ్…ఆంటీ… అనడంతో…ఈవిడ భాను సార్ వాళ్ళ అమ్మ అని అర్ధం అయింది ఉదయశ్రీ కి.
రమ్య మాటలు కలుపుతూ..
ఆంటీ… తను …అదే…ఉదయ ..
అనడంతో…అదేంటమ్మా…ఇక్కడకు
తీసుకొచ్చావు అంటున్న ఆమె మాటలు ఉదయకు అర్ధం కాలేదు,
పర్వాలేదు అంటి …నేను ఈ రోజు నిజమైన ప్రేమ ఏంటో చూపించాలి…అంటూ…నువ్వు రా ..ఉదయ …అని పిలిచింది రమ్య.
లోపలకు నడిచారు అందరూ.
గదిలో మంచంపై … ఉన్న వ్యక్తిని చూసి , నిశ్చలంగా నిలబడిపోయింది ఉదయ.
బెడ్ పై పడుకుని ఉన్నాడు భాను ప్రకాష్ ..రెండు కాళ్ళు కోల్పోయి.
అయ్యో…రమ్య ఏంటి ఇక్కడకు తీసుకొచ్చావు …అంటున్న భానుతో…మీరు ఆగండి సార్ ..
కొద్ది రోజులు మీరు పనిచేసే ఆఫీసులో పని చేసినందుకే , మాకు మీ పై చాలా అభిమానం ఉంది అంటే …మీ మంచితనం వెల కట్టలేనిది సార్, అలాంటిది మీరు ప్రేమించిన వ్యక్తి ..మిమ్మల్ని మోసం చేసి వెళ్లాడని అంటుంటే విని తట్టుకోలేక తీసుకుని వచ్చాను సార్ …అంటూ రమ్య , ఉదయశ్రీ దగ్గరకు వచ్చి …
సార్ కు యాక్సిడెంట్ అయ్యి ఇలా అయ్యింది. నీకు తప్ప ఆఫీసులో అందరికి తెలుసు, సార్ అందరికి ఒక్కటే చెప్పారు, నాకు ఇలా జరిగి నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే తాను ఇంక ఎవరిని పెళ్లి చేసుకోదు.
తన లైఫ్ అలా కాకుండా ఉండాలంటే నేను మోసం చేసానని తను అనుకోవాలి అని, నీ మీద ప్రేమతో…నువ్వు సార్ ని మోసగాడు అనుకున్నా పర్వాలేదు నీ లైఫ్ బాగుండాలి అని కోరుకున్న మహానుభావుడే నిన్ను ప్రేమించినవాడు .రెండు కాళ్ళు లేని వారిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేవని, తనని నువ్వు నిందించినా పర్వాలేదని ఇలా నీకు తెలియకుండా దాచాము. కానీ నువ్వు సార్ ని ఇంతలా నిందిస్తుంటే వింటూ….తట్టుకోలేకపోయాను అంది రమ్య.
ఉదయ కళ్ళల్లో నీళ్ళు కాలువల్లా కారుతూ …భాను దగ్గరకు వచ్చి, మీకు ఇలా జరిగి కాళ్ళను కోల్పోయారు, అంటే నేను మిమ్మల్ని మర్చిపోయి వేరే ఇంకొకళ్ళని చేసుకోగలనా…
అంటే మీకు మాత్రమేనా నాపై ప్రేమ ఉండేది.
నాకున్నది ప్రేమ కాదా మీ మీద, మిమ్మల్ని పసిబిడ్డలాగా చూసుకునే అదృష్టం నాకు కల్పించరా మీరు అంటూ దగ్గరకు వెళ్తుంది.
ఉదయా…నీకు బైక్ పై లాంగ్ డ్రైవ్ ఇష్టం…ఇప్పుడు నేను ఒకరి సాయంతో బతికేవాడిని, నీ ఇష్టాన్ని కష్టంగా ఎలా మార్చగలను అంటాడు భాను.
నాకు నీతో ప్రయాణం ఇష్టం అంతే కానీ, బైక్ పై మాత్రమే నీతో ప్రయాణం ఇష్టం కాదు. మీకు సాయపడే ఆ ఒక్కరు నేనే ఎందుకు కాకూడదు.
అది కాదు ఉదయా…అసలే మీ నాన్నను కోల్పోయిన బాధలో ఉంది మీ కుటుంభం, ఇలాంటి పరిస్తితుల్లో ఈ అవిటి వాడిని అల్లుడి గా తీసుకెళ్లి, వాళ్ళను ఇంకొంచెం బాధ పెడతావా చెప్పు.
అవిటి తనం నీ శరీరానికి వచ్చింది, నీ మనసుకు కాదు , నువ్వు ఎంత గొప్ప మనసు కలవాడివో మా అమ్మకు నేను చెప్పాను. అందుకే ఇన్నిరోజులు నువ్వు కనిపించకపోయినా నేను అమ్మకు చెప్పలేదు, నా మనసుకు ఇంతలా నచ్చిన నువ్వు అమ్మ దృష్టిలో మోసగాడివి కాకూడదు అని నాలో నేను బాధపడ్డానే కానీ, అమ్మకు తెలియకుండా ఉంచాను.
నువ్వు నన్ను చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలవు, కోరి కష్టాలు తెచ్చుకోకు బంగా…అంటూ ఆగిపోతాడు భాను.
ఆపేసావు ఎందుకు , ప్రేమగా నీ నోటి వెంట బంగారు అన్న పిలుపు విని ఎన్ని రోజులైందో తెలుసా…ఇంతలా ముడిపడిన మనసులు మనవి. అలాంటిది నేను వేరొకరితో మూడు ముళ్ళు వేయించుకుని ఎలా సంతోషంగా ఉండగలను అనుకున్నావు బంగారం నువ్వు.
ప్రేమంటే కేవలం సంతోషాలను కోరుకునేది కాదు, ఒకసారి మనసిచ్చాక…మదిలో ఆ మనిషి అలానే నిలిచిపోతాడు. కష్టంలో నైనా ప్రేమించిన వ్యక్తితో ప్రయాణం ఇష్టంగా చేస్తాము.
మలినం లేని నీ మనసును కోరుకున్నాను నేను అర్ధం చేసుకో భాను అంటుంది ఉదయ.
ఆ మాటలు విన్న అందరూ ఆశ్చర్యంతో….ఇన్ని రోజులు భానుప్రకాష్ దే నిజమైన ప్రేమ అనుకున్న వారంతా…
భానును చూడగానే ఇంకేమి ఆలోచించకుండా అమితమైన ప్రేమతో తన దగ్గరకు వెళ్లి ప్రేమ నిండిన కళ్ళతో తనకు చేరువవుతుంది.
అమ్మకు చెప్పి భానును పెళ్లి చేసుకుంటుంది ఉదయ ,జాబ్ చేస్తూ… భర్తను , బిడ్డలా చూసుకుంటుండగా…
భాను ఇంటినుండే వర్క్ చేస్తూ జాబ్ చేస్తుండగా…
సంతోషంగా ఉంటున్న ఆ జంటను చూసిన వారంతా….వాళ్ళను విడి విడిగా పిలవడం మానేసి…
ఉదయభాను అని పిలుస్తున్నారు.

నిజమైన ప్రేమ కు లోపాలు కనిపించవు కదా కళ్ళతో కలిగే ఆకర్షణ కాదు ప్రేమంటే కాళ్ళు లేవని తెలిసినా ఆసరాగా నిలిచేదే కదా ప్రేమ త్యాగాన్ని చూపుతుంది ప్రేమ, తోడుగా నిలుస్తుంది ప్రేమ .

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!