పెళ్లి తర్వాత ప్రేమకథ

(అంశం:  ‘ప్రేమ’)

పెళ్లి తర్వాత ప్రేమకథ

రచయిత:: రమాకాంత్ మడిపెద్ది

ఎప్పుడు ఒక్కడినే ఉండే వాడ్ని నలుగురితో కలవాలంటే  భయం ఆడపిల్లలతో మాట్లాడాలి అంటే ఎక్కడలేని మొహమాటం పుస్తకాలు చదవడమంటే ఇష్టం సినిమాలంటే చిన్నప్పటి నుంచీ పిచ్చి సంగీతం అంటే తెలియని ఆసక్తి నా రోజు వారీ పనుల్లో నా భయాల్ని దాటేస్తూ మొహమాటలతో ముఖం చాటేస్తూ
నా ఇష్టాలకు సమయం కేటాయిస్తూ తోచినంతలో తోటి వారికి సాయం చేస్తూ వీలు చిక్కినప్పడల్లా ఉన్న పిచ్చిని ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తూ నాలుగు గోడల మధ్య నాకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టిలోని ఒక్కడినే ఒంటరిగా కాకుండా ఏ కాంత తోడు లేకున్నా  ఏకాంతంలో   ఏకాకి అనుకున్నా పర్లేదు అని
ఎంతో ఆనందంగా తనకు నచ్చినట్టు మారే కాలంలో నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నా సమయంలో ఓ రోజు  ఇంటి దగ్గర నుండి వచ్చిన ఫోన్ కాల్ నన్ను అలా ఓ ఐదు నిమిషాల పాటు స్తంభింప చేసింది. అలా ఆ ఐదు నిమిషాలు వెనక్కి వెళ్తే
ఫోన్లో: ఒరేయ్ నాయన నేను మీ బామ్మ ని ఎలా ఉన్నావు రా ఎలా ఉంది ఆ ఊరు ఉద్యోగం వేళకు తింటున్నవా అని కుశల ప్రశ్నల తర్వాత అమ్మ తీసుకొని బామ్మల ప్రశ్నలు వేయకుండా సమాధానాలు తానే చెప్పి నాకు కాస్త ఊరట కలిగించింది. ఆ తరవాత నాన్న తీసుకొని జీతం పెంచారా? చేతికి ఎంత వస్తుంది ఎంత మిగుతుంది అని రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ముఖ్య మంత్రి ఆర్థిక మంత్రిని అడిగినట్టు అడిగి అబ్బా! ఈయన ఎప్పుడు ఇంతే అని నేను చిరాకు పడిన విషయం తెలిసినట్టుగా ఏవిట్రా? ఆ సనుగుడు అని ఓ రెండు అక్షింతలు అచ్చ తెలుగులో స్వచ్చమైన రెండు తిట్ల రూపంలో వేసి అరగంట నుండి నాంచుతున్నా మినపప్పు విషయాన్ని అలా గ్రైండర్ లో వేసి తిప్పినట్టు తిప్పి తిప్పి అడిగారు ఏదైనా వివరంగా చెపితేనే అర్థం అవ్వడానికి అర్థ శతాబ్దం పట్టే  ఆయన  వ్యంగపు మాటలు ఓ పట్టాన అర్థం కాలేదు.
మళ్ళీ మరో మారు అక్షింతలు వేసి నా తలంబ్రాల విషయం గురించి చెప్పారు. అదేనండి ! నా పెళ్లి విషయం. ఆ విషయం విన్న నాకు ఒక్కసారిగా ఎందుకు నోట మాట రాలేదు
ఆ తర్వాత ఆయన చెప్పే వాటికి ఆ అనడమే నా వంతు అయ్యింది. సరేలే ఉంటాను ఇక్కడ ఎండలు మండి పోతున్నాయి ఇంకా ఆ మాయదారి రోగం కూడా మన ప్రాణాలకి జాగ్రత్త  బయటికి వచ్చి వెళ్ళేటప్పుడు మస్కులు శానిటైజర్ పెట్టుకెళ్లు అందరికీ అడుగు దూరంగా ఉండు.  వచ్చే వారం సెలవు పెట్టి  వచ్చేయ్ ఖాయం చేసుకుందాం అని అలా ఫోన్ పెట్టగానే అలా అమాంతం మంచం పై పడిపోయా!
ఇది కరెంటు స్తంభం లాంటి మనిషిని స్తంభింప చేసిన విషయం ఇది.
ఇంతలో కరెంటు  పొద్దునా ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఆఫ్ చెయ్యడం మర్చిపోయిన టీవీ  ఆన్ అయ్యింది. నన్ను మళ్ళీ నా లోకం లోకి తీసుకొచ్చింది. ఆ రోజు ఎందుకో ఆకలి లేదు నిద్ర రాలేదు ఎదో తెలియని భయం వెంటాడుతూనే ఉంది. చూస్తూ వుండగానే వారం గడిచిపోయింది. ఊర్లో అడుగు పెట్టానో లేదో ఇంటి ముందు హడావిడి అంతా ఇంతా కాదు చూపులకే ఇలా ఉంటే పెళ్ళికి ఎలా ఉంటుందో అనుకుంటూనే ఇంట్లో అడుగు పెట్టాను. చుట్టూ చుట్టాలు ఎదురుగా ఉయ్యాల బల్ల మీద బామ్మ పక్కన మడత కుర్చీలో నాన్న
పక్కనే అమ్మ నిలబడి ఉంది. అందరిలోనూ అరువు తెచ్చుకున్న ఆనందం నా ముఖం లో మాత్రం వాంతులకి విరోచనాలకి మధ్యస్థంగా ఓ
అదో రకమైన భావ ప్రకటన. వందమంది పైన పని చేసే నాకు ఇక్కడ పదిమందిని చూస్తే ఎందుకో దడ వచ్చేసింది. ఇక్కడ ఇంకో మలుపు ఎంటి అంటే చుట్టాలమ్మయినే చూసాం అని వాళ్లు ఎలాగూ దగ్గరి వాళ్ళే నని ఇక్కడే మా ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.
కాసేపటి తరువాత నా కూడా తెచ్చినా సామాను లోపల పెట్టేసి పోయినా సారి ఆన్లైన్ ఇష్టపడి కొన్న తెల్ల చొక్కా నీలం జీన్స్ వేసుకొని అలా కూర్చున్నాను.అటు వైపు నుండి చూస్తే వాళ్ళ అమ్మగారిలా ఉన్నారు అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగా చాపలో కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళ ద్వంద  అర్థాలతో నోళ్లకి చుట్టూ చేరి   అల్లరి పెట్టే  ఆడ కోతి మూకల్ని  తట్టుకోలేక బలవంతంగా నే అయినా అలా అమ్మాయిని ఓ కన్ను పైకి ఎత్తి చూసాను ఆ
అమ్మాయి కట్టు బొట్టు  కాటుక దిద్దిన పెద్ద కళ్లు గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లా బాపుగారి మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో  రామ జోగయ్య శాస్త్రి గారి బుట్ట బొమ్మలా లా ఉండడం తోనే ఏమో కానీ నేను రెండో కన్ను కూడా ఎత్తి అలా చూస్తూ బొమ్మలా మరిపోయా..  అమ్మాయి ఎలా ఉంది అని అందరూ అడుగుతుంటే నమ్మరు కాని మాములుగా సినిమాల్లో నాటకీయంగా జరిగినట్టు నా మనసుకు తను బాగా నచ్చేసింది సరే నని చెప్పమంది కాని నా లోపలున్న భయం ఆ మాట చెప్పకుండా నా నోరు నొక్కేసింది. కొద్దిపాటి గజిబిజి తర్వాత ఇక వద్దు వల్ల కాదు అని చెప్పే లేపే తానే లేచి నేను అబ్బాయితో మాట్లాడాలి అని చెప్పింది. అందరూ అలా విడ్డూరంగా చూస్తునప్పుడే తను నా చెయ్యి పట్టుకొని అలా తూర్పు వైపు ఉన్న మా బామ్మ గదిలోకి తీసుకెళ్లి గడిపెట్టి అలా మంచం మీద కూర్చొని గడ గడ మాట్లాడం మొదలు పెట్టింది ఇప్పుడు నేను చూస్తున్న అమ్మాయి వేరు కింద ఇప్పటి వరకూ మేము చూసిన అమ్మాయి వేరు.
తన నిర్మొహాటపు మాటల్లో ఉన్న పదును సూటీగా చూసే సూదులాంటి కళ్లు అందంగా నవ్వే ఆ ముఖం తన పైన తనకు ఉన్న నమ్మకం స్పష్టత నన్ను మరింత ఆకర్షించాయి. నా తెలియని తనం, అమాయకత్వం తనకు నచ్చాయి.  పది నిమిషాల ఆ గదిలోని సంభాషణ  నాకు క్షమించాలి మాకు చిరకాలం కావాలనుకునే చేశాయి. మమల్ని మరో అడుగు ముందుకేసి ఒక్కటిగా నడిచేలా చేశాయి. అలా అని మా అభి రుచులు కలవలేదు అని కాదు తనుకు నాలాగే సినిమాలంటే పిచ్చి.  మెల్లగా నా భయాలు వెనుక ఉన్న గతం తాలూకు కారణాలు మొహమాటాల వెనుక ఉన్న అర్థం లేని భయాలు అన్నింటినీ  అర్థం చేసుకొని నేను మెచ్చేలా తాను మారుతూ  తనకు నచ్చేలా నన్ను మారుస్తూ ఇలా నాతో రెండేళ్లగా వేగుతుంది నన్ను అప్పుడపుడు వేపుతుంది.
అలా  రెండేళ్లలో స్పందించని హృదయాన్ని పూర్తిగా ప్రతి స్పందించేలా చేసినా నా లోని సగం పేరు “స్పందన”. తనతో ఈ రెండేళ్ల ప్రణయ ప్రయాణాన్ని  కలిసి చేసినా నా పేరు “ప్రణయ్”. ఆ ప్రయాణంలో చివరి గమ్యంలా కాకపోయినా చిన్నపాటి సేద తీర్పు మా ఇంటి అట విడుపు వాళ్ళ అమ్మకు అచ్చు గుద్దినట్టు మరో రూపు మా పాప “లక్ష్మి నందన”. మా అమ్మ పేరు కలుపుకొని. ఇదేనండి! నా పెళ్లి తర్వాత ప్రేమకథ.

You May Also Like

5 thoughts on “పెళ్లి తర్వాత ప్రేమకథ

  1. పెళ్లి చేసుకో ఇంకా ఇలాంటిి వి బాగా రాయొచ్చు బ్రో ,,, 🤗

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!