మూగప్రేమ

(అంశం :- ప్రేమ )

మూగప్రేమ

రచయిత::సావిత్రి కోవూరు

“హలో శ్రావ్య బాగున్నావా” అన్నాడు మా అన్నయ్య ఫ్రెండ్ సతీష్.

“ఆ బాగున్నాను నీవెలా  ఉన్నావ్. ఎక్కడికి వెళ్లావు ఇన్ని రోజులు” అన్నది శ్రావ్య.

“ఆఫీస్ పని పైన నెల రోజులు ముస్సోరీ వెళ్లాను. ఇంట్లో ఎవరూ లేరా?” అన్నాడు సతీష్.
మా అన్నయ్య, వదిన,అమ్మ షాపింగ్ కి వెళ్ళారు. నాన్న ఏదో పని ఉందని వెళ్లారు.మా చెల్లి రేపు ఉదయం వస్తుంది.” అన్నది శ్రావ్య.

“ఎందుకలా చేసావ్ ఒక్క మాట మీ అమ్మానాన్నలతో చెప్పొచ్చు కదా! నా పైన నమ్మకం లేదా? నేను టూర్ నుండి రాగానే మా చెల్లి చెప్పింది, అమెరికా అబ్బాయితో నీ పెళ్లి కుదిరిందని, ఈ వారంలోనే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతాడని అవునా? ఇదంతా నిజమేనా?” అన్నాడు సతీష్ .

“అవును నాన్నగారు రిటైర్ అయ్యే లోపల నాది, మా చెల్లి పెళ్లిళ్శు చేసేయాలని అనుకుంటున్నారు. ఇంత లోపలే బంధువుల ద్వారా ఈ సంబంధం వచ్చింది. నాన్న వాళ్లకు బాగా నచ్చింది. అందుకే సరే అన్నా” అన్ళది శ్రావ్య.

“మీ నాన్న వాళ్లకు నచ్చితే సరేనా? మరి నీకు?” “

“నాదేముంది. వాళ్లకు నచ్చింది చాలు అంతే”

“అంటే నీ మనసులో ఎవరు లేరా?”

” ఏమో”

“అది కాదు నీకు తెలియదా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని, నువ్వంటే చాలా ప్రాణమని.

“ఎలా తెలుస్తుంది. నీవెప్పుడైనా చెప్పావా? పోనీ అలా బిహేవ్ చేసావా మామూలుగా మాట్లాడేవాడివి. స్నేహంగా చూసే వాడివి. నీ మనసులో ఏముందో అది ప్రేమనా, ఇష్టమా లేక స్నేహమేనా నాకెలా తెలుస్తుంది. ఒక్కరోజు కూడా నోరు విప్పి ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్పలేదు. నీ మనసులో అలాంటి భావం ఉందని తెలుసుకునే తెలివి నాకు లేదు”అన్నది శ్రావ్య.

“నా విషయం వదిలేయి, మరి నీ సంగతి చెప్పు. నీకు నేనంటే ఇష్టం కానీ, ప్రేమ కానీ లేవా? ఓన్లీ స్నేహమేనా? మరి స్నేహమే అయితే మీ అన్నయ్య నేను మాట్లాడుకునేటప్పుడు ఆరాధనగా ఎందుకు చూస్తు కూర్చునే దానివి. నేను మీ ఇంటికి రాగానే నాకు ఇష్టమైన గ్రీన్ టీ ఎందుకు ఇచ్చేదానివి. ఇన్ని రోజులు మా చెల్లితో మాట్లాడేటప్పుడు మాటిమాటికి నా ప్రస్తావన ఎందుకు తెచ్చేదానివి. మా చెల్లి నా గురించి ఏదైనా మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఎందుకు వినేదానివి. నేను గమనించ లేదనుకున్నావా. మా చెల్లి పెళ్లి లో ఇంట్లో మనుషిలాగా అన్ని పనులు కల్పించుకుని చేశావు కదా! మా చెల్లి పెళ్లి జరుగుతుంటే నీవు పెళ్లి చూడకుండా నన్ను చూస్తూ కూర్చున్నావెందుకు? నాకు ఏ కలర్స్ ఇష్టమో తెలుసుకొని ఆ కలర్ డ్రస్ లే వేసుకొనేదానివెందుకు? నా బర్త్ డే రోజు మర్చిపోకుండా విష్ చేసే దానివి కదా. నేను జాబ్ ఇంటర్వ్యూ కు వెళ్ళేటప్పుడు కూడా మా ఇంటికి వచ్చి విష్ చేసావ్ కదా! జాబ్ వచ్చింది అని చెప్తే, ఆ రోజు నీ కళ్ళల్లో మెరుపు  నేను చూడలేదు అనుకుంటున్నావా? ఇంత ఇష్టాన్ని మనసులో పెట్టుకుని ఏమీ లేనట్టు ఎవరినోఎలా పెళ్ళిచేసుకుంటున్నావ్ చెప్పు శ్రావ్య”అన్నాడు గద్గద స్వరంతో.

“ఏం చెప్పను సతీష్, నీవంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టమే. మీ చెల్లి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా, నా చెవులు మాత్రం నీ మాటలే వినడానికి ఇష్టపడేవి. నీవు శనివారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి రెడీ అయ్యి అద్దం దగ్గర నిలబడి తల దువ్వుకుంటుంటే  అదేపనిగా చూసేదాన్ని. మీ  ఫ్రెండ్స్ అందరు కలిసి గుడికి వెళ్ళేవారు కదా! మళ్లీ ఎప్పుడు వస్తారా అని ఆలోచించేదాన్ని. పక్కింట్లో ఉన్నాకూడా నా కళ్ళన్ని మీ ఇంటి వైపే ఉండేవి. అన్ని గమనించే దాన్ని. ఏదో పని పెట్టుకుని మీ ఇంటికి వచ్చేదాన్ని. మనసులోనే ఆరాధించేదాన్ని.

ఒక్క రోజు కూడా నాతో అనవసరంగా ఏ మాట కూడ మాట్లాడకపోతే నీ పైన ఇంకా గౌరవం పెరిగింది. నేను నా మాటల్లో గాని, చేతుల్లో గాని, ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళ కైనా, మా ఇంట్లో వాళ్ళ కైనా ఇష్టం లేకపోతే నిన్ను చూసే అవకాశం కోల్పోతానని, నేనెప్పుడు నా లిమిట్స్ దాటలేదు.

నీవు కూడా ఒక్కరోజయినా నీ ప్రేమని తెలపలేదు. నీవు నెల రోజులు ఆఫీసు పని పై వెళ్లావు. ఈ లోపల పెళ్లి కుదరడం,ముహూర్తం పెట్టుకోవడం జరిగిపోయాయి. పోనీ నీ గురించి మా ఇంట్లో వాళ్లకు చెబుదామంటే, నాకే గ్యారెంటీ లేదు నీది ప్రేమా లేకపోతే మామూలు స్నేహమా అని. అలాంటప్పుడు బయటపడి నా జీవితాన్ని అల్లరిపాలు చేసుకోవడం ఎందుకని, మౌనంగా ఉన్నాను” అన్నది.

“మరి ఇప్పుడు ఎలా? నాకు నీవు కావాలి. నా భార్య స్థానంలో నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేను.ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ పెళ్లి ఏం చేస్తే ఆగిపోతుంది చెప్పు. నాకు పిచ్చెక్కేలా ఉంది. చెప్పు శ్రావ్య” అన్నాడు.

“పెళ్లి ఆగిపోతే మా నాన్న పరువు పోతుంది. మా చెల్లి పెళ్ళికి కూడా ఇబ్బంది అవుతుంది. నన్ను ఇంట్లో వాళ్లంతా అసహ్యించుకుంటారు.ఇప్పుడేం చెయ్యలేం. నన్ను మర్చిపోయి ఎవరినైనా చేసుకొని ఆనందంగా ఉండు. నేను కూడ  ఎలాగో గడిపేస్తాను. ఇంతకు మించి చేసేదేం లేదు ఈ టైం లో. నీ టూర్ లేకుంటే అప్పుడే నీ దగ్గరకు వచ్చి నా పైన నీ అభిప్రాయం ఏంటో తెలుసుకునే దానిని”అన్నది శ్రావ్య.

అప్పుడే శ్రావ్య వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు లోపలికి వచ్చి
“ఏం బాబు బాగున్నావా? టూర్ వెళ్ళావట ఎప్పుడొచ్చావు. మావాడు షాపింగ్ అని వెళ్లినట్టు ఉన్నాడు” అని అన్నాడు.

“ఏమమ్మా గ్రీన్ టీ ఇచ్చావా సతీష్ కి”అన్నారు.

“మీ వాడి తో కాదు అంకుల్ మీ తోనే మాట్లాడాలి” అన్నాడు సతీష్ .

“చెప్పు బాబు ఏంటి సంగతి”అన్నారు.

“అంకుల్ నేను, శ్రావ్య ను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను. నాకు జాబ్ వచ్చినాక మీతో చెప్పి మీకిష్టమైతే  పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. సినిమాల్లో లాగా నా ప్రేమను తనతో పంచుకోలేదు. తనకు కూడా నేనంటే ఇష్టమే అంకుల్. కానీ మేము ఎప్పుడు దాని గురించి ఒకరితో ఒకరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. దానివల్ల మీరు శ్రావ్య పెళ్లి కుదిరిస్తుంటే మీకేం చెప్పలేకపోయింది. నేను ఉంటే నేనే వచ్చి మిమ్మల్ని అడిగేవాడిని. ఇప్పుడు నేనేం చేయాలి అంకుల్. శ్రావ్య అంటే నాకు ప్రాణం. మీకు ఇష్టమైతే ఎలాగైనా ఈ పెళ్లి ఆపేసి శ్రావ్య ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే నేనేం చేయలేను. కానీ నేను ఎవరిని చేసుకోను అని, బ్రతకను అని చెప్పను. కానీ శ్రావ్య తో ఉన్నంత ఆనందంగా బ్రతకలేనని మాత్రం చెప్తాను. నేను శ్రావ్య కి ఇచ్చే ఆనందం ఇంకెవరు ఇవ్వలేరు అని కూడా గ్యారెంటీగా చెప్తాను. ఇక మీ ఇష్టం అంకుల్ అంతా మీ చేతుల్లోనే ఉంది నా జీవితం” అన్నాడు సతీష్.

“అది కాదయ్యా పెళ్లి వారం రోజులు కూడ లేదు. అందరికీ కార్డ్సు కూడ ఇచ్చాము, పెళ్లి పనులు అన్ని అయిపోతున్నాయి. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే నా పరువు సంగతి పక్కకు పెట్టి నా రెండో అమ్మాయి పెళ్లి చేయడం చాలా కష్టం అవుతుంది. రేపు ఉదయం పెళ్లి కొడుకు వస్తున్నాడు అమెరికా నుండి. నీవు ముందు చెప్పి ఉంటే, మనమేమి కొత్త వాళ్ళం కాదు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టమే. మీ ఫ్యామిలీ మంచి మర్యాద గల ఫ్యామిలీ. మా అమ్మాయి మీ ఇంట్లోకి వస్తే చాలా సుఖపడుతుంది అని కూడా నాకు తెలుసు. నీవు కూడా బుద్ధిమంతుడివి నిన్ను వద్దనడానికి ఒక్క కారణం కూడా దొరకదు. పైగా మా అమ్మాయికి బాగా నచ్చావని, ఇందాక ఇంట్లోకి వస్తుంటే మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. నీవు మా అమ్మాయి ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో తెలుసుకున్నాను. ఒక్క మాట చెప్పి ఉంటే మీ కుటుంబంలో కి మా అమ్మాయిని సంతోషంగా పంపే వాడిని. కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. మా వాడితో కూడ మాట్లాడతాను. వాడే మైన ఉపాయం చెబుతాడేమో. కనీసం రాజేష్ నీ ఫ్రెండే కదా వాడితో ఒక్కసారైనా చెప్పలేదు నువ్వు” అన్నారు వెంకటేశ్వరరావు గారు.

“అంతా నా దురదృష్టం అంకుల్ .మీ ఇష్టం మీరు ఏం చేసినా నేనేం మాట్లాడలేను. వస్తానంకుల్” అని వెళ్ళిపోయాడు దిగులుతో సతీష్.

“శ్రావ్య నీవైనా చెప్పొచ్చు కదా సతీష్ ని చూస్తుంటే చాలా బాధగా ఉంది నన్ను ఏం చేయమంటావు చెప్పు” అన్నారు

“నాన్న నాకు కూడా సతీష్ అంటే చాలా ప్రేమ. ఎలాగైనా అతన్ని చేసుకోవాలి అనుకున్నాను. కానీ సతీష్ తన మనసులోని మాట ఒక్కసారి కూడా నాతో అనలేదు. అందుకే మీకు చెప్పలేదు. నాకు కచ్చితంగా తెలియకుండా మీకు ఎలా చెప్తాను. మీకు సాధ్యమైతే ఎలాగైనా ఈ పెళ్లి ఆపి సతీష్ తో నా పెళ్లి జరిపించండి” అన్నది. శ్రావ్య కళ్ళ నీళ్ళతో.

“చాలా కష్టమమ్మా అయినా ఆలోచిద్దాం. నువ్వేం బాధపడకు. నా పరువు కంటే నీ బ్రతికే ముఖ్యం నాకు” అన్నారు.

ఆ రాత్రి కొడుకు రాజేష్ తో సతీష్, శ్రావ్య ల కథంతా చెప్పారు వెంకటేశ్వరరావు.

“నాన్న మీరేం బాధపడకండి ఏదైన ఉపాయం ఆలోచిద్దాం” అన్నాడు రాజేష్

రెండో రోజు ఉదయం దివ్య వచ్చింది మద్రాస్ నుండి వస్తూనే “నాన్న, బావగారు ఎలా ఉంటారు ఫోటో ఉందా? మొన్న నే వద్దామనుకున్నా, మా ఆఫీసర్ లీవ్ ఇవ్వలేదు” అన్నది.

“ఇదిగో మీ బావగారి ఫోటో” అని ఫోటో ఇచ్చారు వెంకటేశ్వరరావు.

అక్కడే టీ తాగుతున్నా రాజేష్ “ఏమ్మా బాగున్నాడా అబ్బాయి. నీకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నారు నాన్న. ఇలాంటి అబ్బాయిని తెచ్చి” అన్నాడు

“ఇలాంటి అబ్బాయి అయితే ఓకే అన్నయ్య” అన్నది  దివ్య.

“ఈ అబ్బాయి అయినా ఓకేనా” అన్నాడు రాజేష్ దివ్య ముఖాన్ని పరిశీలిస్తూ.

“అదేంటి అన్నయ్య అలా మాట్లాడతావు తప్పు కదా” అన్నది దివ్య.

“అది కాదమ్మా నీతో చాలా మాట్లాడాలి” అని సతీష్,  శ్రావ్యల ప్రేమాయణం అంతా చెప్పి, తను ఆలోచించిన ప్లాన్ కూడా దివ్య కు చెప్ప్పాడు రాజేషు.
ఆ రోజు సాయంత్రం పెళ్ళికొడుకు తండ్రి రంగారావు గారికి, వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి “బావగారు మీరు, అక్కయ్య గారు బాబును తీసుకొని ఈరోజు సాయంత్రం వస్తే మ్యారేజ్ రింగ్ కొనొచ్చు” అన్నారు

“సరే బావగారు తప్పకుండా 5 గంటలకు వస్తాము స్వాగత్ హోటల్ దగ్గర కలుసుకుందాము.మీరు ముందు వస్తే అక్కడే వెయిట్ చేయండి. మేము అక్కడికి వస్తాము” అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రంగారావు.

సాయంత్రం నాలుగున్నరకే కొడుకును, కూతురును తీసుకొని వాళ్ళు చెప్పిన హోటల్ కి వెళ్లారు వెంకటేశ్వర రావు గారు. వీళ్ళు వెళ్ళిన పావు గంట కి పెండ్లికొడుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. వాళ్లకి దివ్య ను పరిచయం చేశాడు.

వెంకటేశ్వరరావు తర్వాత మెల్లగా
“మీకు ఒక విషయం చెప్పాలి, బావగారు సావధానంగా వినండి. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి. మీ సమాధానం ఏదైనా మాకు సమ్మతమే” అన్నారు

రంగారావుగారు “ఏంటి విషయము ఏం చెప్పినా ఓకే గాని, పెండ్లి పోస్ట్ ఫోన్ చేయడం మాత్రం కుదరదు. మా అబ్బాయి రిటర్న్ టికట్ కూడ బుక్ చేసుకన్నాడు. వాడికి లీవ్ ఎక్స్టెండ్ కూడ కాదు అందుకని” అన్నాడు రంగారావు.

“అది కాదండి మధ్యాహ్నం మా అమ్మాయి శ్రావ్య ఇంట్లో మెట్ల మీద నుండి జారి పడింది. వెన్నుపూస కి కొంచెం దెబ్బ తగిలింది. నెల రోజులు డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కువ సేపు కూర్చోవడం, నిలబడడం కూడదు అన్నారు. ప్రయాణమైతే అసలే చెయ్యొద్దన్నారు. అదే మీకు తెలుపుదాం అని” అన్నారు వెంకటేశ్వరరావు.

“అయ్యో అలాగా. ఫోన్ కూడ చేయలేదు మీరు. ఇప్పుడెలా వుంది. మరి ఎలాగ పెళ్లి అంటే రోజంతా కూర్చోవాలి. పెళ్లైన వారం రోజులకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు మా అబ్బాయి అమ్మాయిని తీసుకుని. మరి ఏం చేద్దాం అన్నారు. సరే మాకు అరగంట టైం ఇవ్వండి ఏం చేయాలో ఆలోచిద్దాం” అన్నారు.

“సరే టిఫిన్ చేద్దాం రండి ఈ లోపల తొందర ఏమి లేదు మెల్లగా ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరేం చెప్పినా మాకు సమ్మతమే. మీరు తప్పని సరై పెండ్లి కాన్సిల్ చేసుకున్నా మేమేమనుకోము. ఇంత మంచి మనుషులతో సంబంధం కలుపుకునే అవకాశం పోయిందని బాధ పడతాం” అని అన్నాడు రాజేష్.

అందరూ టిఫిన్ చేసి టీ తాగారు “నీవు ఏం చేస్తున్నావ్ అమ్మా” అని అడిగారు రంగారావుగారు  దివ్యని.
“నేను మద్రాస్ లో టీ.సి.ఎస్. లో డెవలపర్ గ చేస్తున్నా అంకుల్” అన్నది దివ్య. రాజేష్, ప్రతీక్, దివ్య వాళ్ళ ఆఫీస్ ల గురించి మాట్లాడుకుంటున్నారు.
అందరూ బయలుదేరుదామని అనుకునే టైం కి ఒక్కపావుగంట ఆగి వెళదాం ఉండండి అన్నారు ఏదో ఆలోచిస్తూ రంగారావుగారు . ప్రతీక్ ని, భార్యని,పక్కకు తీసుకెళ్లి 15 నిమిషాలు మాట్లాడి వచ్చారాయన.

వస్తూనే “సారీ ఏమనుకోకండి ఏవో పర్సనల్ విషయాలు” అన్నారు.

“పరవాలేదు లెండి” అన్నారు వెంకటేశ్వర గారు

“మీరు ఏమి అనుకోకుంటే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు మీ పెద్దమ్మాయి పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేదు. ఇంత వరకు వచ్చాక మా అబ్బాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూసి, నచ్చీ, పెళ్ళి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వాడికి టైం లేదు. మావాడు ఇప్పుడిప్పుడే మళ్ళీ రాలేడు. కనుక నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మీ చిన్నమ్మాయి దివ్యను, మా అబ్బాయికిచ్చి చేయండి అదే ముహూర్తానికి. ఎందుకంటే మా అబ్బాయి పెద్ద అమ్మాయిని కూడా ప్రత్యక్షంగా చూడలేదు మా వాడికి మీ చిన్నమ్మాయి దివ్యని చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు” అన్నారు రంగారావుగారు.

‘రోగి కోరిందదే, వైద్యుడిచ్చిందదే’ అన్న సామెతగా రాజేష్ తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు మనస్సులో సంతోషపడుతూ, గత్యంతరం లేక ఒప్పుకుంటున్నట్టు

“సరే అంకుల్ మాకు కూడా మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు. మీ అబ్బాయికి దివ్యను చేసుకున్న పర్లేదు. మా పెద్ద చెల్లి కోలుకున్నాక ఏదైనా మంచి సంబంధం చూసి చేస్తాము” అన్నాడు

“మరి వాళ్ళిద్దరూ ఏమైనా మాట్ల్లాడుకుంటారేమో టైమ్ ఇద్దామా”  అన్నారు వెంకటేశ్వరరావు.

ప్రతీక్ “ఏం అక్కర్లేదు అంకుల్ మీ అమ్మాయి ని అడగండి తనకు ఇష్టమేనా అని, ఆమెకు ఇష్టమైతే రేపు కలుసుకుందాము.” అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.

వెంకటేశ్వర రావు మనసు కుదుటపడింది. నిన్నటి నుండి శ్రావ్య కు ఇష్టం లేని పెళ్లి ఎలా చేయాలని చాలా బాధ పడుతున్నాడు. అబ్బాయి వాళ్లకు ఏం చెప్పి పెళ్లి ఆపాలి అని ఎంతో మదన పడ్డారు.
రాజేష్ చిన్న చెల్లిని కూడ హోటల్కి తీసుకుపోదామని సలహా ఇస్తే మొదట అర్థం కాలేదు వెంకటేశ్వర గారికి.

“దివ్య ఏదో షాపింగ్ చేయాలట నాన్న” అని చెప్పి వెంట తీసుకు వచ్చాడు. అతని మనసులో ప్లాను అప్పుడు అర్థమైంది. దివ్యని పెళ్ళికొడుకు వాళ్ళకు చూపించి వాళ్లకు ఒక ఐడియా వచ్చేలాగా చేశాడన్నమాట.  కొడుకు తెలివిని తలచుకుని ఎంతో పొంగిపోయాడు వెంకటేశ్వరరావు. ప్రతీక్ కి దివ్య నచ్చడము, దివ్యకు పెళ్ళికొడుకు నచ్చడంతో అనుకున్న ముహూర్తానికే దివ్య నిచ్చి పెళ్లి చేశారు.

మరికొన్ని రోజులకు శ్రావ్య ఇష్టపడిన సతీష్ తో పెళ్లి జరిపించారు.

You May Also Like

One thought on “మూగప్రేమ

  1. Chala bagundi evaru manasu noppinchakunda tanu istapadda vadithone Pelli jarapatam happy ending

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!