గోరింటాకు

గోరింటాకు

రచన:: నామని సుజనాదేవి

ఆషాడ మాసం. అప్పటివరకు ఎండలతో మోడులయిన చెట్లన్నీ చిగుళ్ళతో పచ్చని చీర సింగారించుకున్నాయి. నాకు ఇటీవలే ట్రాన్స్ ఫర్ అయ్యింది హుస్నాబాద్ కి . ఇంటి బాధ్యతలతో పాటు , బాధ్యాతాయుతమైన ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉన్నా కొత్తగా పరిచయమైన అలివేలు భజన మండలి వారు గీత మందిరానికి సాయంత్రం రమ్మని ఫోన్ చేయడం తో ఆఫీస్ అయిపోయాక పని కొంచెం త్వరగా తెమల్చుకుని వెళ్లాను. ఎదో సాహితీ కార్యక్రమమో, కోలాటమో, భజననో అనుకున్న నేను అక్కడి దృశ్యానికి నివ్వెరపోయాను. దాదాపు ముప్పై మంది మహిళలు ముందు రోలుపెట్టుకుని అందులో నూరిన గోరింటాకు ను ఒకరి చేతికి ఒకరు ఛలోక్తులు విసురుకుంటూ , నవ్వుకుంటూ పెట్టుకుంటున్నారు. గీత మందిరం వెనక చెట్లకింద విశాలమైన ఆవరణలో చాప పై కూర్చున్నారంతా. నన్ను చూడగానే నాకు ఫోన్ చేసిన మండలి అధ్యక్షురాలు లక్ష్మి , ఆప్యాయంగా పలకరిస్తూ, ‘రండి రండి…’అంటూ పిలిచింది. మహిళా ఎం పీ పీ ని , మహిళా సంఘం అధ్యక్షురాలిని, మిగతా వారిని పరిచయం చేసింది. కలివిడిగా ఒకరొక చేయి , మరోకరొక చేయి తీసుకుని నాకు గోరింటాకు పెడుతున్నారు. నిజానికి శ్రీవారికి,నాకు ఏంతో ఇష్టమైనా, నా హడావుడికి ఆకు నూరి, పెట్టుకుని ఒక రెండు గంటలైనా (ఏదైనా పని చేస్తూ అయినా) ఉండాలంటే తీరక పోయేది. ‘గొరింటా పూసింది కొమ్మా లేకుండా………మురిపాల అరచేత మొగ్గ తొడిగింది….’ పాట గుర్తొచ్చింది. ఒకరిద్దరు అంతకు ముందే పెట్టుకున్నా మళ్ళీ ఆ ఎర్రటి చందమామ పైనే మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఆంజనేయస్వామి సింధూరం గుర్తొచ్చింది నాకు. సీతమ్మవారు నుదుట సిందూరం పెట్టుకుంటూ రాములవారికి సింధూరమంటే చాలా ఇష్టమని చెబితే , ఆంజనేయుడు సీతమ్మవారు కొంచెం సింధూరం ధరిస్తేనే అంత ఇష్టమైతే , వొళ్ళంతా ధరిస్తే ఇంకెంత ఇష్ట పడతాడో కదా అని,ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడట. ఇప్పుడు శ్రీవారికి ష్టమని …..నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చింది.
సంతోషంగా ఆ ఆహ్లాద వాతావరణం ఆస్వాదిస్తుంటే , కొంచెం దూరం లో ఉన్న గది నుండి కేవలం తల కొంచెం బయట పెట్టి తొంగి చూస్తున్న ఒకమ్మాయి నన్నాకర్షించింది. మొహాన్ని బట్టి వయస్సు పాతిక ఉంటుందేమో… అక్కడికి రావాలనే ఆసక్తి, రాలేని నిస్సహాయత ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది.
ఇంతలోవిలేఖర్లు , టీవీ చానెల్ వాళ్ళు వచ్చారు. అందరినీ గోరింటాకు పెట్టుకున్న రెండు చేతులను ముందుకు చాపమంటూ ఫోటోలు తీసారు. తర్వాత లక్ష్మీ మేడం ని మాట్లాడ మన్నారు. ‘ ఆషాడ మాసం ప్రకృతి పచ్చల హారం తోడుక్కుంటుంది. అనాదిగా వస్తున్నా ఈ సంప్రదాయం మనతరవాతి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దీని వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఇది ఒంట్లోని వేడిని హరిస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ముత్తయిదువలంతా ఇలా ఒక్క దగ్గర ఇలా పెట్టుకోవడం హర్షించదగింది..’ అంటూ మాట్లాడింది.
‘ మొన్నటి వరకు ఎండ తాపం తో ఉన్న భూమి తొలకరికి పులకరించి ఆకై, మొక్కై, చెట్టై ఆహ్లాదం పంచుతుంది. ముత్తయిదు వలంతా కలిసి ఆషాడ మాసంలో జరుపుకునే ఈ వసంతోత్సవం ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది …’ అంటూ ఎం పీ పీ మేడం మాట్లాడింది . ఒక పండు ముత్తయిదువ ,మరో ఇద్దరు మాట్లాడుతుంటే వింటూ ఆలోచనల్లోకేల్లిపోయాను .వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళ ముందు మా అమ్మ, మా పిన్ని కూతురు నిలిచారు. అంతా నన్ను మాట్లాడ మంటూ బలవంతం చేసేసరికి మైక్ తీసుకున్నాను. ‘కరాగ్రే వసతే లక్ష్మీ …. కరమధ్యే సరస్వతీ….కర మూలేత్ భవేద్ గౌరీ …ప్రభాతే కర దర్శనం….’ అంటూ మనం పొద్దున్న లేవగానే మన అరచేతులను చూస్తూ అందరూ మహిళా దేవతా మూర్తులనే తలుస్తాము. మహిళల కున్న ప్రాముఖ్యత అంత గొప్పది. వాళ్ళు తలచుకుంటే సాధించలేనిది లేదు.పాశ్చ్యాత్య సంస్కృతీ నేపధ్యం లో సంప్రదా యాలన్నీ క్రమేనా మాయమవుతున్నఈ తరుణాన మన తరువాతి తరానికి దీనిని కానుకగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే దీనితో పాటు విద్యావంతులైన మన భుజ స్కందాల పై మరో బాధ్యత కూడా ఉంది. అదేమిటంటే కేవలం ముత్తయిదువలె పెట్టుకోవడం కాకుండా, అందరు స్త్రీలు అంటే ఇష్టమున్న ప్రతీ మహిళా పెట్టుకునే అవకాశం ఇవ్వడం. మనం పుట్టినప్పటి నుండే బొట్టు, కాటుక, గాజులు ధరిస్తున్నాం. కానీ పెళ్ళయి భర్త చనిపోతే, ఆచారం పేరుతొ స్త్రీని చిత్రహింస చేసి వాటికి దూరం చేసే ఆచారాన్ని మనం రూపు మాపాలి. వాళ్ళు చనిపోతే దాంట్లో వీళ్ళ తప్పు ఏమైనా ఉందా… అవేమైనా(పసుపు, బొట్టు గాజులు ) భర్త తో వీళ్ళకి వచ్చాయా…లేదే…మరి అలాంటప్పుడు వారు పోయినంత మాత్రాన వాటికి దూరం చేసి వేలేసినట్లు చూడడం…శుభకార్యక్రమాలకు దూరంగా ఉంచడం… వారికి ఇక జీవితం పైనే విరక్తి కలిగేలా చేయడం…ఇవన్నీ మనం రూపు మాపాలి…..’ ఒక్క క్షణం ఆగాను. అంతా నిశ్శబ్దం.
‘నిజమే బిడ్డా…. మొగుణ్ణి కోల్పోయిన నా బిడ్డ యాతనను సరిగ్గా చెప్పినవ్…అది బాద పడతదని నేను ఈడికి రానంటే …..’నాకా అదృష్టం లేదు…ఉన్నదానివి నువ్వెందుకు దూరం చేసుకుంటావమ్మా ..’ అంటూ పంపింది…’ పమిటతో కళ్ళు తుడుచుకుంటూ అంది పండు ముత్తయిదువ.
‘అవును….మా ఆడబిడ్డ కూడా అంతే ….కడుపు తరుక్కుపోతది….’ మరొకరన్నారు. అలా మరి కొందరు గొంతులు కదిపారు.
‘అనంత మైన దూరం కూడా ఒకే అడుగుతో ప్రారంభం అవుతుంది… మనం ఆ సంప్రదాయానికి మీ అందరి తోడ్పాటుతో ఇక్కడే తెర తీద్దాం… ఇటీవల అలా వితంతువులు క్రుంగి పోకుండా , వారిలో ఆత్మ విశ్వాసం నింపుతూ ఒక స్వచ్చంద సంస్థ కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహించింది. ఒక మహానుభావుడు తన కొడుకు పెళ్ళికి, అందరు మహిళా వితంతువులను పిలిచి ఆశీర్వచనాలిప్పించి తన పెద్ద మనస్సు చాటుకుని మనందరికీ ఆదర్శంగా నిలిచాడు… ఎవరో మగవారు చేసిన ఆ పని తోటి మహిళ లమైన మనం చేయలేమా… వారెం పాపం చేసారని ఈ శిక్ష….విద్యావంతులు, చైతన్య మూర్తులు అయిన మీరంతా ఈ దురాచారాన్ని రూపుమాపడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ…. ‘ కళ్ళు విప్పార్చి వింటున్న తలుపు చాటు అమ్మాయి కళ్ళు ఆనందంతో , ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి….’ చేయితో ఇలా రమ్మంటూ నేను చేస్తున్న సైగ చూసి అంతా అటుచూసారు. లక్ష్మి మేడం కి అర్ధమైనట్లు వెళ్లి తలుపు చాటున భయంగా నక్కిన ఆమె చేయి పట్టి బయటకు తీసుకొచ్చింది. ఎం పీ పీ మేడం ఆమె చేయి తీసుకుని గోరింటాకు పెట్టింది… ఆమె కళ్ళు ఆనందంతో విప్పారాయి. అంతా చప్పట్లు కొట్టారు, చేయికి గోరింటాకు పెట్టుకున్నది మరిచి….ఒకరు చిన్న గోరింట ముద్దను ఆమె నుదుటి మధ్యలో సింధూరంగా పెట్టారు. ఆమె మొహంలో వెయ్యి శరత్ జ్యోస్నల వెలుగు మిళితమై కనిపించింది. నా కళ్ళ ముందు ఆక్సిడెంట్ లో భర్తను కోల్పోయిన చిన్నమ్మ కూతురు, అనారోగ్యంతో నాన్న ను కోల్పోయిన అమ్మ మొహాలు దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించాయి.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!