నా అంతర్మధనం

నా అంతర్మధనం

రచయిత: సుశీల రమేష్

అందరి ఆడపిల్లల్లా గా నేను కూడా కలలు కన్నాను. నాకు కాబోయే వరుడు కోసం.

నాకు ఊహ తెలిసినది మొదలు మా ఇంట్లో నేను మహారాణి ని అని.
నాన్నకు గారాలపట్టి ని, అమ్మకు కన్నుల పంట ను. నా మాటలతో మురిసే నాన్నమ్మ తాతయ్యలు. నాతో ఎల్లవేళలా పోట్లాడే తమ్ముడు. ఇదే మా కుటుంబం.

నా పేరు నిత్య, నానమ్మ ఎప్పుడు నన్ను, నువ్వు మీ నాన్న నోట్లో నుండి పుట్టావు ,అచ్ఛుగుద్ధినట్లు మీ నాన్న లా ఉన్నావు, అంటూ మురిసేది.

తాతయ్య చెప్పే కథలు వింటూ నానమ్మ చేతి గోరుముద్దలు తింటూ , పెరిగాను. అలా నా “స్కూలు చదువు అయిపోయింది” నా చేతితో నేను తినడం వేళ్లల్లో లెక్కపెట్టి చెప్పొచ్చు. మా క్లాసులో ఫస్ట్, పోట్లాటలో నేనే ఫస్ట్, నాతోటి పిల్లలంతా నన్ను “సీలు రాకాసి అనేవారు”

ఇంటర్ లో కూడా నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను.డిగ్రీ లో జాయిన్ అయ్యాను, నా ప్రవర్తన లో గానీ, నా నడవడిక లో గానీ , నేనెప్పుడూ పక్కక్కు చూడలేదు, కారణం, నాన్నగారు ఎప్పుడూ ఒక్కమాట చెప్తుండేవారు ,

“నిన్ను నా కూతురు గా కన్న నా తల్లిగా భావించాను , నా తల్లి నాకు ఎప్పుడూ తలవంపులు తీసుకురాదు” అనేవారు.

డిగ్రీ మూడో సంవత్సరం మొదలైనప్పటి నుండి అమ్మ , నాన్నమ్మ, ” ఎంత గారాబంగా పెరిగినా ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే అంటూ పదే పదే నాన్నగారికి గుర్తు చేస్తుండే వారు”ఆ మాట విన్నప్పుడల్లా నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అనిపించేది . నేనైతే బాగా ఏడ్చే దాన్ని, అప్పుడు నానమ్మ ఎందుకు తల్లీ ఏడుస్తావు, నేను రాలేదా మీ తాతయ్య పెళ్లి చేసుకుని, మీ అమ్మ కూడా అలాగే వచ్చింది.మా ఇంటి కోడలిగా, నువ్వు కూడా వెళ్ళాలి మరో ఇంటి కోడలిగా అంటూ నన్ను సముదాయించేది.

” ఆడపిల్ల అంటే ఆడ పిల్ల నే”

డిగ్రీ వార్షిక పరీక్షలు .ఆరోజు ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన నేను , మా ఇంట్లో ఉన్న కొత్త ముఖాలను చూసి కొంచెం కంగారు పడ్డాను.

అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి, చీర కట్టుకో మని ఇచ్చింది. చీర కట్టుకున్న తర్వాత అమ్మ నా జడ వేసింది, మెడలో సింపుల్గా చిన్న హారం వేసింది. తీసుకెళ్లి మా ఇంట్లో ఉన్న కొత్త ముఖాల ముందు కూర్చో మన్నది.

“వాళ్లలో ఒక ఆవిడ నన్ను చూసి అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పింది”. అప్పటికిగాని నాకు అర్థం కాలేదు నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని. తర్వాత నన్ను అడిగారు అబ్బాయి నచ్చాడా అని.
“నేను నా మనసులో అబ్బాయా నేను ఎప్పుడు చూశాను అనుకుంటూ తల పైకి ఎత్తాను” వాళ్లలో ఒకతను మాత్రం నన్ను తినేసాలా చూస్తున్నాడు .
చూడడానికి బాగానే ఉన్నాడు. పేరు ఆనంద్ అట. ఆర్మీ జవాన్ అంట.అక్కడి వాళ్లు చెప్తుంటే తలవంచుకొని వింటున్నాను.

అప్పుడు అబ్బాయిని అడిగారు, అమ్మాయితో మాట్లాడతావా అని.తల ఊపినట్టున్నాడు , ఎందుకంటే సౌండు రాలేదు కాబట్టి చెప్తున్నాను మీకు.
నేను అతను పెరటి వైపు కి వెళ్ళాము.” అబ్బో చాలా హైట్ ఉన్నాడు, నవ్వితే ఇంకా బాగున్నాడు,
ఆనంద్: నిత్య నేను నీకు నచ్ఛానా అని అడిగాడు, నాకు ఆడపిల్లల తో మాట్లాడటం రాదు, చిన్నప్పట్నుంచి ఆర్మీలో చేరాలని లక్ష్యంతో చదువుకున్నాను. అందుకే సూటిగా అడుగుతున్నాను అన్నాడు ఆనంద్.

నిత్య: నా మనసులో నేను ఏం మాట్లాడాలో తెలియక ఇష్టమే అన్నట్టు నిలువుగా ఊపాను నా తల.

ఆనంద్ : నోటితో చెప్పొచ్చు కదా అన్నాడు.

నేను నవ్వుకుంటూ లోపలకి వెళ్ళిపోయాను.

ఆనంద్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకుందాము మీకు ఇష్టమైతే అన్నారు నాన్నగారితో,

పంతులు గారిని పిలిపించి తాంబూలాలు పుచ్చుకున్నారు.

పది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. అంతా అనుకున్నట్టుగానే మా పెళ్లి ఘనంగా చేశారు, పది రోజుల తర్వాత.  అప్పగింతలప్పుడు, నేను నాన్న నన్ను వదిలి వెళ్ళను అని బాగా ఏడుస్తుంటే, తప్పు తల్లి అలా ఏడవకూడదు అని సముదాయించి నన్ను అత్తవారింటికి పంపించారు.

అత్తవారింట్లో ఎలా ఉంటారో అని నేను చాలా భయపడ్డాను. కానీ అత్తమామలు, తల్లిదండ్రులు లాగా ఆదరించారు, తోబుట్టువులు లాంటి ఇద్దరు మరుదులు. అన్నింటిని మించిన ఆయన ప్రేమానురాగాలు జీవితాంతం నేను మరువలేను.

ఆనంద్ నాతో ఉన్నది, నెల రోజులు అయినా, జన్మ జన్మల బంధంగా ముడీ పడ్డాయి మా మనసులు. అంతటి ప్రేమను నాకు పంచారు మావారు ఆనంద్.

” నాకు డైరీ రాసే అలవాటు ఉంది” ఆయన విధి నిర్వహణకు వెళ్లేముందు ఏం జరిగిందో డైరీ లో రాస్తున్నాను,చదవకండి, వినండి.

నా డైరీ లో ని మాటలు:

మీరు “అంటే ఆనంద్”

మీ విధి నిర్వహణ కై వెళ్లే రోజు ఏడవ కూడదని నా దగ్గర మాట తీసుకున్నారు. కానీ మీకు తెలియదు “నా గుండె మీద ఎంతో బరువు ఉన్న బండ రాతిని ఉంచిన భావన” , బరువెక్కిన గుండెతో నేను మీకు క్షేమంగా వెళ్లి రండి అంటూ వీడ్కోలు పలికాను.

నేను మనిషిని ఇక్కడే ఉన్నాను భౌతికంగా, కానీ నా మనసు మీతో వచ్చేసింది. ఇంట్లో ఎంతమంది ఎంత బాగా చూసినా కూడా నా మనసుకు సర్ది చెప్పలేక పోయేదాన్ని.

ఏదన్నా శుభకార్యాలకు అత్తమామలతో వెళ్లిన అక్కడున్న జంటలను చూసినప్పుడు నాకెంతో బాధ అనిపించేది, ఈర్ష్యతో కాదు మీరు తోడు లేరని, పైకి నవ్వుతున్న బయటకు చెప్పుకోలేని బాధ. సంతోషం కలిగితే మీకు చెప్పుకోవాలనే ఆశ అడియాశగానే మిగిలేది, కారణం సిగ్నల్స్ లేక ఫోన్ కలిసేది కాదు. అన్నం తినాలంటే మీరు తినిపించే మొదటి ముద్ద గుర్తుకు రాగానే నాకు ఏడుపు తన్నుకు వచ్చేది. కానీ అత్తమామలు ఏమనుకుంటారోనని నాలుగు ముద్దలు తినాల్సి వచ్చేది.

అర్ధరాత్రి వేళలో తుళ్ళి పడి లేచిన వేళ మీరు నా పక్కనే లేరనే తలంపు మరింత బాధ పెట్టేది దానితో వెక్కివెక్కి ఏడ్చే దాన్ని. ఆ సమయంలో మీ గుండెల మీద తలవాల్చి పడుకోవాలని నా ఒంటరి వేదనను మీతో పంచుకోవాలని ఎంతో ఆశ పడేదాన్ని.

ఈ బాధ తో నా పుట్టింటికి వెళ్ళలేక పోయేదాన్ని. కారణం ఎక్కడ అమ్మానాన్నల ముందు నా వేదన బయటపడుతుందో ననే భయంతో.

పండుగలప్పుడు మీతో కలిసి పండుగ జరుపుకునే అదృష్టం నాకు లేదు. నా ఒంటరి వేదన మరింత రెట్టింపయ్యేది. నాకే ఎందుకు ఇలా జరగాలని నామీద నాకే అసహ్యం వేసేది.

రాత్రిళ్లు నిద్ర రాని వేళల్లో మీ షర్ట్ వేసుకొని పడుకునే దాన్ని, కొంచెం అయినా మీరు నాతో ఉన్నారని భావన, అంతేకానీ కోరికతో కాదు సుమా.

అలా అని మిమ్మల్ని నిందించడం లేదు. నాకు దేశభక్తి లేదని కాదు. మీరు దేశ సేవలో ఉన్నారనే ఆ ఒక్క మాట చాలు గుర్తు వస్తే నా బాధంతా పోయి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.

“మీలాంటి వారికి భార్యని అయినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను” ఎవరితో చెప్పుకోవాలో తెలియక నా బాధంతా ఈ డైరీ లో రాస్తున్నాను.

ఇదండీ ఆర్మీ ఉద్యోగాలు చేసేవారి భార్యల అంతర్మధనం ఎవరికీ చెప్పుకోలేని బాధ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!