పింక్ కలర్ ఫైల్

పింక్ కలర్ ఫైల్

రచయిత :: వాడపర్తి వెంకటరమణ

చురుక్కున వెలుగురేఖ ముఖమ్మీద పడేసరికి మెలకువ వచ్చింది అతనికి. బెడ్ మీదనుంచి లేద్దామని ప్రయత్నించాడు.రాత్రి కాస్తా పెగ్గులు ఎక్కువవడంతో తల బాగా పట్టేసినట్లయ్యింది అతనికి.కణతల్లో సన్నని నొప్పి.రెండు కణతలూ బొటనవేళ్ళతో రుద్దుకుంటూ పక్కకు తిరిగి చూశాడు. బెడ్ మీద మోహిని కనిపించలేదు.

‘ఏమైయుంటుందబ్బా…’ అనుకుని బెడ్ మీద నుంచి లేచి,’బహుశా… వాష్ రూంకి వెళ్ళుంటుందేమో’ అని తనకు తాను సమాధానం చెప్పుకుని తనూ వాష్ రూంకి వెళ్ళేందుకు అడుగెయ్యబోయి ఆగిపోయాడు.

అతని దృష్టి బెడ్ పై పడింది. నలిగిన దుప్పటి, చెల్లాచెదురుగా పడివున్న మల్లెపూలు రాత్రి అనుభవించిన సుఖానికి నిదర్శనంగా తనవైపు కొంటెగా చూస్తున్నట్లనిపించింది.అతని పెదవులపై సన్నగా దరహాసపు చిగుళ్ళు మొలిచాయి.చిన్నగా నవ్వుకుని వాష్ రూంలోకి దూరాడు.

కాసేపటి తర్వాత వాష్ రూం నుంచి బయటకు వచ్చిన అతనికి మోహిని ఎక్కడా కనిపించలేదు.తన గెస్ట్ హౌస్ లోని గదులన్నీ వెదికాడు.అయినా ఫలితం శూన్యం.తనకు చెప్పకుండా ఇంత పొద్దున్నే కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా ఎక్కడికెళ్ళుంటుందబ్బా అని ఆలోచించాడు.ఎంత ఆలోచించినా అతని బుర్రకు అర్థం కాలేదు.

ముందురోజు రెస్టారెంట్ లో పరిచయమయ్యింది మోహిని.అప్సరసలను ఆమె అందాన్ని చూసి పిచ్చెక్కిపోయాడతను. మత్తెక్కించే ఆమె కళ్ళు కైపెక్కిస్తుంటే, ఎర్రగా పండిన దొండపళ్ళులాంటి పెదాలు రా రమ్మని పిలుస్తున్నట్లు అనిపించాయి.ఆమె అందానికి దాసోహమైన అతను,ఇక ఆగలేక ఆ రాత్రికి తనతో గడిపేందుకు అమౌంట్ మాట్లాడుకుని తన గెస్ట్ హౌస్ కి రప్పించుకున్నాడు.అయితే పొద్దున్నే తను లేవకముందు మాట్లాడుకున్న అమౌంట్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయిందంటే ఆమె దొంగేమో అన్న అనుమానం కలిగింది అతనికి.

గదులన్నీ వెదికాడు.ఎక్కడున్న ఖరీదైన వస్తువులు అక్కడే ఉన్నాయి.మరైతే ఎందుకలా చెప్పకుండా వెళ్ళినట్లు…?

ఇందులో ఏదో మెలిక ఉందనే నిర్దారణకు వచ్చాడతను.బెడ్ పై కూర్చుని ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కాల ప్రవాహంలో కొన్ని నిమిషాలు కొట్టుకుపోయాయి.

అనుకోకుండా అతని మస్తిష్కంలో ఓ ఫ్లాష్ లాంటి ఆలోచన కలిగింది.అయితే ఆమె వచ్చింది డబ్బు కోసం కాదు, ఇంకా దేనికోసమో ప్లాన్ ప్రకారం వచ్చిందన్న విషయాన్ని అవగతం చేసుకున్నాడు.

అంతే… నిమిషం ఆలోచించకుండా బెడ్ పైనుండి ఒక్క ఉదుటున లేచి ఎక్కుపెట్టి వదిలిన బాణంలా తనకు ఎదురుగా ఉన్న గదిలోకి సర్రున దూసుకుపోయాడతను.

అది తన పర్సనల్ రూం.ఆఫీసుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన ఫైళ్ళు, డాక్యుమెంట్లు ఆ రూంలోనే ఉంటాయి.చకచకా ర్యాకుల్లోవున్న ఫైళ్ళు,సొరుగుల్లోవున్న డాక్యుమెంట్ల ఫోల్డర్స్ అన్నీ అన్నీ వెదికి చూశాడు.అన్నీ సక్రమంగానే ఉన్నాయి… ఒక్క పింక్ కలర్ ఫైల్ తప్ప.

అంతే ఒక్కసారిగా మొదలు నరికిన మహా వృక్షంలా కూలబడిపోయాడతను. అతని పేరు సుధీర్ వర్మ.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామి అయిన ‘భువి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అధిపతి.వ్యాపార సామ్రాజ్యంలో వెల్ నోటెడ్ పర్సన్.

******

“రేయ్ ఏంట్రా బాబు… లంకణాలు చేసినవాడిలా అలా అయిపోయావు!” ఇంట్లోకొస్తూనే అడిగాడు తన చిరకాల మిత్రుడు నవచరణ్.

“అదేం లేదురా.కాస్త పనుల వత్తిడి వలన…”అన్యమనస్కంగా సమాధానం చెప్పాడు సుధీర్ వర్మ.

“వత్తిడా… అయితే అది తగ్గాలంటే అర్జంటుగా బారుకెళ్ళి బీరు పొంగించాల్సిందే…!”

“ఇప్పుడొద్దురా…నా మూడేం బాగోలేదు”

“సరే…నీ మూడ్ మారాలంటే మూవీకెళ్దాం.రంభా థియేటర్ లో రీసెంటుగా ‘పింక్’ మూవీ వచ్చింది.బాగుందని టాక్.ఛలో…”

మిత్రుని నోటివెంట ‘పింక్’ మాట వినగానే సర్రున చూశాడు సుధీర్ వర్మ మిత్రుని ముఖంలోకి.

మిత్రుని ముఖంలో ఏ భావమూ కనపడలేదు.

ఈరోజు సబ్మిట్ చేయాల్సిన పింక్ కలర్ టెండర్ ఫైల్ తస్కరింపబడిందని, ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసిన ప్రెస్టీజియస్ కొటేషన్ కి సంబంధించిన ఆ ఫైల్,తన పరువు రెండూ స్త్రీ వ్యామోహం వలన కొట్టుకుపోయిందని ఎలా చెప్పగలడు.

“నాకీరోజు అర్జంట్ మీటింగు ఉందిరా!”ఏం చెప్పాలో తెలియక మిత్రునితో చెప్పాడు సుధీర్ వర్మ.

“సరేలే…అబద్ధమాడితే అతికినట్లుండాలి.నీ నీరసానికి,డీలాతనానికి ‘పింక్’ కలర్ ఫైలే కారణమనుకుంటాను…”మిత్రుని పరిస్థితి చూశాక ఇంకా బాధపెట్టాలనిపించలేదు నవచరణ్ కి.

“అవున్రా… నీకెలా తెలుసు!” సంభ్రమాశ్చర్యంగా మిత్రుని భుజాలుపట్టి కుదిపేస్తూ అడిగాడు సుధీర్ వర్మ.

“నువ్వు కంగారుపడి, నన్ను కంగారుపెట్టకు.ఆ పింక్ కలర్ ఫైల్ నా దగ్గర సేఫ్ గా ఉంది.పద…నువ్వు ఫ్రెష్ అయితే ఇద్దరం కలిసి టెండర్ ఫైల్ సబ్మిట్ చేసి వద్దాం!”మిత్రున్ని తొందరపెట్టాడు నవచరణ్.

మిత్రుని మాటలువిన్న సుధీర్ వర్మ కళ్ళల్లో కోటి కాంతుల విద్యుద్దీపాలు వెలిగాయి.ఒక్కసారిగా శరీరమంతా సత్తువ సర్రున పాకినట్లనిపించింది.

అయితే మోహిని పట్టుకుపోయిందనుకున్న ఆ ఫైల్ తన మిత్రుడి చేతికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అతనికి.ఆ విషయమే మిత్రుడిని అడిగాడు సుధీర్ వర్మ.

“బిజినెస్ పరంగా నీ తర్వాత స్థానంలోవున్న చెంగల్రాయుడు నిన్ను ఎలాగైనా తొక్కి నీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ వేశాడు.నువ్వు స్త్రీ లోలుడువని తెలుసుకుని,ఆ టెండర్ ఫైల్ కోసం మోహినిని ఎరగా వేశాడు.ఆ గాలానికి నువ్వు చిక్కావు. అయితే మీ ఆఫీసులో మార్కెటింగ్ సెక్షనులో పనిచేసే మధు అనే కుర్రాడు మోహినిని చెంగల్రాయుడు పక్కన చాలాసార్లు చూడడంతో, నిన్న మోహిని నీతో గెస్ట్ హౌస్ కి వెళ్ళడం చూసి ఏదో అనుమానమొచ్చి నాకు ఫోనుచేసి విషయమంతా చెప్పాడు.నువ్వేదో ట్రాప్ లో ఇరుక్కున్నావన్న విషయం అర్థమయ్యి వెంటనే కారులో గెస్ట్ హౌస్ కి బయలుదేరాను.

నేను గెస్ట్ హౌస్ కి చేరుకునే సమయానికి లోపలినుంచి ఆ చీకట్లో ఓ స్త్రీ ఆకారం చేతిలో ఏదో పట్టుకుని గబగబా ఆటో ఎక్కడం గమనించాను.ఆమె ఎక్కిన మరుక్షణం సర్రున దూసుకుపోయింది ఆటో. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఆటోను కారులో ఫాలో అయ్యాను.

నగర శివారులో ఓ బిల్డింగు ముందు ఆమెను దింపి వెళ్ళిపోయింది ఆటో.ఆమె బిల్డింగు లోపలకు వెళ్ళేంతవరకు వెయిట్ చేసి,ఆమె వెనుకే ఫాలో అయ్యాను.ఆమె గది తలుపు తీయగానే ఒక్క ఉదుటున లోపలికి చొరబడి లోపల్నుండి తలుపు గడియ పెట్టేసాను.నన్నుచూసి భయంతో స్థానువులా అయిపోయింది ఆమె.

ఆమెని కాస్తా భయపెట్టి పోలీసులకు అప్పగిస్తానని బెదిరించేసరికి చెంగల్రాయుడి ప్లానంతా పూర్తిగా చెప్పేసి, తనని తనని పోలీసులకు అప్పగించొద్దని వేడుకుని చేతిలో పింక్ కలర్ టెండర్ ఫైల్ పెట్టేసింది నీ అతిలోక సుందరి… మోహిని!”నవ్వుతూ నిన్న జరిగిన సంఘటన పూసగుచ్చినట్లు వివరించాడు నవచరణ్.

తన పరువును, టెండర్ ఫైల్ ను రెంటినీ కాపాడిన మిత్రుడ్ని అభినందించకుండా ఉండలేకపోయాడు సుధీర్ వర్మ.

కాసేపటి తర్వాత మిత్రులిద్దరూ కలిసి బయలుదేరారు… టెండర్ ఫైల్ దాఖలు చేయడానికి.

***

You May Also Like

One thought on “పింక్ కలర్ ఫైల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!