పెద్ద టాటా
రచయిత:మంగు కృష్ణకుమారి
శివ లిఖిత చాలా హుషారయిన పాప. తమ ఇంటికీ తాతగారింటికీ బాగా దగ్గర. తల్లి తండ్రి వెంకట్ దగ్గర బాగా చేరిక. ‘తాతా, తాతా’ అంటూ ఒక క్షణం వదలదు వెంకట్ కి లిఖిత అంటే ప్రాణం. దానికి కావలసినవి కొని దానితో సమానంగా ఆడుతూ, దానిచేత జుత్తు పీకించుకొని ఆనంద పడతాడు.
అలాటిది సడెన్ గా వెంకట్ కి హార్ట్ ఎటాక్ వచ్చింది. కింద పడగానే భార్య భారతి పెద్ద పెద్ద కేకలు పెట్టింది. ఇరుగూ పొరుగూ వచ్చి వెంకట్ కి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మొదలెట్టేరు. అల్లుడు, కూతురు వచ్చి కార్ లో తీసుకెళ్ళి హాస్పిటల్ లో ఎమర్జెన్సీ లో జాయిన్ చేసేసారు. రాత్రంతా బాధపడి వెంకట్ ప్రాణాలు వదిలేసాడు. భారతిని కూతురు స్వాతినీ ఎవరూ పట్టలేకపోతున్నారు. రావలసిన వాళ్ళందరూ ఫ్లైట్ కి వచ్చేసారు. శివలిఖితని తేలేదు భయపడుతుందని. జరగాల్సినవి జరిగిపోయేయి.
ఇంట్లోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు అందరిచేతా దండం పెట్టించాలి. స్వాతి అత్తగారు “పిల్లకి ఎలాగోలా మభ్యపెడదాం.తప్పదర్రా” అంటూ కార్యక్రమాలు అవుతున్న దగ్గరకి
తీసుకొచ్చింది. జనాలు చాలామంది ఉన్నారు. పెద్ద కుర్చీ మీద మంచి పట్టుచీర వేసి దానిమీద వెంకట్ ఫొటో ఉంచి మెళ్ళో గులాబీలు మల్లెల మాల వేసేరు. అక్కడ ఊదొత్తులు వెలుగుతున్నాయి. అందరూ ఒక్కో గులాబీ వేస్తున్నారు.
శివలిఖిత నాయనమ్మ చేతుల్లోంచి దిగింది. నిశ్శబ్దంగా ఓ గులాబీ చేత్తో తీసుకొని వెంకట్ ఫొటో దగ్గర పెట్టింది. “తాతా, తీసుకో గులాబీ నీకే. నీకు అమ్మమ్మ చూడకుండా ఐస్ క్రీమ్ తెస్తాగా… తిందూగానిలే” అంటూ పరిగెత్తింది.
దాని స్నేహితురాలికి “మా తాత పెద్ద టాటా వెళ్ళేడు. ఇప్పుడే రాడు” అంటూ ఎంతో తెలిసిన దానిలా చెప్పింది. అందరూ దాని గ్రహింపుకి చాలా ఆశ్చర్యపోయేరు.
చాలా బాగుందామ్మా! 👌👌👌😊🌹🌹