ఆచార్య నేమాని కృష్ణమూర్తి గారు

ఆచార్య నేమాని కృష్ణమూర్తి గారు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

నా జీవితానికి దశా, దిశా నేర్పి ఉన్నతికి కారణమైన అతి ముఖ్యమైన వ్యక్తులతో “ఆచార్య నేమాని కృష్ణమూర్తి గారు మొదటి వారు” అని చెప్పవచ్చు. సుమారు నలబై ఏడేళ్ళ క్రిందట నేను ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో చేరినపుడు మొట్టమొదట డిపార్ట్మెంట్ లో వారిని కలవడం జరిగింది. అప్పటి వరకు మేము డిగ్రీ తెలుగు మీడియంలో చదివాము. ఎం.ఎస్.సి.కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం. పల్లెటూరి నుంచి విశాఖపట్నం రావడం నాకు భయం. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళతో పోటీ పడలేనేమో అనిపించింది. మా మామయ్య కృష్ణమూర్తి గారు విజయనగరంలో బాల్య స్నేహితులు. మామయ్య కలవమని చెబితే ఆయన్ని కలవడం. తండ్రిలా మంచి చెడ్డ కనుక్కుని భయం లేదు తప్పక నిరంతర సాధన చేస్తే సాధించలేనిది ఉండదని చెప్పడం. ఆయనే తన దగ్గర పుస్తకాలను నా కివ్వడం
వారి శ్రీమతి ఆచార్య రుక్మిణి గారు కూడా కెమిస్ట్రీ విభాగంలోనే ఉండడం. తల్లిలా తెలియని విషయాలను చెప్పడం నిజంగా వారిద్దరు ఆదర్శదంపతులే. కృష్ణమూర్తి గారి దగ్గర సుమారు నలభై మంది పరిశోధనలు చేసి దేశ విదేశాలకు వెళ్ళడం వారికి అన్ని విషయాలలో సహాయం చేయడం గొప్పవిషయం. ఆచార్య కృష్ణమూర్తి గారు శాస్త్రవేత్తగా, పరిశోధకునిగా, ఉత్తమ అధ్యాపకునిగా, అనేక ప్రభుత్వసంస్థలలో శాస్త్రీయ సలహాదారునిగా పురస్కారాలను అందుకున్న విద్యావేత్త. రెండవ దృక్కోణంలో వారు దేశంలోనే ప్రముఖ చిత్రకారునిగా స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్, పి.వి నరసింహారావు, మురార్జీ దేశాయ్, రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి గిరి, జాకీర్ హుస్సేన్ అలాగే ముఖ్యమంత్రిలు నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చంద్రబాబునాయుడు, జలగం వెంగళ రావు,  నందమూరి తారక రామారావు, రాజశేఖర్ రెడ్డిల నుంచి సత్కారాలను అందుకున్న చిత్రకారులు.
చిత్ర లేఖనంలో అంట్యాకుల పైడిరాజు వీరికి గురువు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీలో
సుమారు అందరి శాస్త్రవేత్తల, ఉపకులపతుల చిత్రాలు మాష్టారు వేసిన తైల వర్ణచిత్రాలే. సంస్కృత, తెలుగు సాహిత్యం అవపోశన పట్టిన సరస్వతీ పుత్రులు. ఆయన అడుగుజాడల్లో నడచి ఉన్నతి స్థితికి చేరడం నా పూర్వ జన్మ సుకృతం.
నా పదవీ విరమణ నాడు ఎనభై ఏళ్ళ వయస్సుదాటిన నన్ను ఆశీర్వదించి సత్కరించటం
పదేళ్ళ క్రిందట నేను ఇప్పటికీ మరచి పోలేను. ప్రస్తుతం ధర్మపత్నీ ఎడబాటుతో తొంభై ఏళ్ళ వయస్సులో కొడుకుల దగ్గర ఉన్న మా కృష్ణమూర్తి మాష్టారు నా జీవిత సాఫల్యతకు స్ఫూర్తి ప్రదాతయే..!
“జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాకృతిమ్
ఆధారం సర్వ విజ్ఞానం
హాయగ్రీవముపాస్మహే..!!”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!