అనుకోని అతిథి

అనుకోని అతిథి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కందర్ప మూర్తి

అగ్రహారం బ్రాహ్మణ కుటుంబాలు, చేతి వృత్తులు, వ్యవసాయ రైతన్నలతో సందడిగా కనబడేది. గ్రామం చుట్టూ పచ్చని వ్యవసాయ భూములు  ఫల పుష్ప తోటలతో ప్రకృతి పారవస్యంగా కనబడేది. నిరక్షరాస్యులైన అమాయక జనాలు, వ్యవసాయ కూలీలు కమ్మరి , చాకలి, మంగలి, వంటి  కుల  వృత్తుల వారు  కష్టం చేసుకుంటూ దొరికిన దానితో జీవనం సాగించేవారు. కులాల వారిగా బ్రహ్మణ వీధి కాపు వీధి చాకలి పేట, మాలపేటగా విభజింపబడి అన్యోన్యంగా  రోజులు గడిపే వారు.  బ్రాహ్మణ వీధి ఉదయం రాత్రి  పండితుల  వేదఘోషతో  పూజలు వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో  కళకళలాడేది. మహరాజులు ఇచ్చిన మాన్యాలతో భుక్తికి  కరువు లేకుండా  దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసేవారు. ఊరి ప్రజలు కూడా దైవ చింతనతో గౌరవ మర్యాదలతో  మెలిగే వారు, వాతావరణం అనుకూలించి సమయాను కూలంగా వర్షాలు కురిసి పాడిపంటలకు కొదవ ఉండేది కాదు. మనుషులు ప్రశాంత వాతావరణంలో  రోజులు గడిపేవారు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు అగ్రహారం స్వరూపమే మారిపోయింది. అగ్రహారపు భూములు మాన్యాలు  కనుమరుగైపోయాయి.
వాతావరణం అనుకూలించక  సమయానికి  వర్షాలు లేక  చెరువులు కాలువలు నీరులేక  ఎండి పంటలు  పండటం లేదు. గ్రామం చుట్టూ ఉండే ఫలసాయ భూములు ఫల వృక్షాల తోటలు బీడు భూములుగా మారి పట్నం నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ యజమానుల వశమై ప్లాట్లుగా  మారేయి. గ్రామంలో ప్రజలకు జీవనోపాధి కరువై కుల వృత్తుల వారు ఎవరికి తోచిన విధంగా వారు  పట్నాలకు  ఇతర  స్థలాలకు వలస పోయారు. బ్రాహ్మణ కుటుంబాలు  కూడా ఊళ్లో జరుగు బాటు లేక ఎక్కడ భుక్తికి దొరికితే  అక్కడకు కుటుంబాలతో వెళిపోయారు.
పూర్వపు  ఆధ్యాత్మిక వాతావరణం వేదనాధాలు నిశ్శబ్ధమై పోయాయి. ఎప్పుడూ పూజలు వ్రతాలు గాయత్రీ మంత్రాలతో  కళకళ లాడిన భవంతులు శిధిలాలుగా కనబడుతున్నాయి. మరో ఆధారం లేని నామ మాత్రపు బ్రాహ్మణ కుటుంబాలు ఊరిని నమ్ముకుని భూకామందులు, పట్నం నుంచి వచ్చిన వ్యాపారస్థులు , వైశ్యులు వంటి  ధనిక వర్గాల  మీద ఆధారపడి రోజులు వెళ్లదీస్తున్నారు. అటువంటి బ్రాహ్మణ కుటుంబాలలో ఊరి పురోహితులు రామశాస్త్రి గారు ఒకరు. తాత తండ్రుల కాలంలో ఎంతో గౌరవ మర్యాదలతో బ్రతికిన వారి కుటుంబం ఇప్పుడు భుక్తికి అల్లాడుతున్నారు. ఊరి పురోహితమే ఆధారం. తండ్రి మిగిల్చిన పాత పెంకుటిల్లు భార్య సుమతి, పెళ్లీడు కొచ్చిన కూతురు శారద, విధవ ముసలి తల్లి  అన్నపూర్ణమ్మతో  కాలక్షేపం  చేస్తున్నారు..
పూర్వం పెద్దల సమయంలా యజ్ఞ యాగాదులు చేయించుకునే వారు కరువయారు. బ్రాహ్మణులంటే చిన్న చూపు చూస్తున్నారు. ఊరి పురోహితంతో భుక్తికి గడుస్తున్నా రూపాయి వెనకేసింది లేదు రామశాస్త్రి. పెళ్లీడు కొచ్చిన మనవరాలికి  నేనుండగా పెళ్లి చెయ్యరా అని తల్లి పోరు పెడుతుంటే, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి
చెయ్యాలంటే మాటలా, కట్నకానుకలు పెళ్లి ఖర్చులు విడిది ఏర్పాట్లకి  ఎక్కడి నుంచి తెచ్చేదని వాపోయే వారు. ఆ విషయం అన్నపూర్ణమ్మకు తెలిసినా అలా  ప్రోద్బలం  లేకపోతే  ఆ విషయమే ఆలోచించండని  నశ  పెడుతూంటుంది. తన పెళ్లి గురించి నాన్న నానమ్మ అనుకునే మాటలు వింటుంటే శారద మనసులో కుమిలిపోయేది. సుమతికి  కూతురి పెళ్లి విషయం బాధ ఉన్నా బయటకు  కనబర్చేది  కాదు.
శారద పెళ్లి విషయమై  ఉదయమే  చర్చించు కుంటున్న సమయంలో ధాన్యం మిల్లు సుబ్బరాజు గారు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారని కబురు వచ్చింది రామశాస్త్రి గారికి. ఏదో శుభకార్యం ఉండి ఉంటుందని పంచాంగం తీసుకుని గుమ్మం దాటి వీధిలో కొచ్చారు. ఇంతలో ఇంటి గుమ్మం ముందు ఆటో వచ్చి ఆగింది. ఒక మధ్య వయసు వ్యక్తి  చక్కని వేషధారణతో ఆటోలోంచి దిగి” మీరు విష్ణు శాస్త్రి గారి అబ్బాయి రామశాస్త్రి కదూ” అన్నారు.
గుమ్మం ముందు నిలబడి తన పేరును అడుగుతున్న వ్యక్తిని చూసి ఎవరా అని సంగ్దంలో ఆశ్చర్యానికి గురయాడు. మీరు ఎటో పని మీద వెల్తున్నట్టున్నారు. కాస్త సమయం కేటాయించగలరా అన్నారు వినయంగా ఆ వచ్చిన వ్యక్తి. ఎవరో ముహూర్తం అడగడానికి వచ్చుండ వచ్చని’సరే’నని ఆ వ్యక్తిని  ఇంటి వసారాలో ఉన్న కర్ర కుర్చీ మీద కూర్చోబెట్టి విషయం అడిగారు  మామూలుగా. ఇంట్లో ఆడవాళ్లు కూడా అలాంటి బాపతై ఉంటుందని వారి మీద ధ్యానం పెట్ట లేదు. ఆ వచ్చిన వ్యక్తి తనని తాను పరిచయం చేసుకుంటూ, తన పేరు సుబ్బారావని, హైస్కూలు హెడ్మాస్టరుగా రిటైరై పట్నంలో ఉంటున్నట్టు  తను  మొదటిగా  అగ్రహారం ఎలిమెంటరి స్కూల్ టీచరుగా ఉధ్యోగం చేసేవాడినని తర్వాత ప్రమోషన్ మీద పట్నానికి బదిలీ అయి అక్కడే సర్వీసంతా పూర్తయి హెడ్మాస్టరుగా పదవీ విరమణ చేసి స్వంత ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఉంటున్నట్టు చెప్పారు. తనకి కూతురు కొడుకు సంతానమని, కూతురికి పెళ్లయి హైదరాబాదులో ఉంటున్నట్టు, కొడుకు  పేరు శ్రీకాంత్ అని బి.టెక్. ఇంజనీరింగ్ చేసి పట్నంలో గవర్నమెంట్ ఉధ్యోగం చేస్తున్నట్టు అబ్బాయికి సాంప్రదాయమైన కుటుంబం లోని అమ్మాయి ఉండాలని పెళ్లికి ప్రయత్నిస్తుండగా  మీ బంధువొకరు  అగ్రహారం  పురోహితులు రామశాస్త్రి గారి అమ్మాయి పెళ్లికుందని వివరాలు తెలియ చేయగా ఇలా వచ్చినట్టు  వచ్చిన విషయం చెప్పారు సుబ్బారావు.
తను కుటుంబంతో అగ్రహారంలో ఉన్నప్పుడు ఏ శుభకార్యమైనా పూజలైనా మీ నాన్నగారు విష్ణు శాస్త్రి గారి చేతుల మీదే జరిగేవని అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తూండే వాడిననీ అప్పుడు మీరు వేదం నేర్చుకోడానికి వేరే చోట  ఉన్నట్టు తెల్సింది. అప్పటికి ఇప్పటికీ ఆగ్రహారం ఊరు చాలా మారిందని అప్పటి వైభవం ఎక్కడా కనిపించడం లేదని తను ఉధ్యోగ భాద్యతల ఒత్తిడితో అగ్రహారం వైపు వచ్చే అవకాశం లేకపోయిందని చెబుతూ అన్నపూర్ణమ్మ  ప్రస్థవన తేగా ఆవిడ  ఇంట్లోనే  ఉన్నారని చెప్పి తల్లిని కేకేసాడు. కొడుకు పిలుపు విని ఎందుకోనని అన్నపూర్ణమ్మ చెయ్యి తుడుచుకుంటు బయటకు వచ్చి చూడగా కొడుకుతో పాటు ఉన్న అపరిచిత వ్యక్తి ని చూసి తెలిసిన ముఖంలా అనిపించింది.
అన్నపూర్ణమ్మను చూగగానే సుబ్బారావు గారు గుర్తు పట్టినట్టు ‘బాగున్నారా బామ్మ గారూ ‘అని పలకరించి తను టీచర్గా ఉధ్యోగం చేసేటప్పుడు  విష్ణు శాస్త్రి  గారి కోసం  ఇంటికి వచ్చే వాడినని గతం గుర్తుకు తేగానే  ‘నువ్వా బాబూ గుర్తు పట్టలేక పోయానని చెబుతు సుబ్బారావుగారి కుటుంబక్షేమ సమాచారం అడిగి తెల్సుకుంది. విషయం తెల్సుకున్న సుమతి  చెంబుతో మంచి నీళ్లు రెండు కప్పులతో వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. రామశాస్త్రి గారు భార్యను పరిచయం చేసారు. అన్నపూర్ణమ్మ అక్కడ స్టూలు మీద కూర్చుంది. కాఫీ తాగడమైన తర్వాత సుబ్బారావు గారు తను వచ్చిన పని చెబుతూ మీలాంటి సాంప్రదాయ కుటుంబం లోని పిల్లని కోడలుగా తెచ్చుకోవాలనే ఉద్ధేశంతో అమ్మాయిల వెతుకులాటలో మీ మనవరాలు పెళ్ళి కుందని తెల్సిఆ ప్రయత్నంలో అగ్రహారం వచ్చినట్టు విషయం తెలియచేసాడు. ఈరోజు  ఉదయమే కొడుకుతో శారద పెళ్లి ప్రస్థావన రావడం, అనుకోని  తీగ కాలికి  తగిలినట్టు  ఇదేదో శుభ సూచకంగా అనుకుంది అన్నపూర్ణమ్మ.దేవుడి దయ ఉంటే  ఈ ప్రయత్నం సఫలం కావచ్చు అనుకుంది మనసులో శారద హైస్కూలు పదవ క్లాసు పాసయిందని కుట్లు అల్లికలతో పాటు వంట వార్పూ అన్నీ చక్కగా చేస్తుందని మనుమరాలికి కితాబిచ్చింది. ముందే రామశాస్త్రి గారి అమ్మాయి శారద వివరాలు తెలుసుకుని వచ్చిన సుబ్బారావు గారు మరొకసారి సంగతులు అడిగి అమ్మాయి జాతకం ఇస్తే  జ్యోతిష్యుడికి చూపించి ముందుకు వెళ్లొచ్చని చెప్పారు. అలాగే పనిలో పనిగా అమ్మాయిని కూడా చూస్తే మనసుకి ఊరటగా ఉంటుందని సుబ్బారావు చెప్పగానే అన్నపూర్ణమ్మ అలాగే బాబూ అమ్మాయిని చూసే వెళ్లండని చెప్పి , శారదని తయారు చేసి తీసుకు రమ్మని చెబుతూండగా ఆయన కలగ చేసుకుని అమ్మాయిని అలాగే చూపించండి చాలు అన్నారు.
ఆయన మాట కాదనలేక శారదని అలాగే బయటకు పిలిచారు. శారద సాదా చీరలో గుమ్మం దగ్గరకొచ్చి సుబ్బారావుకి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది. కుందన బొమ్మలా తెల్లగా గుండ్రటి ముఖం బారెడు జడతో వినయంగా కనిపించిన శారదని చూసి శివరాంకి తగిన జోడీ అనుకున్నారు సుబ్బారావు మనసులో రామశాస్త్రి ఇంట్లో కెళ్లి పెట్టెలోంచి శారద జాతకంతో పాటు మిగతా వివరాలు కాగితం మీద రాసిచ్చారు. సుబ్బారావు గారు జాతక పత్రాలు తీసుకుని ఆటో ఎక్కుతు అమ్మాయి అబ్బాయి జాతకాలు జ్యోతిషుడికి చూపించి విషయాలు తెలియ చేస్తానన్నారు, రామశాస్త్రి  అన్నపూర్ణమ్మ ఆటోవరకు వచ్చి సాగనంపేరు. ఒకవేళ ఈ సంబంధం ఖాయమైనా ధాన్యం మిల్లు సుబ్బరాజు, తోటల వ్యాపారి అప్పల నాయుడు, కోళ్లఫారం యజమాని సూర్యారావు గారిని పెళ్లికి ధన సహాయం అడిగితేనే కాని పని జరగదు. ముందు సుబ్బరాజు ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవాలని వీధిలోకి బయలు దేరారు. వారం తర్వాత సుబ్బారావు రామశాస్త్రి గారికి సమాచారం తెలియచేస్తు అబ్బాయి  అమ్మాయి జాతకాలు  అన్ని విధాల సరిపోయాయని వయసులో కూడా పెద్ద  తేడాలేదని  మంచిరోజు  చూసి  నేను, నా శ్రీమతి అబ్బాయిని వెంటబెట్టుకుని అగ్రహారం వచ్చి సంబంధం ఖాయం  చేసుకుని  పెళ్లి సుమూర్తం నిశ్చయించుకో వచ్చని ఎటువంటి కట్న కానుకలు  మరే లాంఛనాలు అవుసరం లేదని పెళ్లి నిరాడంబరంగా జరిపి పీటల మీద కూర్చొని మీ దంపతులు కన్యాదానం చేస్తే చాలని చల్లని కబురు పంపేరు. ఇటువంటి ఉదార హృదయులు ఈ రోజుల్లో ఉన్నారా అని ఆశ్చర్యపోవడం రామశాస్త్రి అన్నపూర్ణమ్మ ల వంతయింది. అనుకున్న శుభ ముహూర్తాన బాల గణపతి ఆలయంలో నిరాడంబరంగా శారద శివరామ్ ల  పెళ్లి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. పెళ్లి కొచ్చిన వారందరు ఈడుజోడు వారందరు ఈడు జోడు బాగుందని ఆశీర్వాదాలందించారు. అగ్రహారం ఊళ్లో  పురోహితులు రామశాస్త్రి గారి కున్న ఆదరణ కారణంగా ఊరి పెద్దలు మోతుబరులు ధన వస్తు సహాయంతో శారద పెళ్లి జయప్రదంగా చెయ్య గలిగారు. అందుకే అంటారు పెద్దలు , ‘కల్యాణ ఘడియ వచ్చినా కక్కు వచ్చినా ఆగదని.’
“భువిలో రాస్తాడట బ్రహ్మ- దివిలో ఎవరు ఎవరితో కళ్యాణం జరపాలోనని.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!