ట్యూషన్కు వెళ్ళను

ట్యూషన్కు వెళ్ళను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

   వినోద్ రోజూ ట్యూషనుకు వెళ్లను అంటూ మొండికేయడం రామారావుకు కోపం తెప్పిస్తూ ఉంది. వాడు చెప్పిన మాట వినే రకంకాదు అని అభిప్రాయాలూ నిలబడ్డాయి. తోటి ఉపాధ్యాయమిత్రుడు అయిన సుధాకర్ దగ్గరనే వినోద్ ను ప్రయివేటులో చేర్పించాడు. కొన్ని నెలలు సవ్యంగానే వెళ్లిన కొడుకు పరీక్షలు దగ్గర పడే సమయంలో ఇక వెళ్ళనని మొండికేయడం బాగా కోపం తెప్పిస్తుంది రామారావుకు. పైగా సుధాకర్ బజారులో కనిపించి, “మీ వాడు ప్రవేటు డుమ్మా నోయ్ !”అని నవ్వడంతో తల కొట్టేసినట్టు అయింది. అసలే పదో తరగతి లెక్కలు, ఇంగ్లీష్ గట్టిగా చదవడం ముఖ్యం కదా. ఆ సంగతి అడిగితే, ” నేను ఇంట్లో నే బాగా చదువుతా నాన్నా!”అన్నాడు వినోద్. నువ్వు చదివే రకం కాదులే. తిని నిద్రపోయే రకం !” విసుగొచ్చేసింది రామారావుకి. కొడుకుతో మాటలు మానేసాడు. పరీక్షలు అయ్యాయి. ఫలితాల్లో వినోద్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినాడు. సుధాకర్ దగ్గర పిల్లలు రెండో, మూడో స్థానాల్లో వచ్చారు. సంతోషం తో వినోద్ను మెచ్చుకుంటున్న రామారావు తన సందేహం వినోద్ కు చెప్పాడు. ట్యూషన్ ఎందుకు వద్దు అన్నావ్ అని.
అక్కడ వాళ్ళు ఇంట్లో పనులను చేయిస్తూ, బజారుకు సరుకులకు పంపడం, చెట్లకు నీళ్లు పోయించడం, వాళ్ళ పాప ను ఆడించే పని చెప్పేవారని. అది నచ్చకనే మానేశానని చెప్పాడు వినోద్. మరి ఆ మాట చెప్పొచ్చుగా ! మొదటి లోనే.”అంటున్న తండ్రిని చూసి. సుధాకర్ సార్ తో మీకు మంచి స్నేహం కదా నాన్నగారు. చెప్పి మీ స్నేహం పాడుచేయడం నేను భరించలేను!నెమ్మదిగా అంటున్న వినోద్ లో తన తండ్రి కనిపించాడు రామారావుకి. మీకు చెప్తే కోపం వస్తుంది అని చెప్పలేదు నాన్న. అది కూడా మన మంచికే అయింది కదా “అన్నాడు వినోద్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!