యుక్తి

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

యుక్తి

రచయిత :: అనురాధ మురుగము బూజుల

ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫణి,యోగి, సుబ్బు అనే స్నేహితులు ఎనిమిదవ తరగతి చదివేవారు, ఆ స్కూల్ వసతి గృహంలోనే వుండేవారు, ముగ్గురూ చదువులో ముందు వుండేవారు. అంతేకాకుండా, ఆట, పాటల్లోనే కాకుండా అన్నిటిలోనూ ఆ స్నేహితుల ముద్ర వుండేది.

స్కూల్లో టీచర్స్ కి వీళ్లంటే కొంచెం ఆదరాభిమానాలు కొంచెం ఎక్కువే, స్కూల్ లోనే కాకుండా పక్క ఊర్లల్లో కూడా పోటీల్లో పాల్గొని విజేతలు అయ్యేవారు.

ఒక రోజు తెల్లవారుజామున లేచి టైం చూసాడు సుబ్బు, నాలుగు అవుతుండగా చదువుకోవాలని ఫణి, యోగిని కూడా లేపాడు, ఇద్దరూ లేవలేదు, యోగి అయితే అటువైపు తిరిగి పడుకున్నాడు. చేసేది లేక ఒక్కడే లేచి కాస్త దూరంగా వున్న చెట్టు కిందికి వెళ్లి కూర్చొని చదువుకుంటున్నాడు.

కాసేపటికి మెల్లగా గజ్జెల శబ్దం వినిపించింది సుబ్బుకి, మొదట్లో పట్టించుకోలేదు, చదువుకుంటూ వున్నాడు. ఆ గజ్జెల శబ్దం తన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది, భయం వేసి పరిగెత్తుకుంటూ రూంలోకి పరిగెత్తాడు, ఆశబ్దం దగ్గరికి వచ్చి కాసేపు ఆగి మళ్ళీ వెళుతున్నట్టు అనిపించి దుప్పట్లో దూరి కళ్ళు మూసుకున్నాడు.

సాయంత్రం ఆడుకుంటుండగా యోగికి చెప్పాడు సుబ్బు, సుబ్బు విని ఎగతాళి చేసాడు. మరుసటి రోజు మెలకువ వచ్చింది సుబ్బుకి, లేచి చదువుకోవటానికి బయటికి వెళ్లకుండా, రూంలో లైట్ వేసుకొని చదువుకుంటున్నాడు.

రేయ్ సుబ్బు, బయటికి పోయి, చదువుకో అన్నాడు ఫణి, ఫ్రెండ్ ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రూమ్ బయట కూర్చొని చదువుకుంటున్నాడు కానీ, ధ్యాస అంతా గజ్జెల శబ్దం మీద వుంది, కాసేపటికి ఆ శబ్దం వినపడింది, మెల్లగా అడుగులు వేసుకుంటూ గేట్ దాక వచ్చి చూసాడు. అంతా చీకటిగా వుంది ఏమి కనిపించడం లేదు సుబ్బుకి, భయంతో ఎలా రూంలోకి వచ్చి పడ్డాడో కూడా తెలియలేదు.

స్కూల్ కి లేట్ అవుతున్నా సుబ్బు లేవకపోయేసరికి, ఫణి దుప్పటి తీసి చూసాడు, సుబ్బుకి జ్వరం వస్తోంది. వార్డెన్ కి చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లారు, ఫణి….. యోగి.

సాయంత్రం కు కాస్త కోలుకున్నాడు సుబ్బు. యోగి నవ్వుతూ గజ్జెల శబ్దం విని వీడికి జ్వరం వచ్చింది, అని నవ్వాడు. ఫణి విని సుబ్బు దగ్గరికి వెళ్లి ఎప్పుడు విన్నావు? నాకు ఎందుకు చెప్పలేదని అని అడిగాడు.

యోగికి చెప్పాను, ఇప్పుడు నవ్వినట్టే నవ్వాడు, నువ్వు కూడా….. అని నీళ్లు నమిలాడు సుబ్బు.

సుబ్బు చెప్పింది విని, సరే రేపు నేను కూడా నిద్ర లేస్తాను, చూద్దాం లే అన్నాడు ఫణి.

తెల్లవారుజామున ముగ్గురు నిద్ర లేచి మేల్కొని రూంలోనే కూర్చున్నారు. సుబ్బు చెప్పినట్టే, గజ్జెల శబ్దం బాగా వినిపిస్తోంది, వాళ్ళ రూమ్ దాక వచ్చి ఆగింది, ఫణి ధైర్యం చేసి, కిటికీ దగ్గరకు వెళ్లి చూసాడు, ఒక తెల్ల గుడ్డ ఎగురుతూ కనిపించింది, యోగి ఫణి చేతిని గట్టిగా పట్టుకున్నాడు, ఆ తెల్ల గుడ్డతో పాటి గజ్జెల శబ్దం కూడా కనిపించడం, వినిపించడం దూరం అవ్వడంతో ముగ్గురూ భయపడిపోయారు.

ఆ మరుసటి రోజు కూడా అదే జరిగింది. అలా రోజులు గడుస్తున్నాయి. ముగ్గురికి ఆ శబ్దం వినపడుతూనే వుంది. ఇంతలోనే పరీక్షలు అయిపోవడంతో ఊరికి వెళ్లిపోయారు.

సెలవులు అయిపోయాక, ఫణి స్కూల్ మార్చమని అడిగాడు తండ్రిని, ఎందుకు? అని అడిగాడు తండ్రి.

స్కూల్ కి రోజు తెల్లవారుజామున చదువుకోవడానికి నిద్ర లేస్తుంటే, దయ్యం వచ్చి వెళుతోంది, నేను ఆ స్కూల్లో చదువుకోను అని చెప్పాడు, తండ్రి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, తిరిగి స్కూల్లో వదిలేసి వచ్చాడు.

మళ్ళీ అదే శబ్దం రావడంతో ముగ్గురికి ఏమి చేయాలో తెలియలేదు, మళ్ళీ చూడటానికి ప్రయత్నిస్తే, మెరుపులతో వున్న గుడ్డ ఎగురుతూ కనిపించింది ముగ్గురికి, యోగి ఆలోచించి, మా ఊరికి వెళ్దామా? వెళ్లి మా మావయ్య కు చెబుదాము అన్నాడు.

నువ్వు ఇంటిలో చెప్పలేదా? అని అడిగాడు సుబ్బు.

లేదు, మా వాళ్ళు పొలం పనులలో బిజీ గా వున్నారు. మా మామయ్య దగ్గరికి అందరూ వచ్చి సమస్యలకు పరిష్కారం చూపించుకొని వెళుతుంటారు, అని చెప్పాడు, సరే వెళదాం అని అందరూ యోగి వాళ్ళ ఊరికి బయలుదేరారు.

రాత్రి భోజనాలు అయ్యాక, మావయ్య భూషణం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు యోగి, భూషణం యోగక్షేమాలు కనుక్కొని ఎవరో పిలవటం తో వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ముగ్గురూ భూషణం కోసం తోటకు వెళ్లారు. భూషణం చూసి ముగ్గురికి తోటంతా చూపించాడు. మధ్యాహ్నం తోటలోనే భోజనాలు చేసి కూర్చున్నారు.

ఏరా యోగి బండి కట్టిస్తాను ముగ్గురూ స్కూలుకి పొండి అన్నాడు భూషణం.

మావయ్య…. అది…. అని నసిగాడు యోగి.

ఏమైంది యోగి, లెక్క (డబ్బులు) కావాలా? ఇదిగో తీసుకో అని యోగికి రెండొందలు ఇచ్చి, ఫ్రెండ్స్ కి చెరో యాభై రూపాయలు ఇచ్చాడు భూషణం.

యోగి భయం తో భూషణం ని పట్టుకొని స్కూల్లో జరుగుతున్నది అంతా వివరించాడు.

ఓస్…. అంతేనా…… నేనూ వస్తా, చూద్దాం అది ఏమి చేస్తుందో? అని పిల్లలని తీసుకొని స్కూలుకి బయలుదేరాడు భూషణం.

వార్డెన్ కి పని మీద వచ్చినట్టు చెప్పి, ఆరోజు రాత్రికి వాళ్ళ గదిలోనే పడుకున్నాడు భూషణం.

యోగి, ఫణి, సుబ్బు ధైర్యం గా నిద్రపోయారు.

యధావిధిగా ముందుగా లేచి కూర్చున్నారు అందరూ, ఆ గజ్జెల శబ్దం రావడంతో ముగ్గురు భూషణం ని పట్టుకున్నారు.

భూషణం నేను వెళ్లి చూసి వస్తాను, మీరు భయపడకండి, అని వెళ్ళబోతే ముగ్గురు వద్దు మావయ్య, అది నిన్ను ఏమైనా చేస్తే అని అన్నారు, ఏమి కాదు అని భూషణం, వేగంగా వెళ్ళాడు.

ఆ శబ్దం వినపడట్లేదు, వాళ్ళ మావయ్య కనిపించలేదు, గేట్ దాక ధైర్యం చేసి వచ్చి చూసాడు యోగి, కనిపించక ఏడుస్తూ కూర్చున్నాడు.

మిగిలిన ఇద్దరికి కూడా ఏడుపు వస్తోంది, ఒక పదహాయిదు నిమిషాలు గడిచాక, భూషణం చెమటలు పట్టి, ఆయాస పడుతూ వచ్చాడు. అందరూ భూషణం ని చూసి భయపడుతూనే సంతోషపడ్డారు.

అది నిన్ను ఏమైనా అనిందా? దాన్ని నువ్వు చూసావా? అని అడిగాడు యోగి.

భూషణం నవ్వి, రండి….. అని బయటకు తీసుకెళ్లాడు, ముగ్గురూ వణుకుతూ, వెళ్లారు.

గేట్ బయట ఒక పాల రిక్షా వుంది, దాని పక్కనే ఒక ముసలి తాత నిలబడుకొని వున్నాడు. ఆ రిక్షా వెనకాల ఒక కట్టే, ఆ కట్టేకు అదే మెరుపుల గుడ్డ కనిపించింది.

ఈ తాత పాలు పోయటానికి పాలకేంద్రానికి వెళ్తాడు, అని వివరించాడు, తాత ను వెళ్ళమని చెప్పాడు భూషణం.

భూషణం బయలుదేరు తుండగా యోగి వచ్చి ఎలా కనిపెట్టావు? మావయ్య అని అడిగాడు.

భూషణం నవ్వి, మీరు చెప్పినప్పుడే నాకు తెలుసు దయ్యం కాదని, ఎందుకంటే తెల్లవారుజామున పాలవాళ్ళు, పేపర్ వేసే వాళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారు, ఆ విషయం మీకు అక్కడే చెబితే, మీకు అర్థం కాదు, భయం కూడా పోదు అందుకే వచ్చాను.

నేను అనుకున్నట్టు పాలవాడు ఈ పక్కన వుండే ఇంటివాళ్ళు పాలు పోయించుకుంటారు కాబట్టి, మీరు వింటున్న ఆ గజ్జెల శబ్దం కాసేపు ఆగి, ఆ తాత వెళ్ళిపోయే సమయంలో మీకు దూరం అవుతుంది అని చెప్పాడు భూషణం.

మరీ ఆ గజ్జెలు ఎందుకు రిక్షా మూడు గానులకు (టైర్స్) కి కట్టాడు అని అడిగాడు సుబ్బు.

వాళ్ళు తిరిగే సమయం లో ఏవైనా జంతువులు…… అంటే, కుక్కలు, కోళ్లు తిరుగుతూ వుంటాయి, కొన్ని తెలియక పడుకొని వుంటాయి, ఆ శబ్దం అవి భూమి లోపల తరంగాల ద్వారా తెలుసుకొని పక్కకి వెలుతాయి అందుకని కట్టుకుంటారు.

ఆ….. ఇంకొక విషయం ఏమిటంటే, పాములు, తేళ్ళు ఇంకా ఏవైనా విషం చిందించే జీవులు కూడా ఆ శబ్దానికి వెళ్ళిపోతాయి. అప్పుడు వీళ్లకు కూడా యే హాని కలుగదు, అందుకు ఆ గజ్జెలు కట్టుకున్నాడు అని వివరించాడు భూషణం.

మరీ మావయ్య ఆ కట్టెకు గుడ్డలు ఎందుకు కట్టాడు అని అడిగాడు ఫణి.

ఓహ్….. అదా…… ఏమిలేదు, ఏవైనా పక్షులు తలకు తగలకుండా పాల క్యాన్ మీద పడకుండా వుండేందుకు కట్టుకున్నాడు అని చెప్పాడు.

భలే చెప్పావు మావయ్య, నీకు ఎన్ని విషయాలు తెలుసో అన్నాడు యోగి.

ఏమి లేదురా అబ్బాయిలు, మేము పొలానికి పోతాము కదా, ఇటువంటివి అన్నీ మా తాత చెబుతూ వుంటాడు, పెరుగుతూ పోతే అన్నీ అవే తెలుస్తాయి. అపుడప్పుడు మా లాంటి వాళ్ళ వల్ల తెలుసుకుంటారు అంతే……. అని చెప్పాడు భూషణం.

సరే పిల్లలు బాగా చదువుకోండి, ఏదయినా అవసరం అయితే చెప్పండి, వెంటనే వస్తాను అని ముగ్గురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు భూషణం.

తరువాత ముగ్గురు స్నేహితులు యధావిధిగా కొనసాగారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!