అమ్మతనం

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

అమ్మతనం

రచయిత :: కమల’శ్రీ’

“వైషూ…వైషూ…వైషూ…ఎన్నిసార్లు లేపినా లేవవే. లే తల్లీ బారెడు పొద్దెక్కింది.” అంటూ తన ఇరవై ఐదేళ్ల కూతురు వైష్ణవిని నిదుర లేపింది శారద.

“అబ్బా! అమ్మా కాసేపు పడుకుంటాను ఫ్లీజ్.” అంది వైషూ అని ముద్దుగా పిలవబడే వైష్ణవి కళ్లు తెరవకుండానే.

“ఇంకా ఎంతసేపే ఏడుదాటి అరగంట అయ్యింది. కాలేజీ తొమ్మిదికి. ఇప్పుడు లేపితే లేవవు. తర్వాత కంగారు కంగారుగా టిఫిన్ కూడా తినకుండానే వెళ్లిపోతావు. ఇలానే చేస్తే రేపు పెళ్లి అయ్యాక మీ అత్తారింట్లో నన్ను అంటారు. కూతుర్ని సరిగ్గా పెంచడం రాలేదు ఆ తల్లికి అనీ.” అంటూ కిటికీ తలుపులు తీసి, మంచానికి ఓ పక్క పడేసిన బుక్స్ తీసి షెల్ఫ్ లో సర్దిపెడుతూ.

“ఏంటీ నిన్నంటారా.ఎందుకూ. నువ్వేం తప్పు చేశావనీ. నాకు పనులు చేతకాకపోతే నన్ను అనాలి కానీ.” అంటూ విసురుగా లేచింది వైష్ణవి.

“మరి అనరా. నువ్వింత బారెడు పొద్దెక్కే దాకా లేకపోతే ఎవరైనా నన్నే అంటారు.” అంది శారద నవ్వుతూ కూతురు కప్పుకున్న దుప్పటి మడతపెడుతూ.

“అలా అయితే నాకు పెళ్లే వద్దు అమ్మా. ఇంకెవరో నిన్ను మాటలు అనే అవకాశం ఎందుకివ్వాలి చెప్పు.” అంది వైష్ణవి లేచి బాత్రూం లోకి దూరుతూ.

“అలా అయితే నాకు పెళ్లే వద్దు అమ్మా. ఇంకెవరో నిన్ను మాటలు అనే అవకాశం ఎందుకివ్వాలి చెప్పు.” అంది వైష్ణవి లేచి బాత్రూం లోకి దూరుతూ.

ఆ మాటలకు శిలా ప్రతిమే అయ్యింది శారద. “ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది. పెళ్లి వద్దంటుంది ఏంటి? మాటల్లో అన్నాదా లేక నిజంగానే అందా?!.”అనుకుంటూ వంట గదిలోకి వెళ్లింది శారద.

ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన వైషు బయటకు వచ్చి అమ్మా కాఫీ అంటూ సోఫా మీద కూర్చుని టీపాయ్ మీద పేపర్ తీసి హెడ్ లైన్స్ చదువుతున్న ఆమె ముందు కాఫీ కప్పు పెట్టి “వైషూ! నేను చెప్పింది ఏం చేశావు?!.” అంది శారద.

“ఏంటమ్మా!” కాఫీ సిప్ చేస్తూ అంది వైషూ.

“అదేనమ్మా! ఆ వైజాగ్ వాళ్ల సంబంధం. ఒక్కగానొక్క అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. రేపో మాపో అమెరికా వెళ్లే అవకాశం కూడా ఉంటుందట. మాంచి ఆస్తిపాస్తులున్నాయట. మంచి సంబంధం అమ్మా. ఒప్పుకోవే.” అంది శారద బ్రతిమాలుతూ.

“అన్నీ ఉన్నాయంటే కట్నం కూడా బాగానే అడుగుతారు కదా అమ్మా. ఎక్కడి నుంచి ఇస్తావు. ప్రస్తుతానికి ఈ ప్రయత్నం విరమించుకో.నాకో ఇంపార్టెంట్ అసైన్ మెంట్ ఉంది. అది పూర్తి అయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం.”అంటూ న్యూస్ పేపర్లో తాను గమనించిన ఇంపార్టెంట్ విషయాలపై మార్కర్ తో అండర్ లైన్ చేస్తూ అంది వైషు.

“అదికాదమ్మా వాళ్లు ఫార్మాలిటికీ వచ్చి చూసి వెళ్తారు. మిగతా విషయాలు నీ అసైన్ మెంట్ కంప్లీట్‌ అయ్యాక మాట్లాడుకుందాం.” అంది శారద.

“సరే నీ ఇష్టం. కానీ వారి ముందు తలదించుకుని మాట్లాడు, నవ్వకు, తలపైకెత్తి చూడకు. అంటూ కండిషన్స్ పెట్టకు. నాకు అవి నచ్చవు.” అంది వైషూ కాఫీ కప్పుని వాష్ చేసి, తన రూం లోకి దూరబోతూ.

“ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు. మంచిరోజు చూసుకుని వాళ్లని రమ్మని చెప్తాను.” అని టిఫిన్ చేయడం లో నిమగ్నమైంది శారద.

కాసేపటికి రెఢీ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ ముగించి తన ఆఫీస్ కి వెళ్లింది వైషూ.

వైషూ పనిచేసేది ఓ న్యూస్ ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా. సంఘంలో జరిగే అన్యాయాలను ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి అన్యాయం ఎదుర్కొన్న వాళ్లకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తూ వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు వర్క్ చేస్తూ నిర్భయ చట్టం, దిశా చట్టం, గృహ హింస చట్టం ఇలాంటి చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది.

రెండు రోజుల క్రితం ఓ అన్ నోన్ నంబర్ నుంచి వచ్చిన కాల్ ని బేస్ చేసుకుని చిన్న పిల్లలను హాస్పిటల్ నుంచి, రైల్వేస్టేషన్ నుంచి, ఎత్తుకెళ్లి బిచ్చమెత్తిస్తున్న ఓ ముఠా వాళ్లని పట్టుకునేందుకు పోలీస్ వాళ్లతో కలిసి వెళ్లింది.

అంతా ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలు. వారిని ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకెళ్లారో కానీ వారందర్నీ ఓ లగేజ్ లారీ లో వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసి ఇన్స్పెక్టర్ భరత్ నేతృత్వంలోని బృందం తో పాటూ వెళ్లి వారిని అర్థరాత్రి వేళ ఓ ఘాట్ రోడ్ లో పట్టుకున్నారు.అసైన్ మెంట్ ముగిసి ఇంటికి చేరుకునే సరికి తెల్లవారు జామున మూడు గంటలు.

మరుసటి రోజు సాయంత్రం పెళ్లికొడుకు వాళ్లు వచ్చారు. వైషూ బుట్టబొమ్మలా తయారైయ్యింది. అమ్మాయి నచ్చిందని తల్లితో చెప్పాడు పెళ్లికొడుకు.వాళ్లు మధ్యవర్తి చెవిలో ఏదో చెప్పడంతో అమ్మా! శారద గారూ. అబ్బాయి కి అమ్మాయి నచ్చింది. ఇక మిగిలిన లాంఛనాలు అవీ మాట్లాడేసుకుంటే.” అంటుండగా,

“నాకు నచ్చలేదు.” అంది పెళ్లి కొడుకు బామ్మ.

ఆ మాట వినగానే అందరిలో ఆశ్చర్యం.”ఎందుకే బామ్మా అమ్మాయి బాగుంది కదే?!.”అన్నాడు పెళ్లి కొడుకు.

“పిల్ల బాగుంటే సరిపోతుందా. దాని తల్లీ తండ్రి గురించి తెలుసుకోవా. అమ్మాయ్ నువ్వూ సుబ్బారావు మాస్టారు గారి కూతురివే కదా.” అంది ఏదో గుర్తు వచ్చిన దానిలా.

“అవునండీ.”అంటూ సమాధానం ఇచ్చింది శారద ఏదో కీడు శంకిస్తుండగా.

“పెళ్లైన సంవత్సరానికే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే నీ మొగుడు చనిపోయాడని ఊరంతా తెలుసు. మొగుడి ఉద్యోగం నీకిస్తే నువ్వు పట్నం వచ్చావనీ తెలుసు. మా అక్కది అదే ఊరు కావడం, మీ వీధే కావడం అప్పుడప్పుడూ నేనూ వచ్చిపోతుండటంతో నాకూ అంతా తెలుసు.మరి మొగుడు లేని నీకు పిల్లెలా పుట్టింది.ఏ రాత్రి చీకటి వెనకాల ఏం పాడుపని చేస్తే పుట్టింది.” అంది బామ్మ.

శారద సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడటం తో “చూశావా!ఏం తప్పు చేయకపోతే అలా మౌనంగా ఉంటుంది.ఏం మధ్యవర్తి సంబంధం తెచ్చినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్లో ఏంటో తెలుసుకోవడం తెలీదా. మాంచి సంబంధమే తెచ్చావు. లేవండీ ఇలాంటి వారి పిల్లను మొదటిసారి నా మనవడికి చూపిస్తావా.” అంటూ అతన్ని నానా మాటలు అంటూ మధ్య మధ్యలో శారదని నిందిస్తూ ఉంది. వాళ్లు పైకి లేచారు వెళ్లేందుకు సిద్ధపడుతూ.

అంతా చూస్తున్న వైష్ణవి కి ఏమీ అర్థం కావడం లేదు. ‘తను కడుపులో ఉండగా తండ్రి చనిపోయాడని చెప్తూ వచ్చింది తల్లి. కానీ తన తండ్రి తను పుట్టకముందే చనిపోయాడా. మరి తను ఎవరికి పుట్టినట్టు. వీళ్లు అన్నట్టుగా నా తల్లి… ఛా.. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. నా తల్లి ఏం తప్పూ చేసుండదు. తను నిప్పు.’అనుకుంటూ,

“ఒక్క నిమిషం.” అంది మధ్యవర్తిని ఆపకుండా తిడుతున్న బామ్మని చూసి,

“ఏంటీ మా అబ్బాయి ని చేసుకుంటానని బ్రతిమలాడటానికి ఆపావా?!.”అంది బామ్మ.

“కాదు ఇంకోసారి మా అమ్మని ఒక్క మాట అన్నావంటే పెద్దవారని కూడా చూడను.” అంది కోపంగా.

“వైషూ ఏంటా మాటలు?!.” అంది శారద బాధగా.

“తప్పుడు పనులు చేస్తే పుట్టేవారు ఇలానే ప్రవర్తిస్తారు. విచ్చలవిడిగా తిరుగుతారు. అయినా నువ్వు మీడియాలో తిరిగే దానివి కదా… తల్లికి మించిన స్పేహాలు,అంతకు మించి చీకటి వెనుక ఇంకొకరి పక్కలో ముగిసే రాత్రులు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడుతావు?!.” అంది బామ్మ.

“బామ్మగారూ! మరోమాట మీ నోటి వెంట వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్లిపోండి ఇక్కడి నుంచి.”అంది వైషూ కోపంగా.వాళ్లు విసవిసా వెళ్లిపోయారు.

వారు వెళ్లి పోయాక తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది శారద.వైషూ కి వెళ్లి తల్లిని ఓదార్చాలి అని ఉన్నా కానీ ఆమెని కాసేపు ఒంటరిగా వదిలేయడమే మంచిదని తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని ముఖం కడుక్కుని బయటకు వచ్చి కాఫీ కలిపి తనకీ, తల్లికీ రెండు కప్పుల్లో వేసి తల్లి గది వైపు నడిచింది.

డోర్ చప్పుడు అవ్వడంతో కాస్త సర్దుకుంది అంతవరకూ ఏడ్చిన శారద.

కాఫీ కప్పు తల్లి చేతిలో పెట్టి తనూ కాఫీ సిప్ చేస్తూ ఉంది వైషూ.తాగడం పూర్తి అయ్యాక బయటకు వెళ్లబోతుంటే “వైషూ!.’ అంటూ పిలిచింది శారద.

“ఏంటమ్మా!?.”

“వాళ్లు అన్నేసి మాటలు అనేసి వెళ్లారు. కానీ నువ్వు ఏ ప్రశ్న వేయలేదేం?!.” అంది తల వంచుకునే.

“వారికి నా తల్లి కోసం తెలీదు కాబట్టి ఏదేదో మాట్లాడుతారు. కానీ నీకోసం తెలుసు కదమ్మా.ఏదన్నా చెప్పాల్సింది ఉంటే చెప్తావు కదా.

“కానీ నాకు ఒక్కటే బాధనిపిస్తోంది. ఇన్నాళ్లూ నేను కడుపులో ఉండగా చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పిందో అనీ.”

“వాళ్లు అన్నట్టుగా నేను ఏ తప్పూ చేయలేదు వైషూ.” అంది ఏడుస్తూ.

“నా తల్లి ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషో నాకు తెలుసు. తన కళ్లెదుట చిన్న తప్పు జరిగితే భరించలేని మనిషి తప్పు చేస్తుందంటే నేను నమ్మను.” అంది తల్లి పక్కనే కూర్చుని.

“మరి అడగాలనిపించలేదా నేనెలా పుట్టానో అని?!.”

“చెప్పే సమయం వస్తే నువ్వే చెప్తావు కదా. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తా.” అంటూ లేవబోయింది వైషూ.

“లేదు వైషూ ఈ రోజు నీకు నిజం తెలియాలి.” అంటూ కాసేపు మౌనంగా ఉండి, “నువ్వసలు నా కూతురివే కాదు.” అంది ఏడుపు ఆపుకుంటూ.

“అమ్మా! ఏంటి నువ్వనేది?!.” అంది వైషూ ఆశ్చర్యంగా.

అవును నువ్వు నా బిడ్డ వి కాదు.నేను జాబ్ వచ్చిన కొత్తలో మీ తాతగారి ఊరి నుంచి ఆఫీస్ కి స్కూటీ లో అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఓ రోజు ఆఫీస్ వర్క్ ఉండి కాస్త ఆలస్యం అయ్యింది.ఊరి టర్నింగ్ తిరిగేటప్పుడు నాకో పసిపాప ఏడుపు వినపడింది. వెంటనే స్కూటీ ఆపి, చుట్టూ చూసిన నాకు ఓ చెట్టుకి పక్కనే ఉన్న చెత్త కుప్ప పక్కనే ఉన్న ముల్ల పొదల్లో నువ్వు ఏడుస్తూ కనిపించావు. వెంటనే తీసి చూస్తే ఒళ్లంతా రక్తంతో ఉన్నావు. చూడగానే నా హృదయం ద్రవించిపోయింది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి చూపించాను ఆగకుండా ఏడుస్తున్నావని చెప్తే వారు నిన్ను పరిశీలనగా చూసి “ఆకలితో బిడ్డ ఏడుస్తుంటే తెలుసుకోలేని తల్లా మీరు?!.” అనడంతో వెంటనే మందుల షాపు కెళ్లి పాల సీసా,పౌడర్ తీసుకుని కలిపి పట్టించా అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చుని.

పాలు తాగుతూ నువ్వు ఏడుపు ఆపగానే నేను అంతవరకూ పడిన టెన్షన్ అంతా పోయింది. అప్పుడు నాలోని అమ్మతనం మేల్కొంది.

ఇన్నాళ్ల ఒంటరితనానికి ఓ తోడు దొరికిందనిపించింది నీరాకతో.నా ఒంటరితనపు చీకటి లో ఎన్నెన్ని నిదుర లేని రాత్రులు గడిపానో గుర్తొచ్చి నిన్ను నాతో పాటే ఇంటికి తీసుకుని వెళ్లాను.

చేతిలో బిడ్డతో వచ్చిన నన్ను చూడగానే ఆశ్చర్యంగా ప్రశ్నించారు ఇంట్లో వాళ్లంతా. నేను జరిగింది చెప్పి నిన్ను పెంచుకుంటానని అన్నాను. వాళ్లు దానికి ఒప్పుకోలేదు. ఆ బిడ్డ ని ఏ అనాథ శరణాలయానికో అప్పగించి రమ్మని చెప్పారు.

స్థానం లేకపోయినా పర్వాలేదు. కానీ నాకు ఈ బిడ్డ కావాలి. తనకి నేను అమ్మని కావాలి. నా ఒంటరి జీవితానికి ఓ తోడు కావాలి అని వారితో చెప్పాను.

అలాగైతే మా ఇంట్లో నిముషం కూడా ఉండకు అనడంతో వెంటనే నిన్ను పట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఈ ఊర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నా. కొన్నాళ్లకు ఈ ఇంటి ని కొన్నాను.

నువ్వు నా కడుపున పుట్టక పోయినా కన్నబిడ్డ లానే పెంచాను వైషూ.” అంటూ చెప్పడం ముగించి ఏడుస్తూ కూతుర్ని పట్టుకుంది శారద.

అమ్మా! నువ్వెందుకు ఏడుస్తున్నావు. నన్ను ఆ చీకటి వెనకాల విసిరేసిన తల్లి ఏడ్వాలి. తప్పు చేసిన ఆమె బాధపడాలి.నీలాంటి ఉన్నత హృదయురాలు కాదు.” అంటూ తల్లి కన్నీరు తుడిచి,

“అమ్మా! ఇక మీదట ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే వారికి విషయం చెప్పి వారు నచ్చితేనే పెళ్లి, లేదంటే వద్దు. దీనికోసం ఇక బాధపడకుండా లేచి బయటకు రా అమ్మా నాకు ఆకలిగా ఉంది.” అంది వైషూ కడుపుపై చేయి వేసి.

“అవునా! పదే నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను సరేనా.” అంటూ లేచి వంట గదిలోకి వెళ్లింది శారద.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!