నా వేకువలో ఆమె

నా వేకువలో ఆమె

రచన: వాడపర్తి వెంకటరమణ

మొదటి జాముతో మొదలవుతుంది
నా కలల ప్రయాణం
తళుకులీనే తారల టార్చ్ లైట్ వెలుగులో
అలా అలా ముందుకు సాగిపోతాను
నేను నడిచే దారిపొడవునా
అన్నీ అనుభూతించే
దృశ్యకాలే తారసపడుతుంటాయి

ఆ జామురాతిరిలో
చీకటి చెట్టుపై మిలమిలా మెరిసే
మిణుగురులు కొన్ని ఏరుకొచ్చి
గుండె జేబులో నింపుకుని
తుషార బిందువులతో స్నానించి
దారి పక్కనే పరుచుకున్న పూలను
సున్నితంగా కోసుకొచ్చి
నా మది గదిలో ప్రోగేసుకుంటాను

అలా అలా చుక్కల మండలం వెళ్ళి
వాటితో కాసిన్ని కబుర్లు చెప్పి
కొన్ని వెండిమబ్బు తునకల్ని
దేశానికి అతికించుకుని బయలుదేరుతాను

అదిగో అప్పుడే…
వెన్నెల వేకువ ముగ్గేస్తుంది
పక్షులు కిలకిలరావాల శోభతో
శ్రవ్యకాలు ఆలపిస్తుంటాయి

జాము జాము దాటి
మనసు సంచిలో మోసుకొచ్చిన
అనుభూతుల పరిమళాలను
ఆ వేకువలో ఆమెముందు కుమ్మరిస్తాను!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!