ఇదెక్కడి గోల

ఇదెక్కడి గోల

రచన: కృష్ణకుమారి

పెళ్ళయిన అయిదేళ్ళకి సుందరంకి అపురూపంగా ఆడపిల్ల పుట్టింది. అతను పరవశించిపోయేడు.

అప్పటికప్పుడు స్వయంగా బజారుకి వెళ్ళి మిఠాయిలు తెచ్చి పక్క పోర్షన్ల వాళ్ళకి అందరికీ పంచేడు.

ఇంటావిడ జగదాంబ నవ్వుతూ “సుందరం, మరి కూతురుని చూసిందికి వెళుతున్నావా?” అంది.

“ఈరోజు రాత్రే ప్రయాణం నేనూ మా అమ్మాకూడా…” సుందరం తనూ ఓ లడ్డూ తింటూ చెప్పేడు.

“ఓహ్, ఏం చిట్టెమ్మొదినా మనవరాలిని తెచ్చేస్తావా?” సుందరం తల్లితో హాస్యమాడింది జగదాంబ.

పాపాయికి మూడోనెల రాగానే, సుందరం భార్య సుధారాణి పిల్లతో వచ్చేసింది. చుట్టుపక్కల పోర్షన్ల వాళ్ళందరూ వచ్చి చూసి పాపాయి‌ ముద్దుగా ఉందని, దానిపేరు ‘హన్సిక’ మరీ బాగుందని గారంచేసి వెళ్ళేరు. పిల్లని వదిలి తమ ఇంటికి వెళ్ళ బుద్ధి అవటం లేదని కొందరు అన్నారు. అసలు కథ ముందుందని తెలీని అమాయకులు.

జగదాంబ తాతలనాటి తమ‌ పెద్ద ఇల్లుని పోర్షన్ల కింద విభజించి అద్దెకి ఇచ్చి, అద్దెలతో బతుకుతోంది. కొడుకు యూనివర్సిటీలో చదువుతూ హాష్టల్ లో ఉన్నాడు.

ఏ పోర్షన్ లో గట్టిగా మాటాడుకున్నా అందరికీ వినిపించే దగ్గరి ఇళ్ళు.

సుందరం అతని భార్య సుధ తల్లి చిట్టెమ్మ కాకుండా, సుందరం చెల్లి‌ పావని కూడా ఉంటుంది. సుధ తప్పితే మిగతావాళ్ళు హన్సికని ముద్దు చేస్తూ ఆడే మాటలు చుట్టుపక్కలవాళ్ళకి విచిత్రంగా ఉండేవి.

చిట్టెమ్మ నీళ్ళుపోస్తూ “ఎక్కా ఎక్కా పొన్నులే, వాలివాలి చుక్కలే” అనేది
( ఎవరింటి పండు? ఎవరింటి చుక్క?)

పాపకి సాంబ్రాణి పొగవేస్తూ ఉంటే పావని వచ్చి “చిత్తికి గుమగుమలే, తెల్లగాగా? పిల్లి గాగా?” అంటూ రెండు గౌన్లుతీసేది.
(చిట్టికి ఘుమ ఘుమలూ.. తెల్లగౌనా? పిల్లిబొమ్మ ఉన్న గౌనా?”)

పక్కిళ్ళవాళ్ళకి వినపడ్డా, కనపడదు కాబట్టి ఏమిటంటున్నాదో బోధపడేది కాదు.

ఇంక సుందరం ఆఫీస్ నించి వచ్చేడంటే అందరికీ దడగా ఉండేది

“ఆచ్చి పన్నులూ, మీలు పుట్టిచేలా? దొలికిసేలా?” అంటూ ఎగరేసేవాడు
(పండూ… నువ్వు పుట్టేవా? దొరికేవా?) హన్సిక నవ్వేది.

భోజనాలు అవగానే ఒకొక్కళ్ళు చంటిదాన్ని తమ బాణీలో గారాలు మొదలెట్టేవారు.

“ఆయ్ ఆయ్ తిత్తి నవ్వే?” చిట్టెమ్మ

“కొత్తగాగలో అల్లీల వాలే!” పావని (కొత్తగౌనులో హన్సికలవాడు)

ఇహ సుందరం చంటిదాన్ని ముద్దులు చేస్తే ఆపీ వాడు కాదు. అతని గొంతుకీ, ఆ రిథమ్‌ కీ అందరికీ భయం నవ్వూ
వచ్చేవి.

“బుల్లలు గోకిచుకుంతున్నాలా?”
ఒకసారి.
“ఆంతి ఆంతి అన్నీచులు, నాన్నగాయేయి చూయమ్మ అత్తేది? చూయమ్మ” అంటూ ఉంటే చిట్టెమ్మ కి ఒళ్ళుమండింది.

“మీ మేనత్తంటే మరీ అవుతావురా.‌.. ఇంకా నయం… చంటిదానికి సూరమ్మ పేరు పెట్టేవుకాదు” అంది కోపంగా.

సూరమ్మ ఆవిడ ఆడపడుచు. బాల వితంతువు. సుందరం అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెంచింది.
ఉదరంలో‌ జబ్బుతో మరణించింది.

మేనత్తే తన కూతురిలా వచ్చిందని సుందరం నమ్మకం.

హన్సికకి పదోనెల వచ్చింది. ఆ రోజు సుందరం మరీ జోరుగా ముద్దు మొదలెట్టేడు. బుర్ర తమాషాగా తిప్పుతూ,”అన్ని పాపలూ… వాలు మీలు? చూయమ్మా? మామ్మ మంగమ్మా? వాలు వాలు?” అంటూ ఉద్రేకపడుతూ ఉంటే కొసా పోర్షన్ ప్రభాకరం వచ్చేడు.

ఉన్నవాడు ఊరుకోకుండా సుందరం “ఏమండీ, ప్రభాకర్ గారూ, మా హన్నీ పుట్టిన తరవాత అందరూ నాకు
వేపకాయంత వెర్రి ఉందంటున్నారండీ” అన్నాడు.

ప్రభాకరం సీరియస్ గా “ఎవరండీ, ఆ మాట అన్నది? ఆ అన్నవాడికి నిమ్మకాయంత వెర్రి ఉంది. మీకు గుమ్మడి కాయంత వెర్రి ఉంది” అన్నాడు

అప్పటికే చుట్టు పక్కల అందరూ, విసిగిపోయి‌ ఉన్నారేమో, పకపకా నవ్వడం మొదలెట్టేరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!