ప్రియవాణి

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

 ప్రియవాణి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

“ఒరేయ్! విక్కి! ఈరోజు ధైక్వాండో ఫీజు కట్టాలని మనీ అడిగావు కదా! సాయంత్రం వచ్చి కడతానని మీ సార్ కి చెప్పు! అది కూడా అడిగితేనే సరేనా..!” అని కొడుకు తో చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు సురేందర్. ఇంతలో విక్కి చెల్లెలు ప్రియవాణి “అమ్మా! నేను కూడా తైక్వాండో నేర్చుకుంటాను ప్లీజ్ ప్లీజ్! నాకు ఏదైనా ఆపద వస్తే నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా!” అంటూ అమ్మ కళ్ళలోకి చూస్తూ రోజాని చుట్టుకుపోయింది. కనీసం ఈరోజైనా ఒప్పుకుంటుందేమోనని. రోజా… వాణి బుగ్గలు నిమురుతూ “వద్దు రా! అవన్నీ మనకెందుకు చెప్పు. అమ్మ నాన్న మాట వినని అమ్మాయిలకి. ఎందుకంటే వాళ్ళు చాలా మెుండిగా ఉండేసరికి బయట గొడవలు ఎక్కువై వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి. నువ్వు చక్కగా మా మాట వింటావు. నువ్వు బయట గోడవలు కూడా పెట్టే రకానివే కాదు. మా బంగారు తల్లివి” అని చెప్పి స్కూల్ ఆటోలో కూర్చోబెట్టింది విక్కి పక్కన.
స్కూల్ ఆటో ఎంత వేగంగా కదిలిందో రోజా పిల్లలకి అంతే ఆనందంగా టాటా చెబుతుంటే ప్రియ మాత్రం బిక్క మెుహం వేసుకుని అంతే దుఃఖంగా వెనక్కి తిరిగి తల్లి వైపు చూసింది. రోజా కూతురి మెుహం చూసి పరిస్థితి అర్ధం చేసుకొనే పనిలో లేదు. ఆఫీసు కి వెళ్ళే హడావుడి లో గబగబా ఇంట్లోకి వచ్చి అత్తగారికి, మామగారికి చెప్పి స్కూటీ తీసింది.
ఇంతలో “అమ్మా! రోజా!” అన్న మామగారి పిలుపుతో స్కూటీ బయటపెట్టి ఇంట్లోకి వచ్చింది రోజా. “ఏంటి మామయ్య గారు! ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తీసికొని వచ్చేదా!” అని సంశయంగా అడిగింది. నాగభూషణం గారు నవ్వుతూ “రోజా! ఈరోజుల్లో తైక్వాండో ఆడపిల్లకి చాలా అవసరమమ్మా!. ఎలాంటి సందర్భాలోనైనా తమని తాము రక్షించుకోవడానికే కాదు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నా మాట కాస్త
అర్ధం చేసుకుని ప్రియ కి కూడా నేర్పించమ్మా!”
మామయ్య గారూ! నేను P.G.చేసాను. కోకో ఛాంపియన్ ని కూడా. కానీ పెళ్లయ్యాక కోకో ఆడుతున్నానా? పైగా అది నేర్చుకొని మా నాన్నగారి డబ్బులన్నీ వేస్ట్ చేసాను. అందుకే ప్రియ విషయంలో అవీ ఇవీ నేర్పి దాని టైం, మన టైం తో పాటు మనీ ఖర్చు చేయదల్చుకోలేదు. ఇక ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం మామయ్య గారు. ఐయామ్ సారీ. నా ఆఫీస్ టైం అవుతోంది. మీరు, అత్తయ్య జాగ్రత్త” అంటూ బయటికి వచ్చి స్కూటీ స్టాట్ చేసింది రోజా.
నాగభూషణం గారి భార్య సరస్వతి గారు వెడుతున్న రోజా వైపు చూస్తూ ‘ఎంత చదువుకుంటే ఏం లాభం!? అంటూ గాఢంగా నిట్టూర్చారు.
నాగభూషణం, సరస్వతి గార్లకి సురేందర్ ఒక్కగానొక్క కొడుకు కోడలు రోజా. వారికికి విక్రమ్, ప్రియవాణి పిల్లలు. విక్రమ్ కి పదిహేనేళ్ళు, ప్రియకి పదమూడు సంవత్సరములు.
నాగభూషణం గారు కానీ సరస్వతి గారు కానీ మనవరాలు ప్రియని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదన్నా మంచి విషయం చెబుతుంటే రోజా విసురుగా వచ్చి “అత్తయ్య గారూ! ఇలాంటి వన్నీ మంచి చెడు తెలియని పిల్లలకి. నా కూతురుకి అన్నీ తెలుసు” అని ప్రియని లాక్కుని పోయేది అత్తమామల దగ్గర నుంచి.
ఒక ఆదివారం నాగభూషణం గారు మనవరాలిని పక్కన కూర్చోబెట్టుకుని “ప్రియ తల్లీ! తెలియని వారు ఎవరైనా నిన్ను పిలిస్తే వెళ్ళకు. అంతేకాదు మన ఇంట్లో వారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పినా వెళ్ళకు” అని ఇంకా చెప్పబోతుంటే కోడలు రోజా వచ్చి “అయినా! మనం ఇల్లు కట్టుకున్న చోటు ఎంత భద్రం. పైగా ఇలాంటి మాటలు చెప్పి లేనిపోని ఆలోచనలు కల్పించకండి” అంటూ కూతురు చేయి పట్టుకొని లాక్కపోయింది.
ఆ రోజు రాత్రి ఏడుగంటలు…నాగభూషణం గారు, సరస్వతి గారు గుడికి వెళ్ళారు. సురేందర్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాడు. విక్కి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రియ టీవీలో ‘ఛోటా భీం’ చూస్తూ ఆనందంతో చప్పట్లు కొట్టకుంటూ చూస్తోంది. రోజా కూతురిని ఒక కంట గమనిస్తూ వంటింట్లో వంట చేస్తోంది. ఇంతలో కరివేపాకు కావల్సి వచ్చి పెరట్లోంచి తెచ్చి వంటలో మునిగిపోయింది.
అలా అరగంట గడిచాక రోజాకి స్పూర్తించింది. కూతురు నవ్వులు వినిపించడం లేదని హాల్లో కి వచ్చి చూసింది. అక్కడ ప్రియ లేదు. ఏ గదిలోనైనా ఉంటుందేమోనని ఇల్లంతా వెదికింది. పరుగున బయటకొచ్చి చూసింది. అక్కడా లేదు.
భయంతో వీధి చివరకు వచ్చి “ప్రియా! ప్రియా!” అని గట్టిగా పిలుస్తూ ఇంటింటికి వెళ్ళి అడిగింది.
ప్రతీవారు మా ఇంటికి రాలేదని చెప్పేసరికి వీధి చివరి గట్టు మీద కూర్చుని ఏడుస్తూ “అయ్యో! చిట్టితల్లీ ఎక్కడున్నావురా! నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళవు కదా! ఎక్కడున్నావురా! అని అనుకుంటుండగా…వెంటనే మామయ్య మాటలు గుర్తుకు వచ్చాయి’. ఎవ్వరు పిలిచినా వెళ్ళకు’ అని. అంతే ఆ మాటలు తలుచుకునేసరుకి రోజా గుండె వేగం పెరిగింది.
పరుగున ఇంటికి వచ్చి భర్త కి ఫోన్ చేద్దామని ఫోన్ పట్టుకుంది. ఇంతలో “అమ్మా….మ్మా..అమ్మా! అని పెద్దగా ఏడుపు వినిపించేసరికి..అది ప్రియ గొంతని అర్థమై ఫోన్ పక్కన విసిరేసి ఒక్క గెంతులో బయటికి వచ్చింది.
అక్కడ ఏడుస్తున్న ప్రియ..ఆమె చేయి పట్టుకొన్న అన్న విక్కి. అంతవరకూ అలసి సొలసి వెతికి.. కూతురు కనిపించేసరికి ఏడుస్తున్న ప్రియని ఒక్కసారిగా దగ్గరకు తీసికొని ముద్దులు కురిపిస్తూ “ఎందుకు ఏడుస్తున్నావు!?ఏక్కడికి వెళ్ళావు!? నాకు చెప్పకుండా” అంటూ దగ్గరకు తీసికొని అడిగింది.
ప్రియ ఏడుస్తూ “టీవీ చూస్తున్నప్పుడు మా క్లాస్ మెట్స్ చరణ్, సుశాంత్ వచ్చి పిలిచారు. బయటకి వచ్చి మాట్లాడుతుంటే ఇంతలో చరణ్ ముక్కు దగ్గర ఏదో పెడుతుంటే గమనించి చేత్తో విదిలించాను. వెంటనే సుశాంత్ నా నోట్లో కర్ఛీఫ్ కుక్కాడు. ఇంతలో చరణ్ నా రెండు చేతులు వెనక్కి విరిచి మన వీధి చివర ఎడమ వైపున స్మశానం వైపు తీసికొని వెళ్ళాడు. ఆ సమయంలో మన వీధి అంతా నిశబ్దాంగా ఉంది. బయట ఎవ్వరూ లేరూ” అక్కడ…”అని ఇంకా చెప్పబోతుంటే,
విక్కి కల్పుంచుకుని “అమ్మా! మా ఫ్రెండ్స్ తో ఆడుకుని ఇంటికి వస్తుంటే మన వీధి చివరన చెల్లాయ్ కి తిరుపతిలో కొన్న గాజులు కనిపించాయి. అనుమానం వచ్చి అటు వైపు వెడితే వాళ్ళు చెల్లిని లాక్కుపోతున్నారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను నేర్చుకుంటున్న తైక్వాండో లోని కొన్ని స్టంట్స్ తో వైళ్ళని తన్ని చెల్లాయ్ ని తీసికొని వచ్చాను”. అని పూస గుచ్చినట్లు అంతా చెప్పాడు.
అప్పుడే గుడి నుండి వచ్చిన నాగభూషణం దంపతులు అంతా విని ప్రియని దగ్గరకు తీసికొని “బాల వాక్కు బ్రహ్మ వాక్కు” అంటాం. ఆడపిల్లల విషయంలో మనం ఇంకా వెనకే ఉన్నాం. వారి మాటలని గౌరవిద్దాం. వారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ధైర్యవంతులు అవుతారు”. అన్నారు కాస్త కోడలికి ఇన్ డైరెక్ట్ గా క్లాస్ తీసికున్నట్లుగా.
రోజా కళ్ళు తుడుచుకొని “ప్రియా! విక్కి లా నీక్కూడా తైక్వాండో నేర్పిస్తాను. నిజంగా నీ వాక్కు విని ఉంటే తైక్వాండో తో వారిని ఎదిరించేదానివి. నీకు రక్షణ గా నువ్వే ఉండేదానివి. నా కళ్ళు తెరుచుకున్నాయి రా!రేపే మనీ కడతాను నీ తైక్వాండో క్లాసెస్ కి” అంటూ… ప్రియ చేయి పట్టుకొని లోపలికి నడిచింది. ‘ప్రమాదంలో కూడా బాల వాక్కు బ్రహ్మ వాక్కు మంచి విషయాన్ని నేర్పిందని’ అనుకుంటూ ఇంట్లోకి నడిచారు నాగభూషణం దంపతులు…వారిని అనుసరించాడు విక్కి.

You May Also Like

One thought on “ ప్రియవాణి

  1. బాగుంది. అమ్మాయి కి కూడా అన్నీ అవసరం అని తెలిసేలా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!