విలువలేని బంధం

విలువలేని బంధం

 

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పలేకపోతున్నాయి. చెల్లి ని తీసుకుని అమ్మ నన్ను నాన్నని వదిలేసి ఇంట్లోంచి పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నపుడు ఎప్పుడు తలుచుకున్నా సరే కన్నీళ్లు కారుస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ బాధగా ఉన్న అమ్మ ముఖమే ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది.

నాపేరు ఆదిత్య. ఇప్పుడు నాకు 26 ఏళ్లు.ఎప్పుడు తలుచుకున్నా అమ్మ మొహం అలా బాధగానే గుర్తొస్తుంది. పదిహేను ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన కళ్ళముందు మెదులుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మ గురించి చెప్పే ముందు నాన్న గురించి కూడా కొంచెం చెప్పాలి. నాన్న పురుషాహంకారానికి ప్రతీక. ఆడవాళ్లు అంటే చులకన భావం,దానికి తోడు అమ్మ చిన్న పల్లెటూరులో  పొలం పనులు చేసుకునే కుటుంబం నుంచి వచ్చింది అసలు చదువు కోలేదు, పనికి రాని మొద్దు, పల్లెటూరి బైతు,చెత్త మొహం ఇవి నాన్న అమ్మ కి ఇచ్చిన బిరుదులు కానీ అమ్మకేమో భూదేవి కి ఉన్న ఓపిక సహనం,నాన్న ఏమన్నా ఎంత తిట్టుకున్నా పట్టించుకునేది కాదు.

గొడవ కూడా పెట్టుకునేది కాదు తన పనేమో తనది అన్నట్టు ఉండేది. అమ్మ మౌనం కూడా నాన్నకి అమ్మ ని మరింత చులకన చేయడానికి ఉపయోగ పడింది. నాన్న నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మని మనిషిలా ఎప్పుడూ చూడలేదు, అప్పట్లో మా అమ్మ కి ఉన్న విలువ ఇంట్లో  ఏదో ఒక వస్తువుకి ఉన్నంత మాత్రమే.

కానీ ఇదేమీ అమ్మ పట్టించుకునేది కాదు.మీకు ముందే చెప్పానుగా అమ్మకి ఓపిక సహనం ఎక్కువ అని, అలా అన్నింట్లోనూ సర్దుకుపోయే అమ్మ నాన్న చెల్లికి నాకు చూపించే పక్షపాతం లో మాత్రం సర్దుకుపోలేక పోయింది. మగపిల్లాడు అంటూ నన్ను చాలా బాగా చూసుకునే మా నాన్న చెల్లికి ఏం కొనాలన్నా తనకోసం ఏం తీసుకురావాలన్న అమ్మని విసుక్కోవడం కొట్టడం నాకింకా బాగా గుర్తుంది. ఆరోజు అమ్మ చెల్లిని నేను చదివే స్కూల్లో  చేర్పించమని  నాన్నని అడిగింది.
నేను చదివేది మంచి పేరున్న రెసిడెన్షియల్ ప్రైవేట్ కాన్వెంట్. నాన్న ఒప్పుకోలేదు, ఆడ పిల్ల దాని మొహానికి అంత మంచి స్కూలు అవసరమెం ఉంది.
గవర్నమెంట్ స్కూల్లో చేర్పించు అయినా అంత గొప్పగా చదివించాల్సిన అవసరం ఏముంది ఉద్యోగం చేస్తుందా, ఊర్లు ఏళ్తుందా ఏ గంతకు తగ్గ బొంతో అన్నట్టుగా ఎవడ్నో చూసి ముడిపెడితే నీలాగే ఇంట్లో పడి వంట చేసుకుంటూ ఉంటుంది అంటూ చెల్లి గురించి నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మొదటిసారిగా అమ్మ కళ్ళలో కోపం చూశాను.

ఇప్పటివరకు మీరు ఏం చెప్పినా సరే నోరు మూసుకుని విన్నాను. పాప విషయంలో మాత్రం నేను వినను. ఆడపిల్లయినా చక్కగా చదువుకుంటే దాని కాళ్ళమీద అది నిలబడి హాయిగా బ్రతుకుతుంది. దాని బ్రతుకు నాలా అసలు కాకూడదు నాలా మాటలు పడకూడదు అందుకే పాపాయిని బాగా చదివించల్సిందే. అంటూ అమ్మ మొండి పట్టు పట్టడంతో నాన్న ససేమిరా అన్నారు. ఇంట్లో ఒక వారం రోజులపాటు గొడవే నడిచింది. ఎప్పుడూ ఎదురు చెప్పని అమ్మ ఎదురు చెప్పడం నాన్న జీర్ణించుకోలేకపోయారు. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అమ్మా ఇక తట్టుకోలేకపోయింది. నన్ను చెల్లిని తీసుకునీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది.
కానీ నాన్న నన్ను తీసుకు వెళ్లనీవ్వలేదు. నా చేయి పట్టుకున్న అమ్మని దూరంగా తోసేస్తూ, కావాలంటే నువ్వు నీ కూతురు పోండి ఇంట్లో నుంచి నా కొడుకు నాతోనే ఉంటాడు. పద ఆది అంటూ నన్ను లోపలికి తీసుకువెళ్ళి పోయి అమ్మను బయటకి గెంటేసి తలుపులు వేసేశారు. అప్పుడు నేను చిన్నవాడిని
నాన్నను ఎదిరించెంత  ధైర్యం లేదు. అమ్మే కావాలి అని చెప్పేంతగా నా నోరు పెగలలేదు. ఎంతైనా నేను మగవాడినే కదా. అలా 15 ఏళ్లు గడిచాయి. అమ్మ గుర్తు వస్తూనే ఉంది.

నిన్న నా స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మీ చెల్లెలికి పెళ్లి కుదిరిందని. జాబ్ చేస్తుందని, వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని, నా ఫ్రెండ్ చెప్తూ మీ అమ్మగారు చదువుకోకపోయినా చాలా గ్రేట్ రా అనడం  నాకు చాలా గొప్పగా అనిపించింది.
(ఈ విషయాలన్నీ నాకు తెలిసినవే, నాకు అమ్మ నీ చెల్లిని చూడాలనిపిస్తుంది కానీ నాన్నకు నచ్చదేమో అని నేనుఅమ్మని  కలిసే ప్రయత్నం చేయలేదు.)

అలా ఆలోచనలో మునిగి తేలుతున్న నా దగ్గరికి నాన్న వచ్చారు ఏంటి ఆలోచిస్తున్నావ్ అని అడగడంతో, ఏం లేదు నాన్న అంటూ తప్పించుకో బోయాను. నాన్న రూమ్ లోకి వెళ్లి ఒక చిన్న పాకెట్ నోట్ బుక్ తెచ్చి నా చేతిలో పెడుతూ ఇందులో మీ అమ్మ అడ్రస్ ఉంది వెళ్లి కలువు అంటూ ఒక చెక్ నా చేతిలో పెడుతూ 10 లక్షలు మీ చెల్లి పెళ్లికి పనికి వస్తుంది అమ్మకి ఇవ్వు, అని చెప్పడంతో ఆశ్చర్యంగా చూసాను. నాన్న కళ్ళల్లో తడి, నేను ఎంత తప్పు చేశానో మగాడ్ని అనే అహంకారంతో నా కళ్ళు ఎంతగా మూసుకుపోయాయో నాకు అప్పట్లో తెలియలేదు. కాలం గడిచే కొద్దీ మీ అమ్మ లేని లోటు తెలుస్తు ఉంది.అయినా మగాడిని అనే పొగరు కదా నాకు,మీ అమ్మని నా దగ్గరికి తిరిగి వచ్చేయమని పిలవలేక పోయాను. నేను ఏం కోల్పోయానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. జరగాల్సిన తప్పు ఎప్పుడో జరిగిపోయింది. సరిదిద్దుకోవాలనే ఆలోచన కూడా రాకుండా పోయింది. నువ్వు వెళ్ళు ఆదిత్య మీఅమ్మని ఒప్పించు ఇక్కడికి రావడానికి చెల్లి పెళ్లి మా ఇద్దరి చేతుల మీదుగా జరగడానికి, అంటూ నాన్న కళ్ళ నీళ్ళతో చెప్తుంటే తప్పకుండా అమ్మను తీసుకు వస్తాను నాన్న ఒప్పిస్తాను అంటూ అమ్మ దగ్గరికి బయల్దేరాను.

అమ్మ ఉండేది ఒక పచ్చని పల్లెటూరు. నేను వెళ్లే సరికి సాయంత్రం అయ్యింది. పేడ నీళ్లతో కల్లాపు చల్లుతూ అమ్మ, ఇంటి బయట వేప చెట్టు కింద కట్టిన సిమెంట్ చెప్టా మీద పిల్లలకి ట్యూషన్ చెప్తూ చెల్లి చాలా ప్రశాంతంగా కనిపించేసరికి నా మనసుకి హాయిగా అనిపించింది. నన్ను చూడగానే అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గబగబా చేతులు కడుక్కుని కొంగు కి చేతులు తుడుచుకుంటూ, ఆది ఎలా ఉన్నావ్ నాన్న అంటూ పరుగున వచ్చి అమ్మ నన్ను హత్తుకుంది.
చెల్లి కూడా అన్నయ్య అంటూ వచ్చి నాకు కాస్త దూరంలోనే ఆగిపోయింది నాతో అంత చనువు లేనందువల్ల, కుశల ప్రశ్నలు అయ్యాక నాన్న ఎంతగా బాధపడుతున్నాడో అమ్మకి వివరంగా చెప్పాను.

అమ్మ ఏమీ మాట్లాడ లేదు పెదవుల మీద చిరునవ్వుతో నేను చెప్పేది వింటూ ఉండిపోయింది.
చూడు నాన్న ఆది,మీ నాన్న మాటలకి నా మనసు ఎప్పుడో గాయపడి విరిగిపోయింది. ఇప్పుడు అది అతుక్కోదు, చెల్లిని ఆయన నా కూతురు అని ఎప్పుడూ అనుకోలేదు.ఇన్ని సంవత్సరాల్లో మమ్మల్ని ఒక్కసారి కూడా కలవడానికి ప్రయత్నించలేదు,ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారు ఏం తింటున్నారు అని ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు ఆయనకు పశ్చాత్తాపం కలిగి కలిసిపోవాలి అనుకుంటే మాత్రం నా మనసు అందుకు సిద్ధంగా ఉండాలిగా, ఇంత
ఈ వయసులో ఆయనకి ఇంత లేటుగా నా విలువ తెలియడం అప్పటికప్పుడు మా మీద ప్రేమ పెరిగిపోవడం, మమ్మల్ని వచ్చేయమని నిన్ను పంపించడం, ఇవన్నీ నాకు నవ్వు తెప్పిస్తున్నాయి.
మీ నాన్న కు దూరంగా వచ్చేసినందుకు నేను అందరి చేత పడాల్సిన మాటలు,వెకిలి చూపులు అవహేళనలు, అవమానాలు అన్ని అనుభవించాను. నాతో పాటు మీ చెల్లి కూడా అన్ని అనుభవించింది. నాకు నా జీవితం ఇలా అలవాటైపోయింది. ఇలా గడిచిపోతే చాలు, ఇక కొత్తగా అవసరం లేదు. మీ చెల్లిని బీఎస్సీ బీఈడీ చదివించాను. మొన్నే సచివాలయం లో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు పక్క ఊర్లోనే ఉండే స్కూల్లో టీచర్ ఒకతను చాలా మంచివాడు మీ చెల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పురుషాహంకారం లేని ఆడ మగ ఇద్దరూ సమానం అనుకునే వ్యక్తిత్వం కల మనిషి అతను.అందుకే నేను కూడా ఒప్పుకున్నాను.

పెళ్లి ఇంకో రెండు నెలల్లో ఉంటుంది.పెళ్లికి చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తాను మీ నాన్నని వచ్చి ఆ నాలుగు అక్షింతలు వేసి వెళ్ళమను అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడు ఎలాంటి ధైర్యంతో ఉన్నానో అదే ధైర్యం పట్టుదల నాకు ఇప్పుడు కూడా ఉంది. నేను రైతు బిడ్డని. పొలం పనులు చేస్తూ నీ చెల్లెల్ని చదివించాను. దేవుడి దయవల్ల నా కష్టార్జితంతో రెండు ఎకరాల పొలం కొన్నాను. ఎంత కష్టపడినా హాయిగానే ఉన్నాను. ముఖ్యంగా మనశ్శాంతిని కోల్పోలేదు నేను. అంటూ చెప్పడం ఆపింది. అమ్మ తీస్కో నాన్న పంపించారు అంటూ చెక్ ఇవ్వ బోయాను.

అమ్మ పెదవుల్లో మళ్లీ అదే చిరునవ్వు.నాకు కావాల్సింది డబ్బు కాదు నాన్న. అంతకుమించి చాలా ఉంటాయి అవి మీ నాన్న కి తెలియదు. నేను కూడా ఇక తెలియచెప్పాలి అనుకోవట్లేదు. మమ్మల్ని ఇలా ఉండనిస్తే చాలు అంటూ ఇంకా మాట్లాడేది ఏమీ లేదు అన్నట్టు అమ్మ సైలెంట్ గా ఉండిపోయింది. నాకు ఏం చెప్పాలో ఎలా నచ్ఛ చెప్పాలో అర్థం కాలేదు. ఇక
ఏం చెప్పినా అమ్మ వినదు అని అర్థం అయింది. నాన్న వల్ల అమ్మకి జరిగిన అవమానాలు అమ్మని అంత కఠినంగా మార్చేసాయి.

ఇంకో మాట నాన్న, నువ్వు మీ అమ్మను చెల్లిని చూసుకోవడానికి ఎప్పుడైనా రావచ్చు అని అమ్మ చెప్పడంలో ఇంక నువ్వు మీ నాన్న దగ్గరికి బయలుదేరవచ్చు అనే అర్థం కనిపించింది. అన్నయ్య అంటూ దగ్గరికి వచ్చిన చెల్లి తల నిమురుతూ వెళ్ళొస్తాను అమ్మ అంటూ తిరిగి ఇంటికి వచ్చేసాను. బాగా ఆలోచిస్తే అమ్మ తీసుకున్న నిర్ణయం నాకు కూడా కరెక్టే అనిపించింది. కళ్ళల్లో కన్నీటిని కారుస్తూ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుతూ ఇంటి నుంచి బయటికి వెళ్లిన అమ్మ ఇప్పుడు ఇంత ధైర్యంగా హుందాగా మరొకరికి పాఠాన్ని నేర్పించే అంతగా ఎదగడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. వాళ్ళకి దూరంగా ఉన్నాను అనే బాధ తప్ప మరి ఇంకేమీ ఇప్పుడు నా మనసులో లేదు.అమ్మ మళ్లీ మా దగ్గరికి వస్తుందా లేదా అనేది,చూడాలి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో ఎలాంటి మలుపులు తిరుగుతుందో జీవితం  కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు ఆ తండ్రి కొడుకులకు ఈ ఎదురుచూపులు తప్పవు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!