ఇది కథ కాదు

ఇది కథ కాదు

రచయిత :: పరిమళ కళ్యాణ్

ప్రదీప అందరిలాంటి అమ్మాయే. అమ్మ చాటు పెరిగిన ఆడపిల్లే. తనకో చెల్లి, సుదీప. ప్రదీప తండ్రి వెంకటేశ్వర్లు ఒక సాధారణ గుమస్తాగా పని చేసేవారు. తల్లి పద్మావతి గృహిణి.

“మింగ మెతుకు లేదు కానీ, ఇద్దరూ ఆడపిల్లల్నే కన్నారు. వాళ్ళని ఎలా చదివిస్తారు? పెళ్లిళ్లు పేరంటాలు ఏం చేస్తారు?” అంటూ ఈసడించుకునే వాళ్ళు కొందరు.

“పేర్లు మాత్రం భలే పెట్టారు ఒకే పేరు కలిసేలా పిల్లలిద్దరికీ” అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళూ ఉన్నారు. వారి ఆర్ధిక ఇబ్బందులు గమనించి బంధువులు దూరం పెట్టారు, ఎక్కడ వాళ్ళు సాయం చేయాల్సి వస్తుందో అని.

అయినా ఉన్నంతలో ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించే వారు వెంకటేశ్వర్లు, పద్మావతి. పిల్లలు కూడా చదువులో ముందుండేవారు. అది చూసి కొందరు “ఔరా!” అని ఆశ్చర్యపడితే, మరి కొందరు అసూయ పడేవారు.

వాళ్ళ చదువుల కోసం ఎన్నో అప్పులు చేసి, అందర్నీ అడిగి తల్లిదండ్రులు కష్టపడటం చూసిన ప్రదీప తను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని ఆశపడేది. మెరిట్ స్టూడెంట్ కావటంతో, బంధువుల సహాయంతో పీజీ డిగ్రీ పూర్తి చేసింది ప్రదీప. చదువు కాగానే ఉద్యోగ వేటలో పడి, ఖాళీగా ఉండకుండా, తల్లిదండ్రులకు భారం కాకుండా, చదువుకీ తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో చిన్న ఉద్యోగంలో చేరింది.

కొన్నాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి, తన చదువుకోసం చేసిన అప్పులు తీర్చింది. పెళ్ళి వయసు రావటం వల్ల, వెనుక తనకో చెల్లి ఉండటం వల్ల తనకి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు.

మంచి సంబంధం చూసి ఎలాగోలా పెళ్ళి చేసి అత్తారింటికి పంపించారు. సరిగ్గా అప్పుడే ప్రదీప తండ్రి అనారోగ్యం పాలయ్యారు. చెల్లెలు సుదీప కూడా అనారోగ్యం కారణంగా పెద్దగా చదవలేక పోయింది. దాంతో మంచి ఉద్యోగం సంపాదించలేక పోయింది.

ప్రదీప అప్పుడే పెళ్ళై అత్తారింటికి వెళ్ళటంతో వాళ్ళు తను ఉద్యోగం చెయ్యటానికి ఒప్పుకోలేదు. ప్రదీప తల్లి తండ్రులకు సహాయం చెయ్యాలని అనుకుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోని కారణంగా అమ్మా నాన్నలను చూసుకోలేక పోతున్నానని ఎంతో బాధ పడింది.

వెంకటేశ్వర్లు నెమ్మదిగా కోలుకున్నాక సుదీపకి కూడా పెళ్లి చేసి అత్తారింటికి పంపేసారు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ తనకి వచ్చే జీతంలోనే జీవితం గడపసాగారు.

పెళ్లికి ముందు అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి అని ఎన్నో కలలు కన్న ప్రదీప, పెళ్లయ్యాక ఆ కలలు కలలుగానే మిగిలిపోవటంతో ఎంతో బాధ పడింది.

ఇది ఒక్క ప్రదీప విషయంలోనే కాదు, చాలా మంది పెళ్ళైన ఆడవారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. పెళ్లికి ముందు, పెళ్లిగురించీ, వచ్చే వాడి గురించీ ఎన్నో కలలు కంటారు, ఎంతో ఊహించుకుంటారు. కానీ అందరికీ అవన్నీ నెరవేరవు కదా!

***

You May Also Like

One thought on “ఇది కథ కాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!