స్థితప్రజ్ఞత

స్థితప్రజ్ఞత

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”


ఒకనాడు సుధామ దగ్గరకు వచ్చిన పదేళ్ల స్వప్న.

“అమ్మా!… కరోనా వలన మా ఫ్రెండ్ వాళ్ల నాన్నగారు చనిపోయారట.నాకు చాలా భయం వేస్తుంది అమ్మా!”అంటూ, తల్లి ఒడిలో తలదాచుకుని , మనకి కూడా వస్తుందంటావా!? మనం కూడా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిలా చనిపోతామా?”

“అదేం లేదురా తల్లి!!! అందరికి అలా జరగదు. అస్సలు ఏదైనా జబ్బు వచ్చిందంటే, దానికన్న ముందు, ‘దీనివలన మనం చనిపోతామేమో. దీనికి మరీ మందు లేదు. ఉన్న మన ఒంటికి పడతాయో,లేదో.’అని కొందరు ఆలోచిస్తూ, జబ్బు కన్న ముందు తమ ఆరోగ్యం తామే పాడు చేసుకుంటూ, తమ ప్రాణాలు మృత్యువు కి అప్పగిస్తున్నారు”

“దీనికి ఒకటే పరిష్కారం. ఏది జరిగిన స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం ఒక్కటే దారి”

***

ఆ రాత్రి ఇంకా స్వప్న భయపడటం చూసి, “నీకు ఒక కథ చెప్పనా!? శ్రద్ధగా వింటావా మరీ. ఇలాగే ఒకనాడు నారదుడికి సందేహం వచ్చింది. విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి,

“నారాయణ! నారాయణ!”
“ఏం నారదా! ఏంటి త్రిలోకపు సంగతులు. ఈసారి ,ఎవరి మధ్య ఏం తంపులు పెట్టడానికి వచ్చావు!?…”

“నారాయణ! నారాయణ!”
“ఎంత మాట!? నన్ను చూస్తే ఎప్పుడూ తగువులు పెట్టేవాడిలాగే కనిపిస్తున్నాయి!?… నారాయణ! నాదోక చిన్న సందేహం తీర్చుకోవాలని వచ్చాను”

“అయితే అడుగు నారదా!”

“ప్రభూ! లోకంలో నీ భక్తులు ఇంతమంది ఇలా కష్టపడుతుంటే, ఎప్పుడూ నువ్వు ఇలా ఇంత ప్రశాంతంగా యోగనిద్రలో ఎలా ఉండగలుగుతున్నావో!? ఎప్పుడూ అర్థం కాదు. దయచేసి, నా సందేహం తీర్చవలసింది!”

“నీ సందేహానికి సమాధానం నేను చెప్పడం కంటే, మిథిలనగరంలో జనకమహారాజుని అడిగితే బాగా చెప్తారు. అక్కడికి వెళ్లి, నీ సందేహం తీర్చుకో నారదా! శుభం”

“చిత్తం!”
“నారాయణ! నారాయణ!”

***

“నారాయణ! నారాయణ!”
“దయచేయండి నారదమహార్షి!” అంటూ సభకు వచ్చిన నారదమహార్షి సభలోకి ఆహ్వానించి, ఉచితాసనం మీద కూర్చోబెట్టి, ఆర్ఘ్యపాద్యాదులు (కాళ్లు కడిగి తల మీద నీళ్లు జల్లుకుని, తల మీద పూలు చల్లుతూ పూజించి, పళ్లు, పలహారాలు అందించడం. పూర్వం ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఈ విధమైన మర్యాదలు తప్పనిసరిగా చేసేవారు) సమర్పించి, తగు విధంగా సత్కార్యము చేసారు జనకమహారాజు.

“ఆ తర్వాత ఊరికే రారు మహానుభావులు!?… మీరు వచ్చిన పని సెలవియ్యవలసింది!?”

“రాజా!…నాదోక చిన్న సందేహం. అస్సలు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి!? మీరు చాలా స్థితప్రజ్ఞత గలవారని విన్నాను. దానిని ఎలా సాధించగలిగారు”

మహర్షి!… మంచి సందేహం. ఈ విషయం నేను చెప్పడం కంటే, మీరు అనుభవం ద్వారా తెలుసుకుంటే, బాగా అర్థమవుతుంది”

“ఎవరక్కడా!?…” అంటూ భటులను పిలిచారు మహారాజు.

“చిత్తం ప్రభూ!…”

“ఒక ప్రమిదలో నూనె, వత్తి వేసి, వెలిగించి, తెండి!”

“చిత్తం ప్రభూ!…”

ఆ భటుడు తెచ్చిన ప్రమిదను నారదుని చేతిలో పెట్టి,

“మహర్షి!… ఈ దీపం కొండెక్కకుండా, (ఆరకుండా) ఈ సభభవనం చుట్టి రండి, ఒకసారి”

నారదుడు “సరేనంటూ” దీపం ఆరకుండా ఒక చేతితో దపట్టుకుని, ఒక చేతిని దీపానికి గాలి తగలకుండా అడ్డుపెట్టి, సభభవనం చుట్టి వచ్చారు

“ఇప్పుడు చెప్పండి మహర్షి!? మీరు ఈ సభలో ఏమేమి చూసారు!?”

“నాకు దీపం ఆరకుండా చూడటమే సరిపోయింది. ఇక వేరేవి ఎలా చూడగలను”

“అయితే మళ్లీ వెళ్లి, దీపం ఆరకుండా, అక్కడ. జరిగే సంగతులు చూసి వచ్చి, నాకు చెప్పండి”

నారదమహర్షి దీపం తో సహా, మళ్లీ సభభవనం చుట్టి వచ్చి, తాను చూసిన విశేషాలు, సంగతులు జనకమహారాజుకి చెప్పారు.

“చూసారా మహర్షి!… ముందు మీ దృష్టి అంతా దీపం మీదనే ఉండటం వలన, పరిసరాలు గ్రహించలేకపోయారు. నామమాత్రంగా దీపం మీద దృష్టిపెట్టి, పరిసరాలు గ్రహిస్తే, మనం ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలుస్తుంది!…

అలాగే మానవులు ఎప్పుడూ మాకు అది లేదు. ఇది లేదు .అమ్మో! నాకు కూడా కరుణా వస్తుందేమో !?..
భయపడుతుంటే, రాకుండా ఎటువంటి పరిష్కారాలు తీసుకోవాలో తెలియదు. కనుక ఎక్కడెక్కడి వార్తలు వింటూ, భయపడకుండా, తామరాకు మీద నీటి బోట్టుల మనకు చేతనైన సహాయం చేస్తూ, మనవరకు రాకుండా పరిష్కార మార్గాలు ఆచరించాలి.”

“ఇదే నేను తెలుసుకున్న స్థితప్రజ్ఞత”

ధన్యవాదములు రాజా!… నేను కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ, స్థితప్రజ్ఞత సాధించడానికి ప్రయత్నిస్తాను… ఇక సెలవు”

అంటూ నారదమహర్షి జనకమహారాజు దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు.

“నారాయణ! నారాయణ!”

***

కనుక మనం ఇప్పుడు, కరోనా వలన ఎంతమంది చనిపోయారన్న వార్తలను పక్కన పెట్టి, మనకు, మన చుట్టుపక్కల వారికి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, మనకు అందుబాటులో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తే చాలు.

“మరీ ఇప్పుడు చెప్పు. మనం ఏం చేద్దాం!?”

అమ్మా!… ఇక ముందు ఎప్పుడూ కరోనా వలన ఎంతమంది చనిపోయారన్న విషయం ఎవరికి చెప్పను. నా స్నేహితురాలికి అవసరమైన ఆహారం మన ఇంటి నుంచి అందిద్దామా!? ”

“గుడ్ గర్ల్! తప్పకుండా! రేపు ఉదయాన్నే వంట వండి, మీ నాన్నగారి చేత వాళ్లకు పంపిద్దాం. సరేనా చిట్టి తల్లి”.
అంటూ, ఆలోచిస్తూ,
“నేను వంట చేస్తాను. నాన్నగారు తీసుకెళ్లి, ఇస్తారు. మరీ నువ్వేం చేస్తావు!?”
“నేను నీకు వంటలో సాయం చేస్తానమ్మా! కాయగూరలు బాగా కడిగి, కోస్తాను. నీ వెంట ఉండి నీకు అవసరమైనవి అందిస్తాను”

“అయితే ఇక పడుకో. మనం రేపు తొందరగా లేచి, వంట చేయాలి కదా! చిట్టితల్లీ!”

ఈ కథ కోసం ఉపయోగించుకున్న పురాణకథ సేకరణ నుండి తీసుకోవడమైనది. గమనించగలరు…🙏

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!