నిండు మనస్సు

(అంశం : “మానవత్వం”)

నిండు మనస్సు

రచన: సావిత్రి కోవూరు

ఎప్పటిలాగానే హేమలత ఇద్దరు పిల్లలు, భర్త ని తీసుకుని సమ్మర్ సెలవులు గడపడానికి తను పనిచేసే ఊరు నుండి, అత్తగారి ఊరికి వచ్చింది. అత్త మామగారు తమ పెండ్లి కాకముందే చనిపోయారు. ఆ ఊర్లో బావగారు వాళ్ళుంటారు. ఇల్లు, పొలాలు ఉన్నాయి.

వాళ్ల ఇంటికి కొంత దూరంలో ఒక వాగుంటుంది. ఎప్పటికీ నీళ్ళతో ఉండే ఆ వాగు అంటే హేమలత పిల్లలిద్దరికీ ఎంతో ఇష్టం. ఊరికి వచ్చారంటే ఆ వాగు దగ్గరే ఆడుతుంటారు. అందుకే సెలవులు వచ్చినాయంటే ఎప్పుడు ఊరికి వెళ్దామని ఉత్సాహం చూపుతుంటారు. అందుకే హేమలత తల్లి, వాళ్ళ ఊరికి రమ్మన్నా కూడా పిల్లల సరదాలు కాదనలేక తమ ఊరికే తీసుకు వచ్చింది హేమలత.

రెండు బస్సులు మారి ఊరికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండయింది. ఇంటి కెళ్ళి గబగబ వంట చేసి మొదట పిల్లలకు పెట్టాలనుకుంది. పిల్లలను తీసుకుని తమ ఇంటికి వెళ్లేసరికి ఇంటి తాళం తీసి ఉంది. లోపల పశువులు కట్టేసి ఉన్నాయి. పక్కనున్న వారిని అడిగితే “మీ బావగారు వాళ్ళు నెల రోజుల నుండి మీ ఇంట్లోనే పశువులను కట్టేస్తున్నారు” అని చెప్పారు.

“ఏంటి పశువులను మా ఇంట్లో ఎందుకు కట్టేస్తున్నారు. వాళ్లకు పెరట్లో, వాకిట్లో పశువులు కట్టేయడానికి ‘కొట్టాలు’ ఉన్నాయి కదా.అక్కడ కట్టేయ కుండా, మా ఇంట్లో పశువులను కట్టేయడం ఏంటి”  అని కొంచెం విసుగ్గా.

భర్తతో “మీరు వెళ్లి మీ అన్నయ్య గారిని అడిగి రండి” అని పక్కనే ఉన్న బావ గారి ఇంటికి పంపించింది.

వెళ్ళిన ఈ మనిషి ఒక అరగంట తర్వాత హాయిగా తాంబూలం నములుతూ వచ్చి తాపీగా వాళ్ళ కొట్టంలో పశువులు చలికి, ఎండకి చనిపోతున్నాయట. అందుకని మన ఇల్లు ఖాళీగా ఉన్నది కదా అని కట్టేస్తున్నారట” అని చెప్పాడు.

“అది కాదండి మీరు అడగలేదా మేము ఎక్కడ ఉండాల”ని అన్నది హేమలత బాధగా.

“ఆయన అలా చెప్తుంటే నేను ఎలా అడుగుతాను. పైగా ‘మీ ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ భూములు, ఇళ్లు, ఈ జంజాటం అంతా మీకు ఎందుకు, మంచి రేటు వస్తుంది అమ్మేసేయరాదు.’ అన్నాడే మా అన్నయ్య” అన్నాడు.  రామచందర్ రావు.

ఈయన తెలివి తక్కువ తనానికి నవ్వాలో ఏడవాలో నాకు తెలియట్లేదు. ఆడిగి రమ్మని పంపిస్తే అన్న వదిన పెట్టిన భోజనం తిని వచ్చి భూములను అమ్మమంటున్నాడని చల్లగా చెబుతుంటే నాకు పిచ్చెక్కినట్టు అయింది.

“మనకు పిల్లలు ఉన్నారు ఇల్లు, పొలాలు పంచే టప్పుడు కూడ ఆయనకు ఎక్కువ భాగం, మనకు తక్కువ భాగం ఇచ్చారు. పనికిరాని పొలాలన్ని మనకు ఇచ్చారు. అంత పెద్ద ఇంట్లో ఒక రెండు గదులు మాత్రమే మనకు ఇచ్చారు. అప్పుడు కూడా నేను ఏమన లేదు. ఇప్పుడు అది కూడ వాళ్ళే తీసుకుంటుంటే ఏమి చేయాలి. పిల్లలు ఆకలితో వాలి పోతున్నారు. అయినా పిల్లలను వదిలి పెట్టి, మీరు మీ అన్నయ్య వాళ్ళింట్లో భోజనం ఎలా చేశారు” అని గట్టిగా ఏడ్చేసింది.

పిల్లలని తీసుకుని పక్కన ఉన్న టౌన్ కెళ్ళి  కడుపు నిండా భోజనం పెట్టించి, మళ్లీ ఊరికి వచ్చి పొలమంతా ఒకసారి తిరిగి చూసుకున్నారు. అక్కడి నుండి వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ కు ఫోన్ చేసి జరిగిన సంగతంతా చెప్పింది హేమలత.

దానికి ఆయన “సాయంత్రం నేను వస్తాను మీరు అక్కడే ఉండండి. ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు. మీరు ఆయనతో తల పడలేరు. ఎందుకంటే ఊరికి ఆయనే పెద్ద. ఊళ్లో వాళ్లంతా భయంతోనో, భక్తితోనో ఆయన చేసేది అన్యాయం అని తెలిసినా ఎవరు ఎదురు చెప్పరు. మీ ఆయనకు వాళ్ళ అన్నయ్య అంటే ఎక్కడలేని ప్రేమ. కనుక ఆయన ముందర నోరు విప్పడు.

ఇక ఎంత సేపు పోరాడిన నీవే. అందుకే ఇక ఆ ఇంటి మీద ఆశ వదులుకొని మీ పొలంలో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రెండు రూములు వేసుకోండి. నేను వచ్చి చూసి చెప్తాను” అన్నారు హేమలత వాళ్ళ అన్నయ్య కళ్యాణ్.

“అది కాదన్నయ్య మా ఇంటికి కొంత దూరం లోనే వాగు ఉన్నది కదా. అది పిల్లలకు చాలా ఇష్టం. సెలవులకు వచ్చినప్పుడు అక్కడ ఈతకొడుతూ సరదాగా ఆడుకుంటారు. సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు” అన్నాను.

“అది కరెక్టే నమ్మా కానీ ఆయనకు ఎప్పటినుండో మీ ఇంటిపై కన్ను పడ్డది. మీకు ఇల్లు లేకుండా చేస్తే మీరు ఊరికి రావడానికి ఆసక్తి చూపరని. విసుగు పుట్టి పొలం కూడా అమ్మేస్తారని, చవుకగా తను కొనేసుకోవచ్చని అందరితో చెబుతున్నాడట” అన్నాడు అన్నయ్య.

“నేను ఎప్పటికీ ఆ పొలం అమ్మనియ్యను అన్నయ్యా, అది తరతరాలుగా వస్తున్న ఆస్తి. అది నా పిల్లలు అనుభవించాలి.” అన్నాను.

“సరే అలాగే చూద్దాం” అన్నాడు అన్నయ్య.

సాయంత్రం వచ్చి చెట్టు కింద బ్యాగులు, పిల్లలను పెట్టుకుని కూర్చున్నా చెల్లెలి దగ్గరికి వచ్చాడు హేమలత వాళ్ళ అన్నయ్య కళ్యాణ్.

“నీకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయరు. పోనీ నీవు ఎప్పటికీ ఇక్కడే ఉంటే వేరు. ఇప్పుడు పోరాడి స్వాధీనం చేసుకున్నా, నీవు వెళ్ళగానే మళ్ళీ కబ్జా చేస్తాడు. దాని బదులుగా ఆ ఎత్తైన ప్రదేశంలో రెండు గదులు వేసుకుంటే చుట్టుపక్కల చెట్లు చేమలు అన్నీ పచ్చగా కనిపిస్తాయి. వాతావరణం చాలా బాగుంటుంది” అన్నారు కళ్యాణ్.

“సరే అన్నయ్య నేను మళ్ళీ సంక్రాంతి సెలవులకు వచ్చేసరికి నాకు ఇల్లు రెడీగా ఉండాలి. ఇంటి చుట్టూ పెద్ద వసారాలు వేయి. నీవు ఎలాగైనా బిల్డర్ వే కదా. ఎంత డబ్బు అవుతుందో నాకు చెప్పు” అన్నది హేమలత.

“నీవు వచ్చేసరికి ఇంకా ఆరు నెలలు ఉంది. కనుక నీకు ఇష్టమైనట్టుగా కట్టిస్తాను.” అన్నాడు కళ్యాణ్. అలాగే సంక్రాంతి వచ్చేసరికి ఇంటి చుట్టూ వసారాలతో మంచి ఇల్లు కట్టించాడు. ఇంటికి ఒక వైపు ఊరు, ఒక వైపు తమ పొలాలు ఉండటంతో చాలా సంతృప్తి చెందింది హేమలత.

ఇక ఏ ఆటంకం లేకుండా హాయిగా సెలవులకు ఊరికి వచ్చి వెడుతున్నారు. పాత ఇల్లు, వాకిలి పూర్తిగా  కబ్జా చేసుకున్నాడు లక్ష్మణ్ రావు నిర్లజ్జగా.

అయినా కూడా ఆయనకి తృప్తి లేదు. ఇల్లు లేకుండా చేస్తే పొలాలు అమ్ముకుంటారేమో, చాలా చవకగా తను కొనెయ్యాలి అనుకున్నాడు.

రోజులు వేగంగా గడుస్తున్నాయి. రామ్ చందర్ రావు, హేమలతలు రిటైర్డు అయ్యి ఊర్లోనే ఉండసాగారు. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడ్డారు.

ఆ వూరి వాగును చూసిన గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేయించి ఆ వాగుపైన “కత్వా” కడితే చుట్టుపక్కల ఊళ్ళ పొలాలకి నీరు అందించవచ్చని అనుకుని దానిపైన కత్వా (చిన్న ఆనకట్ట) కట్టించారు. దానివల్ల వీళ్ళ గ్రామానికి ఉపయోగమేమి లేదు. ఎందుకంటే కత్వా రిజర్వాయర్లో ఊరి వాళ్ళ ఇళ్ళు ఎన్నో మునిగిపోతున్నాయి. పక్క గ్రామాలకు నీరు అందించడానికి కూడా ఈ ఊరి వాళ్ళ పొలాల నుండి కాల్వలు తవ్వుతారు. అందువల్ల ఎందరివో పొలాలు తగ్గుతాయి. వాటికి నష్ట పరిహారం ఇస్తామంటారు. వాళ్ళ లెక్కలు అవన్ని తేలేసరికి ఏండ్లు గడిచిపోతాయి.

సర్వే చేసినవాళ్లు గవర్నమెంట్ ల్యాండ్ చూసి ఇళ్ళు పోయిన వాళ్ళకు అక్కడ ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ అది ఎప్పుడు అవుతుందో ఆ దేవుడికే తెలియాలి.

లక్షణ్ రావు పొలములో కూడా కాల్వ కింద చాలా పోయింది. ఒక రోజు అర్ధరాత్రి విపరీతమైన వర్షం పడి వాగుకు దగ్గరగా ఉన్న ఇళ్ళన్ని జలమయమై పోయినాయి. ఆ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళంతా ఉన్నపళంగా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అందరు ఎత్తుపైన ఇల్లు కట్టుకున్న హేమలత వాళ్ళింటికి వచ్చారు. వాళ్ళకు తమ ఇంట్లో ఉన్న బట్టలు, దుప్పట్లు సర్దుబాటు చేసి వసారాలలో పడుకోమని చెప్పింది హేమలత.

లక్ష్మణ్ రావు ఇల్లు కూడ జలమయమయ్యింది. ఆయన భార్య జ్వరంతో ఉన్నది. జ్వరంతో ఉన్న భార్యను తీసుకొని సిగ్గు పడుతూ తమ్మునింటికి వచ్చాడు లక్ష్మణ్ రావు. అతనిని చూసిన హేమలత పాత విషయాలేమి పట్టించు కోకుండ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఆదరించింది.

అన్యాయంగా తమ్ముని కుటుంబానికి నిలువ నీడ లేకుండ చేసి వాళ్ళ భూమి కాజేద్దామనుకుంటే తన ఇల్లే  నీళ్ళలో మునిగి సర్వస్వం కోల్పోయి వాళ్ళ అండనే చేరాల్సి రావడం ఎంత దురదృష్టకరం. అయినా హేమలత పాత విషయాలేమి మనసులో పెట్టుకోకుండ మానవత్వంతో అందరిని ఆదరించి తోచిన సహాయం చేసింది.

ఊరి వాళ్ళందరికీ లక్ష్మణరావు తమ్ముని కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు అని తెలిసినా, ఊరిపెద్ద కనుక ఏమీ అనలేక పోయారు. కానీ మనసులో మాత్రం దేవుడు లక్ష్మణ్ రావుకు మంచి శిక్ష వేశాడు అనుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ తనకు వ్యతిరేకంగా తమ బావగారి వైపే మాట్లాడి తనకు ద్రోహం చేసినవాళ్లే అయినా, అవి మనసులో పెట్టుకోకుండా సహాయం చేసి మానవత్వం చాటుకున్నది హేమలత. దానివల్ల ఆయన తలదించుకొని “నన్నుక్షమించమ్మా” అన్నాడు.

“మనం మనుషులం బావగారు తప్పులు చేయడం సహజం. చాతనైతే ఇతరులకు సహాయం చేయాలి. కాని కీడు మాత్రం చేయరాదని నమ్మిన దాన్ని నేను. మీరేం ఆలోచించకుండ ఇష్టమున్నన్ని రోజులు మీ తమ్మునింట్లో ఉండొచ్చు” అని అన్నది హేమలత నిండు మనసుతో.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!