తొందరపాటు

తొందరపాటు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

పూర్వము ఉదయ సేనుడు అను రాజు మగధ సామ్రాజ్యమును పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ప్రజలకు ఏ లోటు రాకుండా, ఏ కష్టాలు రాకుండా కన్నబిడ్డలవలె పరిపాలించేవాడు. అతని సామ్రాజ్యము సిరి సంపదలతో తులతూగుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. కానీ ఆ రాజుకు సంతానము కలుగలేదు. సంతానం కొరకు ఎన్నో పుణ్య క్షేత్రాలు దర్శించాడు. ఎన్నో నదులలో స్నానమాచరించాడు. ఎన్నో యాగాలు, పూజలు, దానధర్మాలు చేశాడు. కానీ సంతానభాగ్యము మాత్రము కలుగలేదు. చివరికి ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు ఒక కుటీరమున ఒక మునీశ్వరుడుండగ, ఆ మునిని దర్శించి తనకు సంతాన భాగ్యము కలుగలేదని, ఎలాగైనా సంతానం కలిగే మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆ మునీశ్వరుడు ఒక ఫలమును ఇచ్చి “ఈ ఫలమును ఆ సర్వేశ్వరుని ముందుంచి తమ కోరికను ఆ సర్వేశ్వరుని విన్నవించి అనంతరం ఆ ఫలమును రాణిగారిని తినమని చెప్పండి. మీ కోరిక తప్పకుండ నెరవేరుతుంది” అన్నాడు.  మునీశ్వరుడు చెప్పిన విధంగానే రాజుగారు ఆ ఫలమును తీసుకొని వచ్చి రాణి సునందనాదేవి గారికి ఇచ్చి మునీశ్వరుడు చెప్పిన మాటలను చెప్పెను. రాణి సునందనా దేవి ఆ సర్వేశ్వరునికి పూజ చేసి తన కోరిక విన్నవించి ఆ ఫలమును భుజించగ కొన్ని రోజులకు సునందనా దేవి గర్భము దాల్చి పనస పండు లాంటి మగ పిల్లవానికి జన్మనిచ్చెను. తన కుమారుని చూసిన రాజుగారి ఆనందమునకు అంతే లేదు. రాజ్యములోని ప్రజలందరూ ఎంతో సంతోషంతో పండగ చేసుకున్నారు. ఆ విధంగా సంతోషంగా రెండు సంవత్సరములు గడిచిపోయినవి. ఒకరోజు మళ్ళీ రాజుగారు తనకు సంతానార్థం ఫలమును ఇచ్చిన మునీశ్వరుని దర్శించుటకు రాజభటులతో బయలుదేరాడు. ఆ సమయమున మునీశ్వరుడు విశ్రాంతి తీసుకొనుచుండగా అతని దర్శనమునకై కుటీరము బయట వేచి ఉండగా, ఒక పెద్ద సర్పము కుటీరంలోనికి ప్రవేశించుట గమనించిన రాజుగారు ఆ సర్పము మునీశ్వరునికి హాని చేయునేమోయని తలచి భటులతో మునీశ్వరునికి నిద్రాభంగం కలగకుండా సర్పమును పట్టుకోమని ఆజ్ఞాపించెను.
కుటీరంలోనికి ప్రవేశించిన రాజభటులకు ఎంత వెతికినా సర్పము కనిపించలేదు. చివరకు  కుటీరం పై కప్పులో దూరుచున్న సర్పమును కాంచి కప్పును విప్పదీసి సర్పమును పట్టుకొని దూరంగా వదిలి వేయుటకు వెళ్ళిరి. ఆ సమయంలోనే మునీశ్వరుడు మేల్కొని తన కుటీరమంతయు కప్పు లేకుండ చిందరవందరగా ఉండుట కాంచి కోపోద్రిక్తుడై తన ఎదురుగా నున్న రాజుగారే ఈ విధంగా చేయించెనని తలచి, రాజుగారి మాటలను వినిపించుకోకుండా “రాజా నీకు నేను చేసిన మేలు మరచి, కృతఘ్నుడవై నాకు నివాసమే లేకుండా చేసితివి. కనుక నీవు కూడా మీ నివాసంలో  నివసించే హక్కును కోల్పోదువు గాక” అని రాజు గారి పై మంత్ర జలమును చల్లెను. వెంటనే రాజుగారు గుర్తు పట్టని విధముగా రూపము మొత్తము  మారిపోయింది. రాజుగారు మునీశ్వరుని శాంతింప జేసి సర్ప వృత్తాంతమంతయు వివరించగా నెమ్మదించిన మునీశ్వరుడు తన తొందరపాటు  చర్యకు ఎంతో చింతించెను. రాజుగారు శాపవిముక్తికై ప్రార్థించగా నిన్ను రాజ్యంలోని ఎవ్వరు కూడా గుర్తించరు. నీవు కూడ నీవెవరో నీ నోటితో చెప్పరాదు. అలా చెప్పినట్టయితె నీ కొత్త రూపమే శాశ్వతమై నీవెప్పటికి రాజభవనం లోనికి వెళ్ళలేవు. కానీ నీ కుమారుడు ఒక్కడు నిన్ను గుర్తుపట్టగలడు. నీవు రాజభవనంలో  గల నీ పాదరక్షలుగానీ, దండము గాని,క కిరీటము గాని, నీ దుస్తులు కాని నీ వస్తువేదయిన నీవు తాకినట్లయితే నీ శాప విముక్తి కలిగి మునుపటి రూపము సంప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. సర్పమును దూరంగా వదిలి వచ్చిన రాజభటులు ఎదురుగానున్న రాజుగారిని గుర్తించక రాజుగారి కొరకు వెతుకుతూ వెళ్లారు. వారికి రాజుగారు కనిపించక పోయేసరికి రాజభవనమున ఉన్న రాణి గారితో రాజుగారు తమకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయారని, ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని సమాచారం తెలిపిరి. రాణి సునందనాదేవి రాజు గారు ఎటు వెళ్ళినారో, ఎలా ఉన్నారో, ఏదైనా ఆపద వాటిల్లినదేమో అని పరిపరివిధముల చింతించుచు దుఃఖించసాగెను. ఎన్ని రోజులు గడిచినా రాజు గారి ఆచూకి దొరక లేదు. రాజుగారు తన శాపము వలన కలిగిన కొత్తరూపముతో రాజభవనంలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించగా భటులు రాజును రాజభవనం లోనికి వెళ్ళకుండ అడ్బగించినారు. రాజుగారు బయటనే సంచరించుచు గడప సాగిరి. చివరకు రాజు గారికి రాజభవనంలోని ఉద్యానవనమునకు మునుపు తాను త్రవ్వించిన సొరంగ మార్గం జ్ఞాపకం వచ్చి, ఆ సొరంగ మార్గము ద్వారా రాజభవనంలోని ఉద్యానవనము లోనికి ప్రవేశించెను. మేడపైన గవాక్షము గుండా వీక్షించుచున్న రాజకుమారుడు ఉద్యానవనంలో తన తండ్రిని చూసి సంతోషముతో గట్టిగా చప్పట్లు కొడ్తు “నాన్నా నాన్నా” అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న రాణి గారు రాజుగారు వచ్చారేమో నని గవాక్షం గుండ క్రిందకి చూడగా అక్కడ ఎవరో తెలియని వ్యక్తి తచ్చాడడం కనిపించింది. ఆ వ్యక్తిని పట్టుకొమ్మని భటులకు ఆజ్ఞాపించగా చిక్కకుండా తప్పించుకుని పారిపోయెను. ఆ విధముగానే పసి పిల్లవాడు మాత్రమే తండ్రిని గుర్తించి ప్రతిరోజూ పిలవడము రాణిగారికి అపరిచిత వ్యక్తిగా కనిపించేసరికి ఆ వ్యక్తి పై కోపంతో అచట గల రాజుగారి పాదరక్షలను తీసుకుని అతనిపై విసిరి వేశారు రాణిగారు.
రాజుగారికి ఆ పాదరక్షలు తాకిన మరుక్షణమే రాజుగారు మునుపటి రూపముతో ప్రత్యక్షమైనాడు. రాణి సునందనాదేవి గారు రాజుగారిని చూసి సంతోషంతో రాజుగారిని రాజభవనం లోనికి తీసుకు వెళ్ళినారు. ఆ విధముగా శాప విముక్తుడైన రాజు పది కాలాల పాటు ప్రజలను మనోరంజకంగా రాజ్యపాలన చేస్తు భార్య కొడుకుతో కలసి సుఖముగా ఉండ సాగెను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!