నిరంతర ప్రయాణం

(అంశం:: “సాధించిన విజయం”)

నిరంతర ప్రయాణం

రచన :: అనురాధ

ఉదయాన్నే లేచి ఇంటి పనులు చూసుకొని, షాప్ ఓపెన్ చేసుకుంది సుశీల, షాపులో దేవుడికి దండం పెట్టుకొని, తాను కూర్చొనే బెంచి, ఛైర్ తుడుచుకొని కూర్చుంది. ఇంకా ఎవరూ వచ్చేలా అనిపించలేదు, కాసేపు కూర్చొని భర్త క్రిష్ణమూర్తి కి ఫోన్ చేసింది, త్వరగా వచ్చి షాప్ లో ఉండమని చెప్పటంతో, క్రిష్ణమూర్తి వచ్చాడు, భర్త రాగానే సుశీల లోపలికి వెళ్లి కాస్త టిఫిన్ చేసి, మళ్ళీ వచ్చి కూర్చుంది.
వెళ్ళండి, వెళ్లి మిగిలిన సరుకులు, కూరగాయలు మార్కెట్ కెళ్ళి తీసుకురండి అంది సుశీల.
రేపు వెళ్తానులే సుశీ….. ఈరోజు ఎటిఎం దగ్గర డబ్బులు తీసుకొని, రేపు వెళతాను అన్నాడు క్రిష్ణమూర్తి.
ఇప్పటికే షాప్ లో అన్ని సరుకులు అయిపోతున్నాయి, మళ్ళీ నష్టాలు వస్తాయి, అంది సుశీల.
ఏమి చేయమంటావు సుశీ, నాకేమో అవేవో “పే టీఎం, గూగుల్ పేలు”, ఇంకా ఏదో వుంది, అవి చేయటం రావడంలేదు.
చేతికి డబ్బులు ఇవ్వటం, తీసుకోవటం బాగా అలవాటు అయ్యింది. ఈ ఫోన్ చూస్తే ఏమి అర్థం కావడంలేదు.
ఈ మధ్య ప్రయత్నం చేద్దామంటే, వాళ్ళు చేసే హడావిడికి నాకు ఇంకా కంగారుగా ఉంటోంది, ఈ ఎటిఎం కూడా అంతే అనుకో, సాయంత్రం వెళ్లి డబ్బులు తీసుకొచ్చి రేపు పొద్దున్నే వెళ్లి అన్ని తీసుకొస్తానులే సుశీ అన్నాడు క్రిష్ణమూర్తి.
ఇంకేమి మాట్లాడలేదు సుశీల.
ఇంకోవైపు వున్న “ఫాన్సీ స్టోర్” కూడా ఓపెన్ చేసి కూర్చుంది, గిట్టుబాటుని బట్టి, రెండింటిని ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు.
పిల్లలు వున్న ఉద్యోగాల పేరుతో దూరంగా ఉన్నారు.
జీవితంలో ఆటుపోట్లు సహజం కానీ, ఈ మధ్య “అభ్యుదయం వైపు అడుగులు” అని చెబుతూ “డిజిటల్ ఇండియా” పేరుతో అందరూ అయోమయానికి గురి అవుతున్నారు అనుకొని నిట్టూర్చింది సుశీల.
ఒక అబ్బాయి వచ్చి ఆంటీ, టీ పౌడర్ ఇవ్వండి అని అడిగాడు.
ఇచ్చాక ఆ అబ్బాయి డబ్బులు ఇవ్వకుండా, ఫోన్ తీసి స్కానర్ లేదా? అని అడిగాడు, గోడ వైపు చూపించింది సుశీల. స్కాన్ చేస్తే మెసేజ్ సౌండ్ వచ్చేసరికి, ఒక బ్లూ (కరెక్ట్ మార్క్) టిక్ చూపించి వెళ్ళిపోయాడు.
సుశీల ఒక్క నిమిషం నిట్టూర్చి ఆలోచనలో పడిపోయింది.
ఒకప్పుడు ఇలా షాప్ పెట్టుకోవడమే విశేషం గా వుండేది. ప్రతి రోజు జనాలు గుంపులు గుంపులు నిలబడుకొని, తీసుకొని డబ్బులు ఇచ్చి ఆనందంగా వెళ్లిపోయేవారు.
స్టిక్కర్స్, నైల్ పాలిష్లు అని అమ్మడం మొదలుపెట్టాం. పండక్కు వచ్చిన మనవడు సెపరేట్ గా అమ్మితే ఇంకా లాభం వుంటుంది అని చెబితే, “ఆలోచనకు చిన్న పెద్ద లేదనుకుని” మొదలుపెడితే వాడన్నట్టు మంచి లాభాలే వస్తున్నాయి.
ప్రతి మనిషి జీవితంలో వైఫల్యాలు వచ్చిన వాటిని మెటికలుగా (స్టెప్స్) చేసుకొని ముందుకు సాగుతున్నాడు.
ఎక్కడ కష్టం లేదు, ప్రతి చోట ఏదో ఒక కష్టం ఉండనే ఉంటోంది. కానీ ఈ మధ్య “నోట్లు బ్యాన్ చేసాక” కష్టం కాస్త ఎక్కువ అయ్యింది.
ఎందుకంటే ఇంతకు ముందు బ్రతికినట్టు ఏది ఉండటంలేదు. నోట్లు రద్దు చేసాక “2000” రూపాయలు నోటు కోసం ఎటిఎం ముందర మా ఆయన అర్థరోజు కాసుకున్నాడు. అయిన నాలుగు వేలు మాత్రమే వచ్చాయి అని చెప్పినప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు ఇప్పటికీ మరచిపోలేదు.
నా డబ్బులు నేను తీసుకోవటానికి ఇంత సేపా? అని బాధ, చేతిలో వున్న డబ్బులు బ్యాంకు లో వేయటానికి ఎదురుచూపు, లైన్లో నిలబడటం ఏది మరచిపోక ముందే, ఆన్లైన్ పెమెంట్స్ అంటూ పిల్లలు చేసే హడావిడి, అర్థం కాకపోయినా వింటూ నేర్చుకుంటున్నాను.
మా ఆయనకు అంత గమనము లేకపోవడం వలన ఇంకా వంట పట్టడం లేదు.
ఇంకో అబ్బాయి వచ్చాడు, అంటీ అది అని నసిగాడు, చెప్పు కుమార్ ఏమి కావాలి అని అడిగింది సుశీల.
ఇంకా డబ్బులు చేతికి అందలేదు, తరువాత ఇస్తాను, రైస్ కావాలి అంటీ అని అడిగాడు.
వెళ్లి ఒక అయిదు కిలోలు ఇచ్చాను, సారీ ఆంటీ, ఈసారి ఇస్తాను అని చెబితే, పర్వాలేదు కుమార్, నాకో సాయం చేస్తావా? అని అడిగాను.
చెప్పండి ఆంటీ అని అనటంతో, ఆన్లైన్ పెమెంట్స్ గురించి అడిగాను.
ఫోన్ ఇవ్వండి ఆంటీ చూపిస్తాను అన్నాడు.
ఫోన్ తీసుకొని, కుమార్ కి బాగా తెలుసనుకుంటా టక టక అని అన్ని ఓపెన్ చేస్తుంటే, అర్థం కానట్టు చూసాను, కంగారు పడకండి, సెట్టింగ్స్ తెలుగులో పెట్టి మీకు నేర్పిస్తాను అని చెప్పటం, చూపించటం చేసాడు.
డబ్బులు ఎలా పంపించాలి, ఎలా తీసుకోవాలి అని చూపించాడు. వెళ్ళిపోయాడు.
ఒకే రోజు చూస్తే రాదు కదా, నా పరిస్థితి కూడా అంతే, ఆరోజు అర్థం అయ్యింది కానీ, మళ్ళీ గుర్తు లేదు. మనవడు వీడియో కాల్ చేస్తే మాట్లాడటం తప్ప, మళ్ళీ మాములే…….
కుమార్ వస్తే మళ్ళీ అడిగాను, ఓపికగా చూపించాడు. ఈ మధ్య ఫాన్సీ స్టోర్ కి వచ్చే అమ్మాయిలను కూడా అడిగి తెలుసుకుంటున్నాను. తెలియదని చిన్న చూపు చూడకపోయినా, అంతో ఇంతో నేర్పిస్తున్నారు.
ఇప్పుడు పర్వాలేదు, కాస్త నేర్చుకున్నట్టే, మా ఆయనకు కూడా నేర్పించటం మొదలుపెట్టాను. నేర్చుకుంటున్నారు కానీ మరచిపోతున్నారు.
కానీ మార్కెట్ కి వెళ్ళాక, డౌట్ వస్తే, ఫోన్ చేసి మరీ అడిగి కనుక్కొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. చదువు రాకపోయినా వాడుక భాష నేర్చుకోవాల్సి వస్తోంది.
కుమార్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసి థాంక్స్ ఆంటీ, అప్పు ఇస్తున్నందుకు అన్నాడు. నేను అప్పు ఇచ్చినా నాకు నువ్వు “ ఎలా ట్రాన్స్ఫర్” చెయ్యాలో నేర్పించావు కదా కుమార్. నేనే నీకు థాంక్స్ చెప్పాలి అన్నాను.
అదేముంది ఆంటీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని అనుమానించకుండా నమ్మి అడగగానే “అప్పు” ఇస్తున్నారు, మీలాంటి వాళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు బ్రతకటం కష్టం.
మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు, మాలాంటి వాళ్లకు ఒకింత మార్గదర్శమే, ఎందుకంటే, మాకు నిరత్సాహం వచ్చినప్పుడు మీరు అన్ని అర్థం చేసుకొని సమాజంలో ముందుకు సాగుతుంటే ఒకింత స్ఫూర్తే కదా.
మీకు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళంత నాలెడ్జ్ లేకపోయినా, మీరే ముందు డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు.
ఇలా ప్రతి షాప్ పెట్టుకున్నవాళ్లకు అర్థం కాకపోయినా నేర్చుకొని మరి ఆదర్శంగా నిలుస్తున్నారు, మీకే హ్యాట్సాఫ్ చెప్పాలి అని వెళ్ళిపోయాడు కుమార్.
నిజమే కదా, “కొత్త క వింత పాత ఒక రోత” అన్న సామెతలాగా ప్రతి రోజు జీవితంలో కొత్త పాఠం నేర్చుకోవలసిందే, “ప్రతిరోజు విజయం సాధించాల్సిందే”,
“ప్రయత్నం ఎప్పటికి వృధాకాదు “
వైఫల్యం ఎప్పుడూ మనతో వుండదు, అది శాశ్వతం కాదు.
“ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నం కూడా చిరు విజయాలను” అందిస్తుంది అని అర్థం చేసుకొని, మన జీవన ప్రయాణానికి విజయం అనే చిరుదివ్యలు అందిస్తూ ముందుకు సాగటమే అనుకుంటూ రెండు షాప్ లు క్లోజ్ చేసి ఇంటిలోకి వెళ్ళిపోయింది సుశీల.

“శుభం”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!