మీరు దెయ్యాన్ని చూశారా?

(అంశం:: “సాధించిన విజయం”)

మీరు దెయ్యాన్ని చూశారా?

రచన :: నాగ మయూరి

నానమ్మ చెప్పే భట్టీ విక్రమార్క కథలు ప్రతిరోజూ వింటూ పెరిగిన భైరవికి ఆ కథలలో ఉండే భేతాళుడిని చూడాలని కోరిక. అదే మాట నానమ్మ కి చెప్పి , “భేతాళుడు ఎక్కడ ఉంటాడు అని అడిగింది”.
ఈ కథలన్నీ ఎప్పుడో రాజుల కాలంలో జరిగినవి. ఇప్పుడు వాళ్ళు ఎవరూ మనకు కనిపించరు అని నానమ్మ చెప్పింది.

భైరవి పెద్దయిన తర్వాత కూడా అలాంటి కథలు ఎంతో ఇష్టంగా చదువుతుండేది. రాను రాను భైరవిలో ఎలా అయినా దెయ్యాన్ని చూసి తీరాలన్న కోరిక బలంగా కలిగింది. అందుకోసం ఆమె కనపడిన వారందరినీ “మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా? ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటూ ప్రశ్నించేది”.

యుక్త వయస్సుకి వచ్చిన భైరవి కోసం తండ్రి పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరటం లేదు.

మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా..?
మన పెళ్ళి అయ్యాకా నాకు దెయ్యాన్ని చూపిస్తానని మాటిస్తారా?…అంటూ భైరవి అడిగే ప్రశ్నలకు భయపడి పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయిలు అందరూ వచ్చిన దారినే పారిపోతున్నారు.

ఈ విషయం తెలిసి ఆ అమ్మాయికి పిచ్చి అంటూ బంధువులలో కొందరు గిట్టని వాళ్ళు చేసిన ప్రచారంతో సంబంధాలు రావడం కూడా తగ్గిపోయాయి….

తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భైరవి వినకుండా మంకుపట్టు పట్టడంతో విసిగిపోయిన తండ్రి, చివరికి ఒక భూతవైద్యుడిని వెతికి తీసుకువస్తాడు.

అతని వృత్తి దెయ్యాలని పట్టుకుని బంధించడం. అని తెలుసుకున్న భైరవి “రాజుగారి గది” సినిమాలో నాగార్జునలా నా భర్త దెయ్యాలతో మాట్లాడతాడు అంటూ సంబరంగా అతడిని పెళ్ళి చేసుకుంది.

అబ్బ! చక్కగా రోజుకో దెయ్యాన్ని చూడచ్చు అన్న ఆనందంతో అత్తవారింట్లో అడుగు పెట్టింది.

మొదటిరోజే భర్తని తనకి దెయ్యాన్ని చూపించమని అడిగింది….భార్య కోరిక ప్రకారం అతను ఒక చిన్న సీసాలో బంధించిన దెయ్యాన్ని చూపించాడు.

దెయ్యాన్ని చూసిన భైరవి సంతోషానికి అవధులు లేవు. ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది….

ఆ సీసా మూత తీసి “రావే నా రక్తపిపాసి” అంటూ ఆ భూతవైద్యుడు పిలవగానే అది భయటకి వచ్చి, భైరవితో బోలెడన్ని కబుర్లు చెప్పింది.

భైరవి తను సాధించిన విజయాన్ని, దెయ్యం కబుర్లని తలచు కుంటూ కొంతకాలం ఆనందంగా గడిపేసింది.

ఒకరోజు భర్త ఎవరికో దెయ్యం పడితే వదిలించడానికని వెళ్ళి వచ్చాడు. లోపలికి రాగానే భైరవి వెళ్ళి ఏది! నాకు కొత్త దెయ్యాన్ని చూపించరూ అంటూ ఆత్రంగా అడిగింది…
అతను సంచిలో నుంచి సీసా భయటకి తీశాడు. తీరా చూస్తే అందులో ఉన్నది ‘రక్తపిపాసి’.

“ఇదేంటి కొత్త దెయ్యం లేదా” అంది ఆశ్చర్యంగా…
“ఇది మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న పెంపుడు దెయ్యం. దీనిని నేనే ఎవరిమీదకైనా వదులుతాను, వాళ్ళు ఎంత మంది దగ్గరకి వెళ్ళినా, ఎవ్వరూ వదల్చలేరు.
నా పెంపుడు దెయ్యం కాబట్టి నా మాట వింటేనే భయటకి వస్తుంది. దాంతో వారు నేను అడిగినంత డబ్బు ఇస్తారు అంటూ అసలు రహస్యం చెప్పాడు”.

అయ్యో మీ దగ్గర ఈ ఒక్క దెయ్యమే ఉందా!. నన్ను ఎంత మోసం చేశారు. మిమ్మల్ని పెళ్ళి చేసుకుని చక్కగా రోజుకో దెయ్యం చూస్తానంటూ నా స్నేహితులు అందరికీ గొప్పలు చెప్పానే ఇప్పుడెలా….

రకరకాల దెయ్యాలని చూడాలనే నాకోరిక నెరవేరదా… అంటూ ఏడుస్తున్న భైరవిని ఆమె భర్త “నా వల్ల నీ జీవితం లో కనీసం ఒక్క దెయ్యాన్ని అయినా చూడగలిగావు…
అంటే నువ్వు నీ కోరిక ని తీర్చుకున్నావు. ఇది నువ్వు సాధించిన విజయం కాబట్టి సంతోషంగా ఉండాలి” అంటూ సముదాయిస్తున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!