మట్టిలో మాణిక్యం

(అంశం:: “సాధించిన విజయం”)

మట్టిలో మాణిక్యం

రచన :: నామని సుజనాదేవి

స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న రమణి కి తెలీదు. ఇంటికి వెళ్ళగానే తన జీవితం లో పెద్ద మలుపు సిద్ధం గా ఉందని. ఫ్రెండ్స్ అందరితో నవ్వుతూ మాట్లాడిన ఆమె, ఇంటికి వెళ్ళగానే ఏడ్చే పరిస్థితి వస్తుందని అనుకోలేదు.
ఇంటి బయటనే నాలుగైదు జతల చెప్పులు, లోపలి నుండి అపరిచితుల నవ్వులు, మాటలు ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారని తెలుపుతుంటే ఒకింత ఆశ్చర్యం తో లోనకెల్లింది. అందరి చూపులు ఒకేసారి ఆమె వైపు తిరిగాయి.
చిన్న గుడిసె కన్నా కొంచెం పెద్దది , ఇల్లు కన్నా కొంచెం చిన్నది అయిన ఆ ఇంట్లో రెండే రూములు. వంట గది ఒకటి, హాలు పడక అన్నీ ఒకటే అయిన గది ఒకటి. నలుగురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, రమణి అమ్మ నాన్నలు , రమణి తమ్ముడు ఉన్నారు. కింద చాప మీద ఆడవాళ్ళు, కుక్కి మంచం లో మగవాళ్ళు కూర్చుని ఉన్నారు.
‘అదిగో వచ్చింది..’
‘ఎంత బావుంది….’లాంటి మాటలు అయోమయంలో ముంచేసాయి ఆమెను .
‘రా…బిడ్డా… రా …’ ఎప్పుడూ తాగిన మత్తులో ఉండే నాయన మాంగ్య ఆప్యాయంగా పిల్చాడు.
‘అట్ల చూస్తానవెందే … వచ్చి …మొహం కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని రా..’ తల్లి లచ్చిమి వచ్చి లోపలికి లాక్కుపోయింది.
‘ఎందమ్మా…. ఎవలాళ్ళు…. నా కోసమెందుకు సూస్తాండ్రు …..’ అయోమయంగా అడిగింది రమణి .
‘లచ్చాధికారులు … నిన్ను పెళ్ళి చేసుకోనికి వచ్చిండ్రు…నీ అద్రుట్టం (అదృష్టం) బాగున్నది …తొందరగా తయారుకా ‘తల్లి మాటలు పూర్తికాక ముందే చెయ్యి విదిలించుకుని శివంగిలా లేచింది రమణి.
‘ఏందీ… పెళ్ళా…నాకా…. నాకిప్పుడు పన్నెండేళ్ళు ..గంతే ..నేను పెళ్లి చేసుకునుడేంది….’
‘ఉష్..నెమ్మదిగా మాట్లాడు ..ఆల్లు ఇంటరు ….ఇగ మాలెక్క గీ కూలి పనులకు పోనక్కర లేదు..జీవితాంతం సుఖంగా ఉండొచ్చు….’
‘నాకే సుఖం వద్దు…. నాకసలు పెళ్ళే వద్దు…నేను చదువుకుంటాను….’
‘నఖ్రాలు అయితాందా…. చదువుకున్న తర్వాత అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కదా …నోర్ముయ్యి…’
‘ఏమైందే…ఇక్కడ ఎదురు చూస్తాండ్రు ..తొందరగా తీస్కరా…’ అంటూ లోపలికి వచ్చాడు మాంగ్య.
‘అగొ నీ బిడ్డ కు పెళ్లి వద్దట..సదువుకుంట దట…’
‘పిచ్చి పిచ్చి మాటలొద్దు..అయినా దాన్ని అడుగుడేందే…. అక్కడ మాట ముచ్చట్లు కూడా అయిపోయాయి..’ అంటూ బలవంతాన రమణి ని తీసుకుని వచ్చారు… పావుగంటలో వారు వెళ్ళిపోయారు.
రమణి ఎంత ఏడ్చి మొత్తుకుని తల్లితండ్రి కాళ్ళవేళ్ళ పడినా, వారి నుండి తీసుకున్న డబ్బుకు ఆశపడి ముప్పై ఏళ్ల వ్యక్తీ తో మరో పదిరోజులలో పెళ్లి ముహూర్తం నిర్ణయించేశారు. అప్పటి వరకు స్కూల్ కి కూడా వెళ్ళకుండా కట్టుదిట్టం చేసారు. దేవుడా నీదే దిక్కు అని ఏడుస్తూ మొక్కింది రమణి.
సరిగ్గా పెళ్ళికి ఓకే రోజు ముందు పోలీసులు వచ్చి రమణి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ చేసి, అబ్బాయి వాళ్ళను బెదిరించి పంపేసారు. వాళ్ళకెలా తెల్సిందంటే రమణి ఒక చిన్న ఉత్తరం టీచర్ కి రాసి తన ప్రాణ స్నేహితురాలికి ఇచ్చి పంపింది. దానితో టీచర్ బాల్యవివాహాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం వారు రావడం జరగడంతో ఇక రమణి చదువుకు అడ్డు లేకుండా పోయింది.
అయితే పదో తరగతి పరీక్ష రాసే రోజు ఉదయం తండ్రి చనిపోయాడు. రమణి కి ఏం చేయాలో తోచలేదు, ఇక తను పరీక్ష అటెండ్ కావడం అసంభవం అనుకుని ఏడుస్తుంటే టీచర్ వచ్చి అక్కడి వారిని ఒప్పించి ఆయన బండి మీద సరిగ్గా సమయానికి పరీక్ష సెంటర్ కి తీసుకెళ్ళాడు.
స్టేట్ రాంక్ కు ప్రిపేర్ అయిన ఆమె ఆ విధంగా స్టేట్ లో మూడవ రాంక్ లో నిల్చింది. ఆమెను చేర్చుకోవడానికి కాలేజీలు లైన్ కట్టాయి ఆమె ఇంటి ముందు. మొత్తం కాలేజ్, హాస్టల్ అన్నీ ఫ్రీ గా ఇచ్చి ఇంకా డబ్బులు ఇవ్వడానికి కూడా ముందు కొచ్చాయి. రమణి కి అప్పుడు పూర్తిగా చదువు పై నమ్మకం పెరిగింది. తను ఇంటికి ఆసరా కావాలనుకుంటే కూలీకి, తల్లి తో పాటు పోయి నాన్నలేని లోటును పూడ్చాల్సిన అవసరం లేదు ,బాగా చదువుకుంటే చాలు అన్నది అర్ధం అయ్యింది. ఇక ఆమె లోకం మొత్తం చదువే అయ్యింది. ఇంటికి ఆమె వెనకబడిన వాళ్లకు ఇచ్చే స్కాలర్ షిప్, మెరిట్ స్కాలర్షిప్ కూడా పంపేది. పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకుని 3.8కోట్ల స్కాలర్ షిప్ తో మసాచుసెట్స్ లోని బాబన్స్ కాలేజీలో చాన్స్ కొట్టేసింది.
మంచి కంపెనీలో సి ఈ వో గా స్థిరపడి, తనను ఇష్టపడిన పేరు ప్రఖ్యాతులు కల్గిన మరో కంపెనీ సి ఈ వో ను పెళ్లి చేసుకుంది.
అక్కను చూసి స్పూర్తి పొందిన తమ్ముడు రాజుకు కూడా బాగా చదువాలనే కోరిక కలిగింది. అన్ని విషయాల్లో అక్క సలహాలు తీసుకుంటూ అటు శారీరక దారుడ్య పోటీల్లో పాల్గొంటూ ఐ పీ యస్ కి సెలెక్ట్ అయ్యాడు.
అయితే ఇక్కడితో రమణి ఆగిపోలేదు. మన దేశం వెనకబడడానికి ముఖ్య కారణం నిరక్షరాస్యత అని గుర్తించి , భర్త సహకారంతో ఒక స్వచ్చంద సంస్థ ను నెలకొల్పి వయోజనుల విద్యకు, మిగతా తండాల్లో బడికి దూరంగా ఉన్న పిల్లల్లో తల్లితండ్రులలో చైతన్యం తీసుకు రావడానికి , తప్పక విద్య అమలు చేయడానికి కౌన్సిల్లింగ్ చేయడానికి వివిధ వ్యక్తులను నెలకొల్పి వారానికోసారి పర్యవేక్షణ చేసేది. ఆమె ఆధ్యర్యంలో బాల్యవివాహాలు రూపుమాపి, ఆరోగ్య,వైజ్ఞానిక సమాజాన్ని సృష్టించడానికి ఆమె చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!