ఎవరు గెలిచేరు

(అంశం:: “సాధించిన విజయం”)

ఎవరు గెలిచేరు

రచన :: మంగు కృష్ణకుమారి

మావిడి తోరణాలతో, గడపల పసుపు కుంకం చుక్కలతో, అందమయిన ముగ్గులతో ఇల్లు కళకళలాడుతోంది.
షామియానా వేసిన వాకిట్లో కుర్చీలు
సద్దుతున్నారు పనివాళ్ళు.

ఇంటిపెద్ద కనకారావునాయుడు పంచెకట్టుతో, నుదుటన నిలువుగా బొట్టుతో హుందాగా
తిరుగుతున్నాడు. అతని భార్య జగ్గమ్మ పట్టుచీర కట్టుకొని, వంటినిండా నగలతో పెద్దబొట్టుతో
పూజకి, వ్రతానికి అవసరం అయినవి
అన్నీ సద్దుతున్నాది. తెల్లరంగు చీరతో నాయుడి తల్లి పుల్లమ్మ ‘పులుకూ పులుకూ’ చూస్తున్నాది.

ఆరోజు నాయుడు మనవరాలి బారసాల. క‌నకారావుకి ముగ్గురూ మగపిల్లలే! అతనికి కర్రల అడితి ఉంది. ఇద్దరు కొడుకులు అతనికి సహాయం చేస్తుంటారు. పెద్దకొడుకు రామా నాయుడికి మొదట ఆడపిల్ల.

ఇంట్లో ఆడపిల్లలే లేరేమో రామా నాయుడికి ఆడపిల్ల పుట్టడం అందరికీ ఆనందం వచ్చింది. బారసాల తమ ఇంట్లోనే అని కనకారావు నాయుడు వియ్యంకుడికి చెప్పేసాడు.

నెలరొజుల‌ కిందట:

పుల్లమ్మ కొడుకుని మనవడినీ, పిలిచి కచ్చితంగా చెప్పింది.”ఒరే అబ్బీ, ఇప్పటి దాకా ఆడపిల్లలు లేకపోడం నాపేరు ఎవరికీలేదు. చంటిదానికి నాపేరే పెట్టాలి. నా నగకట్టులో సగం దానికే”

ఇల్లు పుల్లమ్మకి ఆమె పుట్టింటివాళ్ళు
ఇచ్చినది. ఆమె పేరుమీదే ఉంది. కొడుకు చిన్నవాడుగా ఉండగా భర్త చనిపోడం, తన తమ్ముళ్ళ సాయంతో
కర్రల అడితిని ఆమే నడిపింది. లాభాలన్నీ ఆమె పేరే ఫిక్సిడ్ లు వేసుకొని ఇంటి వ్యవహారాలు చూస్తుంది. ఆమె మాటకి తిరుగులేదు.

జగ్గమ్మ ఉక్రోషంగా చూసింది. ఈ మధ్య కాలంలోనే అత్తగారికి జవాబులు ఇస్తున్నాది జగ్గమ్మ.
“మరి నాకుమాత్రం మనవరాలు కాదా?
నా పేరు పెడతారని మా మరదలు హాస్యాలు కూడా చేస్తోంది. ఇహ నేను మావాళ్ళకి హాస్యమే అవుతాను” అంది.

పుల్లమ్మ గట్టిగా అన్నాది. “ఒసే ఆపాటి జవాబు చెప్పలేవే? ‘మా అత్తగారు ఉండగా నా పేరెలా పెడతారని?’ నువ్వే అంటే ఇహ ఎవరు ఏమంటారు?”

కనకారావు నాయుడు కలగజేసుకొని “ఊరుకోవేఅమ్మా…
అలాగేలే నువ్వన్నట్టే చేద్దాంలే…” అన్నాడు. ‌పుల్లమ్మ మొహం వికసించింది.

రామానాయుడు పుట్టింట్లో ఉన్న పెళ్ళానికి జరిగినదంతా చెప్పేడు.
బాలకి ఒళ్ళు మండింది. “అయితే మన పిల్లకి పేరు పెట్టుకొనే హక్కుకూడా మనకి లేదా?” అంది.

ఉమ్మడి కుటుంబంలో బాలకి చాలా అసంతృప్తి ఉంది. అడితి పెత్తనం‌ మామగారి చేతిలో ఉండడం, అతను తన తల్లికే ఎక్కువ విలువ ఇవ్వడం, భర్త నోరువిప్పడు.
అత్తగారికే ఇప్పుడిప్పుడు నోరు వస్తున్నాది. ఇహ తనకి ఎప్పటికి?

రామానాయుడికి పెళ్ళామన్నా భయమే!
ఆమె కట్నకానుకలూ, సారె భారీగా తెచ్చింది మరి.

రామా నాయుడు “పోనీవే, మానాన్నని ఎలాగో ఒప్పిస్తాను. నాయనమ్మ పేరు పెట్టి నీకు నచ్చినట్టు ‘పాపా’ అనో ‘చిట్టీ’ అనో పిలుచుకుందాం” అన్నాడు.

ఒంటికాలి‌‌మీద లేచింది బాల. “ఏమిటీ? నాకు నచ్చినట్టు పిలిచిందికి
‘పాపా’వా? మీ నాన్నమ్మ పేరు పెడితే ఎలాగూ ఆవిడ ‘పుల్లీ, పుల్లా’ అనక మానదు. అదేం కుదరదు. నేను చెప్పినట్టు పెడితే మీ మాట నేవింటాను” కచ్చితంగా చెప్పేసింది.

భార్య ఏం చెప్తుందో అని రామానాయుడు భయం భయంగా చూసేడు.

******

అనుకున్న బారసాల రోజు రానే వచ్చింది. తెల్లవారేసరికి సన్నాయి మేళం వాళ్ళు వచ్చేసారు. మేళం లీడర్ అప్పలస్వామి సన్నాయి ఎత్తి భూపాలరాగంలో వాయిస్తూ ఉంటే, అందరికీ గుండెల్లో
ఆ ప్రకంపనలు వస్తున్నాయి.

పెరట్లో పెద్ద గేస్ స్టౌలు పెట్టుకొని వంటవాళ్ళు వంటలు మొదలెట్టేసారు.
ఉప్మా నేతిపోపు సువాసన ముక్కులకి
తగులుతున్నాది.

చుట్టాలు, అతిథులు చాలామంది వచ్చేరు. చిట్టి పాపాయి మంచి గౌను, మెడలో గొలుసు, చెవులకి లోలాకులు కాళ్ళకి‌ పట్టీలు, కళ్ళకి కాటుక, నుదుటన చాదు బొట్టుతో కొత్తగా నేర్చుకున్న ఆట, కాళ్ళు తపతపా కొడుతూ అందరినీ ఆకర్షిస్తోంది.

పురోహితుడు రాగానే కార్యక్రమం మొదలయింది. బియ్యం పళ్ళెంలో కొత్త ఉంగరం పెట్టి బ్రహ్మ గారు
“బాబూ, పాపాయికి మీరు అనుకున్న
పేరు బియ్యంలో ఈ ఉంగరంతో రాసి, దాని చెవిలో చెప్పండి” అని
రామానాయుడు కి చెప్పేరు.

బాల ఓరకంటితో మొగుణ్ణి చూసింది.
పుల్లమ్మ ఊపిరి బిగపట్టి చూస్తున్నాది. రామానాయుడు పళ్ళెంలోని బియ్యంలో
ఉంగరంతో అందంగా ప్రపుల్ల అని రాసేడు. పాపచెవిలో కూడా చెప్పేసాడు. కనకారావు నాయుడు గట్టిగా “మా మనవరాలి పేరు ప్రపుల్ల మాఅమ్మ పేరు పెట్టేం” అన్నాడు.

జగ్గమ్మ మొహం వికసించింది. ‘ఫరవాలేదు. మరీ ముసలావిడ పేరు కాదులే’ అనుకొని సంతృప్తి పడ్డాది. పెళ్ళాం మొహం వికసించడంచూసి, కనకారావు నాయుడు కూడా తేరుకున్నాడు. వారం రోజులై జగ్గమ్మ సతాయింపులు పడుతున్నాడు. ఈమధ్య భార్యకి చాలా పట్టు ఎక్కువ అయిపోయింది.

ముందు రోజు కొడుకు ‘ప్రపుల్ల’ అని పెడతాం అనగానే సరే అని ఒప్పేసుకున్నాడు.అప్పుడు రామానాయుడు, ఇప్పుడు కనకారావు ‘హమ్మయ్యా’ అనుకున్నారు మనసులో.

బాల పుట్టింటి వాళ్ళందరూ కూడా మహదానందించేరు.

అసలు సూత్రధారి పుల్లమ్మ చింకిచేటంత మొహంతో వచ్చింది. ఆవిడకి ఏమూలో కోడలు తన పేరు పెట్టనివ్వదేమో, దాని పేరే పెట్టిస్తుందేమో అని ఉన్న అనుమానం తీరిపోయింది.

తన మెళ్ళోంచి మూడు పేటల కాశీకాయ గుళ్ళగొలుసు తీసి చంటిదాని మెడలో పెట్టీ పెట్టనట్టు పెట్టి, బాలకి ఇచ్చి, ‘ప్రపుల్లకి దా అమ్మాయ్’ అంది.

చిట్టి ప్రపుల్ల బాకా ఊదినట్టు, తల్లి‌ పాలకోసం ఏడుపు మొదలెట్టింది. బాల దాన్ని ఎత్తుకొని పక్కగదిలోకి వెళ్ళి పాలు అందించగానే ఆబగా తాగడం మొదలెట్టి, మధ్యలో తల్లి మొహం చూస్తూ ‘ఊ ఊ’ అన్నాది.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!