సాలెగూడు

సాలెగూడు

రచయిత :: సావిత్రి కోవూరు

ప్రతి సంవత్సరం మా పాఠశాలలో పదోతరగతికి సెంటర్ వేస్తారు. అందుకని టీచర్స్ అందరు ఆ పనిలో మునిగి ఉన్నారు. ఒకవైపు పదో తరగతి విద్యార్థులకు లెక్కల టీచర్ ‘స్పెషల్ క్లాస్’ తీసుకుంటున్నారు.

అప్పుడే ఒకావిడ హెచ్.ఎం గదిలోకొచ్చి “మేడమ్ మా అమ్మాయిని ఎలాగైనా రక్షించండి”. అని ఏడవడం మొదలు పెట్టింది.

“మీ అమ్మాయి ఎవరు?ఏమైంది?” అని అడిగిన హెచ్.ఎమ్. తో

“మా అమ్మాయి సరిత. మీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె ఫ్రెండ్ మంజులతో  కలిసి ప్రతిరోజు స్కూలుకని ఇంట్లోంచి బయల్దేరుతున్నదండి. కాని, నిన్న మార్కెట్ లో వాళ్ళ స్నేహితురాలు ఒక అమ్మాయి కనబడి సరిత బడికి రావట్లేదని, టీచర్స్ అడుగుతున్నారని అన్నది,

ఈరోజు వాళ్ళ క్లాస్ కు వెళ్లి చూస్తే మా అమ్మాయి లేదండి. రోజు లాగానే ఈ రోజు కూడ మంజులతో కలసి వచ్చిందండి. క్లాస్ లో పిల్లలను అడిగితే, వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుండి మా అమ్మాయి బడికి రావట్లేదని చెప్పారు. మా అమ్మాయి స్నేహితురాలు మంజులకు, మా అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళుతుందో తెలుసనుకుంటానండి. దయచేసి మీరే మెల్లగా ఆ అమ్మాయిని అడగండి” అని ఏడవటం మొదలుపెట్టింది.

మంజులను పిలిచి హెచ్. ఎమ్. అడిగితే, మంజుల చెప్పిన దాని ప్రకారం, వాళ్లు స్కూలుకు వచ్చే దారిలో కొన్ని రోజుల క్రితం ఒక ‘ఆంటీ’ పరిచయం అయ్యిందని, స్కూల్ కు వచ్చేప్పుడు రోజు వీళ్ళతో ఏదో ఒకటి మాట్లాడేదని, ఇంటిలోకి పిలిచి రకరకాల తినుబండారాలు పెట్టేదని, మంచి గిఫ్ట్స్ కూడ ఇచ్చేదని చెప్పింది.

తాము స్కూల్ కు వెళ్ళకుండ అక్కడే గడిపి స్కూల్ అయిపోయే టైం కి ఇంటికి వెళ్ళేవాళ్ళమని. కొన్ని రోజుల తర్వాత మంజులకు మార్క్సు తక్కువ వస్తున్నాయని, ఇంట్లోవాళ్ళు కోప్పడేసరికి భయపడి సరిత తో “మనము ఆంటీ దగ్గరకు వెళ్ళొద్దు. మార్కులు తక్కువ వస్తున్నాయని మా ఇంట్లో కోప్పడుతున్నారు. రోజు స్కూల్ కు వెళ్ళకుండ ఆంటి  దగ్గరకెళ్ళుతున్నామని తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు రానీయరు” అని ఎంత చెప్పినా, వినకుండా “నేను ఆంటీ దగ్గరికే వెళ్తాను నీవు స్కూల్ కు వెళ్ళు” అని అన్నదట.

సరిత ఆంటీ దగ్గరికి రోజు వెళ్లడం, తిరిగి సాయంత్రం తనతో కలిసి ఇంటికి వచ్చేదని, మొన్న మంజుల సరితతో పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.టీచర్స్  సరిత గురించి అడుగుతున్నారని, చెప్పిందట.

ఆ మాటలు విన్న ఆంటీ “మీ చదువులన్నీ ఉద్యోగాల కొరకే కదా! బాంబేలో మా అక్కకు రెడీ మేడ్ షాప్ ఉంది. ఆమె ఎంతో మందికి డ్రెస్సెస్ తయారు చేయడం నేర్పించి, మంచి ఉద్యోగం కూడా ఇస్తుంది. అక్కడ ఈజీగా నలభై యాభై వేలు సంపాదించుకోవచ్చనీ, తిండి, వసతి కూడా ఆమెనే చూసుకుంటుందని, తను ఎంతో మందిని అక్కడికి పంపి ఉద్యోగాలు వేయించాననీ, ఇప్పుడు తన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు కూడ అందుకే వచ్చారని చెప్పిందట.

ఈ రోజు వాళ్ళని తనే తీసుకెళ్ళుతున్నానని, ఇష్టం అయితే సరితను కూడా తీసుకెళ్తానని చెప్పిందట.

సరిత “నన్నుకూడా వీళ్ళతో తీసుకెళ్ళండి. ఆంటీ నేను కూడా ఉద్యోగం చేసి మా అమ్మ వాళ్లకు డబ్బు పంపుతాను” అన్నదట.

దానికి ఆమె “పంపొచ్చు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. మీ స్నేహితులకు కూడా చెప్పకు. వాళ్లందరికీ ఉద్యోగాలు చూడడం నా వల్ల కాదు. ఎవరికీ చెప్పనని మాటిస్తే ఈరోజు తీసుకెళ్తాను” అని చెప్పిందట.ఈరోజు ఆంటీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో కలసి వెళుతున్నామని , సరిత, మంజులతో చెప్పిందని హెచ్.ఎమ్ కు చెప్పింది.

ఈ విశయాలన్ని చాటుగా విన్న సరిత వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చి ” ఇన్ని రోజుల నుండి మా ఇంటికి వస్తున్నావు. ఇద్దరు కలిసి బడికి వచ్చేవాళ్ళు. ఒక్కసారైనా నాకు చెప్పొద్దా మంజుల” అని ఏడవడం మొదలు పెట్టింది.

సరిత “మా అమ్మవాళ్ళకి చెప్పొద్దని,సరిత ఒట్టు వేయించుకున్నదాంటీ అందుకే చెప్పలేదు. ఈరోజు రాత్రికే వాళ్ళు బాంబే వెళ్ళుతున్నారాంటి” అని చెప్పింది.

“ట్రైన్ రావడానికి ఇంక చాల టైమ్ ఉంది. మీరు టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కే లోపల పట్టుకొని మీ పిల్లలను కాపాడుకోండి. ఈ మధ్య పిల్లలతో పరిచయాలు పెంచుకుని, మచ్చిక చేసుకొని, మాయమాటలు చెప్పి, తీసుకెళ్ళి బొంబాయి ‘రెడ్ లైట్ ఏరియాలకి’ సప్లై చేసే ముఠాల గురించి పేపర్లో చాలా వస్తున్నాయి” అని హెచ్.ఎమ్.తొందర పెట్టారు.

సరిత వాళ్ళ అన్న, ఫ్రెండ్స్ నలుగురు, పోలీసులతో, స్టేషన్ కెళ్ళి ముఠా ని ‘రెడ్ హాండెడ్’ గా  పట్టుకున్నారు.

తన కూతురు తో పాటు మరో ఇద్దరు ఆడపిల్లల జీవితాలను ఊబిలో కూరుకు పోకుండ కాపాడినందుకు, సరైన టైంలో విషయమంతా వివరించి నందుకు సరిత వాళ్ళ అమ్మ, మంజులకు కృతజ్ఞతలు తెలిపింది. మిగతా పిల్లలను వాళ్ళ వాళ్ళకు అప్పగించే ఏర్పాట్లు చేసింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!