అసలురుచి

అసలురుచి

రచయిత :: గుడిపూడి రాధికారాణి

 రోజూలాగానే ఆ సాయంత్రం కూడా స్నేహితులతో ఆరుబయట ఒళ్ళలిసిపోయేలా ఆటలాడి ఇంటికి చేరాడు చిన్నూ.ఇక ఇప్పట్లో నిర్భయంగా బయటికెళ్ళి కలిసిమెలిసి ఆడుకోలేనని కలలో కూడా ఊహించివుండడు.

“రేపటినుండి లాక్ డౌన్ ట నాన్నా!” చెప్పింది వాళ్ళమ్మ.

“అంటే??” అడిగాడు అమాయకంగా.

“మనందరం ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండాలి కొన్నాళ్ళు” వివరించింది.

సంభాషణ జరుగుతోంది.

“మరి స్కూలు?!?” (అయోమయం)

“ఇప్పుడిప్పుడే లేనట్లే” (ఆనందం)

“హాయిగా ఆడుకోవచ్చయితే” (గంతులు)

“బయటికెళ్ళకూడదు.ఎవరినీ కలవకూడదు.ఏ ఆటైనా ఇంట్లోనే”  (నీరసం)

“మరి పాలో?” (సందేహం)

ఆరింటినుండి తొమ్మిదిలోపు మరీ అవసరమైనవి నాన్న వెళ్ళి తెస్తారు.కానీ ఎప్పట్లా నువ్వు కూడా బయల్దేరకూడదు.  (బిక్కమొహం)

“మరి నాన్న కూడా ఇంట్లోనే ఉంటారా?”  (ఆశ్చర్యం)

“అవును”

“భలే భలే”  (ఉత్సాహం)

కొన్నిరోజులు గడిచాక చిన్నూ దిగులుగా కనిపించాడు.కారణం అడిగితే ” ఇన్ని సెలవులొచ్చినా అమ్మమ్మవాళ్ళ ఊరెళ్ళకూడదు ” అన్నాడు దిగులుగా.

“అమ్మమ్మయితే బొలెడు పిండివంటలు వండేది.అమ్మెప్పుడూ పళ్ళూ పాలూ జ్యూసులూ” అన్నాడు ఏడుపుమొహంతో.

నాన్న నవ్వేలోగానే ” తాతయ్యయితే ఎంచక్కా కథలు చెప్తారు.నువ్వెప్పుడూ ఫోనూ,టీవీ,పేపరూ”అనేశాడు.

ఈ సారి అమ్మ నవ్వింది.

వాడి బాధ విన్నమీదట నాన్న కథలు చెప్పడానికీ,అమ్మ స్వీట్లు చెయ్యడానికీ ఒప్పందమయింది.

మర్నాడు పూర్ణంబూరెలు చాలా బాగా కుదిరాయని మెచ్చుకున్నారు నాన్న.

ఆవరణలో మొక్కలదగ్గర ఆడుతూ అమ్మ సంతోషంగా తినిపిస్తుంటే రెండు తిని చాలన్నాడు చిన్నూ.మూడోది వాడిచేతిలో పెట్టి పని చూసుకుంటోంది అమ్మ.

బయట చిన్నూ ఈడువాడే ఒకడు నిలబడి ఉన్నాడు.ఎదుటివరుసలో చివరుండే గుడిసెలో పిల్లాడనుకుంటా.చిరిగిన నిక్కరు,చింపిరి జుట్టు తప్ప వేరే ఆస్తిలేనివాడు.

చిన్నూ వాడినిచూసి పలకరింపుగా నవ్వాడు.గేటులోంచి చెయ్యిచాపి పూర్ణం బూరెని వాడి చేతిలో పెట్టాడు.

తానెన్నడూ తిని ఎరగని ఆ పిండివంటని ఆశగా అందుకుని ఆత్రంగా తినసాగాడా కుర్రాడు.

ఇంతలో వచ్చిన అమ్మ చిన్నూ మెరుస్తున్న కళ్ళని చూసి ఏమిటా అని తలతిప్పి చూసింది.ఆ తల్లి పేగు కదిలింది.

మరికొన్ని పూర్ణాలు,బియ్యం,కందిపప్పు,చిన్నూ బట్టలు కొన్ని తెచ్చి వాడికిచ్చింది.

అవి అలాగే పట్టుకుని ఇంకో బూరెని తీసి ఆవురావురుమంటూ తింటున్న ఆ పిల్లాడిని చూస్తే ఆమెకి పూర్ణం బూరె అసలు రుచి ఇప్పుడు నాలుకకి తగిలినట్లనిపించింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!