అమ్మమ్మ  తిట్ల పురాణం.

అమ్మమ్మ  తిట్ల పురాణం.
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

     ఏభై ఏళ్ళ క్రిందట నేను మా అమ్మమ్మ గారి ఉరు అనకాపల్లి అమ్మ, చెల్లెళ్ళు లక్ష్మీ, పద్మతో కలసి హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు వెళ్ళాము. అప్పుడు అనకాపల్లి వెళ్ళడమంటే అమెరికా వెళ్ళినంత పనే. బెడ్డింగ్ అనేది సద్దుకోవడం, నీళ్ళకి మరచెంబులు, పూర్తిగా రోజు ప్రయాణం కావలసిన తిండికి చేగోడీలు, జంతికలు, దిబ్బరొట్టె, పూరీలు. కిటికి దగ్గర కూర్చిని చెల్లెళ్ళకి కథలు చెప్పటం. పొలాలను చూసి మురిసిపోవడం రాజమండ్రి, విజయవాడలలో బ్రిడ్జి మీద వెళ్ళే టప్పుడు అమ్మ ఇచ్చిన పదిపైసల బిళ్ళలు దండం పెట్టుకొని గోదావరి, కృష్ణ నదులలో వేయడం చాలా బాగుండేది. శారదా నది రాగానే మాకు పట్టలేనంత సంతోషం. అనకాపల్లి స్టేషన్ కి మామయ్య వచ్చి అమ్మని మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడం. వీధి అరుగు మీద పూర్ణయ్య తాత గడ్డంతో వాలు కుర్చీలోంచి లేచి అమ్మని ఆప్యాయంగా తీసుకోవడం గట్టిగా ఇంట్లో ఉన్న కోడలు అన్నపూర్ణని పిలవగానే మడికచ్ఛ తోనే వచ్చి రండర్రా అని లోపలికి తీసుకెళ్లడం ఎంతోబాగుండేది. నాలుగు ఇళ్ళ  లోగిలి పెద్ద పెరడు జామి, కొబ్బరి, మామిడి, దానిమ్మ, రాచ ఉసిరి చెట్లు. రెండు ఆవులు దూడలు గొడ్ల సావిడి మా పాలిట స్వర్గమే. మామయ్యకు ఇద్దరు అమ్మాయిలు దుర్గ, సరస్వతి వారు సంక్రాంతి సెలవుల ముందు ఆఖరి రోజు పాఠశాలకు వెళ్ళారు. అమ్మమ్మ సుభద్రమ్మ మడిలో ఉంది జంతికలు, మిఠాయి, సున్నుండలు వంట అత్తయ్య సుబ్బమ్మ గారితో కలసి చేయిస్తోంది. ఒకసారి బయటికి వచ్చి అమ్మతో స్నానాలు చేయించవే సుశీల వంట అయిపోయింది. మీ మేనకోడళ్ళు వచ్చేస్తారు స్కూలునుంచి వాళ్ళకి రేపటినుంచి సెలవులు అంది. అమ్మ మమ్మల్ని పెరట్లో నూతి దగ్గర స్నానం చేయిస్తుండగానే మామయ్య కూతుళ్ళు దుర్గ, సరస్వతి స్కూలు నుంచి రాగానే పెరట్లోకి వచ్చి అత్తయ్య బాగున్నారా! అని అమ్మని అడిగి మాతో ఎంచక్కా ఈ పదిరోజులు ఆడుకోవచ్చు బడిలేదు అన్నారు. మా ఇంటి పక్కనే ఉన్న పరమేశ్వరి సినిమాలో శారద, శోభన్ బాబు కాంచన నటించిన మనుషులు మారాలి సినిమాకి మామయ్య టిక్కెట్లు కొని మ్యాట్నీకి సీట్లలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న తమ ఇంటికి వచ్చెయ్య మన్నాడు. ఏడో తరగతి చదువుతున్న దుర్గ
అలాగే నాన్న అంది. ఆరోజుల్లో సినిమాలో జరిగేది నిజమే అనుకునేవాళ్ళం. శారద శోభన్ బాబు పడిన కష్టాలు ఉద్యోగం పోవడం, ముగ్గురు పిల్లలను పోషించలేక గుడిసెలో కాపురం ఉంటు వారికి విషం పెట్టి తాను తినడం. పిల్లలు ముగ్గురు చనిపోవడం తాను బ్రతికి భాధ పడి కోర్టులో కాంచన ప్లీడర్ తో చెప్పిన సంఘటనలను చూసి లీనమై వెక్కి వెక్కి ఏడుస్తున్న దుర్గతో పాటు మేము ఏడుస్తు ఇంటికి వస్తే అమ్మమ్మ ఏమర్రా ఏమైంది అంటే అది పిల్లలకు విషం పెట్టి చంపింది. అనగానే దానికేం పోయేకాలం పిల్లల్ని చంపడానికి. ఎక్కడ ఎవరు అని అడిగితే దుర్గ అసలు సంగతి సినిమాలో అని చెప్పినప్పుడు డబ్బిచ్చి తద్దినం పెట్టించుకున్నట్లు పిల్లలు ఆ సినిమాకు వెళ్ళడమేమిటి హాయుగా రాజాలో హాలులో ఉన్న మాయాబజార్ కి పంపించలేక పోయావురా శంకరం అని మామయ్యని తిట్టడం కొసమెరుపే. మేము మనుమలనెత్తిన అమ్మమ్మ తిట్టిన తిట్లను కలసినపుడు ఇప్పటికీ తలచుకుంటాం.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!