రైలు ప్రయాణం

రైలు ప్రయాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

జీవితానికి‌ ఒక మంచి నిర్వచనం ఇవ్వాలంటే అది రైలు ప్రయాణం అనే చెప్పాలి. ఎందుకంటే మన జీవితకాలంలో మనం ఎందరెందర్నో కలుస్తుంటాం, అలా అని అందరూ గుర్తుండరు. అవసరమైనవాళ్ళను వద్దనుకున్నా, మనసుకి కష్టంగా ఉన్నా  వారి జ్ఞాపకాలనూ, వారినీ మనతో ఉంచుకుంటాము. జీవితం అంటే అంతే. ఎక్కడ నుండి ఎక్కడికో గమ్యం తెలియని ప్రయాణంలో అప్పటి వరకూ ఎవరో తెలియని వ్యక్తుల్ని కలుసుకుంటాం. ఎవరి గమ్యం చేరేవరకు వాళ్ళు చాలా దగ్గర అయిపోతారు. కానీ ఎవరి గమ్యంలో వారు దిగక తప్పదు. అయినా కొన్ని బంధాలు బలపడి ముడివేసుకుంటాయి. మరెన్నో అక్కడికే రాసిపెట్టి ఉందన్నట్లు వారి వారి మజిలీలలో దిగిపోతారు, నిరుత్సాహ పరుస్తారు. ఎవరెవరో తెలియకపోయినా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, అనుభవాలను నెమరువేసుకుంటాం. కాలం గడిచే కొద్దీ అలాంటి ప్రయాణాలెన్నో , ఇలాంటి‌ పరిచయాలు అన్ని. ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగకమానదని ఎవరి సమయం వస్తేవాళ్ళు ఈ లోకాన్ని విడచి వెళ్ళక తప్పదని, ఎవరి మజిలీ వాళ్ళదని చెప్పకనే చెప్పే జీవితసత్యం మనం చేసే రైలు పయనం. ఎంతో జీవితసత్యాన్ని తనలో దాచుకుని, ఎంతో గంభీరతను చూపుతూ, కష్ట సుఖాలకు కుంగిపోకూడదని నేర్పే ఒక గొప్ప సత్యం చాటుతుంది. ఏదో ఆలోచనలతో బరువెక్కిన మనసును ఇంకేదీ ఆలోచించకుండా చేసీ, వెళ్ళే మజిలీలో చుట్టూ ఉన్న ప్రకృతిని చూపుతూ మైమరచిపోయేలా చేస్తుంది. ఎన్ని అందాలను మన కళ్ళకు చూపుతుందో కదా, గోదావరి అందాలు, తొలి ఉషస్సు, ఇసుకతిన్నెలపై చిత్రమైన ఆకృతులు, పచ్చని పంట పొలాలు, కూలీ జనాల ఆపసోపాలు, రైతు పంట సేధ్యం, పక్షుల కువకువలు, పంటకాలువ పరవళ్ళు,  కలువల అందాలు, పూవులు సొగసులు , అందమైన పడతులు కళ్ళాపి చల్లి వేసే రంగవల్లులు ఇలా ఎన్నెన్నో అందాలను మన కళ్ళకు చూపుతూ మనసుకు ఆనందాన్ని , ఆహ్లాదాన్ని పంచే రైలు‌ ప్రయాణం  జీవితానికి ఎన్నో ఆనందాలని ఇవ్వడంతోపాటు మరెన్నో అనుభవాలను నేర్పుతుంది. అనుభూతులను పంచుతుంది. అనేక సంస్కృతుల జనాభా , అనేక భాషల పరిచయం, ఎవరి గోల వాళ్ళది. పిల్లల ఏడుపులు, పెద్దల గదమాయింపులు, తినుబండారాల అమ్మకాల అరుపులు, ఒక్కమాటలో చెప్పాలంటే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇక్కడే కనిపిస్తుంది కదా!  పుస్తకాల పురుగులు, న్యూస్ పేపర్ విశ్లేషకులు, కళాశాల కబురులు, అమ్మాయిలను చూస్తూ ఆరాధించడాలు  ఎన్నని చెప్పేది, ఎన్నెన్నో అనుభవాలను తన ప్రయాణంలో మనకు అందిస్తూ కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా మనందరికోసం కష్టపడే మనందరి బంధువు,
మరో కోణంలో మన జీవితాలకు పరమార్ధం‌ చాటే తాత్విక గురువు ఈ రైలు అనడంలో అతిశయోక్తి లేదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!