యుక్తి తో పెళ్ళి

యుక్తి తో పెళ్ళి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: బాలపద్మం

ఒలమ్మీ తిక్క రేగిందా.. అనుకుంటూ వయ్యారంగా పాడుకుంటూ నడుస్తోంది రత్తాలు, పొలంగట్టు మీద. పొలంలో పని చేసుకుంటున్న మావయ్య రంగయ్య ఏటే రత్తాలు తిప్పుకుంటూ పోతున్నావూ అన్నాడు. ఊరికే మావా బావకి చద్దన్నం తెచ్చినా, అత్త ఇచ్చింది అంది అంతే వయ్యారంగా. ఓసోసి అత్త ఇచ్చిందో, నువ్వే తెచ్చావో నాకు తెల్దేంటి చెప్పావులే! అన్నాడు చెల్లెలు కూతురైన రత్తాలుని. పో.. మావా, బావ ఎక్కడా అంది. ఏటి బావకేనా, నాకు లేదా బువ్వ అన్నాడు. నువ్వు ఇప్పుడు ఇంటికి పోతావ్ కదేంటి, అత్త తినిపిత్తాదిలే అంది. ఇంతలో వెనుక నుంచి ఏంటీ మావా కోడలు ఏలాకోలాలు అంటూ వచ్చాడు రత్తాలుకి వరసైన బావ సబ్బడు. ఆ! సూడు బావా, ఈ మావా! అంటూ మొహం గోముగా పెట్టింది రత్తాలు. అది చూసి పరవశించి పోయాడు సుబ్బడు. సరేలే! హా నాన్నా నువ్వు ఇంటికి పోనీ, నేను తోట పని చూసుకుంటా అన్నాడు సుబ్బడు. అలాగే రా, ఈ రత్తాలుతో పడి పని మరచి పోయావూ, జాగ్రత్త! అన్నాడు లోపల మురిసిపోతూ. ఆ దేవుడు రాసి పెట్టె ఉంటాడు లే, ఇదే నా కోడలు అని రంగయ్య. ఈ ఆనందాలు డబ్బులో ఉంటాయా చెప్పండి! కల్మషం లేని ఈ జీవితాలు పట్టణాల్లో దొరుకుతాయా? ఈ యంత్రపు పయనాలలో ఉంటాయా! సరే అది వదిలి పెడదాం. రంగయ్య వెళ్ళాకా చద్దన్నం తెచ్చిన రత్తాలుతో కలిసి గట్టు మీద చింత చెట్టు కింద కూర్చున్నాడు సుబ్బడు. తన చేత్తో తెచ్చి చద్దన్నం పెట్టడం రత్తాలు దిన చర్య. చూడు బావా ఊరికే ఈ చింత చెట్టు కింద కూర్చోడమేనా? నాకు చింతకాయ తినిపించవా? అంది రత్తాలు. దాంది ఏముందే ఓ పది రోజులు ఆగు ఇప్పుడు ఇంకా చిన్న కాయలే కదా, ఎదుగుతాయి. ఒకటేమిటి కేజీ కాయలు కోసిస్తా, ఇదంతా నీదే అన్నాడు సుబ్బడు. పో! బావా కాయలు నువ్వు ఇచ్చేది ఏంటో నేను కోసుకో లేనా అని నెత్తి మీద మొట్టింది సరసంగా. మరింకేంటే రత్తా.. ఏటంటావు అన్నాడు బుర్ర గోక్కుంటూ.
పో.. బావా.. కాసిన చింత కాయకి నువ్వెందుకు నా తలకాయ, మనువు చేసుకుంటే, అప్పుడు తినాలా అదీ.. అంది కాసింత సిగ్గు పడుతూ. ఏటేటే… అదేం కుదరదు నీతో మనువా అబ్బో చంపెత్తావ్, నిన్ను పెళ్ళాడితే నా పని గోవిందా! అన్నాడు ఉడికిస్తూ, రోజూలాగే. పో! బావా నేనేం సేత్తా, నిన్ను పేణంగా సూసుకోను! అయినా నన్ను కాక ఎవరిని చేసుకుంటావ్… నేనూ సూత్తా.. అంది మొహం కంద గడ్డలా చేసుకుని కోపంతో. హా! ఏతి సెత్తావులే! కొండముచ్చి మొగం.. నిన్నా నేను సేసుకునేది! అన్నాడు. దానితో మరింత కోపం వచ్చేసి, బుర్ర మీద నాలుగు పీకింది రత్తాలు. అబ్బా! ఉండవే మరందుకే వద్దనేది ఇప్పుడే ఇలా కొడితే, రేపు మనువయ్యాకా బతకనిత్తావా.. అన్నాడు. అదేంలే! బావ నా పాణం కాదూ నువ్వు, ఏదో సరసంతో మొడితే, కొట్టా నంటవా, అత్తతో సెప్పి నీ సంగతి సూ… త్తా.. అంది లోపల మురిసిపోతూ, బావ సంగతి తెలిసి. నీకు మా యమ్మ తోడూ సచ్చే సావొచ్చిందే అని, అయినా అలిగితే నీ మూతి భలే ఉంటుందే రత్తా అన్నాడు. పో బావా! ఇక పోతా పని చూసుకో, మా మంచి బావ, రేత్రికి తొందరగా వచ్చేయ్, పాములు తిరుగుతున్నాయంట గదా! అంది బయలుదేరుతూ. ఆ పాములు కాకపోతే ఏనుగులు వత్తాయేంటే అలాగేలే జాగ్రత్తగా పో! అన్నాడు. రంగయ్య వెళ్తూ వెళ్తూ దారిలో చెల్లెలు ఇంటి దగ్గర ఆగి తన ఇంటికి వెళ్ళడం అలవాటు. ఏమ్మా సీత ఎలా ఉన్నావ్ అంటూ పలకరించాడు. రా! అన్నయ్యా ఇడ్లీ వేడిగా ఉంది దా! కాళ్ళు కడుక్కొ, అంది. హా! అంటూ కాళ్ళు కడుక్కుని ఇంటి అరుగు మీద కూర్చున్నాడు, బావ ఎక్కడికి పోయాడు అంటూ. తన దూరపు బంధువు పక్కనే ఉంటాడు అని చెల్లిని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలా రెండు కుటుంబాలు అరమరికలు లేకుండా ఉంటూ ఉంటారు. ఇప్పుడే అలా పట్నానికి వెళ్లారు అన్నయ్యా. వదిన కూడా లోపలే ఉంది, ఇప్పుడే వచ్చింది. అంటూ మంచి అరిటాకులలో వేడి వేడి ఇడ్లీ, శెనగపిండి పచ్చడి తెచ్చుకుని తింటూ, మాటల్లో ఏమే ఇక ఈ పిల్లకాయలు ఇద్దరికీ మనువు చేసెయ్యాలి అన్నాడు రంగయ్య. అవును అన్నయ్యా రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయట పూజారిగారు చెప్పారు అంది సీత. మరి బావ ఏమన్నాడు అన్నాడు రంగయ్య. హా! ఆయన అనేది ఏముంది, లోపల ఇట్టమే పైకి కుదరదని కబుర్లు, ఆ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు నేడో, రేపో ముహూర్తాలు పెట్టించు అంది సీత. ఆహా! నాకు వియ్యపురాలు కట్నం తేలకుండా నా కొడుకుని ఎలా ఇత్తా అంది రంగయ్య భార్య. ఓసోసి, అదేం భాగ్యం ఒదినా, నీకు ఏం కావాలి అంది సీత. నాకు ఓ నలభై ఐదు కేజీల బంగారం ఇవ్వాల్సిందే! అంది. హా! ఇంకా నయ్యం అంటూ నోరు వెళ్లపెట్టారు సీత, రంగయ్య.
అదే మరి రత్తాలే నాకు బంగారం అంది. దానిదేమముంది వదినా, తీసుకుపో అంది సీత నవ్వుతూ. ఇంతలో సీత భర్త వచ్చాడు. ఏం బావ ఏడకెళ్ళావ్ అంటూ పలకరించాడు రంగయ్య.
ఏం లేదు బావా పక్క ఊరు మునసబు గారి కొడుకు మన రత్తాలుని చేసుకుంటా అంటుంటే అడగడానికి పోయా అన్నాడు బావ, రామన్న..హా! ఇదే పాడు బుద్ది అంటూ ఒకేసారి గొంతు కలిపారు ముగ్గురూ. పాడు బుద్ది ఏంటి, నా కూతురు పెళ్లి నా ఇట్టం. మీరేం మాట్లాడక్కర్కేదు అంటూ చిర్రు బుర్రులాడుతు లోపలికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే రత్తాలు వచ్చి సంగతి విని అమ్మని, అత్తని పట్టుకుని బోరుమంది. నువ్వుండే రత్తాలు, నా కొడుక్కి కాదని ఈ పెళ్లి ఎలా చెత్తాడో, చూత్తా, ఊరుకుంటుంటే ఏదో ఏలకోలం అయిపోయింది. ఇప్పుడే పోయి నేను ముహూర్తం పెట్టిత్తా అంటూ కదిలాడు రంగయ్య. ఆ! చూద్దాం, పో! నువ్వు లోపలికి రాయే సీతా అంటూ అరిచాడు రామన్న. ఇదిగో రత్తాలు ఇక ఆ ఇంటికేసి చూసినా, బావ గీవ అన్నా సంపుత, లోపలికి రా! అన్నాడు కూతుర్ని.
నేను రాను పో! నే ఇప్పుడే అత్త తో పోతున్నా అంటూ అత్త ఇంటికి పరుగు తీసింది. అలా రెండు రోజులు ఎవరి పని మీద వారున్నారు. రంగయ్య మాత్రం వచ్చే ఆదివారం లగ్గం పెట్టుకుందుకు, ఆ పై పదో తారికు పెళ్లి అంటూ చెల్లికి కబురు పెట్టి, ఏర్పాట్లు చేయసాగాడు. ఇదంతా అయోమయంగా, బెంగ, బాధగా ఉంది మిగతా అందరికీ. ఆ లగ్గం అనుకున్న ఆదివారం రానే వచ్చింది. ఉదయం నుంచీ రామన్న కూడా లగ్గం ఏర్పాట్లు చేస్తున్నాడు. సీతకి, రత్తాలుకి అయోమయంగా ఉంది. కాస్త ధైర్యం చేసి భర్తని నిలదీసింది. దీనికి పుట్టినప్పటి నుంచీ ఆ సుబ్బడు మొగడు అని చెప్పాం, వాడికి ఇప్పుడు ఏం తక్కువ. వరసైన వాడు, కుదురైన మనుషి, నాలుగెకరాల పొలం, ఇల్లు ఇంకేం కావాలి అంది రామన్నతో. అదేం కుదరదు నేను మాటిచ్చా. మునసబు గారు, అబ్బాయి, బంధువులు ఓ గంటలో ఇక్కడ ఉంటారు, మీరు మాట్లాడకుండా ఉండాలా, ఈ లగ్గం జరగాల! లేదంటే, జాగ్రత్త! అన్నాడు లేని పౌరుషం నటిస్తూ. ఈ వింత ప్రవర్తనకి తల్లీ కూతురు విస్తుపోయి, దేవుని మొక్కు కుంటున్నారు. నువ్వే దిక్కు అని. ఇంతలో రంగయ్య అన్ని ఏర్పాట్లుతో, తాంబూలాలు సారె తీసుకుని రామన్న ఇంటికి చేరుకున్నాడు. రామన్న మాత్రం మాట్లాడకుండా కూర్చున్నాడు. అదేంటి బావా! నీకు తెలుసకదా ఆల్లిద్దరికి ఒకల్లంటే ఒకళ్ళకి పాణం, ఇలా ఇడదీస్తే పాపం కదా! అయినా ఇప్పుడు ఏమైందని పక్క ఊరు సంబంధం తెస్తావ్! అన్నాడు. ఇంతలో పక్క ఊరు మునసబు గారు కుటుంబంతో కలిసి రానే వచ్చారు. ఆయన కూడా చీర, సారె, తాంబూలాలు తీసుకువచ్చారు. ఇక లాభం లేదనుకుని రంగయ్య, చూడండి మునసబు గారూ! మా అబ్బాయికి,  రత్తాలుకి మనువు అని చిన్నప్పటి నుంచీ అనుకున్నాం, ఇప్పుడు మీరు ఇలా మీ అబ్బాయి కోసం రావడం పద్దతి కాదు అన్నాడు బ్రతిమాలాడుతూ. అదేంటి రంగయ్య మేమూ అందుకే వచ్చాం, మా కొడుకు తో పెల్లేంటి, వాడు ఇంకా చిన్నోడు కదా! అన్నారు మునసబుగారు. మరి ఈ ఏర్పాట్లూ అవీ అన్నాడు రంగయ్య ఏమీ అర్థంకాక. ఓ! అవా, విషయం చెప్పలేదు కానీ మీ బావ ఇవన్నీ మా ఇంట్లో ఉంచి ఈ రోజు తెమ్మన్నాడు అన్నారు మునసబు గారు. హా! అని ఆశ్చర్య పోవడం ఇప్పుడు అందరి వంతు అయింది.
ముందుగా తేరుకుని సీతే అంది ఏమిటండీ ఇది అని రామన్నతో. లేకపోతే పక్కన బంగారం లాంటి అల్లుడు ఉండగా నాకేం పిచ్చా పక్కకి పోడానికి, వీళ్ళు రెండేళ్ల నుంచి రేపూ, మాపూ అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇలా చేత్తే గానీ దారికి రారు అని చిన్న నాటకం ఆడా అన్నాడు రామన్న. ఎంత పని చేశావ్ బావా. ఎంత కంగారు పడ్డాం అందరూ అన్నాడు రంగయ్య. కాస్త సిగ్గు పడడం రత్తాలు వంతు, మీసం తిప్పడం రామన్న వంతు, రాజసం ఒలకపోయడం సుబ్బడు వంతు అయ్యింది. అదండీ పెళ్లి ఆలస్యం అవుతోంది అని రామన్న నాటకం ఆడడం కొసమెరుపు.

You May Also Like

6 thoughts on “యుక్తి తో పెళ్ళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!