అతడు!

అతడు!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

 రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

కాకులు దూరని కీకారణ్యం. సూర్యకిరణాలు, పడని దట్టమైన అడవి. అటువంటి అరణ్యంలో,
అవంతికా దేశపు యువరాణిని బంధించి తెచ్చి, లోకాన్నంతా జయించాలన్న, తన కోరిక తీరడం కోసం నవరాత్రి సందర్భంలో, విజయదశమి నాడు, దేవికి బలి ఇవ్వాలని, పూజలు చేస్తున్నాడు, దుష్ట మాంత్రికుడు రాజనాల. హోమం చేశాడు. జంతుబలులను ఇచ్చాడు. ఇక ఆఖరి ఘట్టం, రాజకుమారిని బలి ఇవ్వడం. రాజకుమారి శ్రీదేవిని, పచ్చటి పసుపు బట్టలతో అలంకరించారు. అసలే,
జగదేకసుందరేమో, ఆ పచ్చటి బట్టలలో, ఏడువారాల నగలతో ధగ, ధగ మెరిసిపోతోంది
శ్రీదేవి. ఆమె స్పృహలో లేదు. అవంతికా దేశపు మహారాజు రంగనాధవర్మ చాలా విచారంగా ఉన్నాడు. రాజకుమారి శ్రీదేవి కనపడక అప్పటికి పదిహేను రోజులవుతోంది. అవంతికా సైన్యం, గూఢచారులు, ఎంత ప్రయత్నించినా, రాజకుమారి జాడ తెలియలేదు. రాజకుమారి శ్రీదేవి మీద బెంగపడి, మహారాణి కన్నాంబ మంచాన పడింది. ఇహలాభం లేదని తలంచి, అవంతికాధీశుడు రంగనాధ్ “ఎవరైతే రాజకుమారి శ్రీదేవిని రక్షించి తెస్తారో.. వారికి అర్ధరాజ్జ్యం ఇచ్చి, రాజకుమారి శ్రీదేవినిచ్చి వివాహం చేస్తానని”ప్రకటించాడు. దేశ విదేశాలలో దండోరా వేయించాడు, అయినా.. ఎవరినుంచి ఎటువంటి స్పందన లేదు. అతడు దేవగణంలో పుట్టినశివాంశ సంభూతుడు. కండలు తిరిగిన శరీరంతో కఠినమైన యోగాసనాల సాధనతో, అతని శరీరం ఉక్కులా తయారయ్యింది.
కత్తి, డాలు, బల్లెం, మల్ల యుధ్ధాల వంటి సమస్త యుధ్ధవిద్యలలో ఆరితేరాడు. అతడి నామధేయం పవనకల్యాణుడు. అతనిని వీరమల్లుడని, కోయజాతి భీమ్లానాయకుడని ప్రజలంతా అంటుంటారు. ఎందుకంటే వాయువేగంతో గుర్రాల మీద స్వారీ చేయగలడు అతడు. అందుకనే అతడిని, పవన కల్యాణుడంటారు. అతడి అధ్వర్యంలో, ఒక సుశిక్షతమైన కోయ యువకసైన్యం ఉంది. ఆ కోయజాతి పేరు భీమ్లా.
అందుకే, అతనిని భీమ్లానాయకుడని కూడా
అంటారు. అతడు ఈ సమయంలో కఠిన వ్యాయామాలు చేస్తున్నాడు. రహదారి వెంట రాజసైనికులు, రాజకుమారి విషయం దండోరా వేసుకుంటూ వెడుతున్నారు. అదివిన్న పవనకల్యాణుడు తన గురుదేవుడు నాగయ్య చెంతకు వెళ్ళి”గురుదేవా..ఏమి ఆఙ్ఞా”అని అడిగాడు.”మహారాజు రంగనాధుడి చలువవల్లే మనమందరం హాయిగా ఉన్నాం. ఆయన కష్టం మన కష్టంగా భావించాలి.. వెళ్ళి రాజకుమారిని రక్షించి, మహారాజుకు అప్పగించిరా”అని ఆనతినిచ్చాడు. “గురువాఙ్ఞా శిరోధార్యము”అంటూ, పవనకల్యాణ అధ్వర్యంలో, భూమండల నలుదిక్కులకు కదిలింది. భీమ్లానాయక సైన్యము. అతడు తెల్లని అశ్వంపై శరవేగంగా దూసుకెడుతున్నాడు. అతడి అశ్వపాద ఘట్టనలకు అడవి అంత దద్దరిల్లిపోతోంది. పక్షులు అరుస్తూ పారిపోతున్నాయి. అడవిలోని జంతువులు భయంతో రంకెలు వేస్తుా, పరిగెడుతున్నాయి.
అదంతా. తన గుహలో అంజనంలో చూస్తున్న క్షుద్రమాంత్రీక రాజనాల వికటాట్టహాసం చేశాడు.
తన అనుచరులనందరని అప్రమత్తం చేశాడు. గుహ పైభాగం నుంచి మర్రిఊడలను పట్టుకొని,
కరవాలముతో, గగనతలం నుంచి పడ్డ పిడుగులా, రాజనాల ముందు వాలాడు, పవన కల్యాణుడు. ఈలోపల భీమ్లానాయక కోయసైన్యమంతా, గుహ నాలుగుదిక్కులు చేరి, మాంత్రీక అనుచరులతో, యుధ్ధం చేయసాగింది. తెగిపడే చేతులు, కాళ్ళు, తలలతో ఆ ప్రదేశమంతా రక్తం నదిలా ప్రవహించింది. పవనకల్యాణుడుని చూసి, రాజనాల “వచ్చావా, నీకోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ “జై భేతాళ” అని కత్తిదూశాడు. అదిచూసి, భీమ్లానాయకుడు. “జై జగజ్జనని”అని తన కరవాలము కణకణలాడించాడు. భయంకర కత్తియుధ్ధం జరుగుతోంది. కత్తుల రాపిడికి అగ్నికణాలు రాలుతున్నాయి. అనాదిగా దైవభక్తులకు, భేతాళ శక్తులకు యుధ్ధాలు జరుగుతునే ఉన్నాయి. దానికి కారణం, మనిషిలోని స్వార్ధం. మాంత్రీకుడు రాజనాల కరవాల ఛానాలనికి పవనకల్యాణుడి కత్తి, ఆకాశంలోకి ఎగిరింది. రాజనాల విజయహాసంతో ఆ కత్తి వంక చూస్తూ, తలపైకెత్తాడు. అదే అదనుగా, కల్యాణుడు గగనతలంలోకి ఎగిరి, కరవాలాన్ని ఒడుపుగా అందుకొని, మాంత్రీకుడి తల ఖడించి, దేవి విగ్రహ పాదాల వద్ద పడేలాచేశాడు. రాజకుమారి శ్రీదేవిని క్షేమంగా పవనకల్యాణుడు. అవంతి రాజ్యానికి తేవడం రంగనాధ వర్మకు, కన్నాబకు, అంతులేని ఆనందం కలిగించింది. వాళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం చేసి, అర్ధరాజ్జాన్నిచ్చారు. కథ కంచికి మనమింటికి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!